Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-3

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గతం గుర్తు చేసుకుంటూంటుంది రవళి. ఎలిమెంటరీ స్కూల్‌లో టీచర్‌గా చేరిన ఏడాది దాటిన తర్వాత, పెళ్ళి సంబంధాలు చూడ్డం మొదలుపెడతారు ఆమె తల్లిదండ్రులు. మురళి సంబంధం వస్తుంది. పెద్దలు మాట్లాడుకున్నాకా, పెళ్ళిచూపులు జరుగుతాయి. రవళి, మురళి విడిగా మాట్లాడుకుంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించటంతో, సంబంధం కుదుర్చుకుంటారు. అనేక కారణాల పెళ్ళి, ఏడాదిన్నర ఆలస్యంగా జరుగుతుంది. ఈలోపు మురళి డిఎస్సి పరీక్ష పాసై మేథ్స్ బిఎడ్ పోస్ట్ సాధిస్తాడు. రవళి కూడా డిస్టన్స్ ఎడ్యుకేషన్‌లో బిఎడ్ పూర్తి చేస్తుంది. ఇద్దరూ ఒకరి స్వభావాలను మరొకరు గౌరవిస్తూ, నెగిటివ్స్‌తో సహా స్వీకరించడంతో వాళ్ళ వైవాహిక జీవితం ఆనందభరితంగానే సాగుతుంది. మామగారితో ఇబ్బందేమీ రాలేదు కానీ, రవళికి అత్తగారితోనే చిక్కెదురవుతుంది. ఆవిడంతా పాతకాలపు ధోరణి. కోడలు చేసే పనులు నచ్చవు. కొడుకు కోడలిని సమర్థిస్తున్నందుకు కినుస్తుంది. తన తల్లి స్వభావాన్ని వివరించి, ఆమెతో ఎలా సర్దుకుపోవాలో భార్యకి చెప్తాడు మురళి. రవళి తొలిసారి పాప పుడుతుంది. వీణ అని పేరు పెడతారు. రెండోసారి కూడా కూతురే పుట్టేసరికి అత్తగారు సాధిస్తుంది. ఇద్దరే ఉన్నప్పుడు భర్తకి చెప్పి బాధపడితే, ఓదారుస్తాడు. చిన్నపాపకి శృతి అని పేరు పెడతారు. కాలక్రమంలో మురళి తల్లిదండ్రులు మురళి దగ్గరకొచ్చేస్తారు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రవళి తండ్రి రామచంద్రం మరణిస్తాడు. తల్లిని వచ్చి కొన్నాళ్ళు తమతో ఉండమంటుంది. ఆవిడ వచ్చి కొన్ని రోజులుండి తమ ఊరికి వెళ్ళిపోతుంది. రవళికి ప్రమోషన్ వచ్చి మెట్ట మీద హైస్కూల్లో యన్.యస్. టీచర్‌గా చేరుతుంది. విజయనగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉందా హైస్కూలు. మొదట్లో నచ్చకపోయినా, ఆ బడిలోని సానుకూల అంశాలను చూడడం నేర్చుకుంటుంది రవళి. మొదటిసారి టెంత్ క్లాసు పిల్లలకు పాఠాలు చెబుతుండడంతో, వాళ్ళని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుంది. ఎయిత్ క్లాస్‌కి ఆమె క్లాస్ టీచర్. పిల్లలందరికిలోకీ, రమణమ్మ, దీప చలాకీగా ఉండడం, వారిద్దరికీ పడకపోవడం గమనిస్తుంది రవళి. ఆగస్టు పదిహేను సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి హెచ్.ఎమ్. గారి అనుమతి తీసుకుంటుంది. – ఇక చదవండి.]

స్టాఫ్ రూమ్‌కి వెళ్ళి తన ఐడియాలు చెప్పింది. ముందు నిరాశ పరిచినా తెలుగు మేడమ్ సపోర్ట్ ఇచ్చారు. అందరితో డిస్కస్ చేసిన టాపిక్స్‌తో మేటర్ వ్రాసి హెచ్.ఎమ్. గారితో సైన్ చేయించి క్లాస్ క్లాస్‌కి పంపితే పెద్దగా రెస్పాన్స్ రాలేదు. చూడగా హెచ్.ఎమ్. గారి జోస్యమే నిజమయేటట్లు అనిపించింది. ఐదారుగురు తప్ప ఎవరూ పేర్లు ఇవ్వలేదు. రవళి నిరాశ పడకుండా తను ప్రతీ క్లాస్ లోను గుర్తించిన పిల్లల పేర్లతో పాటు, మార్క్స్ రిజిస్టర్ చూసి తెలివైన పిల్లల పేర్లు లిస్ట్ చేసింది. లంచ్ బ్రేక్‌లో వాళ్ళందరికీ కబురు పెట్టి, మాట్లాడి అందర్నీ మోటివేట్ చేసింది.

సాయంత్రం లాస్ట్ పీరియడ్‌లో లైబ్రరీకి తీసికెళ్ళి తాము ఇచ్చిన టాపిక్స్‌కి సంబంధించిన మేటర్ ఉన్న పుస్తకాలు ఇచ్చింది. అనుకున్నట్లుగానే కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ బాగా జరిగాయి. రవళి అంచనా తప్పలేదు. ఊహించినట్లుగానే రమణమ్మ వక్తృత్వంలో టెంత్ వాళ్ళ కంటే బాగా మాట్లాడి ఫస్టు ప్రైజ్ సాధించింది. దీప వ్యాస రచనలో సెకెండ్ వచ్చింది. టెంత్, నైన్త్ లలో కూడా మరి కొందరిని గుర్తించింది. మట్టిలో మాణిక్యాలు అంటే వీళ్ళే అనిపించింది.

ఆటల్లో కూడా వాళ్ళిద్దరూ ఏమీ తగ్గలేదు. కబడ్డీలో ఇద్దరూ చెరో టీమ్‌కి లీడర్లుగా కొదమసింహాల్లాగ కలియబడి ఆడారు. రమణమ్మ టీమ్ గెలిచింది. ఓడిపోయిన దీప కన్నీరు మున్నీరయింది. అది గమనించిన రవళి గ్రౌండ్ లోంచి ఏడుస్తున్న దీపను తీసికెళ్ళిపోయి ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్‌లో కూచోబెట్టి ఓదార్చింది.

“దీపా! మన ఏ యాక్టివిటీ లోనైనా మన భాగస్వామ్యం, ఎంత బాగా ఆడి మన ప్లేస్‌కి న్యాయం చేసామన్నది ముఖ్యం. కానీ గెలుపు ఓటములు కాదు. అలా అని పాల్గొనడం మానకూడదు, అలాగే గెలుపు కోసం పోరాటమూ ఆపకూడదు. జీవితమెప్పుడూ విజయాలతో నిండి ఉండదు. అపజయాలలోంచి పాఠాలు నేర్చుకోవాలి అంతే! టెండూల్కర్, ధోనీ, కొహ్లీ లాంటి ఆటగాళ్లకి ఫెయిల్యూర్స్ లేవా? వాళ్ళే ఇలా డీలా పడిపోతే భారతదేశానికి అన్ని రికార్డులు వచ్చేవా?” అంటూ ఎన్నో కబుర్లు చెప్పి ఛీరప్ చేసింది.

దీప ఐదారుగురి బంధాన్ని విడిపించుకుని గీతను ముట్టుకున్న ఫొటోలు చూపించింది. దీప ఆనంద పడుతూనే “రమణమ్మది కూడా తీసారా?” అని అడిగింది.

రవళి నవ్వుతూ “రమణమ్మదే కాదు బాగా ఆడుతున్నారనిపించిన ప్రతీ వాళ్ళవీ తీసాను. చూస్తావా?” అడిగింది. దీప సిగ్గుగా నవ్వి చూస్తానన్నట్లు తల ఊపింది.

అందరివి చూసాక “పద! ఫైనల్ రమణమ్మ టెంత్ వాళ్ళతో ఆడుతుంది కదా! ఎంకరేజ్ చేద్దాం.” అంది. దీప అయిష్టంగా మొహం పెట్టింది.

“దీపా! ఈ స్కూల్‌కి మీ ఇద్దరూ కలిస్తే, స్నేహంగా ఉంటే ఎంతో బలం. ఎన్నో విజయాలు సాధించి పెడతారు. ఇద్దరూ ఆత్మీయంగా కలిసి ఉంటే ఎంత బావుంటుందో చూడు. ఇంతెందుకు? ఇప్పుడు దీపను నువ్వు ఎంకరేజ్ చేస్తే తన ఆటలో ఎంత మార్పు వస్తుందో చూస్తావా? పద! మా మంచి దీప! నా మాట వింటుంది. కదూ!” ఆప్యాయంగా అడిగింది. దీప ఇష్టం లేకపోయినా సరేనంది.

ఇద్దరూ గ్రౌండ్ లోకి వెళ్ళేసరికి ఆట ప్రారంభమయిపోయింది. రెండు టీమ్‌లు ప్రాణం పెట్టి ఆడుతున్నాయి. ఇక చివర్లో రమణమ్మను ప్రత్యర్థి టీమ్ వాళ్ళు పట్టుకున్నపుడు దీప గొంతు చించుకుని అరిచింది “రమణా! రావాలి! గెలవాలి!” అంటూ. రమణమ్మ గుక్క వదలకుండానే దీప వైపు ఆశ్చర్యంగా చూసింది. ఆ గొంతు తనకి కొత్త శక్తిని ఇచ్చినట్లు, ఒక్కసారిగా అందర్నీ వదిలించుకుని ఒకే దుముకుతో గీత దగ్గరకి వచ్చేసి గీతని ముట్టుకుంది. మైదానంలో ఉన్న అందరి చప్పట్లు మారుమోగాయి. టీచర్స్ కూడా ఆశ్చర్యంగా ఆనందంగా చప్పట్లు కొట్టారు. రమణమ్మ టీమ్ ఫస్ట్ ప్రైజ్ కొట్టింది. దీప వెంటనే రవళి వైపు ఆశ్చర్యంగా చూసింది.

“చూసావా? నేను చెప్పానా?” అన్నట్లు కళ్ళెగరేసి రవళి దీప తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఈలోగా తనని చుట్టుముట్టిన వాళ్ళని విడిపించుకుని రమణమ్మ పరుగు పరుగున దీప దగ్గరికి వచ్చి దీపను పట్టుకుని ఏడ్చేసింది. దీపకి కూడా కళ్ళంట నీళ్ళు వచ్చాయి.

“ఏటే? ఇది! ఊరుకో!” అంది పెద్దరికంగా.

“థాంక్ యూ! దీపా థాంక్ యూ వెరీ మచ్” అంది రమణమ్మ. వాళ్ళిద్దరి చుట్టూ మిగతా వాళ్ళందరూ గుండ్రంగా చేరి చప్పట్లు కొట్టారు.

అంతవరకూ వాళ్ళ కొట్లాటలతో విసిగిపోయిన గ్రౌండ్ వాళ్ళ నిర్మలమయిన ఆనందభాష్పాలకు పులకించిపోయింది. లేతహృదయాలు చక్కగా కలిసిపోయాయి. సంగతేమిటా? అని వచ్చిన హెడ్ మాష్టరుగారు, తక్కిన టీచర్స్ కూడా ఆశ్చర్యపోయారు. హెడ్ మాష్టరు గారు వాళ్ళిద్దరినీ పిలిచి ఈ కలయికకు కారణం అడిగారు. దీప జరిగింది అంతా చెప్పింది.

వెంటనే ఆయన “ దెన్, క్రెడిట్ గోస్ టు రవళి మేడమ్! కంగ్రాట్యులేట్ హర్!” అన్నారు చప్పట్లు కొడుతూ! పిల్లలంతా ‘రవళి మేడమ్!’, ,’రవళి మేడమ్,’ అని అరుస్తూ గోలచేసారు. రవళి కాస్త మొహమాట పడింది.

మళ్ళీ ఆయనే “దీపా రమణమ్మా! ఇక ఈ కలిసిన చేతులు విడిపోకూడదు! ఇక ముందు మీ దెబ్బలాట ఈ పాఠశాల చూడకూడదు సరేనా!” అన్నారు. ఇద్దరూ సంతోషంగా తలలూపారు.

***

ఆ మెట్ట మీద స్కూల్‌కి కుడివైపున ఉన్న పల్లెలో రమణమ్మ, ఎడమవైపు పల్లెలో దీప ఉండేవారు. రమణమ్మ తల్లిదండ్రులకి ఒక్కతే కూతురు. ఇద్దరు, ముగ్గురు పుట్టి చనిపోయిన తరువాత కలిగిన గారాల కూచి. తల్లి పేరు పెట్టుకున్న రాజయ్య కూతుర్ని కనుపాపలా సాకేవాడు. తల్లి నర్సమ్మ కూడా కసి కందనీయకుండా చూసుకునేది. ఆ పల్లెలో రాజయ్యకి మంచి పేరు, పలుకుబడి ఉన్నాయి. టచ్ ఫోన్ చాలా అపురూపమైన ఆ టైమ్ లోనే రమణమ్మకు ఖరీదైన టచ్ ఫోన్ ఉండేది.

చదువు, దాని ప్రాముఖ్యత గురించి ఏమీ అవగాహన లేని తల్లిదండ్రులే ఎక్కువ మంది ఆ ఊర్లో! వాళ్ళకి రాజయ్య, నర్సమ్మ ఏమీ మినహాయింపు కారు. ఇంటికి దగ్గరగా స్కూల్ ఉంది కాబట్టి కాలక్షేపానికి పిల్లని పంపడమే తప్ప తను ఎలా చదువుతోంది? టీచర్స్ తనని ఎలా చూస్తారు? ఇలాంటి విషయాల్లో దేని మీదా వాళ్ళకి ఆసక్తి లేదు. అది రవళికి చాలా తొందరలోనే అర్థమయింది. వ్యాసరచన లోను, వక్తృత్వం లోను ఫస్ట్ వచ్చిన వాళ్ళచేత ఆగష్టు పదిహేనున స్కూల్ అసెంబ్లీలో మాట్లడేటట్లు ట్రైనింగ్ ఇచ్చింది. జానపద గీతాలకి నృత్యాలు చేయించింది. జెండా వందనం సమయంలో కూడా రవళి నేర్పిన కొత్త పాటలు పాడారు. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేస్తున్నపుడు ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి వింటే, చూస్తే బావుంటుందనిపించి వాళ్ళ తల్లిదండ్రులకు కబురు చేసింది. కానీ చాలా కొద్దిమంది వచ్చారు. వాళ్ళలో దీప వాళ్ళమ్మ మంగమ్మ కూడా ఉంది. ఆవిడ వచ్చి చాలా సంస్కారవంతంగా మాట్లాడింది. వచ్చిన వాళ్ళు తమ పిల్లల్ని చూసి పొంగిపోయారు. అందరూ వచ్చి చూస్తే ఇంకా బావుండేది అని రవళికి అనిపించింది.

జెండా వందనానికి ఊళ్ళో పెద్దలతో బాటు ఆ స్కూల్ పాత విద్యార్థులు కూడా చాలా మంది రావడం రవళికి చాలా ఆనందమనిపించింది. వచ్చిన అందరికీ ఆ స్కూల్‌కి కొత్త కెరటం వచ్చిందని, దాని పొంగు ఆ ఫంక్షన్ లో రిఫ్లెక్ట్ అవుతోందని అర్థమయింది.

ఇక దీప ఇంటి వాతావరణం వేరు. తండ్రి చలపతి వ్యసనపరుడు. దీప తల్లి రెండో భార్య. మొదటి భార్య సంతానం రాజేష్. రాజేష్‌కి పదేళ్ళు నిండాక భార్యపోతే, తల్లిదండ్రులు లేని మంగమ్మని అన్న, వదిన పదిహేనేళ్ళ వయసు తేడాతో చలపతికి ఇచ్చి చేసారు. మంగమ్మ, రాజేష్‌ను మచ్చిక చేసుకోవాలని, తల్లి ప్రేమను అందించాలని ప్రయత్నించి విఫలురాలైంది. రాజేష్‌కి సవిత్తల్లి మీద కావల్సినంత వ్యతిరేకత ఉంది. చలపతికి మనుషులను అవసరానికి వాడుకోవడమే అలవాటు ఉంది తప్ప ఎవరినీ కూడా అది తల్లయినా, భార్య అయినా, బిడ్డ అయినా ప్రేమించడం అనేది తెలియదు. అందుకే మంగమ్మ దేవులాడినా రాజేష్‌ను, మంగమ్మని కలిపేందుకు ఏ మాత్రం ప్రయత్నం చేయలేదు. దాంతో రాజేష్ చెయ్యకూడని స్నేహాలు చేసి, వెళ్ళకూడని దారులంట వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు.

తరువాత పుట్టిన దీపను మాత్రం మంగమ్మ చాలా జాగ్రత్తగా పెంచింది. దీప చదువు గురించి జాగ్రత్త తీసుకుంది. టీచర్స్‌ని కలియడం దీప గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడం తరుచు చేసేది. ఇంట్లో నలుగురు సభ్యులున్నా మంగమ్మది, దీపది ఓ ప్రపంచం.

దీపకి రమణమ్మకి స్నేహం కలిసాక ఒకళ్ళింటికి మరొకళ్ళ రాకపోకలు జరిగాయి. దీప ఇంట్లో రమణమ్మకి చాలా స్వేచ్ఛ వచ్చింది. దీప తండ్రి కనబడక పోయినా ఆ విషయం గురించి ప్రశ్నించకుండా రమణమ్మ మంగమ్మ తోనే చక్కగా గడిపేది. రమణమ్మ ఇంట్లో రమణమ్మకి జరిగే గారాబం చూసాక తను కోల్పోతున్న తండ్రి ప్రేమ కోసం దీప మనసు ఆక్రోశించేది. రమణమ్మ “ఇది చేసి పెట్టు” అని అడగ్గానే చేయడానికి నర్సమ్మ, “ఇది కావాలి” అని అడిగితే కొనడానికి రాజయ్య వెనుకాడగా దీప చూడలేదు. వాళ్ళకి రమణమ్మ ఎంత అపురూపమో తెలిసింది.

ఇదంతా చూస్తుంటే దీపకి మొదట్లో చాలా ఈర్ష్యగా అనిపించింది. కానీ ఏదీ తల్లి దగ్గర దాచే అలవాటు లేని దీప మంగమ్మకి అంతా చెప్పి వెక్కి, వెక్కి ఏడ్చింది. మంగమ్మ కూడా ముందు బాధపడింది. కానీ తరువాత “దీపా! ఆ బగమంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు. ఇచ్చిన దానికి సంతోసించడం, దానికే కృతజ్ఞతలు సెప్పుకోవడం అలవాటు సేసుకోవాల. అప్పుడు ఇంకా, ఇంకా మనకి మంచి జరుగుతాది. పోనీ నీకు లేనిదేదో కనిపెట్టినావు కదా! ఆ దేవుడు నీకిచ్చిన వరాలేటో సెప్పు. వింటాను.” అని మంగమ్మ అడిగింది.

కాసేపు ఆలోచించి దీప “నువ్వు! నువ్వు నాకు దేవుడిచ్చిన అపురూపమైన వరం! అది అర్ధం అయింది. కానీ ఇంకే మిచ్చాడో ఆలోచించినా తెలియడం లేదు.” అంది అయోమయంగా!

మంగమ్మ దీపని దగ్గరకి తీసుకుంది. గుండెల్లోకి పొదువుకుంది.

“తెలీలేదంటున్నావు. అయితే నేనే సెప్తాను. ఇనుకో. ఆ దేముడు నీకు మీ టీచర్స్ ముచ్చటపడే తెలివితేటలు ఇచ్చాడు. స్కూల్లోను, బయట కూడా ఎన్నో పోటీలలో ప్రయిజులు తెచ్చుకునే శక్తి నిచ్చేడు. మీ టీచర్ సెప్పగానే అంతదాకా పోట్లాడే రమణమ్మతో స్నేహం సేసే మనసిచ్చాడు. సూడగానే ఈ అమ్మాయి బాగుందనిపించే సక్కదనం ఇచ్చాడు. ఇయ్యన్నీ వరాలు కావా? ఒక్కసారి ఆలోసించు.” మంగమ్మ చెప్తున్న విషయాలు వింటుంటే దీపకి చాలా శాంతిగా అనించింది. దుఃఖం తగ్గింది. పైపెచ్చు బాగా కూడా అనిపించింది.

“అంతే కాదు! మీ నాన్న గురించి ఒక్కసారన్నా రమణమ్మ అడిగితే నువ్వెంత సిన్నబుచ్చుకునేదానివి? అట్టా ఏమీ జరగనేదు. రమణమ్మ మంచి పిల్ల. దానితో ఎప్పుడూ స్నేహంగా ఉండు. నువ్వు పడే బాద రమణమ్మ పడడం లేదని సంతోసించి సూడు! అప్పుడెంత బావుంటదో!” చెప్పడం ముగించి మంగమ్మ దీప నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని గమనించి ఇలా దారిలో పెడితే పిల్లలు మంచి దారిలో నడవడానికి ఇక లోటేముంది? మంగమ్మ ఇచ్చే సలహాలు, చెప్పే మంచి మాటలతో దీప క్రమేపి ఈర్ష్యను జయించింది. దీప, రమణమ్మలు ఇద్దరూ అరమరికలు లేని మంచి స్నేహితులయ్యారు.

***

ఆ రోజు అటెండన్స్ తీసుకుంటున్న రవళి “ఏమిటి? రాధ అప్పుడే వారం రోజులయి స్కూల్ కి రావడం లేదు. ఏమయింది?” అని అడిగింది. ఎవ్వరూ సమాధానం చెప్పలేదు.

రవళి తలెత్తి అందరినీ చూస్తూ “ఏం కమలా! రాధ నువ్వు ఎప్పుడూ కలిసే ఉంటారుకదా! తను ఎందుకు రావడం లేదో నీకు తెలియదా?” అంది.

కమల లేచి నించుని “రేపు వస్తుంది మేడమ్!” అంది సన్న గొంతుతో!

“సరే! కూచో!” అంది రవళి. మర్నాడు పెద్ద లావాటి పసుపుతాడుతో తెచ్చి పెట్టుకున్న పెద్దరికంతో కనిపిస్తున్న రాధను క్లాస్‌లో చూసి రవళి షాక్ తింది.

“రాధా! నీకు పెళ్ళయిందా? ఇంత చిన్న వయసులోనా? ఇలా ఎలా చేసారు మీ వాళ్ళు?” ఆశ్చర్యాన్ని మింగేస్తూ బాధ నిండిపోయింది రవళి గొంతులో.

రాధ ఇంకా ఏమీ సమాధానం చెప్పనే లేదు. ఈలోగా ఆరేడేళ్ళ వయసున్న బాబు, ఐదేళ్ళ లోపు వయసున్న పాప క్లాస్ దగ్గరికి “పిన్నీ! పిన్నీ!” అని పిలుస్తూ వచ్చారు.

రాధ వెంటనే “ఒక్క నిమిషం మేడమ్” అని పర్మిషన్ అడిగి బయటకు వచ్చి వాళ్ళని నచ్చచెప్తూ తీసికెళ్ళింది. రవళి కమల వైపు ఆశ్చర్యంగా చూసింది.

రవళి ప్రశ్న అర్థమయిన కమల “మేడమ్! వాళ్ళు రాధ వాళ్ళ అక్క పిల్లలు. ఈ మధ్యే రాధ వాళ్ళ అక్క చనిపోయింది. పిల్లల కోసమని రాధను వాళ్ళ బావ కిచ్చి మొన్ననే పెళ్ళి చేసారు.” కమల వివరంగా చెప్పింది.

రవళి మనసు నిశ్శబ్దమయిపోయింది. ఇంత చిన్న వయసులో పెళ్ళే ఘోరమనుకుంటే, రెండో పెళ్ళివాడితో, అదీ ఇద్దరు పిల్లలు ఉన్నవాడితోనా? బాధ, దుఃఖం, విషాదం, వేదన అన్నింటి కలబోతగా మనసు మారిపోయింది. పాఠం మనసు పెట్టి చెప్పలేకపోయింది. రాధ తిరిగి వచ్చి క్లాస్‌లో పొందికగా కూచుంది.

స్టాఫ్ రూమ్‌లో ఇంటర్వెల్‌లో శాంతి మేడమ్‌ను రవళి వివరం అడిగింది. ఆవిడ కొద్దికాలంగా అక్కడే చేస్తున్నారు. పేరెంట్స్‌తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి.

“అవును! మేడమ్! నాలుగు రోజులయింది పెళ్ళయి. రాధకి, చనిపోయిన రమకి మధ్యన ఇంకో అమ్మాయి గౌరి ఉంది. గౌరి మొగుడు ఈ అమ్మాయిని వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. ఆ గౌరిని చేసుకుని, తనకి కొత్త జీవితం ఇమ్మని రాధ తల్లిదండ్రులు అల్లుడి కాళ్ళ వేళ్ళా పడ్డారు. కానీ అతగాడు ఒప్పుకోలేదు. రాధని ఇస్తేనే చేసుకుంటానని, లేకపోతే వేరే పెళ్ళి చేసుకుని పిల్లలకి సవిత్తల్లిని తెస్తానని బెదిరించాడు. చిన్న పిల్లలు అన్యాయమయిపోతారని, మరో చిన్నపిల్లకి అన్యాయం చేసారు రాధ తల్లిదండ్రులు. మీకు కొత్త కదూ! వర్రీగా అనిపిస్తుంది. ఇక్కడ ఇదంతా సర్వ సామాన్యం! మరీ ఎక్కువగా ఆలోచించకండి!” ఆఖరి మాటలు మెల్లగా చెప్పి బెల్ అయిపోవడంతో వెళ్ళిపోయారు శాంతి మేడమ్.

లేత తమలపాకు లాంటి రాధకి, నును లేత రెమ్మ లాంటి రాధకి, అరవిరిసిన గులాబి లాంటి రాధకి ఇంత శిక్షా? ఏడేళ్ళ బాబుకి పద్నాలుగేళ్ళ రాధ తల్లా? మూడు పదులు దాటిన వాడికి, అన్ని అనుభవాలు, ముచ్చట్లు తీర్చుకున్నవాడికి ఈ పసి మొగ్గ కావలసి వచ్చిందా? అసలు అతను మనిషా? మనసుందా? మనసుంటే గౌరినే చేసుకునే వాడు కదా! మనకి అన్యాయం అనిపించిన సంఘటన జరిగినప్పుడు దాన్ని ఎదిరించాలి అనిపించడం సహజం. అలా ప్రతిఘటించగలిగితే చాలా బావుంటుంది. కానీ ఆ సందర్భంలో మనం ఏమీ చేయలేని నిస్సహాయతే మనకి ఎదురయితే దాని లోంచి కోపం, ఆ కోపం ఎవరి మీదా చూపించలేని చేతకానితనం, దాన్లోంచి దుఃఖం, ఒకదాని తరువాత వచ్చి మనిషిని నలిబిలి చేస్తాయి. రవళి ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉంది.

సాధారణంగా ఉద్యోగంలో టెన్షన్‌లని, ఇంటి సమస్యలని కలిపేసుకుంటే ఎవరికైనా జీవితం చాలా బరువుగా సాగుతుంది. ఈ సంగతి బాగా అర్థం చేసుకున్న రవళి, మురళి ఇద్దరూ కూడా సంసారపు టెన్షన్‌లను స్కూల్ లోను, స్కూల్ సమస్యలను ఇంట్లోనూ షేర్ చెయ్యరు. ఒకరి సలహా మరొకరికి పనికొస్తుందంటే చెప్పుకోవడం, ఆన్‌లైన్ పనులలో సహాయం చేసుకోవడం తప్ప పెద్దవాళ్ళకి, పిల్లలకి వాటి గురించి ఏ మాత్రం తెలియకుండానే జాగ్రత్తపడేవారు. కానీ రాధ సంగతి రవళిని కదిపి కుదిపేసింది. ఫలితంగా రోజులా కాకుండా రవళి హృదయం ఆమె పనులలోనూ, ఏదో కోల్పోయినట్లున్న మోహంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో భోజనాల దగ్గర చర్చకి తెర లేచింది.

“అమ్మా! ఏమయింది? ఎందుకలా ఉన్నావు?” వీణ అడిగింది. మునివేళ్ళతో కంచంలో అన్నం కెలుకుతున్న రవళి ఉలిక్కిపడి చూసింది. అందరి చూపులు తన మీదే ఉన్నాయి. “ఏమీ లేదు.” తల వేగంగా అడ్డంగా తిప్పుతూ అంది.

“అలా బుకాయించి లాభం లేదు. నువ్వెంత అన్యమనస్కంగా ఉన్నావో నీ వంట చెప్పేస్తోంది. కూరలో ఉప్పెక్కువ అయింది. చారులో ఉప్పే లేదు. ఇంతెందుకు? మేమంతా పెరుగు అన్నంలోకి వచ్చేస్తే, నీ కూర అన్నమే అవలేదు. నీ డ్యూటీకి సంబంధించి కాదు. వేరే ఏదో జరిగింది. చెప్తే ఏదన్నా పరిష్కారం ఆలోచించవచ్చు.” మురళి రవళి మనసుని చదివేసినట్లు చెప్పాడు.

“ఎవరూ పరిష్కరించలేని సమస్య. మా స్కూల్లో ఓ నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయికి వాళ్ళ చనిపోయిన అక్క భర్తతో పెళ్ళి చేసారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నా సర్వీసులో ఇది నాకు మొదటి షాక్!” క్లుప్తంగా చెప్పింది రవళి.

“పల్లెల్లో ఇవన్నీ చాలా సాధారణమే! దీనికింత బాధపడిపోవడం ఎందుకు?” రవళి అత్తగారు కాంతం చాలా మామూలుగా అంది.

“ఎక్కడో ఏదో అత్యాచారమో, దుర్ఘటనో జరుగుతున్నట్లు ప్రతీరోజు వార్తల్లో వింటుంటాం.. కానీ, మన కళ్ళెదురుగా, మన ఆత్మీయులకి జరిగితే దానికి ప్రభావితం కాకుండా ఎలా ఉండగలం? నేనయితే అలా ఉండలేనండి!” అత్తగారి మాటలకు అఫెండ్ అవుతూ రవళి అంది.

“ఇప్పుడంటే విజయనగరంలో సెటిల్ అయ్యావు., కాదనను కానీ, మీ నాన్నగారు కూడా పల్లెటూళ్ళలో పని చేసారు కదా! అప్పుడక్కడ ఎప్పుడూ ఇలాంటి పెళ్ళిళ్ళు జరగలేదా? నీకు తెలియదా? ఈ రోజు కొత్తగా బాధపడిపోయేది ఏముంది?” కాంతం సూటిగా అడిగింది.

రవళికి తన స్నేహితురాళ్ళు పద్మ, జయ, సత్య అందరూ వరుసన జ్ఞాపకం వచ్చారు. మనసంతా చేదుగా అయిపోయింది. తరువాత “నిజమత్తయ్యా! నాకు తెలిసిన వాళ్ళకి అలాగే చిన్న వయసులోనే అయాయి. నేనూ అప్పుడు చిన్నదాన్నే కావడంతో నాకు కూడా పెళ్ళి, జీవితం వీటి గురించి అవగాహన లేదు. వాళ్ళని ఎదిరించి మాట్లాడి వాళ్ళకి ఇంకో పరిష్కారం చూపించేటంత సమర్థతా లేదు. అప్పుడు పూర్తిగా ఇప్పటిలా కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ లేదు. అమ్మ, నాన్నగారూ కూడా చాలా నచ్చచెప్పేవారు. అప్పుడు వచ్చే జీతాలు తక్కువే అయినా, ఫీజ్ కట్టి కాలేజ్‌లో చదివిస్తానని చెప్పేవారు. కానీ వాళ్ళు వినేవారు కాదు. పైనుంచి ఆ పెళ్ళిళ్ళకి ధన సహాయం కూడా నాన్నగారి దగ్గరే తీసుకునేవారు. కాలం ఇంత మారిందంటున్నారు కానీ గ్రామాల ఆడపిల్లల బతుకుల్లో మార్పు రావడం లేదు. ఇరవై, పాతికేళ్ళ క్రితం ఉన్న పరిస్థితే ఇప్పటికీ అక్కడ ఉండాలా?” ఆఖరిమాటలు తనకు తను చెప్పుకుంటున్నట్లు అంది.

“ఆ అమ్మాయి చాలా తెలివైనదా రవళీ?” మావగారు వెంకటరావు అడిగారు. “కాదండీ! యావరేజ్ స్టూడెంట్! చదివేసి ఉద్యోగం చేసేస్తుందా? అంటే కూడా చెప్పలేను. కానీ పసితనం లోనే అంత చేదు అనుభవము అంటే చాలా బాధగా ఉంది.” నెమ్మదిగా అంది రవళి.

“సరే మనం తరువాత దీని గురించి మాట్లడదాం! చాలా లేట్ అయింది. అందరూ భోజనాలు ముందు ముగించండి.” మురళి హెచ్చరికతో అంతా భోజనాలు ముగించారు.

(ఇంకా ఉంది)

Exit mobile version