[సంచిక పాఠకుల కోసం ‘ద స్పెక్టాక్యులర్ నౌ’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
విడాకులు తీసుకున్న ఇళ్ళలో పెరిగిన పిల్లల్లో ఒకరకమైన కసి ఉంటుంది. చిన్న వయసులో తమ వల్లే తండ్రి వెళ్ళిపోయాడని అనుకోవటం ఒక విషాదమయితే పెద్దయ్యాక తండ్రి మీదో, తల్లి మీదో కోపం పెంచుకోవటం మరో బాధాకరమైన విషయం. చాలా కుటుంబాల్లో విడాకులు తర్వాత కూడా తండ్రి పిల్లలను కలుసుకుంటూ ఉంటాడు. అది కూడా లేకపోతే పిల్లల్లో కసి మరింత పెరుగుతుంది. అలాంటి ఒక అబ్బాయి కథ ‘ద స్పెక్టాక్యులర్ నౌ’ (2013). ‘సమ్మోహనకరమైన ఈ క్షణం’ అనే అర్థం వస్తుంది. ఆ పేరు ఎందుకు పెట్టారో చిత్రం చూస్తే తెలుస్తుంది. పైకి ఇది ఒక జల్సారాయుడైన అబ్బాయికి ఒక సౌమ్యమైన అమ్మాయి పరిచయమైతే ఎలా ఉంటుంది అనే పాత కథలా కనిపించినా తరచి చూస్తే విడాకులు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో అనే కథ కనిపిస్తుంది. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే.
సటర్ ఒక పదిహేడేళ్ళ కుర్రాడు. కాలేజీకి అప్లికేషన్లు పెట్టుకునే వయసు. కానీ చదువులో శ్రద్ధ పెట్టడు. తాగుతాడు, జల్సాలు చేసుకుంటాడు. అందరితో తియ్యగా మాట్లాడతాడు. అతనికి క్యాసిడీ అని ఒక ప్రేయసి. అతను ఆమెతో అన్ని సరదాలు తీర్చుకుంటాడు. ఆమె కూడా అతనితో జల్సా చేస్తుంది. అయితే ఆమె అతనితో ఉంటే ముందు ముందు భరోసా ఉండదని అతన్ని వదిలేస్తుంది. అతనికి ఏమీ అనే అమ్మాయి పరిచయమవుతుంది. అతనితో పాటే చదువుతుంది. ఆమెకి అతను తెలుసు, కానీ అతనికి ఆమె తెలియదు. “నేను నీకు తెలియదులే” అని ఆమే అంటుంది. తలవంచుకుని తమ పని తాము చేసుకుపోయే అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరికీ నచ్చరు. వాళ్ళలో వాళ్ళకి కూడా! ఏమీ పొద్దున్నే లేచి చిన్న ట్రక్‌లో పేపర్లు వేయటానికి వెళుతుంది. అది ఆమె అమ్మ ఒప్పుకున్న పని. కానీ ఆమె రాత్రిళ్ళు పార్టీలకి వెళుతుంది. పొద్దున్నే పేపర్లు వేయాలంటే నిద్ర లేవాలిగా! అదీ ఇంటికొస్తే!! అందుకని ఏమీ తానే పేపర్లు వేస్తుంది. ఏమీని తనకు ట్యూషన్ చెప్పమంటాడు సటర్. ఆమె ఒప్పుకుంటుంది. సటర్ లాంటివాడు తనతో మాట్లాడితే ఆమెకి అదో థ్రిల్. ఏమీ స్నేహితురాలికి, సటర్ స్నేహితుడికి వారి వ్యవహారం నచ్చదు. సటర్ని నమ్మవద్దని ఏమీ స్నేహితురాలు అంటుంది. ఏమీని వాడుకోవద్దని సటర్ స్నేహితుడు అంటాడు. వారి మాట ఇద్దరూ వినరు. వయసు అలాంటిది.
ఏమీకి ఫిలడెల్ఫియాలో ఒక కాలేజీలో సీటొస్తుంది. “మా అమ్మ ఒప్పుకోదు. నేను వెళ్ళను” అంటుంది ఏమీ. ఆమె తల్లికి సాయం కావాలి. ఏమీకి ఒక తమ్ముడున్నాడు. అతన్ని చూసుకోవాలంటే ఏమీ ఉండాలి. ఏమీకి ఒక అక్క కూడా ఉంది. ఆమె ఫిలడెల్ఫియాలోనే చదువుకుంటోంది. సటర్ “నువ్వు కాలేజీకి వెళ్ళాలి. మీ అమ్మకి ‘నా బతుకు నన్ను బతకనీ’ అని చెప్పి వెళ్ళిపో” అంటాడు. సటర్ తన కుటుంబం గురించి చెబుతూ తండ్రి పైలట్ అని, తన తల్లి అతన్ని వెళ్ళగొట్టిందనీ అంటాడు. “మా నాన్న మా అమ్మతో ఎలా కాపురం చేశాడో” అంటాడు. అతని తల్లి హాస్పిటల్లో నర్సుగా పని చేస్తుంది. ఒక్కోసారి రెండు షిఫ్టులు కూడా పని చేస్తుంది. చెప్పిన పని చేయకపోతే అతన్ని గట్టిగా మందలిస్తుంది. అతను స్కూలు అయిపోయాక ఒక బట్టల షాపులో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అక్కడి మ్యానేజర్ డ్యాన్‌తో తన కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటాడు. తండ్రి లేని లోటు ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటాడు.
సటర్ ఏమీకి మద్యం రుచి చూపిస్తాడు. ఆమెకి మొదట్లో ఆ రుచి నచ్చదు కానీ మెల్లగా అలవాటు చేసుకుంటుంది. ఒకరోజు తాగిన మైకంలో సటర్ ఏమీని ముద్దు పెట్టుకుంటాడు. స్కూల్ ప్రామ్ (జంటలుగా వెళ్ళే స్కూల్ పార్టీ) కి ఆమెని తనతో రమ్మంటాడు. మైకం దిగాక అతనికి తప్పు చేశానా అనిపిస్తుంది. ఏమీకి, తనకి పొసగదని అనుకుంటాడు. క్యాసిడీని మళ్ళీ తన వైపుకి తిప్పుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆమె ఇంటికి వెళ్తాడు. తాగి ఉంటాడు. మొదట బాగానే మాట్లాడుతుంది కానీ చివరికి “నీతో భవిష్యత్తు లేదు” అంటుందామె. క్యాసిడీ కొత్త బాయ్ ఫ్రెండ్.. సటర్ పని చేసే షాపుకి వచ్చి అతనితో గొడవపడతాడు. ఈ బాయ్ ఫ్రెండ్ బాగా చదువుతాడు, ఫుట్‌బాల్ ఆడతాడు. “ఆమె నీ గురించి తలచుకుంటూ ఉంటుంది. నీతో ఉన్నంత సరదాగా నాతో ఉండదు” అంటాడా బాయ్ ఫ్రెండ్. “నీకేం తక్కువ? కాకపోతే కాస్త పట్టూ విడుపూ ఉండాలంతే” అంటాడు సటర్. అతను స్థిమితపడి “నువ్వు అందరూ అనుకున్నంత జోకర్‌వి కాదు” అంటాడు. తనని అందరూ జోకర్ అనుకుంటారని అప్పుడే తెలుస్తుంది సటర్కి. ఏమీని తప్పించుకు తిరుగుతూ ఉంటాడు. కానీ ఆలోచిస్తే ఏమీ తన జీవితంలో ఉండటం మంచిదే అని అనిపిస్తుంది. ఆమెని మళ్ళీ కలుసుకుంటాడు.
సటర్ అక్క ఒక లాయర్ని పెళ్ళి చేసుకుంది. ఒకరోజు ఆమె ఇంటికి భోజనానికి వెళతాడు సటర్. ఏమీని తీసుకుని వెళతాడు. వేరే అతిథులు కూడా ఉంటారు. సటర్ అక్క కాస్త భేషజంగా ఉంటుంది. తాను తన భర్తతో ఎంత సంతోషంగా ఉందో అతిథులకి చెబుతుంది. సటర్ వ్యంగ్యంగా “ఈ రోజుల్లో మీలాంటి జంటలు తక్కువ. అందరూ విడాకులు తీసుకుంటున్నారు. మన అమ్మా నాన్న, ఏమీ వాళ్ళ అమ్మా నాన్న, నా స్నేహితుల అమ్మా నాన్నలు అందరూ విడాకులు తీసున్నారు” అంటాడు. “మా అమ్మా నాన్న విడాకులు తీసుకోలేదు. మా నాన్న చనిపోయాడు” అంటుంది ఏమీ. అందరూ సానుభూతి చూపిస్తారు. ఏమీ “అన్ని వివాహాలు విడాకులు దాకా వెళ్ళవు. నేను పెళ్ళి చేసుకుంటే విడాకులు కాకుండా చూసుకుంటాను. నేను అంతరిక్ష పరిశోధన చేస్తాను. నా భర్త వేరే పని చేసుకుంటాడు. ఇద్దరికీ ఇష్టమైనవి కొన్ని ఉంటాయి. అలాగే ఇద్దరికీ ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి. ఒకరినొకరు గౌరవించుకుంటాం” అంటుంది. ఆ మాట విని సటర్ ఆమెని ఆరాధనగా చూస్తాడు. భర్త మీద గౌరవం చూపిస్తానని ఆమె అనటం అతనికి నచ్చుతుంది. తాను ఆమెని పెళ్ళి చేసుకుంటే ఆమెని గౌరవిస్తానని మనసులో అనుకుంటాడు. తన స్నేహితుడితో “ఆమె నాకు నచ్చిందంటే నమ్ముతావా? అయినా ఆమె ఎలాగూ నన్ను వదిలేస్తుందిలే” అంటాడు. తన మీద తనకి నమ్మకం లేదు. ఆమెని మాత్రం నమ్ముతాడు. “నీకో నిజం చెప్పాలి. మా నాన్న పైలట్ కాదు. ఆయన్ని చూసి పదేళ్ళయింది. బెంగతో ఏవేవో చెబుతూ ఉంటాను. ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు” అంటాడు. విడాకులు తీసుకున్న ఇళ్ళలో కొందరు పిల్లలు ఇలాగే ఉంటారు. సటర్ తల్లి మీద కోపంతో తండ్రి గురించి గొప్పగా ఊహించుకుంటాడు. “మా అమ్మ నన్ను మా నాన్నకి దూరంగా ఉంచింది” అంటాడు. “ఇది అన్యాయం. ఆమెకి మీ నాన్నని నీకు దూరం చేసే హక్కు లేదు. ఓ పని చేద్దాం. నువ్వు మీ అమ్మ మీద తిరగబడు. నేను మా అమ్మ మీద తిరగబడతా” అంటుంది ఏమీ. కానీ అనుకున్నంత తేలిక కాదు. ఇద్దరూ సరైన సమయం కోసం చూస్తూ ఉంటారు.
ప్రామ్‌కి ఇద్దరూ కలిసి వెళతారు. ఇద్దరూ తాగుతారు. ఆనందంగా గడుపుతారు. తర్వాత ఏమీ “మా అక్క ఫిలడెల్ఫియాలో ఒక పుస్తకాల షాపులో నాకు చిన్న ఉద్యోగం చూస్తానంది. ఆ డబ్బుతో కాలేజీ ఫీజు కట్టొచ్చు. నువ్వు కూడా నాతో రా. జూనియర్ కాలేజీలో చేరొచ్చు. ఇద్దరం చిన్న ఉద్యోగాలు చేసుకోవచ్చు. తక్కువ అద్దెకి ఇల్లు కూడా దొరుకుతుంది” అంటుంది. సరే అంటాడు సటర్. తర్వాత ఒకరోజు ఏమీ తన తల్లితో మాట్లాడానని చెబుతుంది. ఆమె మొదట్లో ‘నన్ను వదిలి పోతావా?’ అంటుంది కానీ ఏమీ దృఢంగా ఉంటుంది. సటర్ని కూడా అతని తల్లితో మాట్లాడమంటుంది. అతను తటపటాయిస్తాడు. అది వేరు, ఇది వేరు అంటాడు. చివరికి తల్లితో మాట్లాడాలనే నిశ్చయించుకుంటాడు.
మామూలుగా సినిమాల్లో మాజీ ప్రేయసి అంటే ఒక చిన్న సైజు రాక్షసిలా చూపిస్తారు. కానీ ఈ చిత్రంలో క్యాసిడీ పాత్రని వాస్తవికంగా చూపించారు. సటర్ తాగుడు చూసి ఆమె భయపడుతుంది. ముందు ముందు జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తుంది. ఇది సరైన ఆలోచన. ఆమెని తప్పు పట్టటానికి లేదు. అమెరికాలో 21 ఏళ్ళు వస్తే కానీ తాగకూడదు. కానీ కొందరు కుర్రాళ్ళు ఎలాగోలా మద్యం సంపాదించి తాగుతారు. విషాదమేమిటంటే సటర్ తండ్రి అతనికి ఆరేళ్ళ వయసప్పుడే బీరు రుచి చూపించాడు. దాంతో అతనికి తాగుడు తప్పు కాదనే భావన కలిగింది. ఇంకో వింత ఏమిటంటే ఏమీ అతని తాగుడుకి అడ్డు చెప్పదు. పైగా ఆమె కూడా తాగుతుంది. ఆమెకి అతనితో ఉండాలనే కోరిక అతనితో కలిసి తాగటానికి ప్రేరేపించిందా? ఏమీ తండ్రి పెయిన్ కిల్లర్ మందులకి బానిస అయి ఒవర్ డోసుతో మరణించాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమెకి తాగుడు మంచిది కాదని తెలియదా? నిజానికి ఈ చిత్రానికి ఆధారమైన నవలలో ఏమీ తాగుడుకి బాగా అలవాటు పడటంతో ఇబ్బందుల్లో పడుతుంది. నవలలో ఆమెకి ఒక సవతి తండ్రి కూడా ఉంటాడు. సినిమాలో సవతి తండ్రి లేడు. అందుకే దర్శకుడు ఏమీ తాగుడుకి అంత ప్రాధాన్యం ఇవ్వలేదని అనిపిస్తుంది. ఏది ఏమైనా అమెరికాలో మద్యం, తుపాకులు తేలిగ్గా దొరకటం అక్కడి సంస్కృతిపై ప్రభావం చూపింది. ఈ చిత్రంలో ముఖ్యమైన అంశం సటర్ తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకున్నాడని. ఈ క్రమంలో ఏమీకి తన జీవితం తాను జీవించే ధైర్యం ఎలా ఇచ్చాడని. తన జీవితం సరిగ్గా చూసుకోలేనివాడు ఆమె జీవితాన్ని గాడిన పెట్టగలడా? ఏమీకి కలలైతే ఉన్నాయి కానీ వాటిని ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. సటర్ ఆమెకి నిబ్బరం నేర్పుతాడు. అతను జల్సాలతోనే బతుకు గడిపేద్దామని అనుకుంటాడు. కానీ అదొక బూటకం. జీవితం ఎలా ఉంటుందో తెలియని భయం. తన తండ్రి లాగే తన జీవితం కూడా గాడి తప్పుతుందని భయం. ఆ భయాన్ని అతను ఎలా దాటాడనేది మిగతా కథ.
టిమ్ షార్ప్ రాసిన నవల ఆధారంగా స్కాట్ న్యూస్టాడర్, మైకెల్ వెబర్ స్క్రీన్ ప్లే రాశారు. జేమ్స్ పోన్సోల్ట్ దర్శకత్వం వహించాడు. సటర్ గా మైల్స్ టెలర్, ఏమీగా షైలీన్ వుడ్లీ, క్యాసిడీగా బ్రీ లార్సన్ నటించారు. మైల్స్, షైలీన్ నటనకి ఎన్నో ప్రశంసలు దక్కాయి. బ్రీ 2016లో ‘రూమ్’ చిత్రానికి ఉత్తమ నటి ఆస్కార్ గెలుచుకుంది. సటర్ తండ్రిగా కైల్ చాండ్లర్ చిన్న పాత్రలో కనిపిస్తాడు.
ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.
సటర్ తన తల్లిని తండ్రి ఫోన్ నంబర్ ఇవ్వమని అడుగుతాడు. ఆమె ఇవ్వనంటుంది. అతను అక్క దగ్గరకి వెళతాడు. “అమ్మా నాన్నల మధ్య ఏం జరిగిందో తెలుసా?” అని అడుగుతాడు. “నాన్న వేరే ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు” అంటుందామె. “అమ్మ అలా చెబుతోంది. ఏ వివాదమైనా రెండు కోణాలు ఉంటాయి కదా. నేను నాన్నతో మాట్లాడాలి. అమ్మనడిగి నాన్న నంబరు తీసుకో” అంటాడతను. ఆమె కాసేపు మౌనంగా ఉండి “నాన్న నంబరు నా దగ్గర ఉంది” అని నంబరు ఇస్తుంది. సటర్ మొదట ఆశ్చర్యపడినా నంబరు దొరికినందుకు సంతోషపడతాడు. తండ్రికి ఫోన్ చేస్తాడు. అతని పేరు టామీ. “చిన్నప్పుడు బేస్ బాల్ భలే విసిరేవాడివి. ఇంకా బేస్ బాల్ ఆడుతున్నావా?” అంటాడతను. సటర్ సంబరపడతాడు. టామీ సటర్ని తనని కలుసుకోవటానికి రమ్మంటాడు. కారులో మూడు గంటల ప్రయాణం. సటర్ ఏమీని తీసుకుని వెళతాడు. టామీ వాళ్ళిద్దరినీ ఒక రెస్టారెంట్‌కి తీసుకువెళతాడు. అక్కడ అతని స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితురాలు కూడా ఉంటుంది. వీళ్ళు వారికి కాస్త దూరంగా కూర్చుంటారు. టామీ బీరు తెప్పించి సటర్కి, ఏమీకి ఇస్తాడు కానీ అతని దృష్టంతా ఆ స్నేహితురాలి మీద ఉంటుంది. మాట్లాడుతున్నంత సేపు మధ్య మధ్యలో ఆమె వంక చూస్తూ ఉంటాడు. ఫ్లోరిడాలో తాను చూసిన అద్భుతమైన సూర్యాస్తమయాల గురించి చెబుతాడు. “అక్కడ నుంచి ఎందుకు వచ్చేశావు?” అని అడుగుతాడు సటర్. “డబ్బులు అయిపోయాయి మరి” అంటాడు టామీ. జ్యూక్ బాక్స్‌లో ఒక పాట పెడతాడు సటర్. “మీ అమ్మకి ఇలాంటి పాటలంటే ఇష్టం” అంటాడు టామీ. “అమ్మకి సరదాలు కూడా ఉన్నాయా?” అంటాడు సటర్. “మీ అమ్మ గురించి అలా మాట్లాడకు. మొదట్లో ఆమె చాలా సరదాగా ఉండేది” అంటాడు టామీ. “ఆమె నిన్ను వెళ్ళగొట్టకుండా ఉండాల్సింది” అంటాడు సటర్. “ఆమె వెళ్ళగొట్టలేదు. నేనే వచ్చేశాను. నాకు ఈ పెళ్ళీ బాదరబందీ నచ్చదు. నేను ఈ క్షణంలో ఆనందంగా ఉండాలంతే” అంటాడు టామీ. సటర్ అవాక్కయి ఉండిపోతాడు. ఇంతలో టామీ “బీరుకి డబ్బులిచ్చెయ్. నేను ఆమెని ఇంటి దగ్గర దింపివస్తాను. ఒక గంట తర్వాత మా ఇంటికి రా” అని స్నేహితురాలితో వెళ్ళిపోతాడు. అతను ఆ స్నేహితురాలితో శృంగారం కోసం ఎన్నో ఏళ్ళకి కలిసిన కొడుకుని వదిలి వెళ్ళిపోతాడు. పైగా బీరుకి డబ్బులు కూడా ఇచ్చెయ్యమంటాడు. అంత ధూర్తుడు. సటర్ టామీ ఇంటి దగ్గర చీకటి పడే దాకా వేచి ఉంటాడు. అతను ఎంతకీ రాకపోయేసరికి తిరిగి రెస్టారెంట్‌కి వస్తాడు. కిటికీలో నుంచి టామీ అతని స్నేహితులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండటం కనిపిస్తుంది. సటర్ హతాశుడవుతాడు.
సటర్ అక్కకి తండ్రి సంగతి తెలుసు. ఫోన్ నంబర్ తీసుకుని సటర్ వెళ్ళిపోయాక ఆమె భావోద్వేగానికి గురవుతుంది. అది చూసి ప్రేక్షకులు అయోమయంలో పడతారు. సటర్ అక్కకి భేషజం ఎక్కువ కాబట్టి ఆమెని ఉద్వేగాన్ని నమ్మబుద్ధి కాదు. కానీ పిల్లలు ఎలాంటి వారైనా తలిదండ్రుల ప్రేమ ఒకేలా ఉంటుంది. ఉండాలి. ఆ ప్రేమ తండ్రి నుంచి దక్కక ఆమె నిజంగా బాధ పడింది. ఆమె కూడా తండ్రిని కలిసే ఉంటుంది. తండ్రి ఎంత పనికిమాలిన వాడో చూసే ఉంటుంది. మరి సటర్ని ఎందుకు ఆపలేదు? అతను చెబితే వినే స్థితిలో లేడు. కానీ ఆమె అతన్ని హెచ్చరించి ఉండాల్సింది. అదే అమెరికా సంస్కృతిలో ఉన్న తేడా. ఎవరి బతుకు వారిదే, ఎవరి నిర్ణయాలు వారే తీసుకోవాలి. ఈ సినిమా మళ్ళీ చూస్తే సటర్ అక్క తండ్రి మిగిల్చిన నిరాశతో ఎంత క్షోభపడిందో కదా అనిపిస్తుంది.
టామీ సటర్ని బీరుకి డబ్బులివ్వమన్నప్పుడు అతను ఏమీని కొంచెం డబ్బు అడుగుతాడు. ఇది చూసి ప్రేక్షకుల మనసు మెలివేసినట్టుంటుంది. స్కూల్లో చదువుకునే పిల్లలకి తాను డబ్బులివ్వాల్సింది పోయి టామీ వారిని డబ్బులిమ్మంటాడు. అంత దిగజారిపోయాడు. డబ్బున్నంత వరకు జల్సా చేశాడు. డబ్బు అయిపోయాక ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ స్నేహితులతో తాగుతూ, అవునన్న స్త్రీలతో తిరుగుతూ కాలం వెళ్ళదీస్తున్నాడు. సటర్ తల్లికి అతని గురించి తెలుసు. అందుకే సటర్ని అతనికి దూరంగా ఉంచింది. కుటుంబమంటే విలువ లేనివాడితో సత్సంబంధాలు కుదరవు. చివరకి నిరాశే మిగులుతుంది. ఆ నిరాశ సటర్కి కలగకూడదని ఆశించింది. కానీ ఆమె భయపడిందే జరిగింది. సటర్కి తల్లి మీద కోపం. ఆమె ఏదో కక్షతో తండ్రిని తనకి దూరం చేసిందని అనుకుంటాడు. టీనేజర్లలో ఉండే పోకడే ఇది. తలిదండ్రులు తమ మంచి కోసమే చెబుతున్నారని గుర్తించరు. అదే విషాదం.
ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.
సటర్, ఏమీ తిరిగి బయల్దేరుతారు. సటర్ తండ్రి మీద కోపంగా ఉంటాడు. ఏమీ ‘నీకు నేనున్నాను’ అనే భావంతో “ఐ లవ్యూ” అంటుంది. సటర్ “నన్నెందుకు ప్రేమిస్తున్నావు? నేను పనికిమాలిన వాణ్ణి. బయటిపో” అని కారు ఆపుతాడు. ఏమీ ఏడుస్తూ కారు దిగుతుంది. అటుగా వచ్చిన కారు ఆమెని గుద్దుతుంది. సటర్ ఆమెని హాస్పిటల్లో చేర్పిస్తాడు. ఆమె చేతికి ఫ్రాక్చర్ అవుతుంది. ఆమె ఇంటికి వచ్చాక సటర్ ఆమెని కలవటానికి వెళతాడు. ఆమె నవ్వుతూ పలకరిస్తుంది. “నువ్వే నాకు ముఖ్యం” అంటుంది. ఒకరోజు సటర్ పని చేసే బట్టల షాపులో మేనేజర్ అతన్ని పిలిచి “వ్యాపారం బాగా లేదు. ఎవరో ఒకరిని తీసేయాలి. నువ్వు కస్టమర్లతో బాగా మాట్లాడతావు. నిన్ను తీయను. అయితే నువ్వు తాగి పనికి రాకూడదు. అలాగని మాట ఇస్తావా?” అంటాడు. “ఆ మాట ఇవ్వలేను” అంటాడు సటర్. “అయితే నిన్ను తీసేయక తప్పదు. నేనే మీ నాన్ననైతే ఇక్కడో లెక్చర్ ఇచ్చి ఉండేవాడిని” అంటాడు మేనేజర్. “మీరే మా నాన్నయితే లెక్చర్ ఇవ్వాల్సిన అవసరమే వచ్చేది కాదు” అంటాడు సటర్. తండ్రి లేకపోవటం వల్లే తానిలా అయ్యానని అతని భావన.
ఏమీ కోలుకుని కాలేజీకి వెళ్ళటానికి ప్రయాణమవుతుంది. సటర్ తనతో వస్తాడని అనుకుంటుంది. బస్ స్టేషన్లో అతని కోసం వేచి ఉంటుంది. సటర్ బస్ స్టేషన్ కి వెళతాడు కానీ ఆమెని దూరం నుంచి చూసి వచ్చేస్తాడు. ఆమె నిరాశగా బయల్దేరుతుంది. సటర్ ఆమె మంచి కోసమే ఆమెని వదిలేశానని బార్లో ఒకతనితో అంటాడు. ఇంటికి వచ్చాక తల్లితో గొడవపడతాడు. “నేను నాన్న లాంటి వాడినే. నన్నెవరూ ప్రేమించరు” అని ఏడుస్తాడు. “నువ్వు మీ నాన్న లాంటి వాడివి కాదు. అతను తనని తాను తప్ప ఎవరినీ ప్రేమించలేదు. నువ్వు అందరినీ ప్రేమిస్తావు. చిన్నప్పుడు నీ స్నేహితుడికి దెబ్బ తగిలితే అతని సంచీ మోశావు. నీ స్నేహితురాలి తల్లి మరణిస్తే ఆ అమ్మాయి మనింటికి వచ్చి ఉండొచ్చా అని అడిగావు. నువ్వు అందరినీ ప్రేమించే మనిషివి” అని అతన్ని కౌగిలించుకుంటుంది. సటర్ విలపిస్తాడు.
కాలేజీ అప్లికేషన్ ‘మీకు ఎదురైన ఏదైనా అవరోధం గురించి చెప్పండి. అది మిమ్మల్ని భవిష్యత్తుని ఎదుర్కోవటానికి ఎలా సన్నద్ధులని చేసిందో చెప్పండి’ అని ఒక ప్రశ్న ఉంటుంది. సమయం దాటిపోయినా సటర్ అప్లికేషన్ పంపిస్తాడు. “నాకెదురైన అవరోధం నేనే. ఈ క్షణంలో జీవించాలి అని అనుకునేవాడిని. నిజానికి నాకు రేపటి గురించి భయం. ఆ భయానికి ముసుగు వేశాను. ఈ క్షణంలో జీవించటం మంచిదే. కానీ అలాంటి క్షణాలు రేపు కూడా ఉంటాయి. వాటి కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఈ అప్లికేషన్ పంపటానికి సమయం దాటిపోయిందని తెలుసు. కానీ నేను సకాలంలోనే మేలుకున్నాను” అని రాస్తాడు. తర్వాత అతను ఏమీని కలుసుకోవాటానికి వెళతాడు. ఆమె అతన్ని చూసి సంకోచంగా చిరునవ్వు నవ్వుతుంది. ఇక్కడితో చిత్రం ముగుస్తుంది.
సటర్ అందరినీ ప్రేమిస్తాడనేది నిజం. ఎవరు అతనికి నచ్చని పని చేసినా, నచ్చని మాట చెప్పినా అతను నొచ్చుకోడు. క్యాసిడీ వెళ్ళిపోతే బాధపడ్డాడు కానీ ఆమెని ఏమీ అనలేదు. క్యాసిడీ బాయ్ ఫ్రెండ్ గొడవపడటానికి వస్తే అతనిని సముదాయించి పంపించాడు. ఏమీ స్నేహితురాలు తనని తిడితే దులిపేసుకున్నాడు. అతని మనసు మంచిది. ఏమీకి ధైర్యం నూరిపోశాడు. లేకపోతే ఆమె తన తల్లి బాధ్యతారాహిత్యాన్ని భరిస్తూ అక్కడే ఉండిపోయేది. అతని కారణంగా ఆమె కాలేజీకి వెళ్ళింది. అతను మాత్రం రేపు ఎలా ఉంటుందని భయపడ్డాడు. ఆ భయాన్ని తల్లి పోగొట్టింది. ఏ తల్లి మీదైతే అతను కోపం పెంచుకున్నాడో ఆమే అతనికి అందరికంటే శ్రేయోభిలాషి అని తెలుసుకున్నాడు. కొన్నిసార్లు విడాకులు తప్పనిసరి అవుతాయి. టామీ లాంటి మనిషితో ఏ స్త్రీ అయినా ఎలా కాపురం చేస్తుంది? విషాదమేమిటంటే విడాకుల ప్రభావం పిల్లల మీద పడుతుంది. సటర్ తల్లి అతన్ని బాధ్యతగా చూసుకుంది. కాకపోతే అతని తాగుడుని గమనించలేదు. అతనికి తండ్రి గురించి చెప్పాలని ఆలోచించలేదు. ఆమె అహంకారం అడ్డు వచ్చి ఉండొచ్చు. ఒక్కతే ఇద్దరు పిల్లల్ని పెంచింది. కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు. కానీ అలాంటి తల్లిని ఎదిగాక పిల్లలు అర్థం చేసుకుంటారు. టామీ లాంటి మనిషికి ఒంటరితనమే మిగులుతుంది.
సటర్ చివర్లో కూడా క్యాసిడీకి మళ్ళీ దగ్గరవ్వాలని చూస్తాడు. ఆమె సున్నితంగా తిరస్కరిస్తుంది. “నువ్వు నాకు అందరికంటే ఇష్టమైన మాజీ ప్రేమికుడిగా ఎప్పటికీ ఉండిపోతావు” అని మాత్రం అంటుంది. అనేక మంది ప్రేమికులు ఉండటం (వేరు వేరు సమయాల్లో), నచ్చినవాడిని పెళ్ళి చేసుకోవటం అమెరికాలో మామూలే. ఇంత జల్లెడ పట్టినా విడాకులు ఎక్కువగానే ఉంటున్నాయి. కారణం సర్దుకుపోయే స్వభావం లేకపోవటం. తల్లితో మాట్లాడిన తర్వాత సటర్లో మార్పు వస్తుంది. ఏమీని కలుసుకోవటానికి వెళతాడు. ఆమె అతన్ని తిరిగి స్వీకరిస్తుందా? అతను తనలో మనోస్థైర్యం నింపాడు కాబట్టి ఆమె అతన్ని స్వీకరించవచ్చు. కానీ అతనితో మొదట మాట్లాడుతుందని నాకు అనిపించింది. అతనికి స్థిరత్వం ఉందా లేదా అని పరీక్షిస్తుంది. చిన్న వయసులోనే ఇద్దరిలో పరిణతి వచ్చింది. ఐతే తమ ఇన్నోసెన్స్‌ని కోల్పోయారు. ఈ రోజుల్లో అదే మంచిదా? ఏమో!
మానవ సంబంధాలు హృద్యంగా ఆవిష్కరించిన సినిమా లాగా ఉంది. చూశాక నా వ్యాఖ్య రాస్తాను.
Thanks for introducing a good film.
ధన్యవాదాలండీ.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
కాజాల్లాంటి బాజాలు-120: నాకీ స్వతంత్రం వద్దు..
భక్తి పర్యటన గుంటూరు జిల్లా – 10: మా తెనాలి
మహాకవి నీరజ్ జీవితంలో ప్రేమ సంబంధాలు
హఠాత్తుగా!!
గతి తప్పిన సాంప్రదాయం
కత్తి లాంటి “ఛురి”
జవాబునారీ
నా కాశ్మీర్ యాత్రానుభవాలు
ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 19 – కోహినూర్
అలనాటి అపురూపాలు – 195
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®