జీవితవృక్షం నింగి దిశగా ఎత్తుగా ఎదిగింది
కొమ్మల్లో ఉన్న చేవ ఎంతో తెలీదుకాని
చెట్టుమానును చుట్టుకున్న బెరడు మాత్రం
తన అంతరంగాన్ని విప్పి తెలుసుకోమంది.
వలయాలు వలయాలుగా కాలం పొరలు
ముద్రలేసుకు ఎత్తెత్తుకు ఎదిగింది ఆ మాను
భూమిపొరల లోలోతులకు చొచ్చుకుపోయిన
వేళ్ళుచెప్తాయి ఆ చెట్టుకున్న సత్తాఎంతో.
మొలకెత్తని విత్తుల జాడలు కొన్ని
పచ్చగా పల్లవించిన వసంతాలు కొన్ని
మోడువారిన గ్రీష్మపు ఛాయలు కొన్ని
కళ్ళముందే తెరలు తెరలుగా కదిలాయి
పొరలు పొరలుగా చుట్టుకున్న ఉల్లి రేకులు
ఒక్కొక్కటిగా విప్పుతుంటే కళ్ళుతడిబారాయి
కాలం పొరలు ఒక్కొక్కటిగా తొలగిస్తుంటే
జీవన గ్రంథం పుటలు తిరగేస్తున్నట్టుంది.
మనసుపొరలలో గూడుకట్టుకుని ఉన్న
అనుభవాలో జ్ఞాపకాలో తుట్టె రేగినట్టయింది
చెల్లాచెదురయిన ఊహాల తేనెటీగలు
తీయతీయగా కుట్టడం ప్రారంభించాయి
నేడు ముదిమి మేనిపై ఆ తీపి గాట్లన్నీ
కాలం పొరలపై ఆనవాళ్ళయి మిగిలున్నాయి

డా. చక్రపాణి యిమ్మిడిశెట్టి విశాఖజిల్లా అనకాపల్లిలో 3.9.1954 న లక్ష్మీకాంతం, రాధాకృష్ణ దంపతులకు జన్మించారు. ఎం.కాం.,ఎం.ఫిల్.,పి.హెచ్.డి, హిందీ సాహిత్యరత్న విద్యార్హతలు. అనకాపల్లి వర్తకసంఘ లింగమూర్తి కళాశాల వాణిజ్యవిభాగంలో 1976 లో లెక్చరర్ గా ప్రవేశించి రీడర్గా పదోన్నతి పొంది 2012 సెప్టెంబర్లో శాఖాధిపతిగా పదవీవిరమణ.
గ్రంథాలయాల పట్ల, పుస్తకాల పట్ల అభిరుచి పెరిగింది వారి అన్నగారి వలన. 1970 నుంచి తన భావాలకు అక్షరరూపం యివ్వటం ప్రారంభించారు. ఆ ఆసక్తి కవితలు,గేయాలు రాయటానికి దోహదమైంది. అందరిలాగే ఆయననూ శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం ప్రభావితం చేసిందని చెబుతారు.
రంగుల చినుకులు, నెలవంక, కవచం పలుకే బంగారమాయే – కవితాసంపుటులు వెలువరించారు. ప్రస్తుతం కన్వీనర్, అనకాపల్లి సాహితీమిత్రులు.