[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘మనసుని అమ్ముకోకు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]


మనిషిని మత్తు గమ్మత్తు చేయొచ్చు
మనసుని ఏ పొరలు కమ్మేయలేవు
దానికి తీవ్రత తీక్షణత ఎక్కువ
సూర్యుడి ముందు మబ్బుల్లా
మనసు ముందు ఏ మాయాజాలమైనా
దూది పింజల్లే ఎగిరిపోవాల్సిందే
మనసు జోలికి వస్తే తట్టుకోలేవు
మనిషితో మాట్లాడు మరచిపొతుంది
కాని మనసుతో మాట కలిపితే
వదలనంటుంది నిన్ను మరువంటుంది
మాయ మాటల గారడీతో
మనసుని గెలవలేవు
మనిషిగా తిరగలేవు
మనసుని నమ్ముకో బతికేస్తావు
అమ్ముకోకు మరణిస్తావు

పెద్దాడ సత్యప్రసాద్ విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు, కవిగా, రచయితగా దశాబ్దాల ప్రయాణం. వీరి కధలు, కవితలు వివిధ పత్రికలలో ప్రచురితమవడమే కాక, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా కూడా ప్రసారం అయ్యాయి. ఇక, వృత్తిగతంగా పాత్రికేయులు. రెండున్నర దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో అంకితభావంతో పనిచేస్తున్నారు. రాజకీయ విశ్లేషణలు వీరి ప్రత్యేకత. ప్రస్తుతం ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగంలో న్యూస్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.