సాయం సమయాన గాలికి ఊగుతూ కులుకుతున్న సన్నజాజి లతను, రోజా రాణులను, ముగ్ధ మందారాలను తిలకిస్తూ అక్కడే కుర్చీలో బైఠాయించాను. చేతిలో చరవాణి.. నా వేళ్లు పాటల్లోకి.. అందులోనూ అప్రయత్నంగా ‘పుష్ప విలాపం’ను తాకాయి…
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని పొద్దున్నే మా తోటలోనికి వెళ్లాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతులతో ఉద్యానవనం కళకళలాడుతోంది. పూలబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు..
నేనొక పూలమొక్క కడ నిల్చి చివాలున కొమ్మ
వంచి గోరానెడు నంతలోన విరులన్నియు
జాలిగా నోళ్లు విప్పి ‘మా ప్రాణము తీతువా’
యనుచు బావురుమన్నవి కృంగిపోతి
నా మానసమందేదో తళుకుమన్నది
పుష్పవిలాప కావ్యమై
అంతలో ఒక సన్నజాజి సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అంది ప్రభూ
ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన
తీవతల్లి జాతీయత దిద్ది తీరుము తదీయ
కర్మములలోన స్వేచ్ఛమై నూయల లూగుచున్
మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్నుమూసెదము ఆయమ చల్లని కాలివేళ్లపై..
ఎందుకయ్యా మా స్వేచ్ఛా జీవనానికి
అడ్డు వస్తావు మేము నీకేం అపకారము చేశాం
గాలిని గౌరవింతుము సుగంధము పూసి
సమాశ్రయించు భృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు; మిమ్ముబోంట్ల నేత్రాలకు
హాయి గూర్తుము; స్వతంత్రుల మమ్ముల
స్వార్థబుద్ధితో
తాళుము తుంపబోకుము తల్లికి బిడ్డకి వేరు సేతువే
ఇంతలో ఒక గులాబి బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి యిలా అంది ప్రభు..
ఊలు దారాలతో గొంతు కురి బిగించి
గుండెలోనుండి సూదులు గుచ్చి కూర్చి
ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము
అకటా దయలేని వారు మీ ఆడవారు..
పాపం మీరు దయా దాక్షిణ్యాలు గల మానవులని
మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద
మాధురీ; జీవితమెల్ల మీకయి త్యజియించి
కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆ పై చీపురుతోడ
చిమ్మి; మమ్మావల పారబోతురుగదా! నరజాతికి నీతి యున్నదా..
ఓయీ మానవుడా..
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు
ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్యచేసెడి హంతకుండ
మైలపడిపోయె నోయి నీ మనుజ జన్మ…
కరుణశ్రీ (జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు) ఎంత లలితమైన తెలుగు పదాలతో పూల అంతర్వాణిని వినిపించారో. ఘంటసాల ‘పుష్పవిలాపా’న్ని ఆలపించిన తీరు అనన్య సామాన్యం. ముఖ్యంగా ‘మేం మీకు ఏం అపకారం చేశాం’ అని ప్రశ్నించే స్వరం ఎంత జాలిగొలిపేలా ఉంటుందో! అకటా! దయలేని వారలు… నిజమే మనిషిలో రోజు రోజుకు కరుణ.. అదే అచ్చతెలుగులో ‘దయ’ తగ్గిపోతోంది. నవ రసాలలో ‘కరుణరసం’ ఒకటి. మహాకవి భవభూతి అయితే ‘కరుణ ఏకో రసః’ అన్నాడు. మనిషనే వాడికి నామమాత్రపు హృదయం ఉంటే చాలదు. అది హృ’దయ’o కావాలి. మనిషికి భూతదయ ముఖ్యం. భూతాలు అంటే ఇక్కడ ప్రాణులని అర్థం. అంటే సకల ప్రాణుల పట్ల దయ ఉండాలి. నిజానికి నేడు ప్రపంచంలో హింస పెరగటానికి కారణం మనిషిలో భూత దయ లోపించడమే. భూత దయ అనేది దైవ గుణం.
చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నొవ్వంగ హరి కీర్తి నుడువడేని
దయయు సత్యంబు లోనుగా దలపడేని
గలుగనేటికి తల్లుల కడుపు చేటు
ఎటువంటి వారి పుట్టుక తల్లుల కడుపు చేటో ఈ పద్యంలో వివరించారు. హరిహర అబేధంతో దైవాన్ని ఆరాధించాలంటూనే ఇంకా తన జీవితానికి ఆధారభూతమైన సర్వ ప్రకృతి పట్ల మానవుడు దయతో వ్యవహరించాలని, సత్యనిష్ఠ పాటించాలని పోతన ఎంతో చక్కగా చెప్పారు. పోతన మరో పద్యంలో కూడా భూతదయ ప్రస్తావన చేశారు. ఆ సందర్భం.. సుదాముడు మధురానగరిలో మాలాకారుడు. బలరామకృష్ణులు మధురానగరంలో ప్రవేశించినపుడు సుదాముడి ఇంటికి వెళ్లారు. వారిని చూచిన వెంటనే సుదాముడు లేచి, వారికి నమస్కరించి, అర్ఘ్య పాద్యాలను, తాంబూలాలను, పూలు, గంధాలను సమర్పించి, పరిమళ సుమ మాలలతో వారి కంఠాలనలంకరించాడు. ఆ తర్వాత ‘మీ రాకతో మా ఇల్లు పావన మయింది. నా తపసు ఫలించింది. నా కోరికలన్నీ తీరాయి. నేను ఇంక మీకు ఏమి చేయగలను?’ అనడంతో బలరామకృష్ణులు సంతోషించి ఏం కావాలో కోరుకొమ్మన్నారు. అప్పుడు సుదాముడు కోరిన కోరికలను పోతన పద్యరూపంలో ఎంతో చక్కగా చెప్పారు. అది.
నీ పాద కమలముల సేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యమును
నీతాంతాపార భూతదయయు
తాపస మందార నాకు దయ సేయగదే
నీ పాద సేవ, నిన్ను సేవించే వారితో స్నేహము, అపారమైన భూతదయ తనకు ప్రసాదించమన్నాడు. అదీ సుదాముడి వ్యక్తిత్వము, భక్తి తత్పరత. అసలు భాగవతంలోని కథలన్నిటా ‘దయ’ చిప్పిల్లుతూనే ఉంటుంది. కృష్ణుడి మోమును వర్ణించడం లోనే …
నల్లనివాడు, పద్మనయనంబులవాడు గృపారసంబు పైఁ జల్లెడు వాఁడు.. అంటాడు.
కృష్ణుడు కరుణ కురిపించే వాడని వివరించారు. కరుణరసాన్ని ఆవిష్కరించడంలో పోతన సిద్ధహస్తుడు. కుళింగ పక్షుల వృత్తాంతంలో.. బోయవాని వలలో చిక్కిన ఆడపక్షిని చూసి మగపక్షి ఆవేదనను ఇలా..
ఱెక్కలు రావు పిల్లలకు ఱేపటినుండియు మేత గానమిన్
బొక్కుచు గూటిలో నెగసి పోవగనేరవు మున్ను తల్లి యే
దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కి నల్
దిక్కులు చూచుచున్న వతిదీనత నెట్లు భరింతు? నక్కటా!..
ఇలా భాగవతం నిండా ఎన్నెన్నో.. రామాయణ, మహాభారత ఇతిహాసాల్లో కూడా కరుణరసం చిప్పిల్లు తూనే ఉంటుంది. రామాయణంలో సీతారామలక్ష్మణులు నారచీరలు ధరించి అడవులకేగటం, లంకలో సీత వేదన, చాకలి మాటతో రాముడు, గర్భవతి అయిన సీతను అడవిలో వదలి రమ్మని లక్ష్మణుని ఆదేశించటం, చివరకు సీత భూమాత ఒడిని చేరటం అన్నీ కూడా కరుణరస ప్రధానాలే. అలాగే మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని వీరమరణం చెందటం వగైరాలు. ఇంకా చెప్పాలంటే స్త్రీపర్వమంతా శోకప్రవాహమే. కురుక్షేత్రంలో మరణించిన తమ బంధుకోటిని చూసిన స్త్రీల విలాపమే స్త్రీపర్వం. మూర్తీభవించిన శోకదేవతగా గాంధారి, దానికంతటికీ కారణం శ్రీకృష్ణుడేనంటూ అతడికి తలలు లేని మొండములు, మొండెములు లేని తలలతో ఉన్న తమ వారిని చూసి రోదిస్తున్న స్త్రీలను చూపి నిలదీస్తుంది. ఇక వేమన కూడా తన నీతి శతక పద్యాలలో
తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినుర వేమ.. అన్నాడు.
అంతలో గురజాడవారి కరుణ రసాత్మక గేయం ‘పుత్తడి బొమ్మ పూర్ణమ్మ’ గురుతుకొచ్చింది. నాడు కన్యాశుల్క దురాచారానికి బలైన బాలికల దయనీయ స్థితికి ఈ గేయకథ ఓ అక్షరదర్పణం. పూర్ణమ్మకు తల్లిదండ్రులు ఓ వృద్ధుడితో వివాహం జరపడం, కొంత కాలం తర్వాత ఆ ముదుసలి ఆమెను తనతో తీసుకుపోవడానికి రావడం జరుగుతాయి. అప్పుడు పూర్ణమ్మ అందరి దగ్గర సెలవు తీసుకొని దుర్గను కొలిచి వస్తానని వెళుతుంది. కానీ…
ఆవులు పెయ్యలు మందలు జేరెను
పిట్టలు చెట్లను గుమిగూడెన్
మింటను చుక్కలు మెరయుచు పొడమెను
పూర్ణమ యింటికి రాదాయె
చీకటి నిండెను కొండల కోనల
మేతకు మెకములు మెసల జనెన్
దుర్గకు మెడలో హారము లమరెను
పూర్ణమ యింటికి రాదాయె
కన్నుల కాంతులు కలవల చేరెను
మేలిమి జేరెను మేని పసల్
హంసల జేరెను నడకల బెడగులు
దుర్గను జేరెను పూర్ణమ్మ..
చదివిన ఎవరికైనా కళ్లే కాదు, మనసూ చెమ్మగిల్లుతుంది. మనసు అనుకోగానే నాకు ‘అమాయకుడు’ చిత్రంలోని దేవులపల్లి వారి పాట గుర్తుకు వచ్చింది. అది..
మనిషైతే.. మనసుంటే
మనిషైతే మనసుంటే.. కనులు కరగాలిరా
కరిగి కరుణ కురియాలిరా.. కురిసి జగతి నిండాలిరా..
ఆగి ఆగి సాగిపోరా.. సాగిపోతూ చూడరా.. ఆ..
వేగిపోయే ఎన్నెన్ని బ్రతుకులో.. వేడుకుంటూ
ఎన్నెన్ని చేతులో వేచి ఉన్నాయిరా.. ॥మనిషైతే॥
తేలిపోతూ నీలి మేఘం.. జాలి జాలిగ కరిగెరా.. తేలిపోతూ..
కేలుచాపి ఆ దైవమే తన.. కేలుచాపి ఆకాశమే ఈనేల పై ఒరిగెరా..
మనిషైతే.. మనసుంటే; మనసుంటే మనిషైతే
వైకుంఠమే ఒరుగురా.. నీకోసమే కరుగురా.. నీకోసమే కరుగురా..
అంతలో జేసుదాసు పాడిన పాట మదిని మెదిలింది..
బోయవాని వేటుకు గాయపడిన కోయిల..
గుండె కోత కోసినా చేసినావు ఊయల..
రాయికన్న రాయిచేత రాగాలు పలికించి
రాక్షసుణ్ని మనిషి చేసి తన దైవం అన్నది
ఏనాటిదో ఈ బంధం ॥బోయవాని॥
చేరువైన చెలిమికి చుక్కబొట్టు పెట్టని
కరుణ చిందు కనులకు కాటుకైన దిద్దని..
రౌడీగారి పెళ్లాం… చిత్రం పేరు ఎలా ఉన్నా ఎంతో అర్థవంతమైన పాటను గురుచరణ్ అందించటం మెచ్చదగ్గ విషయం.
మానవుడు ఎంత గొప్పవాడయినా భగవత్ కృప ఉండి తీరాలి. అందుకే త్యాగరాజు ‘నీ దయ రాదా.. కల్యాణరామా..’ అంటూ భక్తితో, ఆర్తితో వసంతభైరవిలో వేడుకున్నాడు. దయ ప్రస్తావన వస్తే ఎవరికైనా ‘సిద్ధార్థుడు-పావురం’కథ గుర్తుకు వచ్చి తీరుతుంది. సిద్ధార్థుడు ఒకరోజు దేవదత్తుడితో కలిసి అడవుల్లో నడుస్తుండగా ఆకాశంలో ఎగురుతున్న ఓ అందమైన పావురం కనపడటంతో దాన్ని, దేవదత్తుడికి చూపించాడు. అంతే! వెంటనే దేవదత్తుడు దానికి గురి పెట్టి బాణం వేశాడు. సిద్ధార్థుడు వారించే సమయం కూడా లేకపోయింది. బాణం తగిలి ఆ పావురం నేల వాలింది. వెంటనే సిద్ధార్థుడు పరుగున వెళ్లి దాన్ని ఒడిలో చేర్చుకుని, బాణాన్ని తొలగించి, దాని గాయానికి వైద్యం చేశాడు. అప్పుడు దేవదత్తుడు అక్కడికి చేరుకుని పావురాన్ని తనకు ఇచ్చేయమన్నాడు. సిద్ధార్థుడు ఇవ్వనన్నాడు. దేవదత్తుడు బాణం వేసి, దాన్ని కిందకు రప్పించినందున, అది తనదే అన్నాడు. ఇద్దరూ న్యాయాధికారి వద్దకు వెళ్లి విషయం వివరించారు. న్యాయమూర్తి ఎంతో తెలివిగా ఆ పక్షి మరణించి ఉంటే అది నీదని నువ్వు అడిగే వీలుంది, కానీ సిద్ధార్థుడు తన సేవతో దాన్ని బతికించాడు కాబట్టి అది అతనిదే అని తీర్పు ఇచ్చాడు. సిద్ధార్థుడు ఎంతో సంతోషంతో బయటకు వచ్చి ‘ఇది ఎవరిదీకాదు’ అంటూదాన్ని తిరిగి ఆకాశం లోకి ఎగురవేసి, దానికి స్వేచ్ఛ ప్రసాదించాడు. బాల్యంలోనే అతడి దయా హృదయానికి అద్దంపట్టే సంఘటన ఇది. తెలుగు చిత్రాల్లో కొన్ని పాటల్లో శృంగారపరంగానూ, హాస్యపరంగానూ ‘దయ’ను వాడటం జరిగింది.
‘అమ్మాయిల శపథం’ చిత్రానికి ఆత్రేయగారందించిన యుగళ గీతం ఇలా..
నీలి మేఘమా, జాలి చూపుమా ఒక్క నిముషమాగుమా
నా రాజుతో ఈ రాతిరి నన్ను కలిపి వెళ్లుమా..
‘నేనేంటే నేనే’ చిత్రంలో కొసరాజుగారు హాస్యం, శృంగారం మిళితం చేసి ఓ పాట రాశారు. అది చాలా హిట్టయింది కూడా. ఎస్.పి.బాలు ఆ గీతాన్ని ఎంతో ప్రత్యేకంగా పాడారు. అది..
ఓ చిన్నదానా.. ఓ చిన్నదాన విడిచి పోతావటే
పక్కనున్న వాడి మీద నీకు దయరాదటే
ఒక్కసారి ఇటు చూడు, మనసు విప్పి మాటాడు
నిజం చెప్పవలెనంటే నీకు, నాకు సరిజోడు..
ఆ గుంతలకిడి గుంతలకిడి గుంతలకిడి గుమ్మా..
పిఠాపురంగారు పాడిన పాటొకటి చటుక్కున స్ఫురించింది. అది..
రావేలా దయలేదా.. బాలా ఇంటికి రారాదా..
రారాదా.. రారాదా.. రారాదా..
వెన్నెల అంతా చల్లగ కరిగిపోతున్నది
పువ్వుల ఘుమఘుమ వాసన కరిగిపోతున్నది
నీవు లేకపోతే ఇల్లు బావురు మందీ
నీవు రాకపోతే మనసు ఆవురుమందీ ॥రావేలా దయలేదా॥
మనుషులు, జంతువులను దయగా చూడటం అన్నది సాధారణ దృష్టి. కానీ కొన్ని సందర్భాలలో జంతువుల దయే మనిషికి అవసరమవుతుంది. ‘జాతకరత్న మిడతంభొట్లు’ చిత్రంలో గాడిదను దయ చూపమంటూ వేడుకునే పాట… ఎంతగానో నవ్వించే ఆ పాట..
దయ చూడవే గాడిదా.. నిదమ దయచూడవే గాడిదా
పరువుకోసమని నిదురమానుకుని వెదకివెదకి వేసారినాను ॥దయ॥
తోకకు ఆకులు కట్టే వెధవకు.. నీవులేనిదే తోచకున్నది
పాపం లచ్చినిన్నటినించి పిచ్చిదానివలె తిరుగుచున్నదే
దా.. దామ్మదా.. మదమా.. దదదదదా.. దదా.. దదాదా
నీవు రాక మన ఊరి ఇండ్లలో మురికి బట్టలు మురుగుచున్నవి
దొరికితివంటే పెడతా పచ్చని గడ్డి
దొరకకపోతే విరుగుతుంది నీ నడ్డి ॥దయ॥
గార్దభాన్వేషణలో సాగే ఈ పాటను ఆరుద్రగారు రాయగా, బాలు ఆసాంతం నవ్వించేలా పాడారు. దయ కొంత మందిలో చిత్రంగా ఉంటుంది. వాళ్లకు దీన స్థితిలో ఉన్న వ్యక్తి పై దయ కలుగుతుంది. కానీ వాళ్లు అడిగితేనే సాయం చేయాలనుకుంటారు. అవతలివారు అభిమానవంతులై అడగనే అడగరు, వీరు సాయం చేయనూ చేయరు. నేను చాలా ఏళ్ల కిందట చదివిన కథ గుర్తుకొస్తోంది. కథ పేరు ‘సావిత్రమ్మ దాతృత్వం’. సావిత్రమ్మకు, చిరుగులచీర కట్టుకొచ్చిన పనిమనిషి పై దయ కలుగుతుంది. ఓ పాతచీరె ఇద్దామని తీసి పక్కన పెడుతుంది కూడా. కానీ పని మనిషి అడగకుండా ఇవ్వకూడదని బయటకు తీసిన చీరెను లోపల పెడుతుంది. ఇలా రెండుమూడుసార్లు జరుగుతుంది. చివరకు ఏమైందో స్పష్టంగా గుర్తులేదు కానీ సావిత్రమ్మ చీరె దానం చేసే అవకాశమే లేకుండా పోతుంది.
కొందరు తమ దయార్ద్ర హృదయం పదిమందికి తెలియాలనుకుంటారు. ఎవరికైనా ఏదో సందర్భంలో సాయపడితే దాన్ని సంవత్సరాల తరబడి చెప్పుకుంటారు. సాయం పొందిన వ్యక్తి ఆ విషయం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా వీరే పదిమందిలో తమ సాయాన్ని పెద్దది చేసి చెప్పి సాయం పొందిన వ్యక్తి కించపడేట్లు చేస్తుంటారు పదేపదే. కానీ కుడిచేత్తో చేసేదానం ఎడమ చేతికి తెలియ కూడదన్నది పెద్దలమాట. కొందరికి మనుషుల పై కంటే జంతువుల పైనే దయ ఎక్కువగా ఉంటుంది. మళ్లీ జంతువుల్లో కూడా కొన్నింటి మీదే దయ ఉంటుంది. మళ్లీ దయకు, పుణ్యానికి లింక్ ఉంటుంది. పుణ్య ఫలాన్ని ఆశించి దయను చేతల్లో చూపటమన్నమాట.
ప్రతి వ్యక్తి దయామయులై ఉండాలి. వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు కూడా కాస్తంత దయా హృదయులైనప్పుడే ప్రజలకు మంచి సేవ లందించ గలుగుతారు. ముఖ్యంగా వైద్యులు, నర్సులు వంటివారు మనసులో దయ గలిగి ఉన్నప్పుడే రోగులకు పూర్తి మేలు చేకూరేది.
దయ పదానికి ప్రత్యామ్నాయంగా ఎవరికి తోచినట్లు వారు ఆయా సందర్భాలలో కరుణ, కృప, కనికరం, జాలి వంటి పర్యాయ పదాలు వాడుతుంటారు.
దాశరథీశతకం రాసిన కంచెర్ల గోపన్న ప్రతి పద్యం చివర దాశరథీ కరుణా పయోనిధీ అంటూ శ్రీరాముడిని దయా సముద్రుడని స్తుతించటం తెలిసిందే. ఆ పద్యాలు పూర్తి భక్తి రస పూరితాలు.
కరములు నీకు మ్రొక్కులిడ కన్నులు మిమ్మునే చూడ జిహ్వ మీ
స్మరణను దనర్ప వీనులును సత్కథలన్ వినుచుండ నాస మీ
యఱుతను బెట్టు పూసరుల కాసగొనన్ బరమాత్మ సాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ కరుణాపయోనిధీ..
ఈ పద్యం పోతన భాగవతంలోని ‘కమలాక్షు నర్చించు కరములు కరములు..’ పద్యాన్ని గుర్తుచేస్తోంది. పోలికవల్ల కాబోలు.. ఇద్దరూ శ్రీరామభక్తులేగా. అయితే ‘దయచేయండి’ అనే మాటకు అర్థం ‘రమ్మనమని’. ‘రుద్రవీణ’ చిత్రంలో సిరివెన్నెల గారు ఈ పదంతో ఓ తమాషా పాట రాశారు. అతిథిని ఆహ్వానిస్తూ, ఆ ఇంటిని, ఇంట్లోని వ్యక్తుల్ని పరిచయం చేస్తుంది. ఆ పాట. అదే..
రండి రండి రండి.. దయచేయండి
తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ..
మనో, ఎస్.పి.శైలజ, ఎస్.పి.బాలు ఈ పాటను అద్వితీయంగా పాడారు.
‘దయచేయండి’ వ్యంగ్యంగా వెళ్లచ్చు అనే అర్థంలో కూడా పలికే తీరు మార్చి వాడటం కద్దు. ఇంక తమరు దయచేస్తారా లేదా దయచేయొచ్చు మాటలు కూడా వెళ్ళొచ్చని చెప్పేవే.
‘దయ అనేది చెవిటివారు వినగల, అంధులు చూడగల భాష’ – మార్క్ ట్వైన్.
‘నా మతం దయ’ – దలైలామా.
దైవ పూజకు మనం ఎన్నో మేలైన పుష్పాలను సమర్పిస్తుంటాం. కానీ భర్తృహరి ప్రకారం భగవంతుడు కోరుకునే పుష్పాలు మొక్కలకు పూసే పూవులు కావు. దైవం మెచ్చే అష్టవిధ పుష్పాలు..
అహింసా ప్రథమం పుష్పం,
పుష్ప మింద్రియ నిగ్రహః
సర్వభూతదయా పుష్పం
క్షమా పుష్పం విశేషతః
శాంతి పుష్పం తపఃపుష్పం, ధ్యాన పుష్పం తధైవచ
సత్యం అష్టవిధం పుష్పం విష్ణోః ప్రీతికరం భవేత్…
అష్టవిధ పుష్పాలలో సర్వభూత దయాపుష్పం కూడా ఒకటి. మనిషి దయార్ద్ర హృదయుడైతే సమాజంలో ఇన్ని దోపిడీలు, అకృత్యాలు ఉండనే ఉండవు. పిల్లలకు బాల్యం నుంచే భూత దయ అలవరచాలి. అందుకు పెద్దలు ఆ విషయం చెపితే చాలదు. తాము ఆచరించి చూపాలి. ఏ మనిషైనా దివ్యాంగులు, రోగులు, ఇబ్బందుల్లో ఉన్నవారు, నిస్సహాయులు, నిరు పేదల పట్ల ఒకింత దయకలిగి ఉంటేనే నిజమైన మనిషి. అందరికీ ధనసాయం చేయలేని పరిస్థితి అయినా, సేవలందించే పరిస్థితి అయినా కనీసం దయగా మాట్లాడటం ముఖ్యం. దయా గుణంతోనే మనిషిజన్మకు సార్థకత.
హెచ్.డబ్ల్యు.లాంగ్ ఫెలో ఇలా అంటాడు..
కైండ్ హార్ట్స్ ఆర్ ది గార్డెన్స్
కైండ్ వర్డ్స్ ఆర్ ది రూట్స్
కైండ్ థాట్స్ ఆర్ ది ఫ్లవర్స్
కైండ్ డీడ్స్ ఆర్ ది ఫ్రూట్స్
టేక్ కేర్ ఆఫ్ యువర్ గార్డెన్
అండ్ కీప్ అవుట్ ది వీడ్స్;
ఫిల్ ఇట్ విత్ సన్‌షైన్,
కైండ్ వర్డ్స్ అండ్ కైండ్ డీడ్స్
అంతలో బయటి నుంచి ఏడుపు వినపడటంతో ఉలిక్కిపడ్డాను. గబుక్కున లేచి గేటు బయట చూశాను. ఆ బాబుకి ఏడేళ్లుంటాయేమో. చేతిలో చిన్న టీపొడి ప్యాకెట్, ఒక చాక్లెట్. దగ్గర్లోని షాపుకెళ్లి వస్తున్నట్లున్నాడు. ఎదురుగా వస్తున్న పెద్ద కొమ్ముల ఎద్దుల్ని చూసి వణుకుతున్నాడు. గబుక్కున దగ్గరకెళ్లి ‘అరె నాన్నా! భయపడకు. ఇలా లోపలకు వచ్చెయ్’ అంటూ వాణ్ని గేటు లోపలకు లాగి, గేటు మూశాను. అంతే. వాడు ఏడుపు ఆపేశాడు. రెండు నిముషాలలో అవి మా గేటు దాటి ముందుకు వెళ్లిపోయాయి. ‘ఎడ్లు వెళ్లిపోయాయి. ఇంక వెళ్లగలవా?’ అడిగాను. వాడు తలూపి, ముందుకు కదిలాడు. దయ గురించిన తలపులను మదిలో పదిలపరుస్తూ నేను ఇంటి లోపలకు….
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 70కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. కొన్ని కథల పోటీలలో బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన, మానస సంచరరే, అన్నింట అంతరాత్మ వంటి కాలమ్‌లు రాశారు.
9 Comments
Guru prasad
From J guru Prasad
Wonderful narration by smt syamala garu regarding our kind hearted nature towards Physically handicapped People and also fantastic and kind hearted Poets
From J Guru Prasad
Mramalakshmi
దయాగుణంతోనే మనిషి జన్మకు సార్ధకత అంటూ శ్యామలగారు అందించిన రచన బాగుంది.వివిధ ఉదాహారణలతో సందర్భసహితంగా పాటల కూర్పుతో

కరుణరసావిష్కరణ చేసిన శ్యామల మేడంకి ధన్యవాదములు.మీ కలంనుంచి మరిన్ని అనర్ఘరత్నాలు అలవోకగా వెలువడి పాఠకుల మనసులను రాగరంజితం చేయాలనీ మానసారా కోరుతూ
GNMURTY
దయ గురించి రచయిత్రి గారు చాలా బాగా రాసారు
ఇందుకు వారు ఎన్నో పద్యాలను పాటలను సందర్భానుసారం ఉదహరించారు
పోతన గురజాడ రామదాసు ఇలాఎన్నింటినో ఉదహరించారు
రచయిత్రి కి పురాణాల మాద పట్టు ఉందని తెలుస్తోంది
మంచి వ్యాసం
విరించి
దయా గుణం గురించి,మనుష్యులలో దయా గుణం ఆవశ్యకత గురించి శ్యామల గారు దయ తో విపులంగా చర్చించారు…ఇకముందు కూడా ఇంతే దయ తో మరిన్ని మంచి వ్యాసాలు అందించగలరని ఆశిస్తున్నాను.
manikopalle
మనో వనాన దయా సుమం పుష్ప విలాపం తో మొదలై ఎన్నో దయా సుమాల సుగంధాలు వినిపించి, చూపించారు. చాలా బాగుంది. చక్కటి విశ్లేషణ ..
తన కోపమే తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ ! ,,,,,,,,
‘దయ చుట్టంబౌ.’.
అన్నట్లు దయ కొన్నిసార్లు బంధువులా మారి సహాయమూ చేస్తుంది.
Girija
శ్యామలగారి ప్రతి రచన ఆ కధనం పై ఆవిడకి ఉన్న పట్టుకి, విషయ అవగాహానికి, ఓమచ్చు తునక. పాటలకి, పద్యాల కి తన రచనతో మరింత అర్థవంతమైన భావనని జోడించి భాషపై తనదైన శైలిని కలిపి, ఆవిడ రచనలకి ఒక ప్రత్యేకతని ఆపాదించుకున్న శ్యా మల సాటిలేని మేటి రచయిత
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
మనో వనాన దయా సుమం గురించి ఏమి రాయాలో తెలియడం లేదు. ఏవిధంగా రచయిత్రి ని పొగడాలో అర్దం కావడం లేదు. అంత గొప్పగా ఉన్నది ఈ వ్యాసం. శ్రీమతి శ్యామల గారికి కృతజ్ఞతలు ఇంత గొప్ప వ్యాసం అందించినందులకు.
Dr.Ch.Nagamani
The writer wonderfully crafted the narrative with abundant illustrations which makes very interesting reading. The phrase ‘Dasaradhee karunapayonidhi’ reminds one of Thyagaraja kriti ‘Karunajaladhe Dasaradhre’. No wonder great minds think alike. The personal touch given at the ending connects well with the readers. As Shakespeare says ‘ Quality of mercy is twice blessed. It blesses him that gives and him that takes. Congratulations to Smt Syamala for her inspirational and heart touching essay. Looking forward to more and more such works from her.
Bhramara
ఆర్టికల్ అద్భుతంగా ఉంది. టాపిక్ చాలా గొప్పగా, సందేశాన్నిచ్చేదిగా ఉంది. ఇందులో తెలిపిన అన్ని అంశాలు ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. మనుషులు దయ, కరుణ లాంటి లక్షణాలను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని బహు చక్కగా వివరించారు. మనసును కదిలించే పుష్పవిలాపం ను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. భూతదయ గురించి వివరిస్తూ సిద్ధార్ధుడు-పావురం కథను చెప్పడం చాలాబాగుంది. భాగవతం, భారతం, రామాయణాల్లోని కరుణరసం, దయను రచయిత్రిగారు బాగా పట్టుకుని పాఠకులతో పంచుకున్న తీరు అభినందనీయం. ‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ గురించి ఎన్నిసార్లు చదివినా, చదివిన ప్రతిసారీ హృదయం ఆర్థ్రమవ్వడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ..మరోసారి గుర్తుచేసి పాఠకుల మనసును తాకారు. అష్టవిధపుష్పాల గురించి చెప్పడం, సందర్భోచితమైన పాటలను ఉటంకించడం కూడా చాలా బాగుంది. ఇక లాంగ్ ఫెలో రాసిన poem ‘Kind hearts are the gardens’ ఆర్టికల్ కే హైలైట్ అనిపించింది.. ఇంత చక్కటి ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారికి ప్రత్యేక అభినందనలు.




