Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసులోని మనసా-35

ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక.

ఒకసారి నాకు అల్లు రామలింగయ్య గారి నుండి ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళ అమ్మాయి సురేఖ గారు నాకు సినీనటి సువర్ణ వలన పరిచయం అయ్యేరు. సువర్ణ (ఇప్పుడు తమిళ టీ.వీ. సీరియల్స్ ప్రొడ్యూసర్) అప్పట్లో కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా నటించారు. ఆమె నా నవల ‘వానకారు కోయిల’ చదివి ఇంప్రెసయ్యి టీవీ సీరియల్‌గా తీయాలని మా ఇంటికి వచ్చి రైట్స్ తీసుకున్నారు. అలా మా స్నేహం బలపడింది. హైదరాబాద్ వస్తే మా ఇంట్లో దిగేవారు. సువర్ణ అత్తగారు మైసూర్ మహారాజా ప్యాలెస్‌లో దివానుగా పనిచేసే దివాన్ గారి భార్య. వారి ఇల్లు శాంథోమ్ బీచ్‌లో ప్రసిద్ధి గాంచిన ‘కల్పనా హౌస్’. అందులో చాలా షూటింగ్స్ జరుగుతుండేవి. ఆ ఇంట్లో చాలా ఏంటిక్స్ ఉండేవి. అన్నిటికన్నా ఆకర్షణ స్టఫ్ చేసిన ఏనుగు తల వీధి హాల్లో గోడకి ఫిక్స్ చేసి ఉండేది. ఏనుగు కాళ్లతో మోడాలు ఉండేవి. నిలువెత్తు బంగారు గడియారం, అనేక దేశాల అద్భుతమైన పెయింటింగ్స్, పాలరాతి విగ్రహాలు- ఇంకా చాలా చాలా… క్రింద ఫ్లోర్ లో మ్యూజియంలా వుండేవి. సువర్ణ భర్త కెమెరామాన్‌గా పనిచేసేవారు. ఇద్దరూ చాలా మంచివారు. నిగర్వులు. చెన్నై పని మీద వెళ్తే నా మకాం సువర్ణ దగ్గరే.

ఒకరోజు సురేఖ గారు (చిరంజీవి గారి శ్రీమతి) ఆ బంగారు గడియారం కొనాలని వచ్చి నన్ను పరిచయం చేసుకుని వారి ఇంటికి రమ్మని ఆహ్వానించారు. ఆమె చాలా నిగర్వి.

తర్వాత కాలంలో సువర్ణ అమ్మగారికి అపోలో హాస్పటల్‌లో మోకాలి ఆపరేషన్ జరిగింది. ఆమెను చూసి అక్కడే ఎదురుగా ఉన్న విజయబాపినీడు గారి గెస్ట్ హౌస్‌లో తాత్కాలికంగా మకాం వున్న చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం. అప్పుడు సురేఖ గారిని మళ్లీ కలవడం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇంతలో ‘ఎస్‌పి పరశురామ్’ సినిమా షూటింగ్ నుంచి చిరంజీవి గారు వచ్చారు. సువర్ణని ఆప్యాయంగా పలకరించి, నన్ను గుర్తుపట్టి చాలా గౌరవంగా మాట్లాడేరు. అది వరకు ఆయనతో నాకు రెండు ప్రెస్ మీట్‌లలో పరిచయం ఉంది. తన సినిమాలకి కథలు కూడా అడిగారు. ‘నా కథలు మీకు సూట్ కావు’ అంటే నవ్వేశారు. ‘సుమన్ మీద నవల రాశారు కదా’ అని అడిగారు. చివర్న మేము వచ్చేసేటప్పుడు భార్యాభర్తలిద్దరూ సాగనంపడానికి బయట రాంప్ మీదకి వచ్చి, “సువర్ణ ఇక్కడ ఉండదు. మీరు వస్తుండండి శారద గారూ!” అని ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. అందులో నా గొప్పతనం ఏమీ లేదు. అది వారి సంస్కారం, నిగర్వత.

సరే… అల్లు రామలింగయ్య గారు మా ఎర్రమంజిల్ కాలనీలో ఒక అయ్యేయస్ ఆఫీసర్ ఇంటికి తరచూ వస్తుంటారట. ఆయన అంతకు ముందున్న పరిచయంతో ఫోన్ చేసేరు. ఆ రోజు నేను ఇంట్లో ఉన్నాను. పిల్లలు స్కూల్లో వెళ్లారు. ఫోన్ ఎత్తగానే “అమ్మా, నేను అల్లు రామలింగయ్యనమ్మా. ఎలా ఉన్నారు?” అని అడిగారు.

నేను ఎలర్ట్ అయి “బాగున్నాను సర్! నమస్తే” అన్నాను. ఆయనలా మంచీ చెడూ మాట్లాడుతూ అలా ఫిలాసఫీ లోకి పోయారు. ఒక హాస్యనటుడిగానే తెలిసిన నేను ఆయన నాలెడ్జికి ఆశ్చర్యపోతూ వింటున్నాను. ఆయన మాటలు వింటుంటే ఆయన చాలా పుస్తకాలు చదివారని అర్థమవుతున్నది.

ఇక్కడ నా పరిస్థితి ఏమిటంటే, నా బెండకాయ వేపుడు స్టవ్ మీద మాడి పోతున్నది. నాకు అప్పట్లో కార్డ్‌లెస్ ఫోను లేదు. ఉన్నదొక లాండ్ లైన్. ‘కట్ చేస్తే ఫీల్ అవుతారేమో… పెద్దాయన’ అన్న మొగమాటం. అవతల కూర మాడిపోతున్న వాసన!

ఒక మాట ‘ఒక్క నిముషం సర్’ అని చెబితే ఏమవుతుంది? కాని… చెప్పలేకపోయాను. అంటే మీ కర్థమవుతుంది నా మొగమాటానికి పరాకాష్ఠ!

ఆయన ఫోను పెట్టేసాక చూస్తే ఏముంది… మాడి మసయిన కూర! పనికిరాని బాణలి!

‘అంతా భ్రాంతియేనా!’ అని పాడుకుంటూ కూరతో పాటు బాణలి కూడా పడేసాను.

నాకొక పోలీసాఫీసరుగారి శ్రీమతితో స్నేహముండేది. ఆవిడ ఫోన్ చేసి, “శారదమ్మా ఏం చేస్తున్నావ్” అనేవారు.

“ఏం లేదు చెప్పండి” అనేదాన్ని.

“నువ్వొక సీరియల్ రాయాలమ్మా, నేను ఒక క్లూ యిస్తాను. జరిగిన కథే ఇది!” అనేవారు.

“చెప్పండి” అనేదాన్ని.

“ఏం లేదు మా వూళ్ళో జరిగిందే… మా చుట్టాలింట్లోనే… ఆఁ! ఒక్క క్షణం ఆగు తల్లీ! ఒరేయ్ వెంకటేసూ… అవతల గేదెలొచ్చేస్తున్నాయిరా సన్నాసీ! కళ్ళెక్కడ పెట్టుకున్నావూ! అయ్యయ్యో మొక్కలు తినేస్తున్నాయి! తరుము తరుము!” అని ఇంట్లో వున్న ఆర్డర్లీని కేకలేసి, “శారదమ్మా, వున్నావా… ఈ సన్నాసులతో చావమ్మా. ఉండటానికి రేవులో తాడుల్లా వున్నారు. గేదెల్నే తరమలేని ఈ వెధవలు దొంగల్నేం పడతారూ!” అనేవారు.

నేను నవ్వి వూరుకునేదాన్ని.

“అద్సరే… ఎక్కడున్నాను?” అనడిగేవారు మళ్ళీ.

నేను చెప్పేదాన్ని.

“ఆఁ ఆఁ! అదే మా చుట్టాల్లోనే… ఒకమ్మాయికి ఈ మధ్యనే పెళ్ళి చేసేరు. పిల్ల చక్కగా వుంటుంది… ఒసే సుబ్బూ అలానా తడి గుడ్డ పెట్టడం! తుడిచేవంటే తడి కనబడకూడదు. ఇటు తుడుస్తుంటే అటు ఆరిపోవాలి! అయ్యయ్యో… మీరేంటి లోపలి కొచ్చేస్తారూ! నేలంతా డాగులు పడిపోదూ!… అరె! హుస్సేన్… నీకు నోరు పడిపోయిందా! అయ్యగారికి చెప్పలేవూ!” అని అరిచేవారు.

“అమ్మా సార్ వచ్చేసారు. మరోసారి కథ చెబుతాను. వుంటా” అని ఫోను పెట్టేసేవారు.

నాకు పెద్ద రిలీఫ్.

ఇలా ఆ కథ ఎప్పుడూ ముడిపడింది లేదు.

ఆవిడ ఫోనొస్తుందంటేనే భయం నాకు!

కొన్ని ఫోనులు అలా వుంటాయి.

ఒక స్నేహితురాలు నాకు ఫోను చేస్తుంది ప్రేమగా.

వయసు చిన్నదే! మంచి అమ్మాయి.

ఎప్పుడో కాని చేయదు.

చక్కగా మాట్లాడుతుంది.. ఎందుకో తెలియదు. భర్త వస్తున్నాడంటే హడల్! ఫోను మాట్లాడుతున్నదల్లా టక్కున కట్ చేస్తుంది.

నాకు మొహం మీద లాగి కొట్టిన ఫీలింగ్!

ఎందుకంత భయమో అర్థం కాదు.

నేను వయసుకి పెద్దదాన్ని. శారదగారితో మాట్లాడుతున్నానంటే… సదరు చదువుకున్న వ్యక్తి కాదంటాడా!

నెమ్మదిగా రెండు మాటలు మాట్లాడి, “ఆయన వచ్చారు” అని మెల్లిగా నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా! అనుకుంటాను నేను. ఇందులో ఆమెను నేనేమాత్రం తప్పు పట్టను. కాని అంత భయపడిపోవడానికి ఆ వచ్చినవాడు విలన్ కాదు కదా!

నేను బాగా ఆలోచిస్తూంటాను. ఆడవారు చాలామంది (నాతో కూడా) మనకు మనమే న్యూనతా భావంతో మనల్ని మనం తక్కువ చేసుకుంటామేమో!

ఇక మనం పెద్దవాళ్ళయ్యేక పరిస్థితులు చాలా యిళ్ళల్లో వేరే రకంగా వుంటాయి.

మన కోడళ్ళో, కూతుర్లో, కొడుకులో మన ఇండివిడ్యివాలిటీని గౌరవించరు. వాళ్ళకి అత్తగానో, అమ్మగానో మాత్రమే కనబడతాం. కొంత టైమ్ మనకి కావాల్సి వుంటుందని… మన ఆలోచనలు మనకుంటాయని గుర్తించరు.

“పైన వడియాలు ఎండబెట్టేను, తెచ్చేయండి…”, “బాబు అన్నం తినడం లేదు, తినిపించేయండి…”, “నాకు బాగా లేదు బాబుని మీ దగ్గరే పడుకోబెట్టుకోండి”, “మీరెలా వాళ్ళతో పిక్నిక్‌కి వెళ్తారు…. నేను ఆఫీసుకెళ్తే బాబునెవరు చూస్తారు!” ఇలాంటి బాధ్యతల వలయంలో చిన్నగా చుట్టేసి మనకో ప్రపంచం లేకుండా చేస్తారు.

అందరూ మనవారే!

వారి అవసరాలు మనం చూడాల్సిందే!

కాని జీవితమంతా ఎంతో చాకిరీ చేసి అలసిసొలసిన ప్రాణాలకి ఇంత రెస్ట్, రిలీఫ్ కూడ వుండాలి కదా!

నా ప్రాణ స్నేహితురాలు ఇలాంటి దిగ్బంధంలో ఇరుక్కుని నాకు దూరమవుతుంటే నాకు చాలా బాధ కలిగింది.

తను చాలా సున్నిత హృదయురాలు.

బాధని బాధగా కూడా చెప్పలేని సౌమ్యురాలు.

తను నిజానికి బాధ పడడం లేదు… అంత తన వారే… వారికి చేస్తున్నాననే భావిస్తున్నది.

కాని… తనకంటూ కొంత స్పేస్ యిస్తే… తను మరింత ఆనందతో వారికి సాయపడుతుంది.

ఇలాంటి స్థితిలో కొందరు తమ అభిరుచులకు దూరమయిపోతున్నారనే బాధ నాది!

కొందరు నా కొలీగ్స్ వారి పిల్లల డెలివరీలకని అమెరికా చాలా సంబరంగా బయల్దేరి వెళ్తుంటారు. వెళ్ళి వచ్చేక చాలామంది మొహాలు నీరసించి వుంటాయి.

నేను చూసిన ప్రదేశాల గురించి చెబితే కొందరు చాలా బాధగా, “నువ్వు చాలా అదృష్టవంతురాలివి శారదా… మేం ఏమీ చూడలేదు. చంటిపిల్లాడి పనే సరిపోయింది. ఏదో కంటి తుడుపుగా ‘నయగారా’ ఒకటి చూపించారు” అన్నదొక స్నేహితురాలు.

“నాకు అదీ గతి లేదు. రెండు సార్లూ ఎయిర్‍పోర్ట్ మాత్రమే చూశాను. ఆ ప్రయాణానికో నమస్కారం. ఇదిగో మోకాళ్ళ నొప్పులు మిగిలేయి” అంది మరో ఫ్రెండ్.

“సర్లే, సంభడం… ఏదైనా చూపించండి, కొనండి అంటే టూ ఎక్స్‌పెన్సివ్… టూ ఎక్స్‌పెన్సివ్! అంటూ మొగుడూ పెళ్ళాలు మొహమొహాలు చూసుకుంటారు. అలా అనుకుంటూనే పెంచామా… వీళ్ళని” అంది మరో ప్రెండ్ కొంత అక్కసుగా.

సరే… చూపించడాలూ… కొనడాలూ వదిలేద్దాం. ఎందుకంటే ఈ రోజున చాలామంది అమ్మలకి, అత్తలకి భారీ పెన్షన్సే వస్తున్నాయి. ఎవరి డబ్బూ ఆశించే పరిస్థితుల్లో ఎవరూ లేరు.

కాని… ప్రేమ, కొంచెం గుర్తింపు, కొంత బాధ్యత కోరుకోని తల్లి హృదయాలు మాత్రం వుండవు కదా!

దానికి అతీతం కాదు కదా ఈ బేల మనసులు!

Exit mobile version