ప్రకృతి అంత చిత్రమైంది మరొకటి లేదేమో! కొద్ది సేపటి క్రితం ఉక్కపోత. గాలి సమ్మె చేసినట్లనిపించింది. ఇప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. చెట్లన్నీ నృత్యం చేస్తున్నాయి. ఆకాశం కొత్తగా ముస్తాబైంది. ఆహా! చల్లని గాలులు మేనిని తాకుతుంటే మనసు అప్రయత్నంగానే ‘ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో…’ ఆలపించింది. ఇలా చూడటం కంటే కొద్ది సేపు ఇక్కడే కుర్చీ వేసుకు కూర్చుంటే… వెంటనే లోపలికెళ్లి కుర్చీ తెచ్చుకుని బాల్కనీలో బైఠాయించాను.
గాలి పైకి నా ‘గాలి’ మళ్లింది. కనపడదుగానీ సర్వదా సర్వవ్యాప్తమై అందరినీ, అన్నిటినీ తాకుతూనే ఉంటుంది. సకల ప్రాణులకు ‘గాలి’ పోస్తూనే ఉంటుంది. గాలే లేకపోతే ‘ప్రాణం’ కొండెక్కదూ? అందుకే గాలిని మనం ‘వాయుదేవుడు’గా కొలుస్తున్నాం. మనిషి మరణించినా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయ’నే అంటుంటారు.
పంచభూతాల్లో ఒకటైన గాలి జీవాలన్నిటికీ ఆధారమైంది. గాలికి పక్షపాతం లేదు. తరతమ భేదం లేదు. అందుకే ఓ సినీకవి ‘గాలికీ కులమేదీ’ అన్నాడు. గాలుల్లో ఎన్నో రకాలు. పైరగాలి, పిల్లగాలి, చల్లగాలి, తుఫానుగాలి, ఈదురుగాలి, సుడిగాలి, వడగాలి, సముద్రపు గాలి… ఎన్నెన్నో.
ఇవన్నీ అలా ఉంచి, ఇటీవల కాలంలో వాయుకాలుష్యమనే మాట నిరంతరం వినిపిస్తోంది. మనిషి తన అనాలోచిత, స్వార్థపూరిత చేతలతో గాలిని కాలుష్యపరిచి తనకు తానే చేటు కొనితెచ్చుకుంటున్నాడు. స్వచ్ఛమైన గాలి కోసం చెట్లను విరివిగా వాటమని పర్యావరణవేత్తలు పదేపదే చెబుతున్నారు. అసలు చెడు గాలిని శ్వాసిస్తూ మంచిగాలిని మనకందించే చెట్లెంత గొప్పవి! చెట్టు సేవ చెప్పతరమా!
మళ్లీ గాలి హాయిగా నన్ను తాకింది. దాంతో చెలరేగి ముఖానికి అడ్డంపడుతున్న ముంగురులను పైకి తోసుకుంటూ ‘ఈ గాలి… ఈనేల… ఈ ఊరు సెలయేరు’ కూనిరాగం తీస్తుండగా కరెంట్ పోయింది.
లేచి ఎమర్జెన్సీ లైట్ వేసుకోవచ్చు. కానీ లేవాలనిపించటం లేదు. పక్కనే మొబైల్ ఉంది. అవసరమైతే టార్చ్ వేసుకోవచ్చు. అయినా ఇదే బాగుంది. కానీ.. అనుకున్నాను.
అదే సమయంలో అమ్మ గుర్తొచ్చింది. ‘గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఎట్లా?’ అనే సామెత తరచు చెప్పేది. బహుశా నాన్నను కర్తవ్యోన్ముఖుడిని చేయడానికే ఆ సామెత చెప్పేదేమో. నాన్నేమో అన్నయ్యను ‘గాలి కబుర్లు చెప్పుకుంటూ దోస్తులతో బలాదూర్ తిరిగితే పరీక్షల్లో వచ్చేవి బండిసున్నాలే’ అని కోప్పడుతుండేవాడు.
ఒకసారి స్కూల్లో టీచర్ ‘గాలిమేడలు’ పదం చెప్పి సొంతవాక్యం రాయమంది. ‘గాలిమేడలు’ అంటే అర్థమేంటి టీచర్?’ నళిని అడిగింది. గాలిమేడలంటే.. టీచర్ ఓ క్షణం ఆలోచించి, ‘ఆ… నువ్వు కష్టపడి చదవకుండా ఫస్ట్ క్లాసులో పాసయినట్టు, ప్రైజ్ గెలుచుకున్నట్లు, అమ్మా, నాన్న మెచ్చుకొని నీకు పట్టు పరికిణీ కొన్నట్లు ఊహించుకుంటూ ఉంటే దాన్నే ‘గాలిమేడలు’ కట్టడం అంటారు’ అంది.
నా జ్ఞాపకాన్ని చెదరగొడుతూ వీధిలో బెలూన్లు అమ్మేవాడు శబ్దంచేస్తూ వచ్చాడు. ఇంకేముంది… పిల్లలందరూ పరుగెత్తుకుంటూ వీధిలోకి వచ్చారు. రంగురంగుల, చిత్ర విచిత్రాల బెలూన్లు.. గాలితోనేగా వాటి ఉనికి. పిల్లలంతా తమకు నచ్చిన బెలూన్లు కొనుక్కుంటున్నారు. నా బాల్యం మనసులో మెదిలింది. చిన్నప్పుడు నాన్నతో కిరాణా కొట్టుకు వెళ్లి బెలూన్లు కొనుక్కోవడం, ఇంటికి వచ్చి ఊదితే అందులో కొన్ని టాప్మని పేలిపోవటం, అమూల్యమైన ఆస్తి ఏదో కోల్పోయినట్లు నేను ఏడవటం గుర్తుకొచ్చాయి. ఇదివరకు నోటితోనే బెలూన్లు ఊదేవాళ్లు. ఇప్పుడు దానికీ మెషిన్ వచ్చింది. బెలూన్లు అమ్మేవాడు కనుమరుగయ్యాడు. అంతలో ఎదురింటి పాప పింకీ చేతిలో బెలూన్ ‘టాప్’మంది. పాప ఆరునొక్క రాగం అందుకొంది. వాళ్లమ్మ బుజ్జగిస్తోంది. పింకీ అన్న నిక్కీ తాను కొనుక్కున్న ఫూటు ఊదుతున్నాడు కానీ వాడికి ఊదటం రాక వినసొంపుగా లేదు. వాళ్ల నాన్న ‘ఆపుతావా లేదా’ అని అరుస్తున్నాడు. వెదురుగొట్టం సైతం మధుర సంగీతం పలికే మురళిగా మారు తోందంటే ఆ మహిమ గాలిదేగా.
ఆ సంగతి సరే, ఒకప్పుడు అన్నీ కట్టెల పొయ్యిలే ఉండేవి. ఆ పొయ్యి సరిగా మండకపోతే ఓ గొట్టం తీసుకొని గాలి ఊదేవాళ్లు. దాన్ని పొగ గొట్టం అనే వాళ్లు. మంట బాగా వుంటేనే వంట… లేదంటే తంటాయే. ఆ తర్వాత కిరోసిన్ స్టవ్‌లు వచ్చినా పంపు కొడితేనే అవి వెలిగేవి. పంపు కొట్టడమంటే గాలి ఒత్తిడి కల్పించడమేకదా.
ఇప్పుడు ఎంత ఆధునిక కాలమైనా మనం ప్రయాణించే ఏ వాహనం టైర్లలో అయినా ఉండేది గాలే కదా. టైరులో గాలి పోయిందంటే వాహనదారుడి పని తుస్సే. ఇక ప్రయాణాలలో వాడే గాలిదిండ్ల సంగతి తెలిసిందే.. ఆటలాడు బొమ్మల్లోనూ ఉండేది గాలే.
ఆకాశం వంక చూస్తుంటే మబ్బుల ఆకారాలు గాలిపటాలను గుర్తుచేశాయి. అలనాటి ‘పద పదవే వయ్యారి గాలిపటమా… పైన పక్షిలాగ ఎగురుకుంటూ….” నుంచి మొన్నటి ‘చిలుకా పద పద..’ వరకు గాలిపటాలపై ఎంత చక్కని సినిమా పాటలు వచ్చాయి… గాలిపటాలు ఎగరేయాలంటే ఎంత ఒడుపు కావాలి? ఏ చెట్టుకొమ్మకో చిక్కుకోకుండా, ఏ కరెంట్ తీగెకో తగులుకొని తెగకుండా పై పైకి ఎగరేయటం అంత సులభమేం కాదు. ఆధారాన్ని కోల్పోయిన జీవితాన్ని గాలిపటంతో పోలుస్తూ ‘తెగిన గాలిపటం’ అంటుంటారు.
చెట్లు ఊగుతోంటే ఆ గాలి వింత శబ్దాలు చేస్తోంది. ‘గాలి గుసగుసలాడేనని, సైగ చేసేనని… అది ఈరోజే తెలిసిందీ…” కవి కలానికి అందని భావమే లేదేమో. గాలి పైన సినిమా పాటలెన్నో రావటమే కాదు, శాస్త్రీయ సంగీతంలోనూ ‘మలయమారుతం’ పేరిట ఓ రాగమే ఉంది. ‘మనసా ఎటులోర్తునే’ కీర్తన మలయమారుతమేగా.
గాలిమాటలు, గాలి తిరుగుడు అంటారు కానీ గాలికి ఉన్న శక్తి అనంతం. తుఫాను గాలులు వీచాయంటే మహావృక్షాలే ఒక్కొక్కసారి నేలకొరుగుతాయి. గాలికి అంత శక్తి ఉండబట్టే గాలిమరల ఏర్పాట్లు… పవన విద్యుత్ సృష్టించే ప్రయత్నాలు. అగ్నికి వాయువు తోడయిందంటే అది పెనుప్రమాదమే. ప్రచండ వాయువు ప్రమాదకారే. శీతల గాలులు, వేడిగాలులు ప్రాణాంతకాలే. ఈరకంగా చూస్తే గాలి ఊపిరి పోయడమే కాదు, ఆగ్రహించిందంటే ఊపిరి తీయనూ గలదు.
గాలివాటం పడవ గమనానికి ఎంతో ముఖ్యం. అయితే గిబ్బన్ మహా శయుడు మాత్రం “గాలులు, అలలు సమర్థులైన సరంగులకు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయి” అంటాడు. అన్నట్లు విశాఖలో ‘గాలికొండ’ పైకి వెళ్లినప్పుడు ఆ గాలిని అనుభూతిస్తూ “మలయ మారుతమంటే ఇదేనా’ అనుకోలేదూ… తిరువణ్ణామలైలో గాలిగోపురాన్ని ఆశ్చర్యంగా తిలకించిన సందర్భమూ గుర్తుకొస్తోంది.
చినుకులు మొదలై ఆలోచనలను చెదరగొట్టాయి. వెంటనే ఆకలి గుర్తుకొచ్చింది. ‘గాలి భోంచేసి బతకలేం’ కానీ భోంచేసినా, ప్రాణం నిలవాలంటే మాత్రం గాలి అత్యవసరం. నిరంతర అవసరం. ఎందుకంటే ఆకలిని కొంత కాలం వాయిదా వేయవచ్చేమో కానీ శ్వాసించడాన్ని వాయిదా వేయలేం కదా. మనసు ఎక్కడినుంచి ఎక్కడకు ప్రయాణించిందీ! ఏమీ వేగం.. ఎంత వైవిధ్యం.. అందుకే మనసు వేగం మారుత వేగంతో సమానమంటారు.
అంతలో కరెంట్ వచ్చింది. ఇంత సేపూ నా ఆలోచనలక్కూడా ఊపిరై నిలిచిన గాలికి మనసులోనే నమస్సులు అర్పిస్తూ… ‘ఇందుగలడందులేడని సందేహము వలదు గాలి (వాయుదేవుడు) సర్వోపగతుండు… ఎందెందు వెదకి చూసిన అందందే గలడు’… అనుకొంటూ ‘గాలి’ని గాలికొదిలేస్తూ అక్కడి నుంచి లేచాను.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
9 Comments
Sridevi Medisetti
The comparison with Nature is awesome, on the whole the article is very interesting n enjoyable. Shyamala ji we are looking forward for more article from you.
Sridevi Medisetti
Shyamala ji the article is very enjoyable n interesting….. Looking forward for more articles from you.
Deepa
The author’s description of use of the word ‘air’ in our colloquial tongue reminded me of my childhood memories. She did a good job in elaborating the importance of ‘air’ in life in this very enjoyable read. Awaiting more articles from her!!
Guru prasad
Syamalaji article is very good and interesting hope some more articles are expecting from you soon
Guru prasad
m.ramalakshmi
Very nice madam.we want so many articles from you.
భ్రమర
వావ్ ..మనం పీల్చి వదిలేసే గాలిలో ఇన్ని సంగతులున్నాయా ..అని ఆశ్చర్యమేసింది. Really very nice article. చదివినంతసేపూ చల్లటి చిరుగాలి సున్నితంగా పలకరించినట్లు హాయిగా అనిపించింది. అంతేకాదు.. జ్ఞాపకాల పేటికను ఒక్కసారిగా తెరిచినట్లుంది. ‘చక్కనైన ఓ చిరుగాలీ..! ఒక్కమాట వినిపోవాలి’ అనే పాట ఒకప్పుడు ..అంటే టేప్ రికార్డర్ ల కాలంలో ప్రతి ఇంట్లో మార్మోగుతుంటే పెద్దవాళ్ళు ‘ ఆ గాలి పాటలేమిట్రా..అని విసుక్కోవడాలు., .ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే మా ఊరిలోని ఒకతనిని ‘గాలి తిరుగుడు’ తిరుగుతున్నాడని అందరూ సరదాగా ఆట పట్టించడాలు … ఇలా ఎన్నో గుర్తొచ్చాయి. రచయిత్రిగారు స్వగతంలో అనుకునే సంగతులన్నింటినీ పాఠకులతో పంచుకోవడం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి రచయిత్రుల ఊహల్లో ఎంతటి చిన్న అంశమైనా దర్జాగా సింహాసనమెక్కి కుర్చుంటుంది. మొదట్లో చిన్న గీతతో మొదలై..చివర్లో ఓ అందమైన పెయింటింగ్ ఆకృతిని దాల్చినట్లు ..చాలా బాగుంది. వచ్చేవారం ఎలాంటి అంశాన్ని ప్రజెంట్ చేస్తారోనని ఆసక్తిగా ఉంది. మానస సంచరరే టైటిల్ కూడా చాలా బాగుంది. ఇంత చక్కటి ‘మ్యూజింగ్స్’ అందిస్తున్న రచయిత్రి శ్యామల గారికి అభినందనలు.


Prabhakaram
Mrs. Syamala garu is a well-known writer in Telugu Literature. She has. written many essays with broad linked information. Like those essays, the past the present essay on AIR ( గాలి) is a valuable o
,l
Himabindu
chaala baagundi Syaamala garu.
sandhya
మీరు చెప్పినట్లుగా గాలి మనిషికి ప్రాణం పోయగలదు. అదే గాలికి అగ్ని తో డైతే దహించగల శక్తి ఉంది. గాలి మీద పాటలు సందర్భానుసారంగా బాగున్నాయి. మీ అనుభవాలను సంకలనం చేసి మాతో పంచుకున్నందుకు చాలా సంతోషం.