Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మథనం-9

[శ్రీమతి రాయప్రోలు సుజాతా ప్రసాద్ గారి ‘మథనం’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చెప్పినట్టుగానే రమణమ్మ వారం రోజుల తర్వాత పుట్టింటికి వచ్చేసి పదో తరగతి పరీక్షలు వ్రాస్తుంది. దీపకీ, రమణమ్మకీ ఎగ్జామ్స్ సెంటర్స్ వేరు వేరుగా వస్తాయి. పరీక్షల చివరి రోజున దీప ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళి కలుస్తుంది రవళి. తనకు చెప్పకుండా, కలవకుండా ఎందుకు స్కూలు మానేశావని అడిగితే, జరిగినదంతా చెప్తుంది దీప. ఏదైనా సాయం కావాలా అంటే, వద్దని చెప్పి, రవళికి థాంక్స్ చెప్పి వెళ్తుంది దీప. లంచ్ బ్రేక్‌లో, జగదాంబ – రమణమ్మకి జరిగిన సంఘటనలను రవళికి చెప్పి హేళన చేస్తుంది. మృదువుగానైనా, ఆమెకి తగిన జవాబిస్తుంది రవళి. రమణమ్మ గురించి శాంతిని అడిగితే, జరిగినది చెప్పి, రమణమ్మ, తల్లిదండ్రులతో పాటు ఇప్పుడు పారాదీప్‌లో, అమమ్మ వాళ్ళింట్లో ఉంటోందని చెప్తుంది. ఎనిమిదో తరగతి చదివే జ్యోతికి మూడు రోజుల్లో పెళ్ళి అని తెలిసి, పోలీస్ డిపార్టుమెంటులో తెలిసిన వాళ్ళ ద్వారా ఆపించడానికి ప్రయత్నిస్తారు శాంతి, రవళి. జ్వరం కారణంగా మూడు రోజులు స్కూలుకి వెళ్ళలేకపోతుంది రవళి. నాల్గవ రోజు వెళ్ళాక, తెలుస్తుంది. జ్యోతి పెళ్ళి రహస్యంగా జరిగిపోయిందని! తన పరిస్థితిని తలచుకుని రమణమ్మ విపరీతంగా బాధపడుతూంటూంది. డిప్రెషన్ లోకి వెళ్ళిపొతుంది. తరచూ సముద్రం ఒడ్డున్న ఒక్కర్తీ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. – ఇక చదవండి.]

అంత బాధలోనూ రవళి మేడమ్ మాటలు తలుచుకుంటే మనసుకి శాంతిగా బావుంటుంది. మూడేళ్ళు! ఆవిడ మాటలు వింటూ, ఆవిడ ప్రోత్సాహాన్ని అందుకుంటూ, తప్పు చేస్తే చీవాట్లు తింటూ హాయిగా గడిచిపోయింది. కానీ అప్పుడు అది అంత అమూల్యమని తెలియదు. ఇప్పుడు కాలం వెనక్కి రాదు. సముద్రాన్ని అలా రెప్ప వాల్చకుండా చూస్తూ ఉంటే ఒక సారి రవళి మేడమ్ స్కూల్ వెనకాతల పెద్ద రాళ్ళ మీద కూచున్నపుడు సముద్రం గురించి కొటేషన్స్ లాగ ఏదో చెప్పినట్లు గుర్తు వచ్చింది. కానీ అవేమిటో జ్ఞాపకం రాలేదు.

రమణమ్మ తన తెలివితేటలకు ఇదొక ఛాలెంజ్ అనుకుంది. చాలా రోజుల తర్వాత వేరే విషయం ఆలోచించింది. కళ్ళు మూసుకుని ఏకాగ్రతగా పది నిమిషాల పాటు ప్రయత్నించాక సడెన్‌గా చిన్న నవ్వుతో రవళి గొంతు మనసులో ప్రతిధ్వనించింది. “ఏది ఈష్టు? ఏది వెష్టు? ఇది నురగల ఫారెష్టు!” అని.. రమణమ్మకు ఆ చిన్న జ్ఞాపకం, ఆ చిన్ని ప్రయత్నం జీవాన్ని పోసాయి. పెదవుల మీద నవ్వు వచ్చింది.

తోడుగా వచ్చి రమణమ్మని కనిపెట్టుకుని చూస్తున్న తాత ఆ నవ్వు చూసి ‘ఎంత బావుందో బిడ్డ నవ్వుతుంటే’ అనుకున్నాడు.

సడెన్‌గా రమణమ్మకి రవళి ఒకసారి క్లాస్‌లో చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చాయి. “ఒక మనిషి గానీ, సంఘటన గానీ, మనల్ని బాధించాలని ప్రయత్నించినపుడు మనం దానికి లొంగకుండా ఉండడమే వాళ్ళని ఓడించడం. కానీ మనం బాధపడుతూ వాళ్ళకే గెలుపునిస్తాం. జీవితం కూడా పరీక్షించినపుడు ఎదురు నిలబడడమే ధీరత్వం. అసలు ఎటువంటి సమయంలోనూ ఏ పనీ లేకుండా ఉండకూడదు. మనల్ని కుదిపేసే సంఘటన జరిగినపుడే రెట్టింపు కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి.” అని చెప్పిన మాటలు కర్తవ్యాన్ని బోధించాయి.

రమణమ్మకు ఏం చేయాలో తెలియదు.. ‘ఖాళీగా మాత్రం ఉండకూడదు. ఏదో ఒకటి ప్రయత్నించి నేర్చుకోవాలి. పారాదీప్‌లో ఉన్న రోజుల్ని కూడా సార్థకం చేసుకోవాలి.’ అనుకుంది దృఢంగా రమణమ్మ.

రమణమ్మ వాళ్ళ తాతగారింటి పక్క ఇంట్లోనే బ్లౌజ్‌లు కుట్టడం నేర్పుతున్నారంటే అక్కడే జాయిన్ అయింది. ఏదన్నా తొందరగా నేర్చుకునే రమణమ్మ అక్కడ బ్లౌజ్‌లు కొత్తగా డిజైన్ చెయ్యడం, కొత్త రకం మోడల్స్‌లో కుట్టడం, నేర్చుకుంటుండంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. గతాన్ని మరిచి మళ్ళీ ఈ లోకంలో పడుతోందని అంతా సంతోషించారు.

***

దీప, మంగమ్మ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నారు. మంగమ్మ స్నేహితురాలు ఆదెమ్మ బాగా సాయం చేసింది. దీప పరీక్షలు అయేంత వరకూ వాళ్ళింట్లోనే ఉన్నారు. మంగమ్మకి తండ్రి చనిపోయినపుడు ఎవరికీ తెలీకుండా ఇచ్చిన తల్లి బంగారం అక్కరకు వచ్చింది. అటు అన్న, వదిన, ఇటు భర్త ఒకలాటి వాళ్ళే అవడంతో అసలు దాన్ని పైకి తీసి వేసుకున్నదే లేదు. తల్లిదండ్రులకి మనసారా దండం పెట్టుకుని జీవితంలో రాబోయే సరికొత్త సవాళ్ళని ఎదుర్కోవడానికి సిధ్ధపడింది మంగమ్మ. వాళ్ళు లేరు కానీ వాళ్ళిచ్చిన ఆలంబన ఉంది అన్న ధైర్యం!

కొంత బంగారం అమ్మి ఇంటికి అడ్వాన్స్ ఇచ్చింది. ఆదెమ్మకి తెలిసిన ఓ లెక్చరర్ ద్వారా దీపను మంచి ప్రైవేటు కాలేజ్‌లో జాయిన్ చేసింది. దీప మార్కులు, లెక్చరర్ గారి పర్మిషన్ తో ఫీజు కట్టాల్సిన అవసరం రాలేదు. యూనిఫామ్‌కి, పుస్తకాలకి మాత్రమే ఖర్చు అయింది. ఓ కొత్త సైకిల్ కొని దీపకి ఇచ్చింది. ఇంటికి అతి ముఖ్యమైన సామాను మాత్రమే కొని సంసారం పెట్టింది. ఆదెమ్మ సలహాతో కూరగాయలు కొని వ్యాపారం మొదలు పెట్టింది.

దీప మనసు రవళితో మాట్లాడాలని కొట్టుకునేది. కానీ మేడమ్ తన మీద పెట్టుకున్న విశ్వాసం, ప్రతికూల పరిస్థితులలోనూ నిలబెట్టుకున్నానని ప్రూవ్ చేసుకోవాలి, ఏదన్నా సాధించాలి, సాధించాక మేడమ్ దగ్గరకు వెళ్ళి కనపడాలి అని తరుచు అనుకునేది.

***

ఆ రోజు లంచ్ టైమ్‌లో హెచ్. ఎమ్. గారు కబురు పెట్టడంతో రవళి వెళ్ళింది. “మేడమ్! నిన్న ఆఫీసులో తెలిసింది. ఈ ప్రాంతపు రాజకీయ నాయకుడు తన అల్లుడిని హెల్త్ ఇష్యూస్ ఏవో చూపించి ఈ స్కూల్‌కి మీ ప్లేస్‌లో తెప్పించుకోడానికి చాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. మీరు ఏమన్నా ఇన్‌ఫ్లూయన్స్ ఉపయోగించుకుని ఆపుకుంటారేమో అని ముందుగా చెప్తున్నాను. ఎక్కువ టైమ్ లేదు. వారం లోపే అయిపోతుంది. మీరు ఇప్పుడు విజయనగరానికి ఇటువైపు వస్తున్నారు. అతని స్కూల్ పూర్తిగా అటువైపు రూరల్ ఏరియాలో ఉంది.” అన్నారు.

రవళి కాసేపు మౌనంగా ఉంది. తరువాత “కానీయండి సర్! నేను ఏ ప్రయత్నమూ చేయను. ఏ ఊరి గాలి, నీరు నాకు ఋణమో? అలాగే ఏ పిల్లలకి నా అవసరమో! భగవంతుడు నన్ను అక్కడికే పంపుతాడు. ఫర్వాలేదు. అయినా ‘ఉద్యోగికి దూర భూమి ఏముంది?’ చెప్పండి.” అంది మామూలుగా. అక్కడున్న అందరూ షాక్ అయారు. తనకి కూడా ఓ మార్పు కావాలి.. అందుకే ఇది జరుగుతోందేమో అనుకుంది ప్రశాంతంగా రవళి.

“గడిచిపోయిన గతాన్ని గురించి నిట్టూర్పులు విడువను.

కరిగిపోతున్న వర్తమానానికి గాభరా పడను. కానీ,

భవిష్యత్తులో రాబోయే వెలుతురికి నా హృదయ గవాక్షాలు తెరిచే ఉంచుతాను.”

రవళి దృఢంగా అనుకుంది. స్కూల్ లో రవళికి ట్రాన్స్‌ఫర్ అవుతుందన్న సంగతి అందరికీ తెలిసింది. స్టాఫ్ రూమ్‌కి పిల్లల తాకిడి ఎక్కువయిపోయింది. అల్లరి పిల్లలు, రవళితో గొడవ పడే పిల్లలు కూడా వచ్చేసి “ఉండండి మేడమ్” అని బ్రతిమలాడుతుంటే రవళికి ఏదోగా అనిపించింది. ఇంట్లో మురళి అయితే చాలా సంతోషించాడు. రవళికి ఈ టైమ్‌లో మార్పు అవసరమని అతనికీ అనిపించింది.

రవళి ఆ రాజకీయ నాయకుని అసిస్టెంట్ స్కూల్‌కి వచ్చి రిక్వెష్టింగ్‌గా అడిగితే మ్యూచువల్‌కి సంతకం పెట్టేసింది. ఎటువంటి ప్రతిఘటన చేయలేదు. అతను ఆశ్చర్యపోయాడు. పని అంత సులభంగా అయినందుకు చాలా సంతోషించి మర్నాడు స్కూలుకి పెద్ద స్వీట్ పేకట్ పంపాడు. దాన్ని అక్కడే పిల్లలకి పంచేసింది రవళి. మద్యాహ్నం లంచ్ బ్రేక్‌లో టెన్త్ చదివే ‘హరి’ పరుగెత్తుకుంటూ వచ్చాడు.

“హరీ! ఏమయింది? నాలుగయిదు రోజులుగా స్కూల్‌కి రావడం లేదు?” పరుగెత్తడం వలన నోట మాట రాక ఆయాస పడుతున్న హరిని అడిగింది.

“మేడమ్! అమ్మ, నాన్న నన్ను పడవ మీదకి హెల్పర్ గా పంపేస్తున్నారు. రాత్రంతా మేలుకుని సముద్రం మీదుండాలి. రోజుకి 600 ఇస్తారని నన్ను పనిలో పెట్టేసారు. మేడమ్! మీరు వెళ్ళిపోతున్నారా? ఇంకా మీతో మా అమ్మ, నాన్నకి చెప్పించాలనుకున్నాను. నేను చదువుకుంటాను మేడమ్! మీరు ఎలాగైనా మావాళ్ళని ఒప్పించండి.” అన్నాడు.

ఉప్పునీటిలో తడిసి టపటపా కొట్టుకుంటున్న ఆ పసి రెక్కల్ని, ఆ నీటిమీద రాత్రంతా మేలుకోవడంతో ఎర్రగా ఉన్న కళ్ళల్లోంచి ప్రవహిస్తున్న ముత్యాల సరాల్ని చూడలేకపోయింది రవళి.

“హరీ! నేను మాట్లాడితే లాభం ఉంటుందనుకుంటే తప్పకుండా మాట్లాడతాను. వాళ్ళు వస్తారా? నేను మీ ఇంటికి రావాలా?” అడిగింది.

“అమ్మని తీసుకొస్తాను. అమ్మ ఒప్పుకుంటే చాలు.” బోళాగా నవ్వుతూ వెళ్ళిపోయాడు హరి.

“అదేమిటి? మీరు ఆడపిల్లల పార్టీ కదా! ఇలా మగ పిల్లలని కూడా సపోర్ట్ చేస్తారా?” వింతగా అడిగింది జగదాంబ.

“న్యాయానికి ఆడ, మగ ఏమిటి? చదువుకోవడం పిల్లల హక్కు. ఆ హక్కు వాళ్ళ నుంచి లాగేసే అధికారం ఎవరికీ లేదు. అది తల్లిదండ్రులు అయినా సరే! దానికోసం చేయాల్సిన ప్రయత్నం చేయడం మన ధర్మం.” నవ్వుతూ చెప్పింది రవళి.

“మీకు తెలియదు. ఇప్పుడు ఆవిడ దగ్గర చదువుతున్న విద్యార్థుల సంగతి వదిలేయండి, ఆవిడ రాక ముందే టెంత్ పోయి రికామీగా తిరుగుతున్న రాఘవ బొమ్మలు బాగా వేస్తాడని తెలిసి డ్రాయింగ్ ఎగ్జామ్స్, దాని ట్రైనింగ్ అన్ని వివరాలు చెప్పారు మేడమ్. వాటి మీద ఇష్టంతో ఇప్పుడు ఇంటర్ సెకెండ్ ఇయర్ కంప్లీట్ చేసాడు. ఇక డ్రాయింగ్‌లో ఎగ్జామ్స్ కడతాడు. అతనికి ఇష్టమైన మార్గంలో ముందుకు వెళ్ళడానికి మేడమే మార్గం చూపారు.” శాంతి జగదాంబతో చెప్పింది.

హరి తల్లిని తీసుకొచ్చాడు. రవళి హరి తల్లికి మృదువుగా చాలా నచ్చచెప్పింది. ఆవిడ చాలా మొండిది. రవళి మాటలకు ఏ మాత్రమూ ఇన్‌ఫ్లూయన్స్ కాలేదు.

“ఆడు సదివేసి ఫేన్ కింద కూకుని నీలా గవనమెంట్ ఉద్యోగం సేస్తాడని నువ్వు రాసిస్తావా?” అని అడిగింది. రవళి తెల్లబోయింది. హరి ఏవరేజ్ స్టూడెంట్! కానీ ఈ చదివే ప్రోసెస్‌లో ఎవరు ఎప్పుడు రాణిస్తారో చెప్పడం కష్టం. రవళి మౌనం ఆవిడ ధైర్యాన్ని పెంచింది. ఏం సెప్పగలవు? అన్నట్లు అదోలా నవ్వింది ఆవిడ. ఆవిడ మొహం మీద విజయ దరహాసం రవళిని చాలా ఉడికించింది.

“నిజమే! నేను చెప్పలేను. కానీ మీరు టెంత్ లోపల అతని ఇష్టానికి వ్యతిరేకంగా పనిలో పెడితే అది గవర్నమెంట్‌కి తెలియచేసి మిమ్మల్ని శిక్షింపచేసి మరీ అతన్ని చదివించేలా చేయగలను. అలా ప్రయత్నించడం ఇష్టం లేకే మిమ్మల్ని ఇంతలా బ్రతిమాలుతున్నాను. మీరన్నది నిజమే! మూడు నాలుగేళ్ళు చదివాక కూడా అతని సంపాదన ఇరవై వేలే అవవచ్చు. కాకపోతే లక్షా ఇరవై వేలు కావచ్చు. అదెవరూ చెప్పలేరు. మీ భాష లోనే చెప్తాను. అతని భవిష్యత్తు నాకు సముద్రమంత విశాలంగా కనిపిస్తోంది! కానీ మీరు ఆ నీటినే మీ దోసిట్లో పట్టి అందులోనే మునకవేయమంటే అతను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.” ముందు పదునైన స్వరంలో ప్రారంభించినా ఆఖరికి మెత్తగా చెప్పింది.

“అమ్మా! నన్ను ఇంకో పాలి బోట్ మీద పనికి పంపకు. అలా రాత్రి పడవ మీదకు పంపితే నేను ఆ సముద్రంలో దూకి చస్తానంతే!!” కోపంగా అన్నాడు హరి.

రవళి చప్పున హరి నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. “హుష్! ఏమిటా మాటలు? ఇదా! నువ్వు ఇన్నాళ్ళ నుంచి నా మాటలు, నా బాధ అర్థం చేసుకుంది? చావు మాట మళ్ళీ నీ పెదవుల మీదకు రాకూడదు. అమ్మ, నాన్న ఎలా బతుకుతారనుకున్నావు? జీవితాన్ని వాళ్ళు చూసే విధానం వేరేమో గానీ వాళ్ళకి నీ మీద ప్రేమకి కొరత లేదు. ఆ ప్రేమలో మచ్చా లేదు. బతిమాలో, బామాలో ఒప్పించాలి కానీ ఇలాంటి ఆలోచన రావచ్చా? వెళ్ళు. వెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు.” రవళి మాటలకి ఆవిడ కళ్ళలోంచి అప్పటిదాకా బిగపట్టుకున్న కన్నీళ్ళు కారిపోతున్నాయి.

హరి వచ్చి తల్లిని చుట్టుకున్నాడు. “సరే! నీ ఇట్ట ప్రకారమే సదూకో. కానీ, అలాటి ఆలోసన ఇంకో పాలి సెయ్యమాకు.” అంది ఆవిడ ఏడుస్తూనే. అందరికీ ఆ దృశ్యం కమనీయంగా, కనుల విందుగా ఉంది. రవళికి కొత్త ద్వారం తెరుచుకున్నట్లయింది. హరి చెప్పినట్లు ఏ ఆడపిల్లా కూడా తల్లిదండ్రులతో చెప్పలేదా? లేక తల్లిదండ్రులే ఆడపిల్లల మాటలని ఖాతరు చేయలేదా? రవళికి అర్థమవలేదు. కానీ ఏదయితేనేం? హరి సమస్య అప్పటికి అలా ఒక మెలోడ్రామాగా పరిష్కరించబడింది.

***

మొదట్లో దీప అంటే కాలేజ్‌లో కాస్త చిన్నచూపు ఉండేది. జిల్లా పరిషద్ స్కూళ్ళ నుంచి వెళ్ళిన ప్రతీ విద్యార్థికి సాధారణంగా కార్పొరేట్ కాలేజీలలో ఎదురయ్యే సమస్యే ఇది. ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ లేకపోవడం వలన ఆ ఇబ్బంది తప్పదు. కానీ దీప అవేమీ పట్టించుకోలేదు. తనేమిటో, తన చదువేమిటో అలాగే గడిపింది. క్లాస్ టెస్ట్‌లలో దీప పెర్ఫార్మన్స్ అందరికీ కొంచెం ఆశ్చర్యం కలిగించింది. కొన్ని రోజులయేసరికి దీప ఏమిటన్నది స్టూడెంట్స్‌కి లెక్చరర్స్‌కీ కూడా అర్థమయింది. దీప కూడా తన పెర్సెంటేజ్‌ని నిలకడగా ఉంచింది.

క్లాస్‌లో అందరి ధోరణి మారింది. తనతో మెల్లగా స్నేహం చేయడం ఆరంభించారు. ప్రణవి ముందు నుంచి దీపతో బాగానే ఉండేది. తన సాయంతో ఇంగ్లీష్‌లో ఫ్లూయన్సీ పెంచుకోవడం ఆరంభించింది దీప. ఆదెమ్మ వాళ్లకి గవర్నమెంట్ ఇల్లు రావడంతో వాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోయారు. అయినా మంగమ్మ ధైర్యాన్ని వదిలి పెట్టలేదు.

తన కష్టమర్స్‌తో పరిచయం పెంచుకుని వాళ్ళ అపార్ట్‌మెంట్‌కే కూరలు సప్లై చేయడం ఆరంభించింది. కష్టమర్స్ పెరిగారు. వ్యాపారం పెరిగింది. కానీ అప్పుడప్పుడు మిగిలిపోతున్న కూరలను మర్నాడు కూరలతో కలిపి అమ్మడం మంగమ్మకి నచ్చేది కాదు. అందుకని ముందురోజే ఎవరికి ఏ కూర ఎంత కావాలో ఒక పుస్తకంలో వ్రాసుకునేది. తన ఏడవ తరగతి చదువు ఇలా ఉపయోగ పడుతున్నందుకు చాలా సంతోషించేది. అందరితో చాలా క్రమశిక్షణతో మెలిగేది. నోటి మంచితో అందరికీ అభిమాన పాత్రురాలయింది. పాత పేపర్లు కొని తెచ్చుకుని వాటికి పిన్స్ వేసి కవర్స్ తయారు చేసి దాంట్లో నీట్‌గా పేక్ చేసి ఇచ్చేది. ఆ ఇళ్ళ వాళ్ళు కూడా ఈ రోజు ఇచ్చిన కవర్లు మర్నాడు ఖాళీ చేసి పెట్టేవారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్‌తో మంగమ్మ ఆ అపార్ట్‌మెంట్‌లో పాప్యులర్ అయింది.

కొన్నాళ్లు గడిచాక ఒక డాక్టర్ గారి భార్య, కొడుకు వదిలేసిన పాత ఫోన్ ఇచ్చింది. దానిలో రాత్రి తొమ్మిది లోపల కూరలు కావలసిన వాళ్ళు ఆ వివరాలన్నీ మెసేజ్ పెట్టేవారు. ముందులో దీప సాయం తీసుకున్నా మంగమ్మ తరువాత పట్టుదలగా తనంతట తనే చేయడం నేర్చుకుంది. పిల్ల భవిష్యత్తు కోసం మంగమ్మ తీసుకునే నిర్ణయాలకు ఎదిరిస్తూ మోకాలడ్డే వాళ్ళు లేరు. వాళ్ళు ఇద్దరే ఉన్నా, మగ దక్షత లేకపోయినా అసలు ఆ వెలితే వాళ్ళకు తెలియలేదు. పైగా ఎంతో ప్రశాంతంగా జీవితం గడుస్తోంది.

చాలామంది లాగే మంగమ్మ తెలివి తేటలు గానీ, చాకచక్యం గానీ సంసారంలో ఎక్కడా వెలుగు చూడనీయకుండా చలపతి రాహువులా తగులుకునే వాడు. దీపని తీర్చి దిద్దేందుకు తప్ప మంగమ్మ తన తెలివిని ఉపయోగించింది లేదు. కానీ అంతవరకూ నిశ్శబ్దంగా, చీకటిగా ఉన్న ‘భర్త చాటు’ అనే గుహలో ఉండి పైకి వచ్చిన మంగమ్మ దీప భవిష్యత్తు అనే ఆశల రెక్కలు పరుచుకుని స్వేఛ్ఛగా కొత్త ఊహలతో, కొత్త పుంతలు తొక్కుతూ, కొత్త వెలుగును చూస్తోంది.

మంగమ్మ కథ క్రమేణా అందరికి తెలిసింది. ముందు జాలి పడినా, పెద్దగా చదువుకోని మంగమ్మ కూతురి భవిష్యత్తు కోసం చేస్తున్న పోరాటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. మంగమ్మ మంచితనానికి, సామర్థ్యానికి చుట్టూ మంచి సర్కిల్ ఏర్పడింది. అందులో, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, టీచర్లు అంతా ఉండేవారు. వాళ్ళ ఇళ్ళల్లో ఏ సందడైనా మంగమ్మ వెళ్ళి సాయపడేది. దానికి వాళ్ళు డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. తమ ఇంటి చుట్టు పక్కల కూడా అందరికీ చేతనైనంత సహాయం చేస్తూ ఉండేది. అందుచేత ప్రతీ ఒక్కరూ ఏ అవసరానికైనా మంగమ్మకి, దీపకి ముందుండేవారు. అయినా మంగమ్మ వాళ్ళ పరపతిని మేగ్జిమమ్ వాడుకునేది కాదు.

(ఇంకా ఉంది)

Exit mobile version