కూపగర్భంలో కూలదొయ్యబడిన గూండా ఫకీరు కొన్ని క్షణాల అనంతరం తేరుకొని, తాను ఉన్నది మృత కళేబరాల మధ్యలో అని తెలుసుకొని విభ్రాంతుడయ్యాడు. దుర్గంధ భూయిష్టమైన, దుర్భరంగా ఉన్న అంధకార కూపంలో శవాలను కాళ్లతో చేతులతో నెట్టుకుంటూ ముందుకు పోవాలని ప్రయత్నించాడు. అంతలో భయంకరంగా వికటాట్టహాసాలు వినిపించాయి. ‘ఎవరు మీరు? నేనెవరనుకున్నారు?’ అని ఆగ్రహంతో అరిచాడు. మళ్లీ హేళనగా నవ్వులు వినిపించాయి.
‘కాపాలీ, మన మహిమ చూపించు’ అనగానే ఆ మృత కళేబరాలన్నీ గిరగిరా తిరగసాగాయి. మళ్లీ యథాప్రకారం క్రింద పడ్డాయి. దాంతో అవి అతని మంత్రమహిమను తెలుసుకున్నాయి. ఒక పిశాచం తమ వృత్తాంతమంతటినీ క్లుప్తంగా వివరించి, ‘నువ్వు మాకు ఏమన్నా సహాయం చేయగలవా’ అని అడిగింది. ‘ముందు నేను ఈ కూపం నుండి బయటపడే మార్గం చెప్పండి’ అన్నాడు ఫకీరు. అక్కడ ఉన్న బిల మార్గం గుండా పోతే బ్రతికి బయటపడవచ్చని చెప్పాయి. ఫకీరు అలా బిలమార్గాన ముందుకు పోసాగాడు. హఠాత్తుగా అతని మెడకు ఒక గొలుసు వేసి, ఎవరో బలంగా పట్టి లాగుతున్నట్లు ఉంది. ఎంత పెనుగులాడుతున్నా లాభం లేక, ఆ గొలుసు అతన్ని ఇంకా ఇంకా యీడ్చుకొని పోతూనే ఉంది. ఫకీరు తన గంటలను ఒకసారి మోగించాలని చూశాడు. కానీ గంటలు మోగలేదు. ‘కాపాలీ, నీ మహిమలు ఏమైనాయి’ ఆగ్రహావేశాలతో సింహనాదం చేశాడు.
“ఈ ప్రదేశం మహా శక్తివంతమైనది. ఇక్కడ నా మహిమ లేమీ పని చేయవు. అమాయకులైన నూరుగురు ఆడబిడ్డలను చంపి ఈ కూపంలో వేసాడు మహారాజు. ధర్మ దేవత ఈ ఘోరాన్ని సహించలేక ఇక్కడ కొలువై, ఈ ప్రేతములను రక్షిస్తూ ఉంది. దుర్మరణాలకు గురి అయిన వీరిని పునరుజ్జీవితలను చేయటానికి అదను కోసం వేచి ఉన్నది” అంది కాపాలి. “ఇన్నాళ్లూ నిన్ను పూజించాను. ఎలాగైనా నీవే నన్ను రక్షించాలి” అని ప్రాధేయ పడ్డాడు ఫకీరు. జాలిపడింది కాపాలి. “నేను నీ రూపం ధరించి, నీ స్థానంలో శృంఖలాబద్ధమై ఉంటాను. వీరు నన్ను సలసలా మరుగుతున్న తైలంలో పడేస్తారు. ఇంకా అనేక శిక్షలు వేస్తారు. నీవు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లి, తొమ్మండుగురు అవివాహితులైన కన్యలను నాకు బలి యివ్వు. అప్పుడు నాకు శక్తి వచ్చి వెలుపలకు వచ్చి, నీకు ఎప్పటిలా సహాయపడతాను” అన్నది. ఫకీరు అంగీకరించిన వెంటనే కాపాలి అతని స్థానంలో ఉండి, అతనిని విముక్తుణ్నిగా చేసింది. ఫకీరు బిల మార్గాన ముందుకు నడిచి కూపం నుండి బయటపడ్డాడు.
ఆనాడు ఆకాశం నుండి పడిన ఫకీరు చావలేదని, ఈనాటి సభకు వస్తున్నాడని తెలిసి ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. మహారాజు సపరివార సమేతంగా ప్రవేశించాడు సభలోనికి. అంతలో గంటలు మ్రోగించుకొంటూ ఫకీరు ప్రవేశించాడు. ఉగాది నాటి వస్తు ప్రదర్శనలో గాలిగుఱ్ఱమునకు ప్రథమ బహుమతి వచ్చినదని మహారాజు ప్రకటించి, నూరు మణుగుల బంగారమును తెప్పించి, అమూల్య కంఠహారమును అతని మెడను అలంకరించి ‘స్వీకరించండి’ అన్నాడు.
“మహారాజా! నేనొక సర్వసంగ పరిత్యాగి అయిన ఫకీరును. నాకీ అమూల్యాభరణములు ఏమీ అవసరం లేదు. నేను కోరిన దాన్ని సమర్పిస్తానని మీరు వాగ్దానం చేసి ఉన్నారు దానిని నిలుపుకోండి” అన్నాడు. కోరుకోమన్నాడు మహారాజు.
“మీ రాణీవాసములో ముద్దుల మూటకట్టే పలుకులు పలికే చిన్నారి చిలుక సారంగిని అర్పించి మీ వాగ్దానం నిలుపుకోండి” అన్నాడు ఫకీరు.
“స్వామి! ఆ చిలుక నాకు ప్రాణప్రదమైనది. రాణికి ప్రియనెచ్చలి. దానిని విడిచి మేము బ్రతకలేము. పైగా ఆ చిలుక ప్రతిరోజు మాకు కథ చెప్పుచున్నది. ఆ కథ పూర్తయ్యేవరకు నా ప్రతిజ్ఞ నెరవేరే అవకాశం లేదు. కనుక దానిని సమర్పించలేను” అన్నాడు మహారాజు.
పరదా వెనుక చిలుకను ఒడిలో పెట్టుకొని ఉన్న రాగలత జరుగుతున్న దానిని అంతా గమనిస్తూ కన్నీటి పర్యంతమైంది. “ప్రేయసీ, భయపడకు. చివరికి ఏమవుతుందో సహనంతో తిలకిస్తూ ఉండు. నన్నా ఫకీరుకే ఈయనియ్యి. ఆ వంచకున్ని ఈ నిండు సభలో ఏం చేస్తానో చూద్దువు గాని” అన్నాడు చిలక రూపంలో ఉన్న జయదేవ్.
మహారాజు మౌనానికి ఫకీరు ఆగ్రహంతో కళ్ళెర్ర జేసాడు. ప్రజలు ఆశ్చర్యంతో చూస్తున్నారు. మహారాజు భయపడుతూ “సారంగి మాకు చెబుతున్న కథ పూర్తయిన వెంటనే తమకు సమర్పించుకుంటాను” అన్నాడు.
“సరే ఇప్పటికి ఎనిమిది రాత్రులు గడిచింది అంటున్నావు. మరి ఒక ఎనిమిది రాత్రులలో కథ పూర్తిచేయాలని మీ చిలుకకి ఆజ్ఞాపించు. సరిగ్గా ఆరోజుకి నేను తిరిగి వస్తాను. అప్పుడు నాకు చిలుకను సమర్పించకపోతే ప్రళయమే జరుగుతుంది” అన్నాడు.
మహారాజు అంగీకరించిన పిమ్మట ఫకీరు వెళ్ళిపోయాడు. చెదిరిన హృదయంతో చిలుకను తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది రాగలత.
***
దేవ మందారము తీసుకొని వస్తానని వెళ్ళిన చతురిక జాడ తెలియక మంజుషాదేవి విచారంగా కూర్చుని ఉంది. మాయా మైనాకుడు ఫాలాక్షుడు ఆమెను సమీపించాడు. మధుర వాక్కులతో ఆమెను సాంత్వన పరిచాడు. “మొదటే నీకు ఇంత మంచి బుద్ధి వచ్చి ఉంటే ఇంత కష్టం వచ్చేది కాదు కదా! హేమాంగి దేవమందారాన్ని అపహరించుకొని పోయింది. దానిని వెదుకుతూ చతురిక వెళ్ళింది. లేకుంటే ఈపాటికి మన వివాహమై ఉండేది” అంది మంజూషాదేవి.
“ప్రేయసీ! నీ దేవమందారం నీకు లభ్యమయ్యే వరకు మనం వేచి ఉండవలసినదేనా! మన మోహావేశాన్ని మనం అరికట్టుకో వలసినదేనా! అన్నాడు మాయామైనాకుడు.
“అవును. దేవమందారం ధరించకుండా పురుషుని కూడిన నేను మరణిస్తాను” దిగులుగా అన్నది.
“ఎవరో చెప్పిన ఆ మాటలు నువ్వు నమ్మకు. నా తాపమును గమనించు” అంటూ ఆమెను కౌగలించుకొనబోగా,
“నువ్వు నా మైనాకుడివేనా! నేను ఎంత బ్రతిమిలాడినా నాడు అంగీకరించలేదు. ఇప్పుడీ తొందరపాటు ఎందుకు” తీవ్రంగా అంటూ దూరంగా జరిగింది. తన మాయావేషం బయటపడుతుందని అతడు మౌనంగా ఉండిపోయాడు.
అంతలో ఒక పరిచారిక వచ్చి”దేవీ! ఉదయం పూజా మందిరం శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ నాకు దొరికింది. ఎవరిదై ఉంటుందో” అని ఒక అంగుళీయకం తెచ్చి ఇచ్చింది. నీలం, పచ్చ కలిగిన బంగారు ఉంగరం. అది మైనాకునిదే అని గుర్తించింది మంజూషాదేవి.
“ఇది నీదేనా” అని అతన్ని అడిగింది. ఫాలాక్షుడు తడబడ్డాడు.
“నీవు మందిరానికెందుకు వెళ్ళావు? దీనిని ఎక్కడ జారవిడుచుకొన్నావు?” ప్రశ్నించింది అనుమానంగా.
“జ్ఞాపకం లేదు దేవి” అన్నాడు. అతనికి భయంతో నోట మాట రావడం లేదు. ఆమె ఎన్నో ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పలేకపోయాడు.
“ఎవరక్కడ” అన్న నాగరాణి పిలుపందటమే తడవుగా సాయుధ పాణులైన కొందరు వచ్చి నిలుచున్నారు. “సత్యమునొప్పుకునే వరకు వీనిని ఖైదు చేయండి” అని కఠినంగా ఆజ్ఞాపించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మంజుషాదేవి. వెంటనే మాయమైనాకుని బంధించుకొనిపోయారు భటులు.


(చతురిక, ఫాలాక్షుల ప్రయత్నాలు ఏమైనాయి? చిలుక చెప్పే కథ లో, ఓడలో మాధురీబేగం చేత సింహళం తీసుకుపోబడుతున్న అవంతి తనవారిని కలుసుకొన్నదా? … తరువాయి భాగంలో…!)
(సశేషం)

10 Comments
Latha
The way u r connecting the story by very week is excellent
D.Narasimhasastry
Goodmorning Dr.suseelamma gaaru KOVVALI vaari JAGAJJANA SERIAL NOVEL mee chetulu meeduga malli paatakulanu alaristhundi ” marosaari jagajjana-saralamuga-sankshipthamuga ” ane apoorvamaina Seerhika perutho prati Aadivaram DHANYAVADAMULU mitrudu dnsastry
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు లతగారూ, నరసింహశాస్త్రి గారూ.
Prasanna
Excellent mam
సిహెచ్.సుశీల
Thank you Prasanna.
Swarna Pemmaraju
సుశీలమ్మ గారు మమ్మల్ని కథభాగంలోకి తీసుకు వెళ్తున్న తీరు అద్భుతం. ఎప్పటికప్పుడు ముందు ఏం జరుగుతుందో నన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ వారం కథలో చిలుక సారంగి గూండా ఫకీర్ని ఎలా తప్పించుకుని బయట పడు తుందో తెలుసు కోవా లని ఆదుర్దాగా ఉంది. సుశీలమ్మ గారి పద శైలి , మూల కథకి ఎక్కడా భంగం కలుగకుండా సంక్షిప్త రూపంలో మనకి అందించే ప్రయత్నం సదా అభినందనీయం
సిహెచ్.సుశీల
ధన్యవాదాలు స్వర్ణ గారు!
Srilekha
Chaala exciting ga undi. Yelanti confusions lekunda, enni characters ni meeru connect chesthunna vidhaanam baavundi. Awaiting for next episode….
Ramanaenvy
Suspense thriller లా అనిపిస్తుంది కథా గమనం. రాబోయే episode కోసం ఎదురు చూస్తున్నాం
BHOGARAJU SATYANARAYANA
ఈవారం కధకూడా చాలా సరళంగా సంక్షిప్తంగా ,భావయుక్తంగా, ఏక్షణానికాక్షణం
ఆసక్తికరంగా, ఒరిజినల్ నవలలోని కధాక్రమానికి భంగం కలగకుండా సాగింది
ఇటువంటి కార్యక్రమాలు చేపట్టటానికి సుశీలమ్మగారికి. సుశీలమ్మగారే సాటి
సరిలేరు మీకెవ్వరూ !!
హాట్సప్
–భోగరాజ సత్యనారాయణ (సూర్యప్రభాపతి) ఏలూరు. 8143236195