Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మనసులోని మనసా… 7

ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక.

వరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతా భావంతో వుండటం, తప్పుచేస్తే ‘సారీ’ చెప్పడం మానవ ధర్మం.

అది అవతలివారి హృదయంలో ఆనందంతో పాటూ, ఎంతటి బాధనయినా కోపాన్నయినా ఇట్టే తుడిచి పడేస్తుంది.

చాలామంది ఈ మాత్రానికే థాంక్స్ ఎందుకు, సారీలెందుకు అంటారు. కాని అది సరికాదన్నది నా భావన. ఎంతటి చిన్న సహాయం పొందినా మనం దాన్ని గుర్తించినప్పుడు అవతలి వారి మొహం వెలుగుతుంది. ఒకరకమైన సృహృద్భావం పెరుగుతుంది. మంచిమాట హృదయమంతా వెన్నెల్లా పాకుతుంది. రెట్టింపు ఉత్సాహంతో అవతలివారు మీకు సహాయం చేస్తారు. అది రెండు వైపులా ప్రేమని, ఉత్సాహాన్ని పంచుతుంది.

నా చిన్నప్పుడు ఒకసారి మా నాన్నగారు నరసరావుపేటలో వుద్యోగం చేస్తున్నప్పుడు మాకు అక్కడ దగ్గరలో వున్న నకిరికల్లులో ఒక స్నేహితురాలుండేది. ఎప్పుడూ ఒకసారి మమ్మల్ని అక్కడికి రమ్మని కోరేది. అయితే మా అమ్మగారు మమ్మల్ని ఎక్కడికీ పంపించేవారు కాదు. అసలడగాలంటేనే భయం. ఎక్కడికెళ్ళినా తను వుండాల్సిందే. మాకు మా ఫ్రెండ్ దగ్గరకెళ్ళాలని వుండేది. ఒకసారి మా అమ్మగారి మూడ్ చూసి మేము ఆమె గడ్డం పట్టుకుని “సాయంత్రాని కల్లా వచ్చేస్తాం ప్లీజ్!” అని బ్రతిమలాడేం. ఏ మూడ్‌లో వున్నారో మా అమ్మగారు అంగీకరించారు. ప్రొద్దుట పదిగంటలకి బయల్దేరి సాయంత్రం అయిదు గంటలకి వచ్చేయాలి. అది కండీషన్. సరేనని పరమ వుత్సాహంగా  బయల్దేరేం. నాన్న వచ్చి మమ్మల్ని బస్ ఎక్కించారు. వెళ్ళేటప్పుడు బస్సు మమ్మల్ని ఏ ఆటంకమూ లేకుండా తీసుకెళ్ళింది. మా స్నేహితురాలు చాలా సంతోషించింది. ఇక వళ్ళు తెలియని ఆనందం, జోక్స్, వాళ్ళమ్మగారు పెట్టిన విందు భోజనం – కాలం క్షణాల్లో గడిచిపోయింది. నాలుగు అవుతుండగా “మేం వెళ్ళిపోతాం” అని కంగారు పడడం ప్రారంభించాం. తనకి కూడా మా అమ్మగారి విషయం తెలుసు కాబట్టి కూడా వచ్చి రోడ్డు పక్కన బస్సు ఆగే ప్రదేశంలో నిల్చోబెట్టింది. అప్పటికవి పల్లెలే. అందుకే అవి నగర పోకడలు పోక తన ప్రత్యేకతని చాటుకుంటూ అందంగా అలరాలుతున్నాయి. పశువులు ఇంటికి మరలి వస్తుండటంతో సన్నటి ధూళి రేగుతోంది. రోడ్డుకు అటూ ఇటూ పూరిపాకలు – శుభ్రంగా సాయంత్రాలు కూడా వూడ్చి కళ్ళాపి జల్లిన వాకిళ్ళు. వాతిపైన తీర్చిదిద్దిన ముగ్గులు – మమ్మల్ని విచిత్రంగా చూస్తూ నెత్తిన గడ్డిమోపులు పెట్టుకున్న స్త్రీలు – మనోహరమైన పల్లీయ చిత్ర పటమది! కాని… చూసి ఆనందించే స్థితిలో లేము మేము. కారణం బస్సెంతకీ రాకపోవడమే. ఆరు దాటి పోయింది. “వస్తే మేం ఎక్కుతాం. నువ్వెళ్ళిపో” అన్నాము ఫ్రెండుతో. తను వెళ్ళిపోయింది.

ఏడవుతోంది. చీకటి పడిపోయింది. సన్నని వెన్నెల పరచుకొంది. మా గుండెలో రైళ్ళు పరిగెడుతున్నాయి. అమ్మ మొహం సెవెంటీ ఎమ్మెమ్‌లో కనిపిస్తోంది. ఒక్క బస్సూ రావడం లేదు.

“అమ్మాయిలూ, ఎంతసేపలా నిలబడతారు? ఇలా వచ్చి కూర్చోండి. బస్సు మనకాడే ఆగుద్ది. నేనాపుతాలే” ఆ కంఠస్వరం విని వెనక్కు తిరిగి చూశాం.

పెద్దాయన. అరవై సంవత్సరాలుంటాయేమో – పంచెకట్టు, పైన బనీను, భుజాన తుండు – నెరసిన జుట్టు – నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానించారు.

“వద్దండీ” అన్నాం మొగమాటంగా.

“ఇక్కడ బస్సులకి టైమంటూ వుండదు తల్లీ – నా మాట విని యిక్కడ కూర్చోండి. ఎంతసేపు నిలబడతారు? కాళ్ళు పీక్కుపోతాయి. ఏవే మంచం వాల్చు – పిల్లకాయలు కూర్చుంటారు” అన్నారు భార్యతో.

ఆవిడ నవ్వుతూ వచ్చి మంచం వాల్చి దాని మీద ఉతికిన దుప్పటి పరిచింది.  మేం నలుగురం వెళ్ళి కూర్చున్నాం. ఆవిడ గ్లాసులతో మంచి నీళ్ళిచ్చింది. ఆయన మా ఎదురుగా కూర్చుని మా వివరాలడిగేరు. మేం చెబుతున్నామే గాని మనసు మనసులో లేదు.

“ఆ బస్సు ఎప్పుడొచ్చి చచ్చుద్దో గాని పిల్లకాయలకి అన్నం పెట్టవే!” అన్నారాయన భార్యతో.

“వద్దండీ, బస్సు మిస్సవుతాం” అన్నాం కంగారుగా.

“ఏం గాదమ్మా. బస్సు మన గుమ్మం కాడే నిలబడుద్ది. నేనాపుతానుగా!” అన్నారాయన.

ఆమె స్టీలు కంచాల్లో వేడి వేడి అన్నం – కొత్తగా చేసిన టమేటో పచ్చడి – మంచి వెన్న కాచిన నెయ్యి, పప్పు చారు, పెరుగు పెట్టి వద్దన్నా బలవంతంగా పెట్టారు.

నాకిప్పటికీ ఆ భోజనపు సువాసన గుర్తుంది.

భోం చేస్తూ ఇంటిని పరికించి చూశాను.

కొంచెం పెద్దదిగా వేసుకున్న పూరిపాక, అలికిన పచ్చటి నేల, విశాలంగా వున్న వాకిలి – ఫెన్సింగుగా దట్టంగా కట్టిన కందికంప – నేను ఆయన్నడి మరీ తెచ్చుకున్నాను. కంది పంట వేశాక, ఎండిన చెట్లని దట్టంగా దడిలా కడతారు ఆ ప్రాంతాల్లో.

వెన్నెల కాంతిని పెంచింది.

హరికేన్ లాంతరు కాంతిలో మా భోజనాలయ్యేయి.

ఇంతలో బస్సు వచ్చింది.

ఆయన పరుగెత్తి టవల్ ఊపి బస్సాపి మమ్మల్ని ఎక్కించి “ఆడపిల్ల కాయలు జాగ్రత్త – పేట నుంచొచ్చేరు” అని కండక్టరుకి చెప్పడం నాకింకా గుర్తుంది.

ఇన్ని సంవత్సరాలయినా నేను వారు చూపిన ప్రేమ, ఆదరణ మరచిపోలేదు.

ఈ సంఘటనని వీలు కుదిరినప్పుడల్లా నేను నా స్నేహితులకి ఎప్పుడూ చెప్పేదాన్ని. ఇప్పటికీ ఒంటరిగా వున్నప్పుడు తలచుకుని కృతజ్ఞతలు చెప్పుకుంటూనే వుంటాను.

ఆఫీసులో కూడా నేను ఏ అటెండరు నాకే చిన్న సహాయం చేసినా చివరికి మంచినీళ్ళు అందించినా, థాంక్స్ చెప్పేదాన్ని. కొన్నాళ్ళు నేను మా లేబరేటరీలో పనిచేసేను. అక్కడ ఏల్విన్ కంపెనీలో హెవీ రిట్రెంచ్‌మెంట్ వచ్చి కొంతమంది టెక్నీషియన్స్‌ని మా దగ్గర లేబ్ ఎసిస్టెంట్లుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎప్పాయింట్ చేసారు. అందరూ పాతికేళ్ళ లోపు పిల్లలు. వాళ్ళు మాకు టెస్టుల్లో హెల్పర్స్‌గా వుండేవారు. రోడ్డు వేసాక అది క్వాలిటీ సరిగ్గా వుందో లేదోనని చిన్న ముక్క పరిశీలనకి వస్తుంది. అలాగే ఇటుకలు, సిమెంటు, స్టీలు రాడ్స్, ఇసుక అన్నీ పరిశీలించాలి. వీళ్ళే మాకు కాఫీలు, మంచినీళ్ళు అందించేవారు. నేను ఏది చేసినా ‘థాంక్స్’ చెప్పగానే, వాళ్ళు “ఎందుకు మాడం” అని నవ్వేవారు. కాని నేనలా చెప్పినప్పుడు వాళ్ళ మొహాల్లో పరచుకున్న కాంతి నేను గమనించేదాన్ని. వారి పనిని, సహాయాన్ని గుర్తించినప్పుడు ఎవరైనా రెట్టింపు వుత్సాహంతో పనిచెస్తారు. ఆ విషయాల్ని చాలామంది గ్రహించారు. కొందరు ఆఫీసర్స్ తమ అధికారంతో జులుం చేసి పని తీసుకోవాలని చూస్తారు. అటెండర్స్ బయటకి వచ్చి వాళ్ళని ఎలా తిట్టుకుంటారో చూశాను.

నేను కారిడార్‌లో నడిచి వెళ్తుంటే అటెండర్సు చాలామంది నన్ను చూసి చిరునవ్వు నవ్వి విష్ చేసేవారు. ఇది చూసి నా కొలీగ్స్ చాలామంది “ఏవిచ్చేవే లంచాలు, అందరూ నిన్ను చూసి విష్ చేస్తారు!” అని నవ్వేవాళ్ళు. నిజానికి అంత పెద్ద డిపార్టుమెంట్ హెడ్ ఆఫీసులో నేను చిరు ఉద్యోగిని. నేనేమి ఇస్తాను? నేను వాళ్ళని సాదరంగా తోటి మనుషుల్లా చూసేదాన్ని. ఎవరైనా అన్నం తినలేదంటే నా మనసు విలవిల్లాడేది. అందుకని తినమని డబ్బులిచ్చేదాన్ని. ఈ చిన్న సహాయం నాకు సర్వీసంతా ప్రేమ కురిపించింది. నేను వోలంటరీ రిటైర్‍మెంట్ తీసుకున్నప్పుడు వీళ్లంతా ఎంతగానో ఏడ్చారు. ఇప్పటికీ నన్ను గుర్తుపెట్టుకుని యింటికొచ్చి చూసి వెళ్తారు.

నా పొరపాటు వున్నప్పుడు నేను సారీ చెప్పడానికి కూడా ఎప్పుడూ సందేహించలేదు.

అమెరికాలో జరిగిన చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను.

అమెరికా సామ్రాజ్యవాదం గురించి నేను మాట్లాడను. అక్కడివారి డిసిప్లిన్ గురించి మాత్రమే నాకు తెలిసింది నేను చెబుతున్నాను. ఇప్పటికి నాలుగుసార్లు నేను అమెరికా వెళ్ళాను. మా అబ్బాయి వంశీ నాకు చాలా ప్రాంతాలే చూపించాడు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా, షాపింగుకి ఎళ్ళినా అక్కడివారు చిరునవ్వుతో విష్ చేస్తారు. మనం వెనుక షాపులోకి ప్రవేశిస్తుంటే మర్యాదపూర్వకంగా తలుపు తీసి పట్టుకుంటారు. ఎదురయితే నవ్వకుండా వుండరు. అదే మన తెలుగువాళ్ళు ఎక్కువగా వచ్చే ఏషియన్ మార్కెట్సులో మొహాలు మాడ్చుకుని చూడనట్లు వెళ్ళిపోతారు. నేను వాళ్ళు తెలుగు మాట్లాడడం చూసి ఆనందంతో నవ్వేదాన్ని. కాని వాళ్ళు చూడనైనా చూసేవారు కాదు.  అదే తమిళులు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుని పలకరించుకునేవారు. అదే విషయం మా వంశీని అడిగితే ‘మనవాళ్ళు అంతే’ అని చెప్పాడు. నేను నవ్వుతూ, “మనం కూడా పడుతూ లేస్తూ అమెరికా వచ్చాం కదరా! వీళ్ళకెందుకంత చిన్నచూపు” అని నవ్వేదాన్ని. “అందుకేనమ్మా, అమెరికన్ ఇండియన్ మెంటాలిటీ అని గేలి చేస్తారు” అన్నాడు. “మనం చేసిన పని దేశానికంతా ఖ్యాతి తెచ్చిందన్న మాట!” అని ఆశ్చర్యపడ్డాను.

Exit mobile version