Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాన్నకు పాఠం చెప్పిన బుడతడు

[బాలబాలికల కోసం ‘నాన్నకు పాఠం చెప్పిన బుడతడు’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]

పిల్లలూ, అమ్మా, నాన్నా, టీచర్లూ, ఇలా పెద్దవాళ్ళంతా సమయం దొరికితే చాలు.. పిల్లలకి పాఠాలు చెబుతూనే వుంటారు కదా. ఈ పెద్దవాళ్ళెప్పుడూ ఇంతే అనుకుంటాము కదా. అయితే మీలాంటి బుడతడొకడు జగాన్నేలే జనకుడికి పాఠం చెప్పాడురా. ఆ కథ చెప్పనా?

పరమ శివుడు, మహా శివుడు అంటూ మన పెద్దవాళ్ళు రోజూ పూజ చేస్తూ వుంటారు కదా శివుడికి. అదేనర్రా.. మూడు కళ్ళుంటాయి.. నంది ఎక్కి తిరుగుతాడు.. ఆ.. ఆ.. వినాయకుడి వాళ్ళ నాన్న.. ఆయనకే పాఠం చెప్పాడీ బుడతడు. ఎవరో తెలుసా? కుమారస్వామి.. అంటే వినాయకుడి తమ్ముడు. ఆయననే సుబ్రహ్మణ్యుడు అని కూడా అంటారు. ఆయన వాళ్ళ నాన్నకేం పాఠం చెప్పాడో మీకూ తెలుసుకోవాలని వుంది కదా? సరే. ఆ కథ చెప్తాను.

చిన్న పిల్లలు దేవుళ్ళయినా సరే! అల్లరి చేస్తారు. కదా? అది చిన్న పిల్లల హక్కు. ఒకసారి కుమారస్వామి ఆడుకుంటుండగా బ్రహ్మ దేవుడు అటువైపు వచ్చాడు. ఆయనని చూసిన కుమారస్వామి సరదాగా మాట్లాడదామనుకున్నాడు.

“బ్రహ్మ దేవా, నాకో చిన్న సందేహం తీరుస్తారా?” అని అడిగాడు.

చిన్న పిల్లవాడు ముద్దుగా అడుగుతున్నాడు. సృష్టికర్తనైన నేను ఇతని సందేహం తీర్చకపోతే ఎలా అనుకుని బ్రహ్మదేవుడు “అడుగు బాబూ, చెప్తాను” అన్నాడు.

మనవాడు ఈ ఆట ఎలా ఆడాలి అన్నంత తేలిగ్గా అడిగాడు ఓంకారానికి అర్థం చెప్పమని. బ్రహ్మగారు సరిగా అర్థం చెప్పలేక పోయారు. దానితో కుమారస్వామి బ్రహ్మగారిని బందీ చేశాడు. బ్రహ్మగారు సృష్టికర్త అంటే ప్రపంచాన్ని సృష్టించేవాడు. ఆయనని బంధించే సరికి ఆయన చేసే సృష్టి ఆగిపోయింది. దేవుళ్ళయినా సరే ఎవరి పని వారు చేస్తేనే ప్రపంచం సరిగా సాగుతుంది. సృష్టి ఆగిపోయేసరికి ప్రపంచం అల్లకల్లోలం అయింది. దేవతలంతా శివుడి దగ్గరకి వెళ్ళి రక్షించమని అడిగారు. అందరూ కలిసి కుమారస్వామి దగ్గరకు వచ్చారు.

తండ్రి అడిగితే కుమారస్వామి ధైర్యంగా సమాధానం చెప్పాడు. నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదు. అందుకే ఒప్పందం ప్రకారం బందీని చేశాను అన్నాడు.. తన తప్పేమీ లేదన్నట్లు. మీలాంటి పిల్లలెప్పుడూ నిజమే చెప్తారు కదా! శివుడు ఏమీ చెయ్యలేక పెద్దవాళ్ళడిగేటట్లే అడిగాడు.

“అయితే దానర్ధం నీకు తెలుసా? తెలిస్తే చెప్పు” అన్నాడు. మన డింభకుడేం సామాన్యుడా?

“సరే చెప్తాను. అయితే నేను చెప్పేవాణ్ణి, నువ్వు వినేవాడివి.. అంటే నేను గురువుని, నువ్వు శిష్యుడివి. ఏదో పిల్లవాడు చెప్తున్నాడు అని కాకుండా శ్రధ్ధగా వింటే చెప్తాను” అన్నాడు..

కొడుకులతో ఆడటం తండ్రులకి సరదానేకదా. శివుడు ఉత్సాహంగా “ఏం చెప్తావో చెప్పు. నేనూ వింటాను శ్రధ్ధగా..” అన్నాడు. తండ్రి ఉత్సాహాన్ని చూసి కొడుకు ఇంకా ఉత్సాహంగా ఓంకారం అర్థాన్ని విపులంగా చెప్పాడు. అందరికీ అర్థం కాని ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని అంత విపులంగా కుమారస్వామి వివరిస్తుంటే శివుడు పరవశుడై విన్నాడు.

ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు తండ్రికి గురువైనాడు. కుమారస్వామి అయ్యాడు. శివుడు జగత్తుకే స్వామి.. అలాంటి స్వామికి నాథుడై, అంటే గురువై బోధించాడు గనుక ఇక్కడ సుబ్రహ్మణ్యుడిని స్వామినాథుడంటారు. ఇది జరిగింది తమిళనాడులో తంజావూరు జిల్లాలో స్వామిమలైలో. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పెద్ద ఆలయం వుంది. ఆ ఆలయం మెట్లెక్కుతూ వుండగా మీరీ సన్నివేశానికి సంబంధించిన శిల్పాన్ని చూడవచ్చు.

Image Courtesy: Internet

Exit mobile version