మనం పురోగమిస్తున్నామా? తిరోగమిస్తున్నామా?
నేను ఆరో క్లాస్లో ఉండగా స్కూల్లో ఒక డిబేట్ మీటింగ్లో ఈ చర్చ పెట్టారు. అప్పుడు మేమంతా మనం నిస్సందేహంగా పురోగమించేస్తున్నాం. కార్లు, బస్లు విమానాలు, టెలిఫోన్లు అంటూ బోలెడంత మేటర్ రాసేసుకుని చెప్పేశాం. ఒకబ్బాయి మాత్రం మనం తిరోగమిస్తున్నాం అని చెప్పి స్పీచ్ రాసుకొచ్చాడు. ఆ రోజంతా ఆ పిల్లాడు మాకొక విచిత్ర వీరుడు అయిపోయాడు. ఎక్కడున్నాడో? ఏం చెప్పాడో కూడా గుర్తు లేదు. ఇన్నేళ్ల తర్వాత గుర్తు చేసుకుంటే అతను క్రాంతదర్శి కావచ్చేమో అనిపిస్తోంది.
ఇప్పుడు శాస్త్ర విజ్ఞాన ఫలాలు అనుకుంటూ మనం అనుభవిస్తున్నఅన్ని రకాలైన ఆన్లైన్ సేవలు, బిల్ పేమెంట్స్, బిర్యానీ హోమ్ డెలివరీలు, వీడియో కాల్స్, యు ట్యూబ్ విశేషాలు పురోగమనం అయితే తిరోగమనం బహుముఖీనంగా చాప కింద నీరులా వ్యాపించింది.
పూర్వం పసి పిల్లలకి ఓ హనుమాన్ తాడు, ఓ నల్ల దిష్టి తాడు కట్టి ఊరుకునేవారు. ఈ నాడు ప్రజలకి కొత్త పిచ్చి రక రకాలుగా మొదలయ్యింది. రంగురాళ్లు, యంత్రాలు, గ్రహాల శాంతి, జాతకాలు ఒక రకమైతే, ఏకముఖ, పంచముఖ, రుద్రాక్ష మాలలు, రాళ్ల ఉంగరాలు, నవ రత్నాల హారాలు, వెండి ఉంగరాలు మరో రకం.
అమ్మాయిలకీ అబ్బాయిలకీ చాయిస్ పెరిగిపోవడం వల్ల పెళ్లిళ్లు సులువుగా అవ్వడం లేదు. పెళ్లి కోసం ప్రత్యేక పూజలు చేయించుకునే దేవుళ్ళు, చేసే పూజారులు పుట్టారు. చెన్నైలోని కళ్యాణ్ పెరుమాళ్ గారి పని ఇదేనట.
ప్రస్తుత పరిస్థితి చూస్తే పిల్లలకి హై స్టాండర్డ్ చదువు ఇస్తున్నాము కానీ మన చిన్నప్పటి ఆత్మ విశ్వాసం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. రాంక్ రాకపోతే బిల్డింగ్ పైనుంచి దూకుతున్నారు. విద్యార్థుల్లో సంయమనం లోపించింది.
అప్పుడు ప్రేమలు నూటికి నూరు శాతం విఫలాలే కానీ ఆత్మహత్య ల్లేవు, అనాగరిక ఆటవిక దాడుల్లేవు. కత్తులతో నరకడాలూ, ఆసిడ్ పొయ్యడాలూ లేవు. ఇప్పుడు అత్తల ఆరళ్ళు పోయాయి కానీ అసహనం పెరిగి భార్యాభర్తల మధ్య అవగాహనా లోపంతో సంసారాల్లో అశాంతి మొదలయ్యింది.
మనది కుల మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం అని పాఠాల్లో చదువుకున్నాం. అయితే నిత్యం కుల సంఘాలు, కుల సమీకరణతోనే చట్ట సభల్లో సీట్లు, మంత్రి పదవులు – చదువుల్లో, ఉద్యోగాల్లో, ప్రమోషన్లలో రిజర్వేషన్లు రాజ్యాంగబద్దంగా ఇస్తున్నాం. దాంతో రిజర్వేషన్ లేని వర్గాల్లో నిరాశ, నిస్పృహ పెరిగి వారు సమాజంపై కోపం తెచ్చుకోవడానికి కారణం అవుతోంది.
ఇటీవల కుల కార్పొరేషన్ల కోసం దీక్షలూ, బుజ్జగింపులూ జరిగి చివరికి ప్రభుత్వం వారు వాళ్లకి కోట్ల రూపాయల ఫండ్స్ శాంక్షన్ చెయ్యడమూ, అది చూసి మా కులం పరిస్థితేంటని మిగిలిన కులాల వారు సంఘటితం కావడం చూస్తుంటే శుభ్రంగా మనం వెనక్కి పోయి కులాల గోడల్ని గట్టిగా కట్టుకుంటున్నామేమో అనిపిస్తోంది. ఆనాడు వివిధ వర్గాల మధ్య ఉండే గీతలు ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటే ఇప్పుడు కక్ష సాధింపుగా ఆవేశ పూరితంగా ఉంటున్నాయేమో అనిపిస్తోంది.
అప్పట్లో భక్తి తగు మాత్రంగా ఉండేది. ఇప్పుడు భక్తి ఇబ్బడి ముబ్బడిగా పెరిగింది. ఛానళ్లు బాగా భక్తిని ప్రమోట్ చేస్తున్నాయి. పుణ్యక్షేత్రాల వివరాలిచ్చి ట్రావెల్స్ వాళ్ళు టూర్ ప్యాకేజీల బిజినెస్ పెంచుకుంటున్నారు. టీవీల్లో నైవేద్యాలు, దీపారాధనలో వాడాల్సిన నెయ్యి, నూనెలపై చర్చ జరుగుతోంది. శని నివారణా పద్ధతులు, నాగ పూజలు, సర్ప దోష నివారణలూ పెరిగాయి. అప్పుడు మహా పండితులెవరో జాతక చక్రాలు వేసుకునేవారు. గొప్పవారికి వేసేవారు. ఇప్పుడు ప్రతివారికీ జాతకాల మానియా మొదలయ్యింది. సైన్స్ మాష్టార్లు వెక్కిరించిన, మన చిన్ననాటి మూఢ నమ్మకాలు ఇప్పుడు మోడరన్ డ్రస్సుల్లో దర్శనమిస్తున్నాయి. ఈ విధంగా మనం ఖచ్చితంగా తిరోగమిస్తున్నాం అని ఢంకా కొట్టి మరీ చెప్పుకోవచ్చు.
పెళ్ళిళ్ళకి బ్యూరోలోచ్చి పడ్డాక, కంప్యూటర్ ఫీడ్ చేసిన జాతకాలు చెబుతోంది. మంచి రోజూ, ఘడియలూ చూసుకుని పిల్లల్ని పుట్టించుకునే వెసులుబాటు వచ్చింది. గుళ్ల నిండా జనం పెరిగారు. మరయితే క్రైమ్ రేట్ తగ్గాలి కదా! కానీ పెరిగింది. కారణం మనకి తెలీదు. ప్రవచనాలు అన్ని వయసులవారూ విరగబడి వింటున్నారు. నైతిక విలువలు పెంచుకోవడానికి, సేవానిరతిని పాదుకొల్పడానికీ ఈ గంటలు గంటలు వింటున్న ప్రవచనాలు ఎంత ఉపయోగపడుతున్నాయో ఆ దేవదేవుడికే తెలియాలి. కొత్త తరానికి ప్రశాంత జీవనం ఇవ్వకపోవడం ముమ్మాటికీ పురోగమనం కాదు. తిరోగమన వేగం లెక్క కట్టుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నామేమో, ఆలోచించుకోవాలి మనం.
సైన్స్ అభివృద్ధి చెందినప్పుడు విజ్ఞానం పెరిగి సహేతుకత పెరగాలి. కానీ తరుగుతోంది. సైన్స్ ఫలాల వల్ల ఆర్థిక ఇంకా ఇతర వాతావరణ బాధల్ని అధిగమించి మానవ సమూహాలు తమ మధ్య సమన్వయం పెంచుకోవాలి.
మానవులందరికీ ఆనందకరమైన జీవితం కావాలంటే నువ్వు బ్రతుకు, పక్కవాడిని బ్రతకనియ్యి అన్న చిన్న సూత్రం చాలదా! భక్తి పేరుతో యాత్రలకి వేలకి వేలు ఖర్చు చేసుకుంటూ శరీరాన్ని హింస పెట్టుకునే బదులు మానవ సేవే మాధవ సేవ అనుకుంటే సరిపోదా! అడుగడుగునా గుడి ఉంది అందరిలో గుడి ఉంది అనుకుంటే ఎంత హాయో కదా!

అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు.
APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
1 Comments
Dr Trinadha Rudraraju
Manam Purogistunnama?, a candid and just work of the writer through a prismatic optics, made everyone of us introspect the pace and relevance of development in real life.