అన్నపూర్ణగా పేరుగాంచిన
నా అఖండ భారతావనికి
వెన్నెముక వాడు.
మోయలేని ఆ బిరుదు బరువు
మోస్తున్న పాపానికి
ప్రకృతిచే శాపానికి గురయ్యాడు.
పైరుసాగుకు పట్టే చీడకు
ధర దక్కనీయని దళారుల పీడకు
బలయ్యాడు.
కష్టానికి తనువు శల్యమై
తన బతుకు దైన్యమైనా
పాలకుల సాయం మాత్రం శూన్యమే.
మాయోపాయంతో
పద్మవ్యూహంలో ఏకాకిని చేసి
అభిమన్యుడిని చుట్టుముట్టిన
కౄర కౌరవసేనలా
ఉక్కిరిబిక్కిరి చేసి
ఊపిరాడనివ్వక రైతును
చుట్టుముట్టిన కష్టాలకు
పరిష్కారమార్గాలు రెండే.
పేనిన తాడు, పురుగుల మందు
ఛాయిస్ ఏదైనా
ఒకటి గొంతు మీదకు
మరోటి గొంతులోకి.
ఏదయితేనేం గొంతే
వొంచేస్తోంది వెన్నెముకను.
ఎంతైనా తను దేహంలో
వెన్నెముక కంటే పైనే కాదు
ముందుకూడా ఉందిగా మరి.
2 Comments
Vijay
Chaalaa baagundi
Kosinepalli Vs varaprasad
Good and fantastic poem medam