ప్రొద్దుటే ఒకమ్మాయి వచ్చి గుమ్మం ముందు నిలబడింది.
తలస్నానం చేసి విరబోసి క్లిప్పులు పెట్టిన జుట్టు, తళుకు బొట్టు, చెవుల లోలాకులు, చుడీదారు.
ఎదురింటి అమ్మాయేమోనని చిరునవ్వు నవ్వి “ఎవరూ?” అన్నాను
ఆ అమ్మాయి నవ్వలేదు.
“పనమ్మాయి కావాలన్నారట, వాచ్మాన్ చెప్పాడు” అంది.
వెంటనే గుర్తొచ్చింది. కొత్త ప్రదేశానికి వచ్చాం కదా! ఆ ముందు రోజే వాచ్‌మన్‌కి పనిమనిషిని చూడమని చెప్పాను.
అయినా ఆ అమ్మాయిని చూస్తూంటే సందేహంగానే వుంది.
“అవును” అన్నాను, ఆ అమ్మాయి చేతిలోని సెల్‌ఫోన్ వంక చూస్తూ.
“ఎంతిస్తారు?” అంది ఏం చేయాలి అని అడగకుండానే.
ఇప్పుడిక పూర్తిగా అర్థమయింది.
చాలా కాలంగా పనిమనుషుల తీరు మారిపోయింది. వాళ్ళు రావడానికి పోవడానికి ఒక టైమంటూ వుండదు. పూర్వంలా వాకిట్లో కళ్ళాపిలు, ముగ్గులూ లేనే లేవు. వాళ్ళు వచ్చేసరికి సగం పని మనం చేసేసుకోవాలి. గిన్నెల్లో ఎంగిళ్ళు వుండకూడదు. వీలయితే కడిగి పెట్టాలి. గబగబా ఫిల్టర్ కాఫీలందించాలి. టిఫిన్స్ పెట్టాలి. వాళ్ళు ఇల్లు తుడుచే నెపంతో ‘s’ ‘y’ లు వేస్తే చూసి నోరెత్తకూడదు. గుమ్మం ముందు చూడగానే దేవుడు ప్రత్యక్షమయినట్లు ఆనంద పడిపోవాలి.
చేయాల్సిన పనిని తగ్గించి చెప్పాను.
అడగాల్సిన జీతాన్ని హెచ్చించి అడిగింది.
చేసేది లేక సరే అన్నాను.
గిన్నె గిన్నెకు తోముతూ సెల్లో మాట్లాడుతూనే వుంది.
గేప్‌లో పనికి మాలిన పాటలు పెడుతూనే వుంది.
“ఆ పాటలు బంద్ చెయ్యి, నాకు చిరాకు” అన్నాను.
నన్నో ఆడవి మనిషిలా చూసి ఆపింది.
స్క్రబ్బర్ చేతికి గుచ్చుకుంటుందని గునిసింది.
చీపురు పట్టుకుంటుంటే చేతికి బొబ్బలొస్తున్నాయని అంగలార్చింది.
“మీరు తెలంగాణా ఓల్లా?” అనడిగింది.
“ఎందుకూ?” అన్నాను.
“ఆల్ల బాస బాగోదు. ఒక్కముక్క అర్థం కాదు” అంది ఒక వాక్యంలో వంద తప్పులు మాట్లాడుతూ.
“ఈ మాటే రాష్ట్రాన్ని విడదీసింది” అని చెప్పలేక పోయాను.
“ఏ వూరు?” అన్నాను.
“కాకినాడ” అంది.
“అందుకే మరి వాళ్ళు ‘మా భాష నచ్చనప్పుడు ఇక్కడ వుండటం దేనికి’ అంటున్నారు” అన్నాను.
అదోలా చూసింది.
వెళ్ళేటప్పుడు ఆ రోజు డబ్బులిచ్చి పంపేసాను.
“పనొద్దా?” అనడిగింది.
“నువ్వు చెయ్యలేవు, వద్దులే” అన్నాను.
ఆ జుట్టు విరబోసుకోవడం నాకసలు నచ్చదు. ఎప్పడో ఫాషన్గా తయారవ్వడం వేరు. ప్రొద్దుట నుండి అలా విరబోసుకుని తిరగడం వేరు. చేసే పనుల్లో వెంట్రుకలు పడటం పరమ చిరాకు కదా!
కొన్నింటికి బ్రిటీష్ వారిని ఆడిపోసుకుంటాం కాని వారు కొన్ని విషయాల్ని స్ట్రిక్ట్‌గా పాటించారు. టీచర్స్ని, డాక్టర్స్‌ని గట్టిగా జడ అల్లి ముడి వేసుకోవాలని తెల్లటి బట్టలు మాత్రమే ధరించాలని. ముఖ్యంగా డాక్టర్లు ఆపరేషన్లు చేస్తున్నప్పుడు వెంట్రుకలు రాకుండా. అలాగే పేషంట్ కళ్ళకి ప్రశాంతంగా కనిపించేట్లు తెల్ల డ్రస్సులు ధరించేవారు. మన ప్రభుత్వాలు వచ్చాకా అంతా స్వేచ్చే! ఇప్పుడు వారు చేసుకుంటున్న గాడీ మేకప్పులు చూస్తూనే వున్నాం.
పనిమనిషి గురించి ఆలోచిస్తూ పడుకుంటే కాలచక్రం గిర్రున తిరిగి నా అయిదో సంవత్సరంలో నిలబడింది.
అప్పుడు మేం ఒంగోలులో వున్నాం.
నేను అక్క నా తర్వాత చెల్లెలు – తర్వాత ఇద్దరూ ఇంకా పుట్టలేదు. ఎప్పటి నుండి అక్కడ వున్నామో కాని నాకు వూహ తెలిసేసరికి మా యింట్లో పని చేసే ఆమె పేరు ముకుందిని.
వయస్సు నలభయి వుంటాయేమో !
సన్నగా వంగి వుండేది.
మొహం మాత్రం పాత సినిమాల్లో శకుని పాత్ర వేసే లింగమూర్తిలా వుండేది. అప్పుడే మా యింటి పక్కన టూరింగ్ టాకీసులో డొక్కు సినిమాలు పదే పదే చూస్తూన్నానేమో, లింగమూర్తి బాగా గుర్తుండిపోయాడు.
చేతులు వెనక్కి పెట్టి నిన్న మొన్న అన్నమో, కూరలో ఇచ్చిన గిన్నెలు పట్టుకుని నిదానంగా అటూ యిటూ చూస్తూ లోపలి కొచ్చేది.
అమ్మ ఆమెను చూస్తూనే గయ్యిమని “వచ్చిందే లేటు. ఇంకా తిప్పుకుంటూ నడుస్తున్నావేంటి పద!” అనేది.
ముకుందిని ఆ మాటలేం ఖాతరు చేసేది కాదు.
“అయ్యేడి?” అనడిగేది నిర్లక్ష్యంగా.
“ఆయన సంగతి నీ కెందుకు? పని చేసి తగలడు” అనేది అమ్మ కోపంగా.
“సర్లే. పిల్లలేరి?” అనేది.
మేం గదిలోంచి తొంగి చూసి నవ్వేవాళ్ళం.
తెచ్చిన గిన్నెలో దాచిన, పల్లీ వుండలో, నువ్వులుండలో మా చేతిలో పెట్టి పరట్లోకి వెళ్ళేది.
“అడ్డమైన గడ్డీ తెచ్చి వాళ్ళకి పెట్టకు. జబ్బులు చేస్తాయి” అని అరిచేది అమ్మ.
ముకుందిని మా వైపు తిరిగి కన్ను కొట్టి, నవ్వి తినండని సైగ చేసి “అడ్డమైనవేం కావమ్మో.. ఆచారి కొట్లోవి” అనేది.
మా అక్కని ‘పెద్దమ్మాయ్’ అని పిలిచేది. నన్ను‘నాయుడూ’ అనేది. మా చెల్లెలిని ‘పంతులు’ అనేది.
తర్వాత ఊరంతా చాంతాడు తగిలించుకుని చొట్ల పొయిన బక్కెట్టుతో బిందెల్లో బావిలో నీళ్ళు తోడి పోసి గోళాలు నింపేది. మేం తనతో వెళ్ళి కాళ్ళెత్తి బావిలోకి తొంగి చూసే ప్రయత్నం చేసేవాళ్ళం.
ఎక్కడో పాతాళంలో కొద్దిగా నీళ్ళుండేవి. బకెట్ నేలకి తగలగానే ఖంగున శబ్దం వచ్చేది. ఎలాగో తాడు కదిలించి బకెట్ నింపుకుని పైకి లాగేది. మేం వెనక నిలబడి తాడు లాగేవాళ్ళం.
“ఊరుకోండి. మీ అమ్మ జూసిందంటే కయ్యిమంటుంది” అనేది నవ్వుతూ.
ఒక్కోసారి మా అమ్మ మీద అలిగేది.
అప్పుడు “రా నాయుడూ” అని చెయ్యి పట్టుకుని మా చెల్లెల్ని చంకనేసుకుని తన పూరి గుడిసెకి తీసుకు పోయేది.
మా అమ్మ “వాళ్ళనెక్కడికి” అని అరుస్తున్నా వినిపించుకునేది కాదు.
ముకుందిని తిన్నగా తీసుకెళ్ళి తన పూరి గుడిసె ముందు వున్న వేప చెట్టు క్రింద నులకమంచం వేసి శుభ్రంగా వుతికిన దుప్పటి పరచి మమ్మల్ని దాని మీద కూర్చోబెట్టి, అరటి పళ్ళో, జామకాయల్లో పెట్టి తను క్రింద కూలబడి కూర్చుని కథలు చెప్పేది.
శుభ్రంగా పేడ కళ్ళాపి చల్లిన పచ్చని నేల, వేపగాలి బాగా ఆనిపించేది. అమ్మ కెంత కోపం వున్నా మాకు ముకుందిని అంటే ఇష్టమే.
తర్వాత మధ్యాహ్నం భోజనానికి వచ్చిన మా నాన్నగారికి చెప్పి అమ్మ ‘లబోదిబో’ మనేది. నాన్న ముకుందిని గుడిసె కొచ్చి “ఏం పని యిది ముకుందినీ, పిల్లల్నెందుకు తెస్తావు” అని కేక లేసేవారు.
అప్పుడు “ఏం లేదయ్యా పిల్లలే నా యెంట బడ్డారు” అని మా వంక చూసి కన్ను కొట్టి “రా పంతులూ” అని మా చెల్లెల్ని చంకనేసుకుని నా చెయ్యి పట్టుకుని మా నాన్నగారి వెంబడి ఇంటికొచ్చేది.
అప్పటికే మా అమ్మ మండిపోతుండేది.
“ఈసారి పిల్లల్ని తీసుకెళ్ళావంటే పోలీసు రిపోర్టు యిస్తా” అంటూ గయ్యిన లేచి అంతటితో ఆగక “ఏవే అడ్డమైన గడ్డి కోసం దీని వెంబడి పోతారా” అని నన్ను వాయించేసేది.
“ఎందుకు చిన్నపిల్లనలా బాదుతావు, ఏడి నించి తెచ్చావయ్యా యీ దూర్వాసమునిని. మన కాడ అమ్మాయిల్లేరనా” అని మా నాన్నతో అనేది.
ఇలా అక్కడున్నన్నాళ్ళు తనే పని చేసింది. కాని ఎన్నడూ మానలేదు. మేం కాకినాడ వెళ్ళాం. అప్పుడే నాన్నకి మాచర్ల ట్రాన్సఫరయ్యింది.
తిరిగి ముకుందినిని చూడలేదు.
నేను టెన్త్ చదువుతుండగా తిరుపతి నుండి వస్తూ ఒంగోలు వెళ్ళాం. అప్పుడు అమ్మ ముకుందినిని పిలిపించింది. అలానే వుంది. మమ్మల్ని చూసి బుగ్గలు పుణికి కన్నీళ్ళు పెట్టుకుంది. అమ్మ చీర, కొంత డబ్బు యిచ్చింది.
“పిల్లల్ని బాగా పెంచావమ్మా, బాగున్నారు” అంటూ సంతోపడి వెళ్ళింది.
మాచర్లలో మా యింట్లో ఒక ముస్లిం ఆమె పని చేసింది.
ఆమెను మేం బూబమ్మా అని పిలిచే వాళ్ళం.
బూబమ్మ చాలా సౌమ్యురాలు. అమ్మ కేకలేసే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోలేదు. అక్కడ చాలా పెద్ద యిల్లు మాది. ముందూ వెనకలా చాలా స్థలముండేది. అంతా ఊడ్చి కళ్ళాపి జల్లేది. మాకు స్నానాలు చేయించేది.
ఒకసారి మా అమ్మగారికి జాండీస్ వచ్చి మూడు నెలలు లేవకపోతే తనే వండి పెట్టి మాకు తలలు దువ్వి మా సంరక్షణంతా చూసింది. ఎన్నడూ విసుక్కోలేదు. అమ్మ తర్వాత అమ్మలా మమ్మల్ని ఆదరించేది.
నేను చేసే అల్లర్లలో భాగంగా ఒకసారి నేను చిలకడదుంపలానే వుంటుదనుకుని చేమదుంప తినేసాను. ఇక చూడాలి, దురద. బాత్రూంలో చేరి నాలుక పీక్కుని ఏడుస్తుంటే బూబమ్మ వచ్చి తెలుసుకుని మా అమ్మకి తెలియకుండా రహస్యంగా చింతపండు వుప్పూ నమిలించి ఆ దురద పోయేట్లు చేసి ‘చేమదుంప తినకూడదమ్మా’ అని చెప్పి సముదాయించింది.
మూడేళ్ళ తర్వాత మాకు ట్రాన్సఫరయితే మేం ఒంటెద్దు బండిలో స్టేషన్‌కి మా బండి కూడ స్టేషన్‌కి ఏడుస్తూ వచ్చిన వారిలో బూబమ్మ ఒకరు.
ఇప్పుడు జీతాలు పెరిగేయి. పనులు తరిగేయి. మర్యాదలు పెరిగేయి. అయినా అనుబంధాలు పొడిపొడి రాలుతూ అతికే సిమెంటూ, సున్నం లేనట్లు రాలిపోతున్నాయి. ఎవర్ని ఏ పేరుతో పిలిచినా అప్పట్లో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ వుండేది. ఆప్యాయత వుండేది. ఒకర్నొకరం మనం అనుకునేవాళ్ళం.
కాలం మనుసులోని ఆప్యాయతల్ని ప్రేమల్ని చంపేస్తున్నది.
దానికి పనిమనుషులు అతీతులు కారేమో.
మన్నెం శారద ప్రఖ్యాత కథా, నవలా రచయిత్రి, బహుగ్రంథకర్త. అత్యంత ఆసక్తికరంగా రచనలు సృజించడంలో అందెవేసిన చెయ్యి. “చిగురాకు రెపరెపలు”,”మహారాజశ్రీ మామ్మగారు” అనే నవలలు; “మన్నెం శారద కథలు” అనే కథా సంపుటి వెలువరించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
సోమశిల సందర్శనం
మరణం!
‘రామప్ప దేవాలయం’ వైశిష్ట్యాన్ని చాటే డా. మజ్జి భారతి కవిత
ఎన్నో ప్రశ్నలు – కొన్ని జవాబులు-5
ప్రముఖ రచయిత్రి శ్రీమతి యలమర్తి అనూరాధ గారికి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం సత్కారం
దుఃఖ నివారణకు వేదాంత మార్గం
భారతీయులకు హెచ్చరిక-7
ఆశల తోరణం
పూచే పూల లోన-70
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®