[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘మోహనాంగి – మారీచీపరిణయం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]


“తెనుఁగుబాస ప్రపంచమంతటికి నాదింబొల్చి నిర్దోషులౌ
ట నిజాంచత్పదముల్ బుధాగ్రణుల్ వేడ్కన్ మౌళులం దాల్చి మ
న్నన సల్పంగ ద్రిమూర్తులై వెలయు నా నన్నయ తిక్కన యె
ఱ్ఱనలన్ భావమునన్ స్మరించెదను నేనాంధ్రాభిలాషంభునన్”
~
మోహనాంగి – ‘మారీచీపరిణయము’
తెలుగు భాషను ప్రపంచమంతటికీ ఆదిభాషగా భావించిన ఏకైక రచయిత్రి మోహనాంగి. ఒప్పులెరిగినవారు, అచ్చమైన తెలుగు తెలిసినవారు మేథావులు సంతోషంగా తమ నెత్తిన పెట్టుకుని గౌరవించిన భాష ఇదనీ, ఆంధ్రభాష మీద అభిమానంతో సాహితీ త్రిమూర్తులైన నన్నయ తిక్కన ఎర్రనలను మనసులో స్మరిస్తున్నాను అంటూ మోహనాంగి తన మారీచీ పరిణయం కావ్యంలో కవిత్రయానికి తొలుతగా వందనాలు చెప్పుకుంది.
ఏ భాషైనా అది అనేక ఇతర భాషలు రూపొందటానికి లేదా సంపన్నం కావటానికి దోహదపడితే దాన్ని ‘ఆదిభాష’ అనాలి. అప్పుడే అది ప్రాచీన భాష అనే గౌరవాన్ని పొందటానికి అర్హమౌతుంది. సర్వశ్రీ తిరుమల రామచంద్ర, బూదరాజు రాధాకృష్ణ, కోరాడ రామకృష్ణయ్య, మల్లాది సూర్యనారాయణశాస్త్రి ప్రభృతులు పాళీ, ప్రాకృత సంస్కృత భాషల అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గురించి, తెలుగు ప్రమేయం గురించి అనేక విశేషాలు వెలుగులోకి తెచ్చారు.
‘అరక’ నుండి ‘నాగలి’ వరకూ పాళీ భాషలో మన వ్యావసాయిక పదాలు కొల్లలుగా ఉన్నాయి. సంస్కృతంలో ఉన్న పుత్ర, మీన, తాళ లాంటి తెలుగు పదాలు తెలుగులోంచి సంస్కృతంలోకి చేరాయని కోరాడ రామకృష్ణయ్యగారు 1921లోనే వ్రాశారు. ఎఫ్. బి. జె. క్వీపర్ అనే పరిశోధకుడు ఋగ్వేదం లోంచి 360 పదాలను ఏరి ఇవి ద్రావిడ, ముండా భాషలకు చెందినవి కావొచ్చంటూ ఒక పట్టిక ప్రకటించాడు. ‘క్వీపర్స్ లిస్టు’ అంటారు దీన్ని. ఇందులో అనేక ద్రావిడ పదాలున్నాయి. వాటిలో అధికభాగం తెలుగులో వ్యాప్తిలో ఉన్నాయి. పాలీని, ప్రాకృతాన్ని, సంస్కృతాన్ని అభివృద్ధి చేయటంలో తెలుగు భాష పాత్ర, తెలుగువారి పాత్ర ఎంతో ఉంది.
తెలుగుభాషకు ప్రాచీనతా హోదాని నిర్ణయించినప్పుడు, ఈ భాష అనేక ఇతర భాషల అభివృద్ధికి కారకం కావటాన్ని ఒక పరిశీలనాంశంగా గుర్తించారు. తెలుగు భాషా చరిత్రలో ఇది ముఖ్యమైన విషయం. తెలుగు భాషని ఆదిభాషల్లో ఒకటిగా ఘనంగా ప్రకటించింది మోహనాంగి. మోహనాంగి చరిత్ర ఎలా ఉన్నా, ఆమె పేరుతో కనిపించే “తెనుఁగు బాస ప్రపంచమంతటికి నాదింబొల్చి” అనే పద్యం మాత్రం చిరస్మరణీయమైనది.
ఈమె శ్రీకృష్ణదేవరాయలు కుమార్తె అనేందుకు సాక్ష్యం ఆమె వ్రాసిన మారీచీ పరిణయం కావ్యం. ఆమె చిత్రకారిణి కూడా! సంస్కృతాంధ్ర భాషల్లో మంచి ప్రవేశం కలిగిన కవయిత్రి. ఆమె అసలు పేరు తిరుమలాంబ అనీ, కృష్ణదేవరాయలు భార్య పేరు కూడా తిరుమలదేవి కాబట్టి ఈమెను మోహనాంగి అని ముద్దుగా పిలుచుకున్నారనీ ఆరవీటి వంశీకుడు, కృష్ణదేవరాయల తరువాత విజయనగర సామ్రాజ్యాన్ని కొనసాగించిన అళియ రామరాజు భార్య అనీ కళాప్రపూర్ణ కొండూరు వీరరాఘవాచార్యులవారు మోహనాంగి పేరుతో ఒక చారిత్రక నవల వ్రాశారు.
మోహనాంగి తిరుచెంగొత్తు అర్థనారీశ్వరస్వామి భక్తురాలనీ, ఆ అర్థనారీశ్వరుడి సేవకే జీవితాన్ని అంకితం చేసిందని తమిళనాట బాగా వ్యాప్తిలో ఉన్న ప్రచారం. వైష్ణవ భక్తి ప్రచారంలో మునిగితేలిన కృష్ణదేవరాయల వారి కూతురు, అళియరామరాజు భార్య అర్థనారీశ్వరుడి భక్తురాలు కావటం కూడా ఒక విశేషమే!
రాధాకృష్ణుల ప్రణయ తత్త్వం లాగే అర్థనారీశ్వరుల ప్రణయ తత్వాన్ని చాటే నృత్యరూపకాలు మోహనాంగి పేరుతో తమిళంలో కొన్ని ఉన్నాయి. తమిళ మోహనాంగి, తెలుగు మోహనాంగీ ఒకరు కాకపోవచ్చు.
మారీచీ పరిణయం అనే కావ్యానికి అవతారికలో రాయలవారి వంశ చరిత్రనీ, రాయల కాలం నాటి చారిత్రకాంశాలనీ, సాంఘిక జీవనాన్నీ అనేక పద్యాలలో వ్రాసింది మోహనాంగి. ఆమెను గానీ, ఆమె వ్రాసిన చారిత్రక విషయాలను గానీ పండితులు పరిగణించలేదు.
1829లో కావలి వెంకట రామస్వామి మారీచీ పరిణయం కావ్యం గురించి, మోహనాంగి గురించి మొదటగా ‘దక్కను కవుల చరిత్రలు’ గ్రంథంలో ప్రస్తావించాడు. మెకంజీ దొరకు కైఫీయత్తుల సేకరణలో సహాయపడిన కావలి బొర్రయ్యగారి తమ్ముడు ఈ కావలి రామస్వామి. ఆయనకు చిత్తుప్రతుల్లోనో వ్రాతప్రతుల్లోనో ఈ పుస్తకం దొరికి ఉండవచ్చు.
వేటూరి ప్రభాకర శాస్త్రిగారు రూపొందించిన తెలుగు చాటుపద్యమంజరిలో మోహనాంగి గురించిన ఒక ఐతిహ్యాన్ని అందించారు. రాయలవారికి మోహనాంగి అనే కూతురు ఉన్నదనే విషయాన్ని ఈ చాటువు చాటుతోంది: కృష్ణదేవరాయల దర్శనం కోసం సంకుపాల నృసింహ కవి అనే కవిగారు చాలా రోజులు విశ్వప్రయత్నం చేస్తున్నాడు. ఆయన వ్రాసిన ఒక పద్యం ఎలానో మోహనాంగిని చేరింది. ఒక రోజు మోహనాంగి తండ్రితో చదరంగం ఆడుతుంటే రాయలవారి రెండు ఏనుగుల మధ్య తన బంటు చిక్కుకుని ఆమె వదిలేసుకోవలసి వచ్చింది. “యుద్ధతుల మధ్య పేదకు నుండదరమె” అంటూ ఆమె తన బంటుని సమర్పించింది. రాయలవారు ‘ఈ పద్యపాదం చాలా బావుంది, పూర్తి పద్యం చదువు” అన్నాడట
“గీ, ఒత్తు కొనివచ్చు కటికుచోద్వృత్తిఁ జూచి
తరుణి తనుమధ్య మెచటికో తలఁగిపోయె
నుండె నేనియు గనఁబడకున్నె! యహహా
యుద్ధతు లమధ్య పేదకు నుండదరమె”
అని చదివిందట. రాయలవారు ఈ పద్యం రాసిన కవి గురించి తెలుసుకుని దర్శనం ఇచ్చి సత్కరించాడని వేటూరి వారు వ్రాసిన ఐతిహ్యం. రాయల సమకాలికుడైన సంకుపాల నృసింహ కవి చరిత్ర ప్రసిద్ధుడే. అతన్ని ఏ కారణం చేతో అష్టదిగ్గజాల్లో చేర్చి చెప్పలేదు. పండితుల వ్యక్తిగత రాగద్వేషాల ప్రభావం ప్రాచీన సాహిత్య విమర్శ పైన బాగా కనిపిస్తుంది.
మారీచీ పరిణయ రచన
“పుత్రిక తొల్త బుట్టుటతి పుణ్యకరంబని, నేనెఱింగి యుం
బుత్రుడు నాకొకండయిన బుట్టమి, రాజ్యమునెల్ల నేల
దౌహిత్రుడె నాకు దొల్త జనియింపగ గోరెద, గాన గబ్బపుం
బుత్రిక నీవు కాంచునెడ బుణ్యమునుం, బురుషార్థముం జుమీ”
అంటూ, తన తండ్రికి ఈ కావ్యాన్ని అంకితం ఇస్తున్నట్టు కావ్య రచనారంభంలో చెప్పుకుంది. ఆమె ఈ రచన ప్రారంభించే నాటికి రాయలవారికి పుత్ర సంతానం లేదని దీని తాత్పర్యం. ఈ కావ్యాన్ని అంకితం తీసుకుని మనుమడినే పుత్రుడుగా భావించమని కోరింది. కానీ, కావ్యం నాలుగో అధ్యాయంలోకి వచ్చేసరికి రాయలవారికి సుపుత్రప్రాప్తి కలిగింది. ఆ విషయాన్ని ఆశ్వాసాంతంలో ఆమె స్పష్టంగా పేర్కొందని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ వ్రాశారు.
ముద్రణా యంత్రాంగం లేని రోజుల్లో రచనలలో ప్రక్షిప్తాలకు నిక్షిప్తాలకు ఎన్నో అవకాశాలు ఉండే అవకాశం ఉంది. విషయమే ముఖ్యం అనుకుంటే ఈ మారీచీ పరిణయం పరిచయ పద్యాలను తప్పక చదవాలి.
తండ్రీ కూతుళ్ళ మధ్య స్త్రీ విద్య గురించి, స్త్రీలు కవిత్వం వ్రాయటం గురించి జరిగిన ఈ సంభాషణ చూడండి:
“తండ్రి! సమస్య పూర్తికి నెదం దలపోయుబ లేదు, మీరలే
మండ్రో, మదీయ సాహసము నారసి, కావ్యమొనర్పబూనితిన్
పీండ్రకు బాక ముండగ గవిత్వపు బాకమునేల? యంచు ని
ల్లాండ్రను గేలిసేయు జనులందఱు మెచ్చెడు నట్టి శైలితో”
“నాన్నగారూ! మీరడిగిన సమస్యను పూరించటం గురించి కాదు నా ఆలోచన, నేను కవిత్వం చెప్తుంటే మీరేమంటారో నని ఆలోచిస్తున్నాను. సాహసించి కావ్యం వ్రాసే పనికి పూనుకున్నాను. ఈ ఆడాళ్ళకు వంటింట్లో పాకాలను చేయటం ఉండగా ఈ కవిత్వ పాకాలతో పనేమిటి? అని ఇల్లాళ్ళను గేలి చేసే వాళ్లు కూడా మెచ్చే శైలిలో వ్రాయాలనుకుంటున్నాను” అంది మోహనాంగి.
“అన విని యెట్టెటూ పలుకవమ్మ మఱొక్కతఱిం బ్రబంధ మీ
వొనరుప నింతకాలమున కూహయొనర్చితె? యెంత చెప్పినన్
వినకయ యుంటి విందనుక వీనుల విందుగ నీదుకబ్బ మో
తనయ, వినంగ నబ్బును కదాయని, నిత్యమపేక్ష చేయుదున్”
“ఏంటేంటీ మరోసారి చెప్పూ! ప్రబంధం వ్రాయాలనే ఊహ ఇన్నాళ్లకు కలిగిందా? ఇన్నాళ్లనుండి ఎన్నిసార్లు ఇలాంటి ప్రయత్నం చెయ్యమని నీకు చెప్పాను..? ఇప్పటికి వీనుల విందైన గ్రంథాన్ని వ్రాయాలనిపించిందా? ఎప్పుడు నీ పద్యాలను విని ఆనందిద్దామా అని ఎదురుచూస్తాను” అన్నారట రాయలవారు.
“చదువుల సరస్వతివి, నీ
మృదు కవితాశైలి స్త్రీలకే యననేలా
తుదకుం గొమ్ములు తిరిగిన
మదవత్కవి పుంగవులకు మహినిఁ గలుగునే”
“స్త్రీ లన్నంతనె చుల్క చేయుటకు కుమారీ మౌఢ్యమే సుమ్మునా
రీలోకంబున శేముషీయుతలు లేరే, పూర్యమింతేటికిన్”
“చదువుల తల్లీ! నీ మృదు కవితాశైలి స్త్రీలకే కాదు కొమ్ములు తిరిగిన కవి పుంగవులక్కూడా నచ్చుతుంది. స్త్రీ లనగానే చులకన చేయటం మన వాళ్లలో ఉన్న కుమారీ మౌఢ్యమే సుమా! నారీ లోకంలో అశేష శేముషీయుతలు లేరా..?” అని రాయలవారు ప్రోత్సహించా రామెని! 500 యేళ్ల నాటి స్త్రీవాదానికి ఈ ఘటన ఒక తార్కాణం.
మోహనాంగి కల్పిత పాత్రా?
“మోహనాంగి వ్రాయనూ లేదు, చారిత్రక ప్రామాణికతా లేదు” పేరుతో 2-11-75 జమీన్ రైతు వారపత్రికలో ఆరుద్రగారు మారీచీ పరిణయము కావ్యాన్ని ఒక కూట సృష్టిగా తీవ్రంగా ఖండించారు. చరిత్రకారులు రాయలవారికి తిరుమలాంబ అనే కూతురు, తిరుమల దేవరాయలనే కొడుకూ ఉన్నారని అంగీకరిస్తున్నారు. అందుకు చాలినంత ఆధారాలను సమీకరించారా?
ఆంధ్రకవుల చరిత్రములో కందుకూరి వీరేశలింగంగారు “కృష్ణరాయుడి కొమార్తెలును సంగీత సాహిత్యముల యందు నిపుణు రాండ్రనియు రామరాజు భార్య యైన మోహనాంగియను నామె ‘మారీచీపరిణయ’మను నైదాశ్వముల శృంగార ప్రబంధము రచించెననియు ఒకరు వ్రాసి యున్నారు. గాని మాకా గ్రంథము లభింపకపోవుట చేత నిది యిట్లని నిశ్చయింప జాలకున్నాము. కృష్ణరాయని యల్లు డయిన రామరాజు భార్య పేరు మోహనాంగి యైనట్లు సైతము గానబడదు, అయినను మోహనాంగి యను పేరు తిరుమలాంబకు నామాంతరమై యుండవచ్చును” అని రాశారు.
1829లో కావలి రామస్వామి ప్రచురించిన ‘ది డెక్కన్ పొయెట్స్’ గ్రంథంలో మోహనాంగి అనే కవయిత్రి గురించి వ్రాసిన పరిచయ వాక్యాలు ఈ వివాదం మొత్తానికి మూలకారణం.
“This poet was a princess, and the Daughter of Krishnadevaraya. She received an excellent education in her infancy and was well versed in rhetoric and poetry, while in the bloom of youth she married ramarayalu, after which she still continued her studies and employed much of her time in reading those works in Telugu composed by poets at her father`s Court; by constant application she attained to considerable proficiency, in the art of verification and wrote a poem entitled “marichi parinayam’, the subject of which is taken from Mahabharat, In this poem very elegant description is given on the Marichi damsels, the work consists of five books; this princess had no issues and became unfortunately a widow in the prime of life. According to tradition, she was immolated on the funeral pile of her husband (Deccan Poets).
మారీచీ పరిణయం వ్రాసిన మోహనాంగి కృష్ణదేవరాయలవారి కూతురని, చిన్ననాడే సాహిత్యం ఇతర కళలు నేర్చిందనీ, రామరాయల్ని పెళ్లి చేసుకుందని, భువన విజయంలో కవుల రచనలను బాగా అధ్యయనం చేసేదనీ, 5 అధ్యాయాలు కలిగిన మారీచీ పరిణయ కావ్యాన్ని వ్రాసిందని, అళియరామరాయల మరణంతో సహగమనం చేసి అశువులు బాసిందనీ కావలి రామస్వామి గారు అందించిన సమాచారం.
200 యేళ్ల క్రితం పరిశోధనలు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కావలి బొర్రయ్యగారు వేసిన బాటలో వెలువడిన ఆనాటి పరిశోధనా గ్రంథం ఇది. ఈ రెండు వందల యేళ్ళలో అనేక నూతన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అంత మాత్రాన తెలిసి తెలియక వ్రాసినవాడిగా ఆ పరిశోధనా పితామహుణ్ణి చులకన చేయటం సబబు కాదు.
అయితే మారీచుడి వృత్తాంతం రామాయణంలోది కాగా ఈయన మహాభారతం ఆధారం అనటం వలన మొత్తం మోహనాంగినే కల్పితంగా కొట్టిపారేశారు పండితులు. నిజానికి మారీచీ పరిణయం పుస్తకానికి అవతారిక పద్యాలే దొరుకుతున్నాయి. అసలు కావ్యం ఎలా ఉందో, అందులో ఇతివృత్తం ఏమిటో ఎవరికీ తెలీదు. తోకని పుచ్చుకుని ఏనుగు అనేది పాములా ఉంటుందని చెప్పిన ఐదుగురు అంధుల కథలా ఉండకూడదు విమర్శ.
పరిష్కర్త పైన నింద
కావలి రామస్వామి గారి తరువాత సరిగ్గా వందేళ్లకు గాజుల లక్ష్మీనరసింహ సెట్టి 1929-30 శుక్లనామ సంవత్సరం సమదర్శిని పత్రికలో తన మిత్రుడి ఇంట దొరికిందంటూ, మారీచీ పరిణయం అవతారిక పద్యాల్ని, 4వ అధ్యాయంలో కొన్ని పద్యాల్ని ప్రచురించాడు.
“నష్టమై పోయిందనుకున్న ఒక గ్రంథం దొరికినప్పుడు సాహితీపరులు ముఖ్యంగా సాహిత్య చరిత్రకారులూ ఎగిరి గంతులు వేయాలి. సంబరపడాలి. అందులోనూ కృష్ణరాయల గురించి కొత్త చారిత్రకాంశాలు లభించే అవతారిక దొరికితే ఉప్పొంగిపోవాలి. అయితే చరిత్రకారులు గాని, సాహిత్య చరిత్రకారులు గానీ ఇవేం చేయలేదు. చూసీ చూడనట్టు ఊరుకున్నారు. ఎందువల్లనంటే సెట్టి లక్ష్మీనరసింహం గారి ‘విఖ్యాతి’ అటువంటిది” అని ఆరుద్ర కటువుగా జమీన్ రైతు పత్రికలో మారీచీ పరిణయం అవతారిక పద్యాల్ని గాజుల లక్ష్మీనరసింహ శెట్టి కూట సృష్టి చేశాడని నిందించారు. చిలకమర్తివారు తనతో జమీందారుగారు స్వయంగా గాజుల నరసింహ శెట్టి రాస్తుండగా తాను చూశానని చెప్పినట్టు ఆరుద్ర తన వాదనకు సాక్ష్యంగా వేసుకున్నారు.
గాజుల వారు గతంలో శృంగార శ్రీనాథ అనే పుస్తకాన్ని ప్రచురిస్తే, చిలకమర్తివారు ఆది శ్రీనాథుడికి సంబంధం లేనిదని ఖండించారు. కాబట్టి ఇది కూడా అటువంటిదే ననే అబిప్రాయానికి ఆరుద్రగారు వచ్చి ఉండవచ్చు. కానీ చిలకమర్తివారు ‘మహాపురుషుల జీవితములు’ పేరుతో వ్రాసిన ప్రముఖుల జీవిత చరిత్రల్లో గాజుల వారి చరిత్రను కూడా ఘనంగా చిత్రించిన వైనాన్ని మరచిపోకూడదు. చిలకమర్తి వారి టకార ప్రయోగాలు ఆరుద్రగారికి ఆకరాలు కాకూడదు.
ఫోర్జరీ లేదా కూటసృష్టి చేసే వ్యక్తి బహిరంగంగా నలుగురికీ చూపించే వ్రాశాడంటే నమ్మలేము. ఒకవేళ ఎత్తి నకలు తయారు చేస్తుంటే జమీందారుగారు చూశాడేమో తెలీదు. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారుల కుటుంబం గాజులవారిది. బహుశా రాయలవారి పట్ల కులాభిమానం ఆయన్ని మోహనాంగి కావ్యాన్ని పరిచయం చేయటానికి ప్రోద్బలించి ఉండవచ్చు.
అంతమాత్రాన నిష్కళంక దేశభక్తుడు, తొలితరం జాతీయోద్యమ నాయకుడు గాజుల వారి మీద ఆరుద్రగారు నిరాధార అభాండం వేయటం, ఆయన వివేకాన్ని హేళన చేయటం బాధాకరమే అనిపించింది.
గాజుల లక్ష్మీనరసు శ్రేష్ఠి నీలిమందు, పత్తి వ్యాపారి. మద్రాసు నగరం ధనికుల్లో ఒకడు. తరువాత సంఘసేవా కార్యక్రమాల్లోకి వచ్చాడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. 1844 అక్టోబరు 2న లక్ష్మీనర్సు శెట్టి హిందువుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన క్రెసెంట్ పత్రికను స్థాపించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రికగా ఇది చరిత్రకెక్కింది. మతం మారినంత మాత్రాన హిందూ వారసత్వ హక్కులు కోల్పోడని బ్రిటిష్ వారు మతమార్పిడి అనుకూల చట్టం తెస్తే, కోర్టులో పోరాడి ఆ చట్టాన్ని రద్దు చేయించాడు. స్త్రీ విద్య కోసం ఎక్కువ పాటుబడ్డాడు. మద్రాస్ ప్రావిన్సులో మరో రాజా రామ్మోహనరాయిగా ఆయన ప్రసిద్ధి పొందారు. కానీ, “ఆయన ‘విఖ్యాతి’ అటువంటిది” అని ఆరుద్రగారు ఆయన్ని అంత వ్యంగ్యంగా ఎందుకన్నారో, ఈ పుస్తకం నమ్మదగినది కాదని ఎలా అన్నారో ఆశ్చర్యమే!
పరవస్తు చిన్నయ సూరి తండ్రి రంగరామానుజాచారి వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన్ని ఈస్టిండియా కంపెనీ కేసుల విషయంలో తన న్యాయవాదిగా నియమించుకున్నారు గాజులవారు. 1836లోనే రామానుజాచార్యులవారు మరణించారు. కానీ 1853 జూలైలో శబ్దలక్షణ సంగ్రహాన్ని చిన్నయ సూరిగారు గాజుల లక్ష్మీనరసింహ శ్రేష్ఠిగారికి అంకితం ఇచ్చాడని JAHRS-XXIV సంచికలో “More Light on Gajula Lakshminarasu Setti” అనే వ్యాసంలో వై. విఠల్ రావు పేర్కొన్నారు.
ఈ గ్రంథాన్ని 1953లో ఆ అంకితం పేజీ తీసేసి కొండవీటి వెంకట కవి ప్రచురించారు. అలా ఎందుకు చేశారో తెలీదు. దానికి ముందు మాటలు వ్రాసిన వఝల చిన సీతారామశాస్త్రి ఈ రచన సూరిగారిది కాదంటూ కర్రి సాంబమూర్తిగారు చేసిన వాదనని ఖండించారే తప్ప, పరవస్తు రంగరామానుజాచార్యులకు అంకితాన్ని ఎత్తేయటం గురించి ప్రస్తావించలేదు.
గాజులవారు పద్యాలు అవలీలగా వ్రాయగలిగిన కవిపండితుడు ఎంతమాత్రమూ కాదు. ఆయన స్వాతంత్ర సమర యోధుడు. సామాజికవాది! హిందూ సమాజ అభ్యున్నతికి పాటు పడే వ్యక్తి. అంతే గాని కవి కానే కాడు. సాహిత్యాభిమానం ఉన్నవాడు. ఆయనే రాయలవారి చరిత్రని మోహనాంగికి అంటగట్టి ఆ పద్యాలన్నీ వ్రాశాడనటానికి తార్కాణాల్ని ఆరుద్ర సహా ఎవరూ చూపించలేదు. గాజులవారు కూట సృష్టి చేశాడన్నది నమ్మశక్యం కాని విషయం.
డబ్బున్నవాడు కాబట్టి ఎవరితోనో డబ్బిచ్చి వ్రాయించి ఉంటాడని మాటవరసకు అనుకున్నా, గాజులవారు దీన్ని ప్రచురించటానికి వందేళ్ళ ముందే ఆ పుస్తకం ఉందని కావలి రామస్వామి వ్రాసిన ఆధారం ఉంది కదా! గాజులవారే సృష్టించారనటం తొందరపాటు అవుతుంది.
“ఒకవేళ అది ఉంటే అదీ ఇదీ ఒకటి కాదు” అన్నారు శ్రీ ఆరుద్ర. ఆ ఇంకొకటి దొరికే వరకూ గాజులవారిని కించపరచటం సబబు కాదనే నా భావన.
కూటసృష్టి చేస్తే అందువలన గాజుల వారికి ఒనగూరిన ప్రయోజనాన్ని ఆరుద్ర గారు నిరూపించలేదు.
ఒక వేళ మోహనాంగి పేరుతో ఎవరైనా ఈ కావ్యాన్ని కూట సృష్టి చేసారనుకున్నా అది కూడా 400 యేళ్ల క్రితమే జరిగి ఉండాలి. ఇటీవలి కవి ఎవరో కల్పించినదిగా భావించటం కూడా తొందరపాటేననిపిస్తుంది.
మొత్తానికి తర్కానికి నిలవనిదిగా మోహనాంగి పాత్ర మిగిలి పోయింది.

డా. జి. వి. పూర్ణచందు విజయవాడ వాస్తవ్యులు, ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు, వివిధ సాహిత్య ప్రక్రియలలో సృజనాత్మక, సామాజిక, వైఙ్ఞానిక రచనలు చేసిన సాహితీవేత్త. 130 పుస్తకాలు వివిధ ప్రచురణ సంస్థల ద్వారా ప్రచురితం అయ్యాయి. 50 అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కీలక ప్రసంగం, సభాధ్యక్షత లేదా, పత్రసమర్పణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న ‘హంస’ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం, సద్గురు శివానంద మూర్తి వికారి నామ సంవత్సర శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం, మద్రాస్ విశ్వవిద్యాలయం ఆర్కాటు ప్రసాదరావు ధర్మనిథి పురస్కారం ఇంకా 50కి పైగా సంస్థల పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు 4 పర్యాయాలు ప్రధానకార్యదర్శిగా వ్యవహరించారు.