Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురానుభూతుల ‘నా వంగదేశ యాత్ర’

[శ్రీమతి రమా శాండిల్య గారి ‘నా వంగదేశ యాత్ర’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్.]

“ఆధ్యాత్మికతతో పాటు ఎన్నో ప్రత్యేకతలున్న ప్రాంతం పశ్చిమ బెంగాల్” అని వ్యాఖ్యానించారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి తమ ముందుమాటలో. రమగారి యాత్ర – వంగదేశంలోని ఆలయాలు, సాగర సంగమాలు, ఇతర పర్యాటక ప్రదేశాల సందర్శనంగా సాగింది.
సాధారణంగా ఒక ప్రదేశాన్ని చూడాలనుకుని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అదనంగా కొన్ని ఇతర ప్రదేశాలూ లిస్టులో చేరుతాయి. అలా గంగాసాగర్ పర్యటనగా మొదలైన ప్రయాణం, చుట్టు ప్రక్క ప్రాంతాలని కలుపుకుని ‘వంగదేశ యాత్ర’గా మారింది. జమ్‍షెడ్‌పూర్, రాంచీల సందర్శనం అదనం!!
ప్రధానంగా ఆలయాల సందర్శనంగా మొదలయిన ఈ యాత్రకి, కోల్‍కతా నగరంలోని చారిత్రక ప్రదేశాల సందర్శనం, షాపింగ్‌లు తోడయ్యాయి.
~~
హౌరా బ్రిడ్జ్ సందర్శనతో మొదలైన ప్రయాణం, కోల్‌కతా నగర జీవనాన్ని, వేగాన్ని, అక్కడి మనుషులని, వాళ్ళ ఇళ్ళని, వంటలని, ఆచారవ్యవహారాలని, పూజా విధానాలని, ఆతిథ్యపు అలవాట్లను ప్రదర్శిస్తుంది. ఐకానిక్ ట్రామ్స్ గురించి ప్రస్తావిస్తుంది.
హౌరా బ్రిడ్జ్‌ని చూస్తున్నప్పుడు, వంతెనల అవసరం చెప్తారు రమగారు. మామూలు వంతెనలు గురించి మాత్రమే కాదు, ‘మనసునూ మనసునూ కలిపే వంతెన’ల ఆవశ్యకతని వివరిస్తారు, ఎప్పుడైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు, తెరుచుకోడానికి సిద్ధంగా ఉండే వంతెనలు కావాలని చెప్తారు. నిజం కదా! కలవడం, విడిపోవడం, మళ్ళీ కలవడం.. ఈ ప్రక్రియ కొనసాగాలంటే, మనుషులని అంతరంగాలను కలిపే వంతెన తప్పనిసరి.
దక్షిణేశ్వరంలోని కాళీమాత ఆలయం దర్శించినప్పుడు, ఆ ఆలయ చరిత్రని వివరించటమే కాకుండా, ఆలయ నిర్మాణశైలిని చెప్తారు. రామకృష్ణ పరమహంస పూజించిన భవతారిణి అమ్మవారిని చూసినప్పుడు, మనలో ఏదో శక్తి ప్రవేశించినట్టు అనిపిస్తుందని అన్నారు రచయిత్రి.
అక్కడ్నించి గంగానదిని దాటి బేలూరు మఠం వస్తారు. అది సాయంకాల సమయం! గంగాతీరంలో సూర్యాస్తమయం చూడడం ఓ మధుర స్మృతి. రామకృష్ణుని ఆలయం, శారదామాత మందిరం, దర్శించుకుని, నరేంద్రుని స్మరించుకుని, గంగానది వద్ద కాసేపు కూర్చుని, చంద్రోదయం చూసి, అక్కడ్నించి బయల్దేరుతారు.
కాళీఘాట్ లోని కాళికాదేవి ఆలయానికి వెళ్తారు. ఆ రోజు హోళీ పండుగా కావడం వల్ల, ఆలయంలో పెద్దగా రద్దీ లేదట. మామూలుగా అయితే ఆ గుడి ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడిపోతుంది. ప్రశాంతంగా దర్శనం చేసుకుని, ‘దేనినైనా భరించగలిగే శక్తినివ్వమ’ని వేడుకుంటారు రచయిత్రి. సందర్భానుసారంగా ఆలయం గురించి ఎన్నో విలువైన విషయాలు అందించారు.
మర్నాడు ఉదయం గంగాసాగర్‌ ప్రయాణం! హిమాలయాలలో జన్మించిన గంగానది, పలు రాష్ట్రాలలో ఎన్నో నగరాలలో ప్రవహించి, చివరికి పశ్చిమబెంగాల్ లో సముద్రంలో కలుస్తుంది. గంగానది సముద్రంలో కలిసే చోటుని గంగాసాగర్ అంటారు. కలకత్తా నుంచి గంగాసాగర్‌కి వెళ్ళేదారిలో కపిలముని ఆశ్రమం ఉంటుంది. అది కూడా చూసుకుని వెళ్ళచ్చు. గంగమ్మ సాగరంలో కలిసే చోట స్నానం చేయటం వల్ల శరీరం, మనసు పునీతమవుతాయని ప్రతీతి. గంగాసాగర్ యాత్ర జీవితంలో ఒకసారైనా చేసి తీరాల్సిన ప్రయాణమని చెప్తారు రచయిత్రి. క్రితం సారి చేసిన గంగాసాగర్ యాత్రకీ, ఈసారి యాత్రకి మధ్య ఉన్న తేడాని రచయిత్రి తెలిపారు. నాలుగైదు వాక్యాలలోనే ఉన్నా, లోతుగా విశ్లేషిస్తే, ఎన్నో వివరణలు లభిస్తాయి. ఈ మార్పు గురించి రచయిత్రి ఏమన్నారో, వారి ప్రత్యేక ఇంటర్వ్యూలో చదవచ్చు.
తర్వాతి ప్రయాణం పాండువా లోని శృంఖలామాత ఆలయం. అష్టాదశ శక్తి పీఠాలలో మూడవదైన ఈ ఆలయం విశిష్టమైనది. కలకత్తా నుంచి సుమారు నాలుగు గంటల ప్రయాణం. ఆలయం ప్రత్యేకతని వివరిస్తూ, ఇది శక్తి-భైరవ ఐక్యతకు ప్రతీక అని తెలిపారు రచయిత్రి. శృంఖలం అంటే నడుముకు వేసుకుని కట్టు అనీ, అంటే అమ్మవారు నిత్యబాలింతలా తన పిల్లలను కాపాడుతుంటూందని ప్రజల విశ్వాసాన్ని వెల్లడించారు. ఆలయ ప్రాచీన చరిత్రనీ, ఆధునిక చరిత్రని వివరించారు.
అక్కడ్నించి తారకేశ్వరం వెళ్ళి, బాబా తారక్‌నాథ్ (శివుడు) ఆలయం సందర్శిస్తారు. ఆరోగ్యం, మోక్షం ప్రసాదించే దేవుడిగా కొలుస్తారీ శివుడిని. ఈ గుడికి వెళ్తున్నప్పుడు రచయిత్రికి ఒక ఎదురైన ఒక ఘటన, భారతీయ ఆధ్యాత్మిక విధానంలోని నిర్వికారతని పరిచయం చేస్తుంది.
తదుపరి మజిలీ తారాపీఠం! కాళిని తారామాతగా, భైరవభైరవిగా కొలిచే శక్తి పీఠం ఇది. ఇక్కడి అమ్మవారు రెండు రకాలుగా దర్శనమిస్తుందని చెప్తారు. ఇక్కడ సాధన చేసిన ‘భాము కేపాతో’ అనే తాంత్రిక సన్యాసి గురించి వివరిస్తారు. కాశీలోని మణికర్ణికలానే, ఇక్కడి శ్మశానం కూడా నిత్యాగ్నిహోత్రమని వ్యాఖ్యానించారు.
మరుసటి రోజున విక్టోరియా మ్యూజియం, నేతాజీ గృహం, రవీంద్రుని ఇల్లు చూశారు. నేతాజీ ఇంటిని ప్రభుత్వం కాపాడుతున్న తీరుని మెచ్చుకున్నారు. అక్కడ ఏమేం చూడాలో, ఎలా చూడాలో చక్కగా చెప్పారు. అక్కడ్నించి రవీంద్రుని ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఏదో పులకింత కలుగుతుందని అన్నారు. ఆయనని కలిసిన మనుషులు, ఆయన రాసిన కవితలు, చదివిన పుస్తకాలు, గీసిన చిత్రాలు అన్నీ సందర్శకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా, రవీంద్రుని తలచుకోగానే భారతీయత రూపుకట్టిన మూర్తి మనసుకి గోచరిస్తుందని అభిప్రాయపడతారు రచయిత్రి. పాఠకులూ అవునంటారు.
తర్వాత శాంతినికేతనం! భారతీయులు, ముఖ్యంగా స్వేచ్ఛావిద్యను ఇష్టపడేవాళ్ళు తప్పనిసరిగా సందర్శించాల్సినది శాంతినికేతనం! రవీంద్రుని ఆశయాలు, బోధనా పద్ధతులు ఎందరెందరినో ఇక్కడికి రప్పించాయి. అయితే ఈసారి శాంతినికేతనం సందర్శనం రచయిత్రికి కొంత నిరాశని కలిగించిందని అంటారు. ఎందుకో, ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.
తర్వాత టాటానగర్ వచ్చి, రైల్లో ప్రయాణం చేసి, దేవ్‌ఘర్ చేరుతారు. స్థానిక బైద్యనాథ్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం జ్యోతిర్లింగ క్షేత్రంగా, శక్తి పీఠంగా పూజలందుకోవడం విశేషం. సతీదేవి హృదయం పడిన స్థలం ఇదేనని అంటారు. ఇక్కడి శివుడు ఆరోగ్య ప్రదాత అని, అందుకే వైద్యనాథ్ అని అంటారని చెబుతారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే, అనారోగ్యాలు దూరమవుతాయని ప్రజల విశ్వాసం. స్థల పురాణాన్నీ, ఆలయ చరిత్రని సందర్భోచితంగా వివరించారు రచయిత్రి.
టాటానగర్ నుంచి ఝార్కండ్ లోని బూంద్ వెళ్ళి అక్కడి సూర్య దేవాలయాన్ని సందర్శిస్తారు. ఆ ఆలయంలో కలిగిన అనూభుతిని పంచుకుంటారు. దశమ అనే గ్రామం సమీపంలోని జలపాతాన్ని చూస్తారు, పాఠకులకూ చూపిస్తారు. తదుపరి రాంచీ లోని యోగానంద ఆశ్రమానికి వెడతారు. స్వామీ యోగానంద స్థాపించిన ఆశ్రమం ఎంతో ప్రసిద్ధి చెందింది. క్రియాయోగ శిక్షణ ఇక్కడ్నించే ప్రారంభమైందని అంటారు. రాంచీ పర్యటనలో నలుగురితో ఉన్నా కూడా ఎందుకో ఒంటరితనం అనుభవంలోకి వచ్చిందంటారు రచయిత్రి. ఎందుకో, ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.
అక్కడ్నించి టమర్, దేవిడిలు చూసుకుని తిరిగి, టాటా నగర్ చేరుకుంటారు.
తదుపరి మజిలీ బిష్ణుపూర్! కలకత్తా యాత్రలో చివరి గమ్యం! ఇది ఛిన్నమస్తాదేవి క్షేత్రం! ఈ క్షేత్రంలో రచయిత్రికి ఎదురైన అనుభూతి గొప్పది. డబ్బుని అత్యంత నిర్వికారంగా అమ్మవారి పళ్ళెంలో పడేసిన పూజారి ఈ ఆలయంలో తారసపడతారు. ఈ ఊరు చేనేత చీరలకి ప్రసిద్ధి.
~
యాత్రలు చేసేడప్పుడు, ముందుగా కొన్ని ప్రదేశాల గురించి ఎంతో ఊహించుకుని వెడతాం, తీరా వెళ్ళాకా, ఊహకీ వాస్తవానికి ఎంతో వ్యత్యాసముంటుంది. అలాంటి సందర్భాలలో నిరాశకు లోనుకాకుండా, ఆనందానుభూతులు లేవంటూ, ఆ ట్రిప్‌ని విస్మరించకుండా, మిశ్రమానుభవాలను సైతం పాఠకులకు అందివ్వడం బావుంది.

ఇది మామూలు భక్తి పర్యటనలానో లేదా ట్రావెలాగ్ లానో అనిపించినా, ఈ బాహ్య ప్రయాణంతో పాటు రచయిత్రి ఆంతరిక ప్రయాణాన్ని కూడా ఒడిసిపట్టిన రచన అని చెప్పవచ్చు. చాలా సందర్భాలలో వివిధ ప్రదేశాలలో రచయిత్రి తనలో తాను తరచి చూసుకోవడం కనబడుతుంది. కొన్ని అనుభూతులకు లోనైనప్పుడు అవి భౌతికమైనవి కాకుండా ఆంతరికమైనవని చదువరులు గుర్తిస్తారు.

~
“ఒక ఊరిని చూడడం అంటే, ఆ ఊరిని పరిచయం చేసుకోవడం” అని రమా శాండిల్య గారు చివరి వ్యాసంలో చెప్పారు. ఈ మాటలు అక్షర సత్యాలు. కళకళాలాడే ‘కళ-కత్తా’ (కోల్‌కతా) నగరాన్ని, ఇతర ప్రదేశాలని అక్షరాలతో రూపుకట్టి పాఠకుల ముందు పరిచారు.
చదివి, భద్రపరుచుకోవాల్సిన పుస్తకమిది అని అనడంలో అతిశయోక్తి లేదు.

***

నా వంగదేశ యాత్ర (కళ-కత్తా)
రచన: రమా శాండిల్య
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్, హైదరాబాద్
పేజీలు: 120
ధర: ₹ 150/-
ప్రతులకు:
అచ్చంగా తెలుగు బుక్స్, హైదరాబాద్
ఫోన్: 8558899478 (వాట్సప్ మాత్రమే)
నవోదయ బుక్స్,
కాచీగుడా, హైదరాబాద్
ఫోన్: 9000413413
రచయిత్రి: 9618766600

 

~
రమా శాండిల్య గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mrs-rama-sandilya/

Exit mobile version