(1)
భూమ్మీద స్ధిరంగా తిరుగుతున్న మనిషి
సముద్రాలను చూస్తూ ఆకాశాన్నీ దాటి సాగే
సంద్రం లోతుల్లో నింగి పరిధి ఆవల చూసే బతుకు
(2)
బీజం పుట్టుకతో మొదలైనవి సృష్టిలో
సంఘర్షణలూ సంక్షోభ సంతోషాలూ
భూమ్మీదికి వచ్చీపోయే ప్రాణ తీగల మనుషుల్లాగ
(3)
మనసు మాట్లాడింది మనసుతో
మౌనంగా మందహాసంగా ప్రకృతిలో
గొప్పగా చెప్పేది ప్రేమ భాషైన అమ్మే కదా
(4)
సత్యం ధర్మం న్యాయ బోధలే పురాణేతిహాసాలు
ప్రబంధ కావ్యాన్నీ సామాజిక సన్మార్గ నియమాలు
రాముడై కృష్ణుడై కాచిరి మంచిని భువిని దేవుళ్ళై
(5)
తిరిగే పాద ద్వయం నడక ఆగదు
మాట్లాడే వదనం మాట ఆపదు
పరికించ అక్షర సృష్టి మానదు కాలంలో కలం
(6)
పూలు ఊగిన గాలికి బలం
చేలు పండిన మట్టికి అందం
ప్రకృతిలో హరితం మనిషి బంధం
(7)
తెల్ల కాగితాలన్నీ తడిసిన జీవితాలు
ఎడతెరిపిలేని వర్షధార వరదల్లో
జ్ఞానబోధ చేసే అనుభవ పాఠాలు మంచికై
(8)
మనుషులం మాత్రమే కాదు మనం
ప్రకృతి ప్రేమికులైన సాంస్కృతిక వారసులం కూడా
కళాత్మ తపన మానవులం ధరణిలో
(9)
అజేయుల అధరాలపై పూచేను
మౌనం చిరునవ్వూ రెండు పూలై
బాధల్ని చిరునవ్వు తీరిస్తే మౌనం తప్పించుగా
(10)
మౌనం మహా స్ఫూర్తి సృష్టిలో ఎప్పుడూ
మట్టిని సైతం గొప్పగా తీర్చే చూడు
ఆలోచింప ముక్తకాల్లో మట్టి మౌనమై మాట్లాడింది

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
1 Comments
ravindra chary
“మట్టి మౌనమై మాట్లాడింది”….ప్రతీ మాట ఓ ముత్యం.ఓ రత్నం. ఇందులో భాష యొక్క అందచందాలే కాదు అందులోని అనుభవపూరిత జ్ఞానం….
జరిగిన,జరుగుతున్న వృత్తాంతాలు,ఇతిహాసంనుండి ఉద్భవించిన భావవ్యక్తీకరణ. రచయిత మామూలు రచయిత కాదు ఒక ఆలోచనాశీలి, ఓ ఫిలాసఫర్ గానూ పేర్కొన వచ్చు…cordial Congratulations to the author.