[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన ఇరిగినేని హనుమంతరావు గారి ‘మరుపు రాని మనిషి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


నడక మానేసి బెంచ్‌పై నిస్సత్తువగా కూలబడ్డాడు రిషి. ఎందుకిలా అయింది? ఈ సుడిగుండంలో నుండి ఎలా బయట పడేది? మనసును మళ్ళించేందుకు మెల్లగా చేతిలోని పేపర్ తెరిచాడు. లాభం లేకపోయింది. కళ్ళు అక్షరాల వెంట పరుగులు పెడుతుంటే, మనసు అడ్డదిడ్డంగా గతాన్ని తవ్వుకుంటోంది. అరగంట గడిచింది. పేజీ మారలేదు. ఆలోచనలు మాత్రం జీవిత కాలాన్ని చుట్టేస్తున్నాయి.
పేపర్ మడిచి పక్కన పెట్టేశాడు. పార్కులో ఉన్న అందరూ శక్తివంచన లేకుండా కేలరీలను ఖర్చుచేసే ప్రయత్నం చేస్తుంటే తను బలవంతంగా కాలాన్ని కరిగిస్తున్నాడు. ఎప్పుడూ ఆహ్లాదాన్ని ఇచ్చే వాతావరణం ఇప్పుడా పని చేయడం లేదు. కాదు.. తనే స్వీకరించడం లేదు. పరాకుగా ఎటో చూస్తున్నవాడిని జాగింగ్ చేస్తూ వస్తున్న ఓ ఆకారం ఆకర్షించింది.
‘సుహాస్ కదూ! ఔను.. తనే!’ అనుకున్నాడు. ట్రాక్‌కు కొంచెం దూరంగా, బెంచ్ మీద కూర్చున్న తనను సుహాస్ గమనించలేదు.
‘చూస్తే గుర్తుపడతాడా? సందేహం లేదు. నేను తేలిగ్గానే గుర్తుపట్టానుగా!’ ఆలోచనలు ఇలా సాగుతుండగా, చూపులు అతని పరుగును అనుసరిస్తున్నాయి.
“హాయ్ అంకుల్. ఎలా వుంది ఆరోగ్యం?” జాగింగ్ చేస్తూ వెళ్ళేవాడు ఒక్కక్షణం ఆగి, వాకింగ్ చేస్తూ ఎదురుపడ్డ ఓ పెద్దమనిషిని పలకరించాడు సుహాస్.
ఆ పెద్దాయన ఇచ్చిన సమాధానం రిషికి వినిపించలేదు.
“సర్లే. కంగారు పడకండి. రేపొకసారి హాస్పిటల్‌కి రండి. టెస్టులు చేయించి చూద్దాం.” అని నవ్వుతూ పరుగు మొదలెట్టడంతో తననే చూస్తూ ఉండిపోయాడు రిషి.
‘తను అనుకున్నట్టుగానే డాక్టర్ అయ్యాడన్నమాట! అసాధ్యుడే! అవునూ.. ఈ పార్కులో ఇదివరకెప్పుడూ కనపించలేదే! వారం తర్వాత ఇవాళేగా నేనొచ్చింది.. సో.. ఈమధ్య కాలంలో రావడం మొదలై ఉండాలి’. ఇలా ప్రశ్నలూ, సమాధానాలూ పేర్చుకుంటూ సుహాస్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఈ ట్రాక్‌పై సాధారణంగా ఐదు నిమిషాల్లో ఒక రౌండ్ పూర్తి అవుతుంది. పది నిమిషాలు గడిచినా సుహాస్ కనబడకపోయేసరికి ఆలోచనలో పడ్డాడు. వెళ్లిపోయుంటాడా? కంగారుగా అతను వెళ్ళిన వైపు నడక సాగించాడు.
కొంతదూరం వెళ్లేసరికి సుహాస్ ఒక పదేళ్ళ కుర్రాడితో ఏదో మాట్లాడుతూ కనిపించాడు. ఆ కుర్రాడు ఒకటే నవ్వుతున్నాడు.
‘వీడేమీ మారలేదు. ఏ వయసు వారితోనైనా తొందరగా కలిసిపోతాడు. ఏమాటకామాటే! నాకంటే నాన్నతోనే చనువెక్కువ వీడికి.’ అనుకుంటూ తననే చూస్తూ నిలబడిపోయాడు.
‘వెళ్లి మాట్లాడిస్తే పలుకుతాడా? ఎందుకు పలకడు? మాట్లాడటం మానేసిందీ, బెట్టుగా ఉన్నదీ నేనేగానీ, వాడు కాదుగా!’
ఇప్పుడేం చేయాలి? సందిగ్ధంలో ఉన్న మెదడులో ఒక ప్రశ్నప్రాణం పోసుకుంది. ‘ఇదే స్థితిలో నాన్నైతే ఏం చేస్తాడు?’ తను చెప్పే మాటొకటి తళుక్కున మెరిసింది. అది తన చెవికి ఏమాత్రం రుచించదు. కానీ మొదటిసారిగా ఎందుకో ఆచరణలో పెట్టాలనిపిస్తోంది. ఆ కుర్రాడితో మాటలు అయ్యేవరకు వేచిచూశాడు.
“హాయ్ సుహాస్! నేన్రా రిషిని, గుర్తు పట్టావా?” అంటూ వెళ్లి పలకరించాడు.
“వావ్! మై గుడ్నెస్! మర్చిపోయే మనిషివా నువ్వు!” అని బిగ్గరగా అరుస్తూ వాటేసుకున్నాడు. ఆ అరుపుకి చుట్టూ ఉన్నవారు ఒక్కసారిగా ఉలికిపడ్డారు.రిషి కొంచెం ఇబ్బందిగా కదిలాడు. సుహాస్ ఇదేమీ పట్టించుకోకుండా నడుద్దాం అని సైగ చేసి సంభాషణ మొదలెట్టాడు.
“ఎన్నేళ్ళయిందిరా..? ఆగు.. నన్ను చెప్పనీ..! ఊఁ.. కలుసుకొని ఇరవై ఏళ్ళు, మాట్లాడుకొని ఇరవై రెండేళ్ళు. అంతేగా!”
అవునన్నట్లు తలాడించాడు రిషి.
“అంకుల్ ఎలా ఉన్నారు?” అడిగాడు సుహాస్.
“అదిగూడా నువ్వే చెప్పరా!, అవకాశాలివ్వటం నీకలవాటు లేదుగా!” నవ్వాడు రిషి.
“ఆయనకేం.. దివ్యంగా ఉంటారు. దేవుడు కక్ష కట్టాల్సిందే గానీ మనుషుల వల్ల ఆయనకేం ఇబ్బంది రాదు.” నవ్వుతున్నాడు సుహాస్.
“ఈ ఊరెప్పుడొచ్చావ్? మొత్తానికి డాక్టర్ అయినట్టున్నావ్..!” అని ఇంకేదో అడగబోతున్న రిషిని వారించాడు సుహాస్.
“ఇక్కడికొచ్చి వారమైంది. ఇక డాక్టర్ కావడం అంటావా..? అది ఒక కల. దాన్ని మనం కలర్ఫుల్గా డిజైన్ చేస్తే, ప్రింట్ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్‌లో వచ్చింది. డాక్టరై పెద్ద హాస్పిటల్ కడదామనుకొని, అలా కుదరక, చివరికి ఎం.బి.ఏ. చేసి ఎవరో కట్టిన హాస్పిటల్లో పనిచేస్తున్నాను. సేవ రూపం మారింది గానీ.. స్థానం మాత్రం మారలేదు.” అంటూ కన్నుగీటాడు.
“ఇంతకీ.. నీ కబుర్లేంట్రా?” తనే ఉత్సాహంగా అడిగాడు.
“ఇక్కడికి మాఇల్లు దగ్గరే. ఒకసారి ఇంటికి పోదాం రారాదూ!” మాట మార్చాడు రిషి.
“ఈరోజు కుదరదు. శ్రీమతినీ, పిల్లల్నీ ఊర్లో దిగబెట్టి రావాలి. వచ్చేసరికి రాత్రవుతుంది. రేపుదయమే ఇంటికి వస్తాను. ఇంటి అడ్రస్ చెప్పు.” మొహంపై నవ్వు చెరగలేదు.
అడ్రస్ చెప్పగానే రేపు తప్పక కలుస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ఉదయంనుండీ సలుపుతున్న ఆలోచనలేవీ రిషి మనసులో ఇప్పుడు లేవు. ఇన్నేళ్ళ తర్వాత సుహాస్ కనబడటం, తనే వెళ్ళి పలకరించటం ఆనందమేసింది. తనకి తాను ఇంకో తనులా తోచాడు. పేపర్ పార్కులోనే వదిలేసి, పాత జ్ఞాపకాలతో ఇంటికి బయలుదేరాడు.
***
స్కూల్ నుండి ఇంటికి చేరి పుస్తకాల సంచులు గిరాటేసి, సైకిళ్ళు తీసుకొని వేగంగా గ్రౌండ్‌కి చేరుకోవటం, ముందుగా వచ్చిన వాడు ఆ రోజు జరిగే పోటీని నిర్ణయించటం. ఇది ఆనవాయితీ. దీనికి విరామం లేదు. వాళ్ళకు విసుగు లేదు.
ఎప్పట్లానే ఆరోజు కూడా సైకిళ్ళతో సిద్ధం అయ్యారు. ముందు సుహాస్ చేరుకున్నాడు. కాబట్టి పందెం తనే నిర్ణయిస్తాడు. దగ్గరలో ఉండే గుడి ప్రక్కన రోడ్డుపై ఒక వ్యక్తి కుక్కతో వాకింగ్ చేయిస్తూ ఉంటాడు. దాని వెనుకగా వెళ్ళి ఒక్క సారిగా సైకిల్ బెల్లు మోగించాలి. ఆ కుక్కకు సైకిల్ బెల్లంటే మహా బెరుకు. అది భయపడి ఆయన చేతిలో నుండి తప్పించుకొని పారిపోతుంది. వెంటనే బయలు దేరిన చోటుకి చేరుకోవాలి. ఓడిపోయిన వాళ్ళు ఒక వారంపాటు గెలిచిన వాడి హోం వర్కులు రాసిపెట్టాలి.
“కుక్కతో మనకేం పనిరా?” రిషికి సందేహం వచ్చింది.
“కుక్కతో కాదు. దాన్ని పట్టుకున్న మనిషితోనే పని. నిన్న మనం ఇసుకకుప్ప మీద ఆడుతుంటే, కర్ర తీసుకొని తరిమింది అతనే. అందుకే ఈ ప్రతీకారం. యు.. హ్హ..హ్హ..” పెద్దగా నవ్వాడు.
పోటీ మొదలైంది. ఇద్దరూ వేగంగా అక్కడకు చేరుకొని ఒకేసారి బెల్లులు మోగించారు. వాళ్ళు అనుకున్నట్టుగానే అది బెదిరిపోయి అతని చేతిలోనుండి విడిపించుకుంది. కానీ వీళ్ళు ఊహించనిదేమిటంటే.. అది వీళ్ళ వెంట పడింది. అసలు రేసు అప్పుడు మొదలైంది. భయంతో సైకిళ్ళపై వీళ్ళు, కోపంతో వెనుక కుక్క. ఎలాగోలా తప్పించుకొని చివరి స్థానం చేరే క్రమంలో ఒకరికొకరు గుద్దుకొని సైకిళ్ళపై నుండి కింద పడ్డారు. రిషికేమీ కాలేదు కానీ సుహాస్ మోచేతికి గట్టి దెబ్బే తగిలింది. చాలా రక్తం పోయింది. ఇద్దరూ భయపడిపోయారు. మెల్లగా రిషి వాళ్ళ ఇంటికి చేరుకున్నారు.
అప్పుడే ఇంటికి వచ్చిన రిషి తండ్రి, సుహాస్‌కి ధైర్యం చెప్పి, ఆ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి తనను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టివస్తానని వెళ్ళాడు. రిషి వాళ్ళను అనుసరించాడు.
సుహాస్ వాళ్ళ నాన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. ఆయన కోపం కట్టలు తెంచుకుంది. నోరు అదుపు తప్పింది. సుహాస్‌ను బాగా కేకలేశాడు. అడ్డు చెప్పబోయిన రిషి తండ్రిని సైతం లెక్కచేయలేదు. ఇదంతా రిషితో స్నేహం వల్లే అన్నాడు. గాలి వెధవలూ, గాలి తిరుగుళ్ళూ.. అంటూ సుహాస్‌పై చేయి చేసుకోబోయాడు. రిషి తండ్రి అడ్డుపడ్డాడు. దెబ్బ అతనిపై పడింది. అయినా తప్పుకోలేదు. ఇంకో దెబ్బను ఆపే క్రమంలో కిందపడ్డాడు. సుహాస్‌ను చేయిపట్టుకొని ఈడ్చుకుంటూ ఇంట్లోకి పోయి తలుపేసుకున్నాడు వాళ్ళ నాన్న.
ఇది జరుగుతున్నంతసేపూ బిగుసుకుపోయి నిలబడ్డాడు రిషి. తర్వాత తండ్రీ కొడుకులిద్దరూ మౌనంగా వెనుదిరిగారు. ఇంటికొచ్చాక రిషి మౌనం కోపంలా మారింది. అంత గొడవ జరుగుతున్నా సుహాస్ నోరు మెదపలేదని, అందువల్లే తన తండ్రికి అవమానం జరిగిందని నిశ్చయించుకున్నాడు. ఇక ఎప్పటికీ సుహాస్‌తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు.
తర్వాత కూడా సుహాస్ ఇంటికి రావటం మానలేదు. ఇంట్లో అందరూ మాట్లాడినా తను మాట్లాడేవాడు కాదు. ఎన్నోసార్లు సుహాస్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ సంఘటన జరిగిన రెండేళ్లకు సుహాస్ వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయాక, వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు.
***
సుహాస్ కోసం ఎదురు చూస్తున్నాడు రిషి. ఫోన్ నెంబర్ తీసుకుంటే పోయేది. బుర్ర పని చేసి చావలేదు. తిట్టుకున్నాడు. వస్తాడా? వస్తే బాగుణ్ణు. ఇంతలో గేటు మోగింది. తలెత్తి చూశాడు.
“కుక్కల్లేవు కదా! మనక్కొంచెం భయం” గేటు బయటే నిలబడి నవ్వుతున్నాడు సుహాస్.
“ఆరోజు నుండి కుక్కకు మనకు ఆమడ దూరం” సుహాస్ నవ్వుతో జత కలిపి, గేటు తీసి భుజాలపై చేతులు వేసి లోపలికి తీసుకెళ్ళాడు.
“ఎవరూ లేరా ఇంట్లో?” చుట్టూ కలియచూస్తూ అన్నాడు.
“అమ్మ, తను పక్కింట్లో ఏదో పూజ ఉంటే పొద్దున్నే వెళ్ళారు. వచ్చే టైం అయింది.” చెప్పాడు రిషి.
అప్పుడే ఆడుకుంటూ అటుగా వచ్చింది రిషి ఐదేళ్ళ కూతురు.
తనను గట్టిగా పట్టుకొని ఆపి “భలే ఉన్నావ్! నీ పేరేంట్రా?” అన్నాడు.
“నీ పేరేంట్రా?” అంది.
“ఏమిటా మాటలు? పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది?” కోప్పడ్డాడు రిషి.
“ఆడపిల్లల్ని అలాగేనా అడిగేది? పేరేంట్రా అని!” కళ్ళు చక్రాల్లా తిప్పుతూ సుహాస్ వైపు గుర్రుగా చూస్తోంది.
“సుహాస్ రా” కొంటెగా సమాధానం ఇచ్చాడు.
“సహస్ర” అని రిషిని కొరకొరా చూస్తూ వెళ్ళిపోయింది.
ఇద్దరూ నవ్వుకున్నారు.
“అంకులెక్కడ?” ఉత్సాహంగా అడిగాడు సుహాస్.
సుహాస్‌ను పక్కగదిలోకి తీసుకొని వెళ్ళాడు రిషి. అక్కడో కుర్చీలో కూర్చుని కిటికీనుండి బయటకు చూస్తున్నారాయన.
“నాన్నా.. వీడు సుహాస్. నా చిన్నప్పటి స్నేహితుడు. గుర్తు పట్టావా?”
“హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు?” అంటూ చేతిలో చేయి వేశాడు సుహాస్.
ఒక్కసారిగా చేయి మెలితిప్పి, మోచేయి వైపు చూసి, “ఈ చేతికేనా దెబ్బ తగిలింది?” ప్రశ్నించాడు.
“సూపర్ మెమరీ అంకుల్.. భలే గుర్తు పెట్టుకున్నారు!” ఆశ్చర్య పోయాడు.
తర్వాత.. ఉద్యోగం, పిల్లలు, నివాసం వంటి విషయాలపై కొన్ని ప్రశ్నలడిగాడు. కానీ వాటిలోని తడబాటు గమనించాడు సుహాస్. ఓపిగ్గానే సమాధానం ఇచ్చాడు.
“మీ అమ్మా, నాన్నా ఎలా వున్నారు?” ఈ ప్రశ్నకు బిత్తరపోవటం సుహాస్ వంతైంది. అనుమానంగా రిషి వైపు చూశాడు.
“నాన్నా.. వీడికి ఇల్లు చూపించి తీసుకొస్తాను.” అని సుహాస్ ను వెంటబెట్టుకొని బయటకు నడిచాడు.
ఇద్దరూ హాల్లో కూర్చున్నారు. తాము విడివిడిగా గడిపిన కాలాన్ని దగ్గరకు చేర్చారు. బాల్యపు అమాయకత్వాలను గుర్తు తెచ్చుకొని నవ్వుకున్నారు. ఒకరి అనుభవాలను ఇంకొకరు పంచుకొని ఆనందించారు.
“అవునూ.. అంకుల్ సమస్య ఏంట్రా?” నడిచే చర్చను మళ్ళించాడు సుహాస్.
బలంగా శ్వాస తీసుకొని వదిలి నిదానంగా చెప్పాడు రిషి.
“నువ్వు ‘సూపర్’ అన్న మెమరీనే అసలు సమస్య. నాన్నకు అల్జీమర్స్. పాత జ్ఞాపకాలు కొంతవరకు నయం. ఇప్పటి విషయాలైతే అసలేమీ గుర్తుండటం లేదు.”
“ఎప్పటినుండి?”
“మనకు తెలిసి ఒక వారమయింది. ఒకరోజు ఉదయం నడకకు వెళ్ళి ఇల్లు మర్చిపోయాడు. ఎలాగో వెతికి పట్టుకొని, అదే రోజు ఆసుపత్రికి తీసుకెళ్తే తేలింది.. అల్జీమర్స్ అని!” నిట్టూర్చాడు
“ఇంత హఠాత్తుగా ఎలా? ముందుగానే పసిగట్టే అవకాశం రాలేదా?”
“అదే దురదృష్టం. ముందు నుండీ నాన్న మెమరీతో నాకు సమస్యగానే ఉండేది. కాబట్టి అందులో భాగమే ఇది అనుకున్నానుగానీ ఈ విపత్తును ఊహించలేదు.”
“ఆయన మెమరీతో నీకు సమస్యేంటో నాకర్థం కాలేదు.”
“మొదటి నుండీ నాన్నకు కొంచెం పరధ్యానం ఎక్కువ. చిన్నచిన్న విషయాలు కూడా మర్చిపోతుండేవాడు. అది సాధారణమే అని తేలిగ్గా తీసుకున్నా, అతి ముఖ్యమైన విషయాలను కూడా సునాయాసంగా వదిలేసేవాడు. నాకు చాలా అంశాల్లో నచ్చేది కాదు. అందుకే ఆయన మెమరీకి సంబంధించిన అంశాలను నేను పట్టించుకోవటం మానేశాను. ఇక్కడికొచ్చి ఆగేవరకు నాకు విషయం అర్థం కాలేదు.”
సందేహంగా చూశాడు రిషి వైపు. ఆ చూపు ఇంకేవో వివరాలను అడుగుతోంది.
“క్లుప్తంగా చెప్తాను విను” అని ప్రారంభించాడు.
“ఓసారి బంధువుల గృహప్రవేశానికి నేను, నాన్న వెళ్లాం. తన పరిచయస్థులతో మాట్లాడుతూ ఉండగా ఒక వ్యక్తి వచ్చాడు. మొఖమంతా నవ్వు పులుముకొని ఆ మనిషికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. మేము అంతకు ముందు అద్దెకి ఉన్న ఇంటి యజమాని అతను. వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు, ఏదో సిల్లీ అంశం మీద తగాదా పెట్టుకొని నాన్నను పిచ్చి మాటలు అన్నాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేయించాడు. అటువంటి మనిషిని పలకరించేటప్పుడు ఈయనకు ఆత్మాభిమానం ఉండఖ్ఖర్లా? అక్కడ నుండి బయటకు వచ్చే దార్లో నాన్నను ఆమాటే గట్టిగా అడిగాను. దానికి నాన్న సమాధానం తెలుసా?”
‘ఆ సమయంలో అన్నేళ్ల పరిచయమే గుర్తుంది కానీ, జరిగిన గొడవ గుర్తు లేదని’
“ఇంకో ఏడాది పోయాక అందరం ఒక పెళ్ళికి వెళ్లాం. అక్కడో మనిషి కలిశాడు. అతనితో చాలా సేపు మాట్లాడాడు నాన్న. భోజనాలు చేసే సమయంలో నాన్నని అడిగాను.. అతనెవరని! నాకు మావయ్య అవుతాడంట. మొదట నాకర్థం కాలేదు. అమ్మ వాళ్ళ అన్నయ్య అని చెప్పాడు. అప్పుడే తనను చూడటం. ‘అదేంటి.. వాళ్ళకు మనకు మాటలు లేవు కదా! నీతో ఎలా మాట్లాడాడు’ అని అడిగాను. అమ్మా, అత్తా ఇద్దరూ మాటా, మాటా అనుకున్నారు కానీ వీళ్లిద్దరికీ ఏం లేదట. సరేలెమ్మని వాళ్ళిద్దరి తగువేంటని అడిగాను. దానికి నాన్న ఇచ్చిన సమాధానం,
‘చాలా రోజులైంది కదరా.. నాకు సరిగా గుర్తు లేదు. అమ్మని అడిగితే వివరంగా చెప్తుంది’
అసలు గొడవే గుర్తు లేనప్పుడు కుటుంబాల మధ్య అగాథం ఎందుకని అడిగాను. సమాధానం దొరక లేదు.”
“ఇంకో విషయం.. నువ్వేమీ అనుకోకూడదు మరి!” సందేహంగా సుహాస్ వైపు చూశాడు.
పర్లేదు కొనసాగించమని సైగ చేశాడు సుహాస్.
“మీ నాన్న చనిపోయినప్పుడు, మీ ఇంటికి వెళ్ళద్దని నేను పట్టుపట్టాను. పద్ధతి తెలియని మనిషిని వెళ్ళి చూడాల్సిన అవసరం లేదని వాదించాను.” ఒక్క క్షణం సుహాస్ వైపు చూసి తనే కొనసాగించాడు.
“అది సాటి మనిషికి మనం ఇవ్వాల్సిన కనీస గౌరవం. నేనిప్పుడు వెళ్ళేది చనిపోయిన ఆ మనిషికి తెలియక పోవచ్చు. కానీ ఈ కష్ట కాలంలో ఆ కుటుంబానికి ఏదైనా అవసరం వస్తే, మీ తోడుగా మేమూ ఉంటాం అని చెప్పటానికైనా వెళ్లి కనబడాలి. అయినా.. నీ పిచ్చిగానీ, ఆయన పద్ధతి తప్పి ప్రవర్తించింది ఎక్కడ్రా? కొడుకు మీద ఉన్న ప్రేమ అది. నీకది మరోలా కనబడింది.” అని నా మాటను పక్కకు తోసేశాడు.
సుహాస్ కళ్ళల్లో కదిలిన నీటిపొరను రిషి గమనించలేదు.
వెంటనే తమాయించుకొని, “వీటి సారాంశం ఏంటో చెప్తే, నాకర్థమైంది నేను చెప్తా!” అన్నాడు.
“పరధ్యానంగా ఉండి కొన్ని విషయాలు, కావాలని కొన్ని విషయాలు మర్చిపోయేవాడు. కొన్ని గుర్తులేనట్టుగానే ప్రవర్తించేవాడు. తనతో ఏకీభవించలేక, ఏది స్వాభావికం, ఏది అభ్యాసం అని తేల్చే ఇష్టం లేక, పట్టించుకోవడం మానేశాను. ఇప్పుడేమో ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక గింజుకుంటున్నాను.” అని ముగించాడు.
“ఇప్పటివరకూ తను కోరి తెచ్చుకున్న మరుపు, ఇప్పుడేమో దేవుడిచ్చిన మరుపు. చూశావా విచిత్రం! తనకేది ఇష్టమో.. దేవుడూ అదే ఇచ్చాడు. దీనికి పరిష్కారం అని చెప్పను గానీ, రెండు అంశాలపై మనం దృష్టి పెట్టాలి.” రిషి చేతిలో చేయి వేసి అనునయంగా చెప్తున్నాడు సుహాస్.
“మొదటిది వైద్యపరమైనది. నాకు తెలిసినంతవరకూ అల్జీమర్స్ వ్యాధికి చికిత్సేమీ లేదు. కానీ అధైర్య పడవలసింది ఏమీలేదు. మందులు వాడి, మెమరీ పతనం అయ్యే వేగాన్ని తగ్గిస్తారు. సాధ్యమైనంత వరకూ మంచి వైద్యం దొరికేలా నేను ప్రయత్నిస్తాను. ఆక్యుపేషనల్ థెరపీ దీనికి కొనసాగింపు. మా హాస్పటల్లో ఒక ఆక్యుపేషనల్ థెరపిస్ట్ ఉన్నాడు. రోజువారీ వ్యవహారాల్లో అంకుల్‌కి మనం ఏవిధంగా సహాయం చేయాలో గైడ్ చేస్తాడు.” ఏమంటావ్ అన్నట్లు రిషి వైపు చూశాడు.
రిషి సందిగ్ధంగానే తల ఊపాడు.
“నువ్వు చేస్తున్న తప్పును సరి చేసుకోవటం రెండో అంశం.”
అయోమయంగా చూసాడు రిషి.
“అర్థం కాలేదు కదూ! నీకు తెలిసిన మీ నాన్న జీవితాన్ని గమనిస్తే, కాలం పెట్టే పరీక్షలను ఒడుపుగా నెగ్గుకోచ్చే ఒక యోధుడు కనిపిస్తాడు. కానీ అవకాశం దొరికిన ప్రతిసారీ.. ఒడ్డున కూర్చుని.. పనిగట్టుకొని, ఆయన్ను ఫెయిల్ చేసే పనిలోనే ఉన్నావ్. ప్రతిసారీ జీవితమే తనను ఉత్తీర్ణుణ్ణి చేసిన తర్వాత, నువ్వు తప్పించటంలోని ఔచిత్యం ఏమిటి?”
‘నాన్న స్వభావాన్ని తప్పుగా తూకం వేశాడా? మతిమరుపు ఔదార్యం కాబోదని తను అనుకున్నాడు. అది తనకున్నదైనా, తెచ్చుకున్నదైనా నాన్న ఆయుధమేనని అని వీడు చెప్తున్నాడు. ఆలోచిస్తే నిజమేననిపిస్తోంది.’ తల గిర్రున తిరిగినట్లయింది రిషికి.
“నీకు తెలిసినంతలో, తన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళున్నారా?” కొనసాగించాడు సుహాస్.
“లేదు”
“తనెవర్నైనా ఇబ్బంది పెట్టాడా?”
“లేదు”
“అంటే తన జీవితంలో ఘర్షణ శూన్యం. ఉదయం లేచిన దగ్గర నుండి తెచ్చిపెట్టుకునే ఒత్తిళ్ళతో కాలం వెళ్లదీసే మనుషులున్న ఈ ప్రపంచంలో ఎంతమంది ఇలా జీవించగలరు?” కంఠం గంభీరంగా మారింది.
“మా నాన్న పోయాక కొన్ని రోజులకు అంకుల్ మా ఇంటికి వచ్చారు. ఆసరా కోల్పోయి దీనంగా ఉన్న మా కుటుంబానికి చాలా ధైర్యం చెప్పారు. అంకుల్ ఇచ్చిన ఉత్సాహంతోనే ఎప్పుడూ గడప దాటని అమ్మ ధైర్యంగా జీవితానికి ఎదురు నిలిచింది. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నాకెప్పటికీ గుర్తుండిపోయాయి.” రిషి ముఖ కవళికలు మారటం గమనించి కొంచెంసేపు ఆగాడు.
“గతం గాయాలతో బాధపడేవాడు, భవిష్యత్ భూతాన్ని చూసి భయపడేవాడు, ప్రస్తుతంలో జీవించటం మానేస్తాడు.”
‘పొల్లుపోకుండా అవే మాటలు. ఈ మాటలే కదా నాన్న జీవితకాలం నమ్మినదీ.. నేను తృణీకరించినదీ.. నిన్న వీడివద్దకు నన్ను నడిపించినదీ.. అమోఘం! చనువెక్కువని తెలుసు కానీ, నాన్న ప్రభావం వీడిపై ఇంత ఉందా!’ లోలోన మురిసిపోయాడు.
“ఏమైనా చెప్పలనుకుంటున్నావా?” సందేహించాడు సుహాస్.
“ఊహు.. ఇంకా వినాలనుకుంటున్నాను” హాయిగా నవ్వాడు.
“అంకుల్‌తో పరిచయం ఉన్నవారెవరూ తనను మర్చిపోలేరు. ఆయన చెప్పే మాటలు తన అనుభవంలోనివి. వాటితో కదలనివారు, కలవనివారు అరుదేమో! అంతెందుకు.. నువ్వే వచ్చి నన్ను మాట్లాడించడానికీ, ఇన్నేళ్ళుగా మాటల్లేని మనం మాట్లాడుకోడానికీ, ఆయన నమ్మిన సిద్ధాంతం పరోక్షంగా అయినా దోహదపడిందా లేదా?” రిషికి సమాధానం చెప్పే అవకాశం ఇవ్వకుండా తనే కొనసాగించాడు.
“ఎప్పుడూ గతంలో కుర్చీవేసుకోని తాపీగా కూర్చోవడం, లేదంటే ఆయన శేషజీవితాన్ని గూర్చి బెంగపెట్టుకోవటం తప్ప, తన ప్రస్తుతంలో ఒక పది నిమిషాలు స్థిమితంగా గడిపావా? ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉండగలదో ఊహించగలవా?” విరామం ఇచ్చాడు.
క్రమంగా రిషిలో సందిగ్ధపు తెరలు కరుగుతున్నాయి. సందేహం లేదు. తనో అద్భుతం. అనుక్షణం అనుభూతి చెందాల్సిన అనుభవ శిఖరం. తప్పు తెలుస్తోంది. చేయవలసిన పని తలపుకొస్తోంది.
“చూడు నాన్నా.. తాత నన్ను విసిగిస్తున్నాడు” అంటూ విసురుగా హాల్లోకొచ్చింది సహస్ర.
“ఏమన్నాడు తల్లీ!” బుజ్జగించాడు రిషి.
“నేనే క్లాస్ చదువుతున్నానో అడుగుతున్నాడు.”
“చెప్తే సరిపోతుందిగా బంగారూ! దానికంత కోపం ఎందుకు?” అడిగాడు సుహాస్.
“ఎన్నిసార్లు చెప్పాలి? నిన్ననే చెప్పాను. మళ్ళీ ఎందుకు అడగడం?” నవ్వుతున్న రిషి, సుహాస్‌ల వైపు అమాయకత్వం, కోపం కలిసిన చూపుతో చుర్రుమని చూసింది.
“ఒక్కోసారి అంతే.. ఎవరైనా మర్చిపోతారు. తాతైనా.. నువ్వైనా..” రిషిని ఆగమని సైగ చేసి సుహాస్ కొనసాగించాడు.
“నేనేం మర్చిపోను.”
“ఓహో..! అలా ఐతే నిన్నేం చెప్పావో నీకు గుర్తుందా?”
“ఓ..”
“పద.. తాత దగ్గరికి పోయి చెబుదాం. నీకెంత గుర్తుందో నేనూ చూస్తాను.” అంటూ సహస్రను తీసుకొని పక్క గదిలోకి వెళ్ళాడు సుహాస్. కుతూహలంగా వాళ్ళను అనుసరించాడు రిషి.
“తాతా..” ఉత్సాహంగా పిలిచింది.
“ఏంటమ్మా?”
“నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను.”
“అవునా..! వెరీ గుడ్.” ఆనందంగా దగ్గరికి తీసుకున్నాడు. తాత ఒళ్ళో కూర్చుని సుహాస్‌ని చూసి కళ్ళెగరేసింది.
“నీకు అన్నీ గుర్తుంటాయా?” కవ్వించాడు సుహాస్.
ఔనంది సహస్ర.
వుండవన్నాడు సుహాస్.
“ఉంటాయ్..” కేక పెట్టింది.
పందెమన్నాడు.
సై అంది.
పార్కుకి దారి చెప్పలేవన్నాడు.
ఒక్కదాన్నే వెళ్ళొస్తానంది.
ఒక్కతే కాదు, చేతనైతే తాతను పార్కుకి తీసుకెళ్ళి తిరిగి రావాలన్నాడు. అలా వస్తే తను మర్చిపోదని ఒప్పుకుంటానన్నాడు.
సిద్ధమైంది. తాతను బయటకు నడిపించింది.
సంభాషణ మొత్తం విన్న రిషి ఆనందంతో సుహాస్‌ను కౌగిలించుకున్నాడు.
“థాంక్ యూ సో మచ్ సుహాస్. నేనేం చేయాలో నాకు అర్థం అయింది. ‘ప్రస్తుతం’లో నా ప్రయాణం ఇప్పడే మొదలవబోతోంది. నిన్నిలా వదిలేసి వెళ్తున్నానని మరోలా అనుకోకు. పేపర్ చూస్తూ ఉండు. ఈలోగా అమ్మ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళతో మాట్లాడ్తూ ఉండు. త్వరగా వచ్చేస్తాం.” అంటూ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, పరుగున వెళ్లి వాళ్ళతో జత కలిశాడు. చాలా రోజులుగా పుష్పించటం మరిచిపోయి ఇప్పుడిప్పుడే మొగ్గతొడుగుతోన్న పెరట్లోని మందారం సుహాస్ ను చూసి హాయిగా నవ్వుతోంది.