[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పి.ఎల్.ఎన్. మంగారత్నం గారి ‘మానవత్వపు పరిమళింపు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


ఆ నియోజకవర్గపు ఎం.ఎల్.ఏ.గారి నమ్మినబంటు అయిన నరేంద్ర చౌదరి నుంచి పోను.
అతను చెబితే, ఎం.ఎల్.ఏ గారు చెప్పినట్లే.
“సారు! నీకో పని చెప్పమని.. సీ.సీ గారితో అన్నారట. ఓ చిన్న ఎంక్వయిరీ. నువ్వు.. మీకు దగ్గర్లో ఉన్న ‘నాగులాపల్లి’ గ్రామానికి వెళ్ళాలి” చెప్పాడు.
“ఎందుకన్నా?” పలికాడు చక్రపాణి.
“అక్కడ ‘గింజాల పెద సత్తియ్య’ అనే ఒకతను ఉంటున్నాడట. అతను ఓ పన్నెండేళ్ళ క్రిందట.. కాకినాడ బీచ్‌లో వేరుశనగకాయలు అమ్ముకునేవాడట. తరువాత.. నాగులాపల్లి వెళ్ళిపోయాడని తెలిసింది. ఇప్పుడు అతని ఇంటి అడ్రస్ పట్టుకోవాలి” చెప్పాడు.
“ఎందుకన్నా! పల్లీలు అమ్ముకునేవాని అడ్రస్సు. అతన్ని కూడా మన పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్నారా! ఏమిటీ?” అడిగాడు చిన్నగా నవ్వుతూ.
“సీ.సీ గారు చెప్పినపుడు.. నేనూ అలాగే అనుకున్నా! ఎవరో, అమెరికాలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారట. అందుకే, నాకు చెప్పి.. నీకు చెప్పమన్నారు. నీ సెల్‌కి ఓ ఫోటో కూడా పంపుతున్నాను. అందులో ఉన్న పిల్లాడితో పాటు.. ఆ శెనక్కాయల సత్తియ్య కూడా ఉన్నాడు. ఆ పిల్లాడే, పెద్దవాడై ఇప్పుడు.. అతన్ని గురించి అడుగుతున్నాడట. కాబట్టి, ఫోటో చూపించి విషయాలు తెలుసుకో.”
ఓ పదేళ్ళ పిల్లాడు, సత్తియ్యతో పాటు అతని సైకిలూ, దాని హేండిల్ బార్కి అమర్చుకున్న వెదురు బుట్టా కనిపించేలా ఉన్న ఫోటో అది.
ఆ అబ్బాయి ముద్దుగా, బొద్దుగా ‘స్పింగ్ డాల్’లా ఉంటే.. సత్తియ్య మాత్రం, సన్నగా, పీలగా బక్కచిక్కి ఎండకు ఎండీ.. వానకు తడిచిన మనిషిలానే ఉన్నాడు.
***
నాగులాపల్లి, వెళ్లి, అక్కడ ఉన్న వాళ్లతో.. వచ్చిన పనిని గురించి చెప్పి, అలాగే, సెల్లో ఉన్న ఫోటోని కూడా చూపించాడు.
వాళ్ళలో అందరిలోనూ పెద్దవాడైన, ఏబై ఏళ్ల సూరిశెట్టి “ఆ గుడ్డివాని తూము మలుపులో మోటారు మెకానిక్కు ఆంజనేయులు అనే అతను ఉంటాడు. వాళ్ళు గింజాల వాళ్ళే. పైగా బయటనుంచి వచ్చారు. అతని తండ్రి పేరేంటో నాకు గుర్తు లేదు గానీ.. కాలం చేసి చాలాళ్ళు అయ్యింది. ఆ ఫోటో ఆయనదో! కాదో! నాకు తెలీదు” అంటూ ఆ మెకానిక్ షాపుకి దారి చెప్పాడు.
అలా ముందుకు వెళ్లి..
ఓ మోస్తరు రేకుల షెడ్డు దగ్గర ఆగింది బండి. ఓ నలభై ఏళ్ల వ్యక్తితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడ పని చేస్తున్నాడు.
నెమ్మదిగా.. ఆంజనేయులు దగ్గరకు వచ్చాడు చక్రపాణి. చేస్తున్న పని ఆపి. ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు ఆంజనేయులు, బండి రిపేరు కోసం వచ్చారనుకొని.
విషయం వివరించి, సెల్లో ఉన్న ఫోటో కూడా చూపించాడు చక్రపాణి.
అతను చెబుతున్న విషయాలు ఆకళింపు చేసుకుంటున్న ఆంజనేయులి కళ్ళు.. ఒక్కసారిగా మెరిసాయి. అది తన తండ్రి ఫోటోనే.
ఆ మాటలకి.. ఇంట్లో నుంచి భార్యాపిల్లలూ, తల్లీ బయటకి వచ్చారు.
చక్రపాణి చెప్పిన వివరాలు అన్నీ చెప్పి “అమ్మా! నాన్న ఫోటోనే.. ఇది. ఇతను నాన్న గురించి అడుగుతున్నారు” అంటూ చక్రపాణి చేతిలో ఉన్న సెల్ తీసుకుని తల్లికి చూపించాడు.
అది చూసిన గంగాభవాని కూడా కళ్ళు కూడా విప్పారినయ్యి.
అది తన భర్త పోటోనే. కళ్ళెదుట భర్త కనిపించినట్లే అనిపించింది. ఆ ఆనందంలో కళ్ళలో నీళ్ళు తిరిగినయ్యి.
ఎప్పుడూ ఓ మంచి పోటోనే తీయించుకోలేదు భర్త. పోయినప్పుడు కూడా సరిఅయిన పోటో లేక.. రేషను కార్డు మీద ఉన్న పోటోనే తీసి పెద్దది చేయించారు.
“నాన్న పోయి రెండేళ్ళు అయ్యింది సారూ! నాన్న ఉండగా అందరం కాకినాడలో ఉండి.. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళం. అయితే, అంత జరుగుబాటు లేక.. స్వంత ఊరిలో, ఇంటి స్థలం అయినా ఉందని ఇక్కడికే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తరువాతే పోయాడు” అంటూ చెప్పాడు ఆంజనేయులు.
“మీ నాన్న ఒకసారి చెప్పాడు రా! ఎవురో! అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు.. బీచ్‌కి వచ్చి తన దగ్గర శెనక్కాయలు కొన్నారనీ, అయితే, పర్సు మర్చిపోవడంతో, మళ్ళీ మరునాడు వచ్చి, డబ్బులు ఇవ్వడం కోసం.. ఓ పోటో తీసుకున్నారనీ.. ఎందుకో, వాళ్ళు మళ్ళీ కనిపించలేదనీ చెప్పాడు” అప్పటి విషయాల్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది గంగాభవాని.
ఆంజనేయులి అడ్రస్సూ, పోన్ నెంబరు తీసుకున్నాడు చక్రపాణి.
***
అక్కడ అమెరికాలో, ఉన్న ప్రణవ్‌కి ఇండియాలో ఉంటున్న తన చిన్ననాటి స్నేహితుడూ, ప్రస్తుత కాకినాడ ఎం.ఎల్.ఏ. అయిన అత్యుతానందనరావు పంపిన మెయిల్లో ‘నువ్వు అడిగే.. శనక్కాయల సత్తియ్య వివరాలు తెలిసినాయనీ, అడ్రస్సూ, పోన్ నెంబరూ పంపిస్తున్నాననీ.. అతను రెండేళ్ళ క్రిందటే మరణించాడనీ’ తెలిపాడు.
***
పదేళ్ళ వయసులో..
ఇండియాకు వెళ్ళినపుడు, కాకినాడలో, తాతగారి ఇంట్లో ఉన్నప్పుడు..
ఓ సాయంత్రం, అక్కడ ఉన్న బీచ్‌కి వెళ్లారు.
ఆ బీచ్‌లో.. ఓ అబ్బి సైకిలు మీద శెనక్కాయలు అమ్ముకుంటు౦టే, ఎప్పుడూ ఐస్‌క్రీంలు తినే తనకీ, చెల్లికీ.. అవి కొత్తగా అనిపించి, అవి ‘కావాలని’ అడగడంతో.. తండ్రి తమ ఇద్దరికీ చెరో పొట్లం ఇప్పించాడనీ, తీరా డబ్బులు ఇవ్వబోయే సమయానికి ‘పర్సు’ కనిపించక పోవడంతో జేబులు వెతుక్కుంటున్న తండ్రిని చూసి ..
అతను “పర్వాలేదు సార్! పిల్లలే కదా! తింటున్నారు. మరోసారి వచ్చినపుడు ఇద్డురుగాని లెండి” అన్నాడనీ,
మళ్ళీ నిన్ను గుర్తు పట్టడం ఎలా? అన్నట్లు సంశయంగా చూస్తున్న తండ్రితో..
“నా పేరు గింజాల పెద సత్తియ్య బాబూ! శనక్కాయల సత్తియ్య అంటే, ఎవరైనా చెబుతారు. రోజూ సాయంత్రం అయితే ఈ బీచ్‌లోనే ఉంటాను.” అన్నాడు మెరిసే కళ్ళతో.
పేదరికం ఓడుతున్నట్లు ఉన్నా.. ఆ ఔదార్యానికి ఆశ్చర్యపడిన తండ్రి.. జేబులో ఉన్న సెల్ తీసి అతని పోటో తీస్తుంటే, ఆసక్తి కొద్దీ తనూ వెళ్లి నిలబడ్డాడు.
ఆ పోటో ద్వారా అతన్ని గుర్తు పెట్టుకోవచ్చనుకున్నా, మళ్ళీ బీచ్‌కి వెళ్ళే అవకాశం రాకుండానే అమెరికా వచ్చేసింది ప్రణవ్ కుటుంబం.
అలాంటిది..
ఇప్పుడు.. ఆ జ్ఞాపకానికి చిరునామా దొరకడంతో, తను అనుకున్న పని చెయ్యాలనుకున్నాడు.
***
“ఉన్నట్లు ఉండి, ఇప్పుడు ఇండియాకు ఎందుకురా? ఏం అవసరం వచ్చిందీ?” అడిగాడు ప్రణవ్ తండ్రి మోహన్.
“ఎందుకా? పన్నెండేళ్ళ క్రిందట తాతగారి ఊరు వెళ్ళినప్పుడు, అక్కడ బీచ్‌లో ఉండే శనక్కాయల సత్తియ్యకు డబ్బులు ఇవ్వకుండానే వచ్చేసాం. గుర్తు ఉంది కదా! ఇప్పుడు అతని అడ్రస్ తెలిసింది కాబట్టి, వెళ్లి.. ‘ఆ డబ్బులు’ ఇచ్చి రావాలని అనుకుంటున్నాను” చెప్పాడు.
కొడుకు జ్ఞాపకానికి అచ్చెరువొందాడు మోహన్.
వెంట చెల్లెలు కూడా బయలుదేరింది స్వంత దేశం చూడాలని.
***
ఆ రోజు..
ఆంజనేయులు ఇంటిలో పండుగ వాతావరణం నెలకొంది.
తమ ఇంటి ముందుకు వచ్చిన పెద్ద కారునీ, అందులోంచి దిగిన వాళ్ళని చూసిన ఆనందపడ్డారు. ఎప్పుడో ‘తమ కుటుంబ పెద్ద’ చూపిన మంచితనం.. అనుకోని అతిథుల్ని తమ ఇంటికి రప్పించిందని.
ఊరి సర్పంచీ, ఇంకా కొంతమంది పెద్దలూ వచ్చి చేరారు.
“ఈయనే బాబూ! మా నాన్న” అంటూ ఇంటి ముందు చెమ్కీల దండతో వ్రేల్లాడే ‘పెద సత్తియ్య’ పోటోని చూపించాడు. చేతులు జోడించాడు ప్రణవ్,
“ఎప్పుడో ఒకసారి మా ఆయన చెప్పాడు బాబూ! అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు తన పోటో తీసుకున్నారనీ, అలా అప్పుడు కలవకపోవడం వల్లనే కదా! ఇప్పుడు మీలాంటి గొప్పవాళ్ళు మా గుడిసె ముందు వచ్చింది. మీ రాక మా ఊరికి కొత్త కళ వచ్చింది” అంటూ సంబరపడింది గంగాభవాని.
“అమ్మా! అన్న మాట నిలబెట్టుకోలేక పోయామని, అక్కడ ఉన్నా అప్పుడప్పుడూ అనుకుంటూ ఉంటాం. నాన్న అయితే మరీను. అందుకే, ఇక్కడ ఉన్న మా బందువుల్నీ, స్నేహితుల్నీ ఎంతగానో అడిగా౦.
అయితే.. చివరికి ఇన్నాళ్ళకు, నా చిన్ననాటి స్నేహితుడి ద్వారా అది సాధ్యపడింది. ఆ పోటో చూసినప్పుడు అంకుల్ మంచితనమే మాకు కనిపిస్తుంది. అతన్ని మళ్ళీ చూడలేకపోయినా.. ఆ ఋణం కాస్త అయినా తీర్చుకోవాలని, ఇలా వచ్చాను” అంటూ పర్సులోనుంచి ‘పాతికవేల రూపాయలు’ తీసి అందించాడు.
అంత మొత్తం వాళ్ళు ఎప్పుడూ చూసి ఉండలేదు.
“ఎందుకు బాబూ! అంత డబ్బు” మొహమాటపడింది గంగాభావాని.
“పర్వాలేదులే! అమ్మా! ఆరోజు అంకుల్ ఔదార్యమే నన్ను మళ్ళీ స్వంత ఊరు చూసేలా చేసింది” చెప్పాడు ప్రణవ్ సంతోషంగా.