Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-17

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[రమణమ్మ కాలేజీలో చేరుతుంది. టైలరింగ్ మానదు. రెండు నెలలకోసారి తప్పనిసరిగా రమణమ్మని తల్లిదండ్రులతో మాట్లాడిస్తాడు శరత్. రవళి తన కుట్టు మిషన్ ఇవ్వడంతో, రమణమ్మకి షాప్‌కి వెళ్ళి వచ్చే టైమ్ మిగులుతుంది. తన వీలైన సమయంలో మంచి మంచి డిజైన్లతో జాకెట్లు కుడుతూంటుంది. ఆర్డర్స్ బాగా వచ్చేవి. ఓ రోజున రమణమ్మని తన తల్లిదండ్రులకి పరిచయం చేస్తాడు మురళి. ఆమె తల్లిదండ్రులు దూరంగా పల్లెలో ఉంటారని, అందువల్ల అకేషన్స్‌కి తమ ఇంటికి  వస్తూంటుందని చెప్తాడు. తల్లి కాంతమ్మ అభ్యంతరం చెప్పినా, పట్టించుకోడు. రమణమ్మ మురళి తల్లిదండ్రులు కనిపిస్తే నమస్కరించి తప్పుకునేది. వీణ, శృతులకు మంచి స్నేహితురాలవుతుంది రమణమ్మ. వీలున్నపుడు రాజేశ్వరి దగ్గరికి కూడా వెళ్లి వస్తుంటుంది. ఓ రోజు పైడితల్లి అమ్మవారి కోవెలకి వెళ్తే, పాత స్టూడెంట్ మహేశ్వరి చేతిలో బిడ్డతో కనబడుతుంది. ఆప్యాయంగా పలకరిస్తుంది రవళి. మహేశ్వరి తన గురించి చెబుతుంది. కొద్ది రోజుల తర్వాత ఓ రోజు సంధ్య స్కూలుకి వచ్చి రవళిని పలకరిస్తుంది. పదిహేనేళ్ళ లేత వయసు, తెచ్చిపెట్టుకున్న పెద్దరికంతో చీరలో కనబడిన సంధ్యని చూసి బాధపడుతుంది. అత్తవారింట తనను చదువుకోనివ్వడం లేదని చెప్తుంది సంధ్య. ఆమెకి తగ్గ సలహా ఇస్తుంది రవళి. ఇంతలో ఇంటికి చుట్టాలొచ్చారని కబరు రావడంతో సంధ్య వెళ్ళిపోతుంది. ఓ రోజు కాలేజీలో ఉపన్యాసం పోటీలు జరుగుతాయి. రమణమ్మ పాల్గొంటుంది. చక్కగా మాట్లాడేసరికి, ఇంటర్-కాలేజీ పోటీలకి పంపుతారు రమణమ్మని. ఆ పోటోలలో దీప కలుస్తుంది. ఇంతలో రవళి ఫోన్ చేసి, ఎలా మాట్లాడావని అడుగుతుంది. బాగా మాట్లాడననీ, తనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెబుతుంది రమణమ్మ. కాసేపు మాట్లాడుకుని నేస్తురాళ్ళిద్దరూ బయల్దేరుతారు. – ఇక చదవండి.]

సడెన్‌గా ఒకరోజు సంధ్య పేరెంట్స్ రవళిని కలవడానికి వచ్చారు. వాళ్ళ రాకకి కారణం ఊహించలేకపోయింది. వాళ్ళు రవళికి నమస్కరించి కూచున్నారు రవళి తండ్రి “మేడమ్! మీరు మాకొక ఉపకారం చెయ్యాలి.” అన్నాడు కాస్త గొణుగుతూ.

“నేనేం చెయ్యగలనండీ? చెయ్యవలసిన మహోపకారమేదో మా టీచర్స్‌కి మీరు సంధ్యకి పెళ్ళి కానిచ్చి చేసేసారు. ఇంక మన మధ్య ఏముంది? నేను చేయగలిగేది ఏముంది?” ఎంత ఆపుకుందామన్నా ఆగని కోపం రవళి గొంతులో కరకరలాడింది.

రవళి జవాబుకి వాళ్ళ మొహాలు నల్లబడ్డాయి. కానీ మెల్లగా కూడదీసుకుని వాళ్ళమ్మ “మేడమ్! జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగబోయేది మీరు చక్కబెడితే మాకు సహాయం చేసిన వారవుతారు. సంధ్య ఇంటికి వచ్చింది. కానీ అత్తవారింటికి పోను అంటుంది. ఏడాది కాలేదు. పెళ్ళయాక అలా అంటే ఎలాగమ్మా! ఎలా అన్నా మీరు నచ్చచెప్పి దాన్ని దారిన బెట్టాల. మీ మాటంటే దానికి చాలా గురి.” అంది.

తన చిన్ననాటి నేస్తం సత్యకి పెళ్ళే వద్దు అని తాము చెప్తే ఆ పెళ్ళి ఆపలేదు సరికదా, ఆ పెళ్ళికి తండ్రి దగ్గరనుంచి ధన సహాయం తీసుకున్న అప్పలస్వామి జ్ఞాపకం వచ్చాడు రవళికి. వీళ్ళు పనికిమాలిన సంబంధం తెచ్చి పెళ్ళి చేస్తే, సంధ్యని కాపురానికి తను మోటివేట్ చెయ్యాలా?

రవళి మొహంలో భావాలు చదివినట్లు ఆవిడ చాలా జాలిగా.. “మేడమ్! మీరు కోపం తెచ్చుకోకుండా మాకు సహాయం చెయ్యండి” అంది. రవళికీ బాధ కలిగింది. సంధ్య జీవితం ఎఫెక్ట్ చేసేది పస్ట్ వాళ్ళనే కదా!

“అసలు ఎందుకు వెళ్ళనంటోందో కారణం కనుక్కున్నారా?” అంది సాలోచనగా.

“ఎంత అడిగినా ఏదీ చెప్పదమ్మా! ముంగిలా నోరు తెరవదు. మీకయితే ఏమన్నా చెప్తుందేమోనని” అంది.

“సరే రేపు సాయంత్రం లాస్ట్ పీరియడ్ నాకు లీజర్ ఉంది, పంపండి” అంది.

మర్నాడు సంధ్య వచ్చింది. నల్లగా కంపలా అయిపోయిన సంధ్యని చూసి ఆశ్చర్యపోయింది. “ఏమిటి సంధ్యా! ఇలా అయిపోయావు? ఏమయింది?” అంది బాధతో కూడిన ఆశ్చర్యంతో.

“బాగా ఉండడానికి ఒక్కటి కూడా కారణం లేదు మేడమ్. ఇలా అయిపోడానికి లెక్కపెట్టలేనన్ని రీజన్స్ ఉన్నాయి అంది.” నిస్తేజంగా.

“అసలేమయింది చెప్పమ్మా! చెప్తే అమ్మ వాళ్ళు ఏదన్నా పరిష్కారం ఆలోచిస్తారు కదా!” అంది రవళి ఎంతో సున్నితంగా సంధ్య చేతిని తన చేతితో పట్టుకుంటూ.

“ఏం చేస్తారండీ? ఏమీ చేయరు. కాపురానికి పంపి వాళ్ళ పరువు నిలబెట్టుకోవడం తప్ప. వాళ్ళకి చెప్పినా ప్రయోజనం లేదండీ. అందుకే చెప్పను. ఎవరికీ చెప్పినా లాభం లేదు. ఆర్చేవాళ్ళు, తీర్చేవాళ్ళు ఎవరూ లేరు. అంతెందుకు మీరేమయినా చేస్తారా? చేయగలరా? నన్ను ఆ పాడు జీవితం నుంచి తప్పించి మళ్ళీ చదివిస్తారా?” ఎంతో దూకుడుగా అడిగింది సంధ్య.

షాక్ కొట్టినట్లయింది రవళికి. అనుకోకుండానే రవళి చేతుల్లోంచి సంధ్య చేయి జారిపోయింది. తను సంధ్యకి బాధ్యత పడడమా? పడగలదా?

ఒక్కసారిగా దూసుకొచ్చిన కళ్ళనీళ్ళతో నవ్వింది సంధ్య. “చూసారా? ఆ మాట అనగానే మీరు కూడా నా చెయ్యి వదిలేసారు. ఇలాగే ఉంటుంది. అందుకే నేను ఏమీ, ఎవరికీ చెప్పను.” అంది .

రెండు నిమిషాల లోనే తనని తాను తమాయించుకుంది రవళి. నెమ్మదిగా “ఆ అధికారం, ఆ అవకాశం నాకు లేవు సంధ్యా! ఉండి ఉంటే అసలు ఆ రోజు నీకు పెళ్ళి జరగకుండానే ఆపి తీసికెళ్ళిపోయేదాన్ని. నిన్నే కాదు, చదువుకుంటామని దేవులాడే ఏ అమ్మాయిని ఈ బాల్య వివాహానికి బలి కాకుండా చేసేదాన్ని. కానీ.. కానీ.. నా స్వాతంత్ర్యానికి, నా ఆర్థిక పరిస్థితులకి, నా అన్ని శక్తులకీ పరిధులున్నాయి సంధ్యా! అందుకే నేను నిస్సహాయురాలని. ఏమీ అనుకోకు. నిజమే! నువ్వు ఆశించిన కోణంలో నీ సమస్య తీర్చలేనపుడు నిన్ను ప్రశ్నించకూడదు. అది వదిలేసి ఇంకేమైనా మాట్లాడుకుందాం.” రవళి సంధ్యకి కాదు, తనకి తాను చెప్పుకున్నట్లుగా ఉంది.

“వద్దు మేడమ్! మీరు అలాగ అనుకోకండి. వచ్చిన దగ్గరనుంచి అందరూ అడుగుతుంటే వినీ, వినీ ఆఖరికి మీ దగ్గర బరస్ట్ అయ్యాను. మీరేమీ చేయలేననుకోకండి మేడమ్! మంచి గైడెన్స్ ఇచ్చి, సరైన దారి చూపించి బాగు చేయగలరు. మీరు నన్ను వదిలేయకండి మేడమ్!” సంధ్య వెంటనే వెక్కి, వెక్కిఏడవడం ప్రారంభించింది.

“లేదులే ఊరుకో. మా తల్లివి కదా!” రవళి సంధ్యకి మంచి నీళ్ళిచ్చి ఉక్కిరిబిక్కిరి అవుతుంటే వెన్ను మీద వ్రాసి, తల మీద తట్టి ఊరుకో బెట్టింది.

“ఆ ఇల్లు నా పాలిట జైలు. ఆ కాపురం నరకం. నేను వెళ్ళను. ఒక పుస్తకం ఉండదు. పేపరు కూడా తెప్పించరు. ఏదీ చదవడానికి ఉండదు. పాత పేపరు ముక్క అయినా ఇంట్లోకి గాలికి వచ్చినా ప్రేమగా చదవాలనిపిస్తుంది. మళ్ళీ ఏడాది కాలేజ్‌లో జాయిన్ అవుతాను. అంతే. అదే నా నిర్ణయం. వద్దంటుంటే అబధ్ధాలు చెప్పి పెళ్ళి చేసారు కదా! మా అమ్మ వాళ్ళే అనుభవిస్తారు.” సంధ్య దృఢంగా చెప్పింది.

రవళికి సంధ్య మాట్లడడంలో ఏదో తేడా కనిపించింది. చదువు మీద ఉన్న ఇష్టం మానసికమైన బాధగా మారి తనని ఏ దిశకి నడిపిస్తోంది? ఒకసారి రోషంగా, కోపంగా మాట్లాడుతోంది. అంతలోకే పట్టలేనట్లు ఏడుస్తోంది. అసలు ఈ పిల్ల ఎలా తేరుతుంది? భగవంతుడా! కళ్ళలోంచి రెప్పలని తోసేసి వస్తున్న నీటిని ఆపడానికి చాలా శక్తిని ఉపయోగించింది.

నరనరాల వేదనలో, తరతరాల రోదనలో –

బక్క చిక్కి, బిక్కచచ్చి పడిన బతుకు గోడలు!

పాడు పడ్డ వాడలు, పూలులేని కాడలు!

మనసులో శ్రీశ్రీ గారి ‘నీడలు’ కదిలి మనసు ‘పేదవాడ’గా మారిపోయింది.

“అలాగే! సంధ్యా! ఏదో ఒకటి చేద్దాం. ఆలోచిద్దాం. నువ్వేమీ బాధపడకు. అమ్మ వాళ్ళతో నేను మాట్లాడతానులే.” పైకి సంధ్యకి ఊరటనిస్తూ మాట్లాడింది.

***

రమణమ్మ శరత్‌కి కూడా ఇలాగ ప్రైజు వచ్చిన సంగతి చెప్తూ ఆ రోజు వీలయితే వచ్చి తనది వినమని అడిగింది. శరత్ సంతోషించి ప్రయత్నిస్తానన్నాడు. అప్పుడే దీప విషయం వివరంగా చెప్పి ఆదివారం అక్కడికి వెళ్తానని పర్మిషన్ అడిగింది.

“అలాగే గానీ, ఆ అమ్మాయి రవళి స్టూడెంటే అయితే రవళితో ఆ మాట ఎందుకు చెప్పడం లేదు?” అర్థం కానట్టు అడిగాడు.

“మేడమ్‌కి తను ఏదో సాధించి ఆ గెలుపుతో కనిపించాలని కోరిక. అందుకే ఇప్పట్లో చెప్పలేను. అంతకంటే ఏమీ లేదు.” చెప్పింది రమణమ్మ.

“ఓ! అలాగా! సరే అయితే.. అలాగే వెళ్ళు కానీ వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు? అడ్రస్ పెట్టమ్మా! నువ్వు వెళ్ళే ప్లేస్ లతో నాకూ టచ్ ఉండాలి కదా!” అన్నాడు.

“అలాగే అంకుల్! ఇప్పుడే మీకు ఫార్వర్డ్ చేస్తాను. నమస్తే అండి. ఉంటాను.” అని ఫోన్ పెట్టేసింది. ‘అమ్మో! శరత్ అంకుల్ ఎంత తొందరగా ఆలోచించేస్తారో! ఎంత జాగ్రత్త పడతారో కదా!’ అనుకుంది.

కానీ శరత్ రెండు రోజుల్లో రవళిని కలిసి పాత స్కూల్ గురించి కేజువల్‌గా మాట్లాడుతున్నట్లే ఫేవరేట్ స్టూడెంట్స్ గురించి అడిగాడు. అతను ఎక్కువ ప్రశ్నించకుండానే రవళి దీప గురించి చెప్పింది.

“తనూ చదువుతోంది అని తెలిస్తే బావుండునన్నయ్యా!! కానీ అది జరగడం లేదు.” అంది నిరాశగా.

శరత్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు.

ఆ ఆదివారం రమణమ్మ దీప వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కలిసినందుకు స్నేహితురాళ్ళ ఆనందానికి హద్దు లేదు. మంగమ్మని “అత్తా! బావున్నావా? ఆ రోజు ఏమీ మాట్లాడలేక పోయాను.” అంది రమణమ్మ.

“ఏం పర్వాలేదు. మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండండి. మీకు ఇష్టమైనవి వండి పెడతాను.” నవ్వుతూ చెప్పింది మంగమ్మ.

రమణమ్మ శరత్ తీసుకున్న జాగ్రత్తలు నవ్వుతూ చెప్పింది. దీప సాలోచనగా “ఇక్కడ మాకు కూడా సోమశేఖర్ అంకుల్ కష్ట సమయంలో ఆదుకున్నారు” అని, సవితి అన్నదమ్ముడు తమని పెట్టిన ఇబ్బందులు, సోమశేఖర్ గారు ఎలా వాళ్ళ ఆటలు కట్టించింది అన్నీ చెప్పి “ఆ రోజు ఆ కారణంగానే కోట దగ్గర ఉన్నాం. కాబట్టే నిన్ను కలిసాం. అయినా మేడమ్ చెప్పినట్లు ఏది జరిగినా దానికో అర్థం ఉంటుందేమోనే! శరత్ గారికి కావాలంటే సోమశేఖర్ అంకుల్ నెంబరు నువ్వు ఇవ్వు. అప్పుడింక మన కలయికకు అడ్డంకి ఉండదు.” అంది దీప.

“ఈ ఆలోచన చాలా బావుందే. అలాగే ఆయనకి ఇస్తాను.” అంది రమణమ్మ.

కాసేపటిలో ఇద్దరూ వంటింటి లోకి వచ్చేసారు. “ఉన్న ముగ్గురమూ ఒకే దగ్గర కూచుందాం.” అంటూ. దీప అప్పుడు మళ్ళీ అడిగితే రమణమ్మ తాను దాటి వచ్చిన ప్రమాదాల గురించి ఆగుతూ, ఆగుతూ, నిర్లిప్తంగా, మెల్లగా చెప్పింది. మంగమ్మ వంట ఎప్పుడు ఆపేసిందో తెలియలేదు. దీప కూడా చలనం లేనట్లే ఉండిపోయింది. ఇద్దరూ నిశ్చేష్టులై ఉండిపోయారు.. ఇద్దరిలోనూ ముందు తేరుకున్నది మంగమ్మే! పొయ్యి దగ్గర నుంచి లేచి వచ్చి, రమణమ్మను హృదయానికి హత్తుకుని తల నిమురుతూ “ఇంత చిన్న వయసులో ఎంత బాధ పడ్డావే కూతురా! నీకు అంత మంచి దారి చూపించిన ఆ మేడమ్‌కి వేల నమస్కారాలు.” అంటుంటే ఆ కౌగిలి నర్సమ్మ కౌగిలిగా, ఆ మాటలు రాజయ్య మాటలుగా అనిపించి చాలా రోజుల తరువాత రమణమ్మ “అమ్మా! అమ్మా!” అంటూ తల్లిని తలుచుకుని ఏడ్చింది.

కొంచెం సేపు అయాక ఆ ఉధృతి తగ్గింది. “దీపా! మంచినీళ్ళు తే!” రమణమ్మ కళ్ళు తుడిచి మంగమ్మ చెప్పింది. “అత్తా! నువ్వు అలా దగ్గర తీసుకుంటే మన ఊర్లో అమ్మ దగ్గరే ఉన్నట్లుంది” అంది మంచి నీళ్ళు తాగి.

“ఇకపై ఎప్పడు కావాల్సినా ఇంటికి వస్తూ ఉండు. మీ ఇంట్లో ఉన్నట్లే ఉండు.” మంగమ్మ ఆప్యాయంగా చెప్పింది.

దీప “రమణా! ఇంక అత్తని వదిలి స్నేహితురాలివైపు చూస్తావా?” అంది దబాయింపుగా. వాతావరణాన్ని తేలిక చేస్తూ.

తరువాత మరో అరగంటలో మంగమ్మ వంట చేసి పెట్టింది. ఎన్నాళ్ళ తరువాతో తనకి ఇష్టమైన తమ ఊరి స్పెషల్స్‌తో భోజనం చేసింది రమణమ్మ. ఆ రోజంతా బాగా గడిపి సాయంత్రానికి హాస్టల్‌కి వచ్చింది రమణమ్మ. వచ్చాక శరత్‌కి ఫోన్ చేసి తను వచ్చేసినట్లు చెప్తూ, సోమశేఖరం గారి నంబరు ఇచ్చింది.

రమణమ్మ వెళ్ళిపోయినా మంగమ్మ మనసంతా తెలీని బాధతో నిండిపోయింది. తల్లిదండ్రులకి రమణమ్మ ప్రాణం అయినా ఆ ప్రేమ రెండు సార్లూ ఆ పిల్లకి కష్టాల సముద్రాన్నే చూపించింది. అయినా రమణమ్మ ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కొన్న తీరు, ముందు కాకపోయినా తరువాత ఆ అమ్మాయికి అనుకూలించిన పరిస్థితులు.. అంతా ఆశ్చర్యంగానే అనిపించింది.

ఆ రాత్రి దీపకి కూడా నిద్ర పట్టలేదు. తనకి తండ్రెంత అయోగ్యుడైనా తల్లి సరిగ్గా ఆలోచించడం వలన తన జీవితం ఈ తీరుకి వచ్చింది. లేకపోతే.. అనుకోగానే భయమేసి తన పక్క మీంచి లేచి తల్లి గుండెల్లో తల దాచుకుని గువ్వలాగ నిద్రపోయింది దీప.

***

సెప్టెంబర్ ఐదున రమణమ్మ స్టేజ్ మీద మాట్లాడుతున్నపుడు శరత్ రాలేకపోయాడు. కానీ నిర్వాహకులతో ఫోన్‌లో ముందుగా మాట్లాడం వలన రమణమ్మ మాట్లాడినపుడు, ప్రైజు తీసుకుంటున్నపుడు కూడా తీసిన వీడియో శరత్‌ను చేరింది. శరత్ దాన్ని చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యాడు. అంత సభలో ఏమి ప్రెజెంటేషన్! దాన్ని వెంటనే నర్సమ్మ, రాజయ్యలకు, రవళికి షేర్ చేసాడు.

రాజయ్యకి, నర్సమ్మకి మేటర్ పెద్దగా అర్థం కాలేదు. కానీ రమణమ్మ మాట్లాడిన తీరు పొంగిపోయేలా చేసింది. ప్రైజ్ తీసుకున్నపుడు వాళ్ళకి తెలియకుండానే చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి దాన్ని ఎన్ని సార్లు చూసారో లెక్కలేదు. వంట, వార్పు చేసుకోవాలన్న స్పృహ లేకుండా, తిండీ తిప్పలు అవసరం లేనట్లే ఆ వీడియోను చూసారు. వాళ్ళకి కొంతవరకూ రమణమ్మ గురించి రవళి పడ్డ బాధలోను, చదువు కుంటానని రమణమ్మ చేసిన యాగీ లోను అర్థం తెలియ వచ్చింది. తమ మూర్ఖత్వం అర్థమయింది. రమణమ్మతో మాట్లాడాలని తహతహలాడారు.

మళ్ళీసారి రమణమ్మతో మాట్లాడుతున్నపుడు రమణమ్మకి వాళ్ళని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సంతోషం అర్థం అయింది. ఫోన్ లోనే దిష్టి తీసేసింది నర్సమ్మ. రమణమ్మ నవ్వుకుని “మన స్కూల్‌లో కూడా మాట్లాడానమ్మా. అప్పుడే మిమ్మల్ని రమ్మని మేడమ్ కబురు పెడితే మీరు రాలేదు. పోన్లెండి ఇప్పటికైనా చూసారు.” అంది.

“ఇన్నాళ్ళ తరువాత నిన్ను కళకళలాడుతుండగా చూడగలిగాం. ఆ పోలీసాయన మీద ఉన్న కోపం పోయింది. ఆయనకి దండాలు పెట్టామని చెప్పు. నిన్ను కలియాలని తప్ప మరే కోరికా లేదు.” నర్సమ్మ చెప్పింది. రమణమ్మ శరత్‌కి వాళ్ళ సంతోషం, తన వీడియో వాళ్ళకి పంపినందుకు తన తరుపు నుంచి కృతజ్ఞతలు కూడా చెప్పింది.

***

ఎప్పటిలాగే ఆ రోజు కూడా రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ పడింది. డబుల్ గేట్. జనం చాలా మంది ఆటోలు దిగిపోయి, తెలిసిన వాళ్ళతో కబుర్లు, కాలక్షేపాలు చేస్తున్నారు. రవళి దృష్టి గేట్ దగ్గర కాణా మీద కూచుని ఏదో పుస్తకం చూస్తున్న సంధ్య మీద పడింది. తను కలిసి కొన్ని నెలలయిపోయింది. ఏం జరుగుతోందో తెలియదు. ఆటో అతనికి కాణా దగ్గర ఆపమని తను అక్కడ ఎక్కుతానని చెప్పి రవళి సంధ్య దగ్గరికి వెళ్ళింది.

వాళ్ళమ్మగారు కాస్త దూరంలో నిలబడి ఉన్నారు. సంధ్య పక్కనే ఒక పదేళ్ళ బాబు కూచుని ఉన్నాడు. తను దగ్గర కెళ్ళి పక్కన కూచున్నా తలెత్తి చూడలేదు. పక్కన ఉన్న పిల్లడి నోట్స్ జాగ్రత్తగా తప్పులు దిద్దుతోంది. ఆ అబ్బాయి నోట్స్ ఇచ్చేయమని గోల చేస్తున్నాడు. కానీ సంధ్య వినడం లేదు. వాళ్ళమ్మ గారు గబగబా దగ్గరకి వచ్చి పుస్తకం తీసేసుకుని ఆ పిల్లాడికి ఇచ్చేసారు. ఆ పిల్లడు ‘బ్రతుకు జీవుడా’ అన్నట్లు పారిపోయాడు. సంధ్య కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి.

“నీకేం పోయింది? నోట్స్‌లు ఎలా ఉండాలో తెలుసా? అన్ని తప్పులతోనా? ఆ పిల్లడికి నేను హెల్ప్ చేస్తుంటే చెయ్యనియ్యవు. మా అత్తవారి లాగే. నువ్వూ నేను పుస్తకం పట్టుకుంటే చూడలేవు. కళ్ళలో నిప్పులు పోసుకుంటావు.” అరిచింది సంధ్య.

“మేడమ్ నీ కోసం వచ్చారమ్మా!! అందుకని తీసుకున్నాను.” వాళ్ళమ్మగారు ఓపికగా చెప్పారు. సంధ్యలో ఆ విపరీత ధోరణి అలాగే ఉందని అర్థమయింది రవళికి.

“అరే! నమస్తే మేడమ్! చూడలేదండీ. సారీ మేడమ్! ఆటోలో నా పక్కన కూచున్న పిల్లడి నోట్సుల్లో అన్నీ తప్పులే. అవి దిద్దుతుంటే మా అమ్మ” ..అని వాళ్ళమ్మ వైపు కోపంగా చూసింది.

“నువ్వు చదువుతున్నపుడు నీ నోట్స్‌లో టీచర్ తప్ప మరెవరైనా చెయ్యి వేస్తే ఊరుకునేదానివి కాదు కదా? ఇప్పుడేంటి? ఇలాగ నువ్వు చెయ్యచ్చా?” రవళి లాలనగా అడిగింది. సంధ్య తప్పు చేసినట్లు తల దించుకుంది.

రైల్ గేట్ తీస్తున్న సవ్వడికి కూతుర్ని తీసుకుని ఆవిడ వెళ్తుంటే, “మీరో సారి స్కూలుకి రాగలరా?” అంది మెల్లగా రవళి. “తప్పకుండా వస్తానమ్మా” చెప్పేసి ఆవిడ వెళ్ళిపోయింది.

మర్నాడు స్కూల్‌కి వచ్చి ఆవిడ ఒకటే గోల. “పుస్తకం కోసమే అస్తమాను దేవులాడిపోతుందమ్మా! పిల్ల సరిగ్గా ఉండడం లేదని అత్తవారు గొడవ పెట్టేస్తున్నారు. డాక్టరు దగ్గరికి బలవంతంగా తీసికెళ్ళాల్సి వస్తోంది. ట్రీట్మెంట్ జరుగుతోంది. అయినా చదువు గొడవ వదలదు. చెప్పకుండా లైబ్రరీకి వెళ్ళిపోతుంది. గంటలు, గంటలు పేపర్లు, పుస్తకాలు చదువుతుంది. వాటి గురించి అక్కడ వాళ్ళతో మాట్లాడుతుంది. వీధిలో పిల్లలని చదివిస్తానంటుంది. వాళ్ళేమో దీనికి భయపడి రారు. అందుకని వాళ్ళతో గొడవ పడుతుంది. కర్ర పట్టుకుని వాళ్ళని చదవడానికి రమ్మని బెదిరిస్తుంది. చాక్లెట్లు ఇచ్చి బతిమాలుతుంది. చదువు, పుస్తకం తప్ప ఇంకో గోల లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఎంతమందికో ఈ వయసులో పెళ్ళిళ్ళయాయి. కానీ ఎవ్వరూ ఇలా లేరు. మా దురదృష్టం. ఇదే ఇలా తినేస్తోంది.” ఏడుపు గొంతుతో చెప్పింది ఆవిడ.

“నేను పది పదిహేను రోజులాగి కబురు చేస్తాను. ఒక్కసారి సంధ్యను పంపండి. ఈ లోపల నేను ఏదో ఆలోచిస్తాను.” రవళి భారంగా చెప్పింది. సంధ్యని మామూలుగా చదవనిస్తే అప్పుడెలా ఉండేదో? కానీ వద్దన్న కొద్దీ ఆ ఇష్టం పెరిగిపోయి, మనసు చెదిరిపోయి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. తక్కిన పిల్లలకి సంధ్యకి ఉన్న తేడా కన్నవారికే అర్థం కాపోతే ఇక అత్తవారికి ఏమవుతుంది? రత్నం లాంటి పిల్ల! మెరుగు పెట్టేవారు లేక మకిలీ పట్టేసింది. దీని విలువ ప్రపంచానికి ఎలా తెలుస్తుంది?

రవళికి ఆ సమస్య ఎలా ఎదుర్కోవాలో, సంధ్యకోసం తనేం చేయగలదో, తన కెలాగ దారి చూపాలో తెలియలేదు. తెగించి చదివించడానికి తల్లిదండ్రులు సిధ్ధంగా లేరు. రవళి మళ్ళీ రమణమ్మ టైమ్ లో పడినంత టెన్షన్ పడింది. మర్నాడు ఆదివారం కావడంతో ఆ రోజు ఇంటికిరానని తల్లి దగ్గరకు వెళ్తానని, మురళీకి ఫోన్ చేసి రాజేశ్వరి దగ్గరకు వెళ్ళింది.

(ఇంకా ఉంది)

Exit mobile version