[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘మేఘ సంతాపం!!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


అంద చందాల నీటికలశం
ఆ చిన్నారి మేఘకిశోరం
చకచకా కురిసి పోదామని
విసవిసా పరుగులెత్తింది!
అటు చూసి ఇటు చూసి
కదలని కారుమబ్బుల చూసి
జాలి చూపింది ఈ పిల్ల మేఘం,
చేవ తక్కిన, వృద్ధ గజాలంటూ!
చిట్టి బొజ్జలో పట్టినంత నీరూ
ఇక కుమ్మరిద్దామని వేచి కాచిన
బాల ప్రాణం విస్తుపోయింది పాపం
నాటి పైరే, నేడు రాతి మేడగ చూసి!
ఇదికా దిది కాదని తరలి తరలి
ఊరి పై నుంచి చూసింది, తల్లడిల్లింది
ఊరు వాడంత మేడలూ మిద్దెలే
ఏరు పోయింది, నీరంత ఇంకింది!
ఊరు ఊరే శుద్ధ శుష్కమై తోచింది
నవ్వు కలకలలు ఇగిరిపోయాయి
కాసు గలగలలు మిన్నులంటాయి
చెమ్మ పోయింది, చెలిమి పోయింది!
కంటితడి ఆపుకుంది చిన్నారి బుగ్గ
పొట్టలోని నీరివ్వలేనని హఠం పట్టింది
బిరబిరా దొర్లి పారిపోయిం దాకసాన
కసితీర కుమ్మరించేసిం దుప్పుసంద్రాన!
పంటకందేది పొలము నష్టపోయింది
మనసు చినవోయి చిట్టి మరలింది
మౌనమే పెద్దమేఘాల వైఖరయ్యింది
మనిషి వైనమే అంత మార్చివేసింది!
నీతిపై ధ్యాస పోయింది, ఆశ మీరింది,
పైస కోసం చెట్టనే పైడిపట్టునే కూల్చాడు
నేలంత బందిఖానాల ఇళ్ళు నిలిపాడు
బతికినపుడే సమాధి కట్టి మురిశాడు!
ఎప్పుడొస్తుందో ఈ జీవికి బుద్ధి మళ్ళీ
ఎప్పుడో, ఆ మేఘం ఈ వైపుకు మళ్ళీ
ఇపుడిపుడే కనరా దిద్ధరిలో ఏ మార్పు
అందాక ఇల వహించాలిక, రక్కసి ఓర్పు!