నువ్వూ.. నేనూ
హాయ్.. అనుకోవడం తప్ప,
కలుసుకునేది తక్కువ!
అందుకే
సమయం చిక్కితే చాలు,
వీలు కుదిరిందంటే..
ఏమేమో చాట్ చేసేస్తాం,
ఆనంద లోకాల్లో..
తేలిపోతుంటాం!
ఎందుకో..
అతిగా చాట్ అయిందంటే,
ఆ.. రోజు..
తప్పకుండా..
ఏదో అంశంలో ..
అపార్థం అంకురిస్తుంది ,
ఆ.. కొంచెం ఆనందం,
విషాదాంతంగా
రూపాంతరం చెందుతుంది!
అందుకే నేనంటానూ,
అత్యుత్సాహంగా
చాటింగులు ఎందుకు?
అపార్థాల..
విషాద
వలయాలేందుకు?
మనసు పాడుచేసుకుని,
మౌనవ్రతాలెందుకు?
ప్రేమను ప్రేమగానే
ప్రేమించుకుంటూ,
అపార్థాల అనర్థాలకు
తావులేకుండా..
చాటింగుల పర్వం,
అదుపులో ఉంచుకోవాలి!
అప్పడప్పుడూ..
హాయిగా..
ప్రత్యక్షంగా మాట్లాడుకోవాలి,
అనుభవాలను,
ఆదర్శంగా మలుచుకోవాలి!!

వృత్తిరీత్యా వైద్యులు, ప్రవృత్తి రీత్యా రచయిత అయిన డా. కె.ఎల్.వి. ప్రసాద్ పుట్టింది, పెరిగింది తూర్పు గోదావరి జిల్లా దిండి గ్రామం. హైస్కూలు విద్య పాక్షికంగా అప్పటి తాలూకా కేంద్రం రాజోలులో. తదుపరి విద్య నాగార్జున సాగర్ (హిల్ కాలనీ), హైద్రాబాదులలో. వారి అన్నయ్య కె.కె.మీనన్ స్వయంగా నవలా/కథా రచయిత కావడం వల్ల, చిన్న వయస్సులోనే పెద్ద పెద్ద రచయితల సాహిత్యం చదువుకున్నారు. ఇంటర్మీడియట్ నుండే కవితలు రాయడం మొదలుపెట్టారు. 1975 నుండి వ్యాసాలు రాస్తున్నారు. 1983 నుండి కథలు రాస్తున్నారు. ఉద్యోగ రీత్యా హన్మకొండలో స్థిరపడ్డారు. వరంగల్ “సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ”కు వరుసగా 15 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉన్నారు. 2011లో కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో సివిల్ సర్జన్‌గా రిటైర్ అయ్యారు. “కె ఎల్వీ కథలు”, “అస్త్రం”, “హగ్ మీ క్విక్”, “విషాద మహనీయం” (స్మృతి గాథ) వంటి పుస్తకాలను వెలువరించారు.