

(తిస్రగతి 6 / 6 / 6 / 6)
అమ్మకడుపులో నినుగని
కులుకుతుంది నాన్నేగా
పుట్టగానె నిన్నుచూసి
మురుస్తుంది నాన్నేగా
ఆనందం వెల్లివిరియ
గంతులేసి నాట్యమాడి
నీముఖంలో ముఖంపెట్టి
పిలుస్తుంది నాన్నేగా
నీమోమున బోసినవ్వు
మనసంతా పరవశింప
మనసారా ముద్దులాడి
మెరుస్తుంది నాన్నేగా
తప్పటడుగు లేసినపుడు
చేయిపట్టి నడకనేర్పి
నీతోడై ఆసరాగ
నిలుస్తుంది నాన్నేగా
కొద్దిసేపు నడవగానె
కాళ్ళన్నీ నెప్పెడితే
భుజాలపై నిన్నెత్తుకు
నడుస్తుంది నాన్నేగా
క్లాసులోన ఫస్టువస్తె
మిఠాయిలను తినిపించుతు
కనులనిండ బాష్పాలను
నింపుకుంది నాన్నేగా
నిరంతరం నీబాగుకు
తపించుతూ శ్రమించుతూ
నీవిజయం తనదేనని
పలుకుతుంది నాన్నేగా
చదువువంక మీదనువ్వు
విదేశాల కెల్లిపోతె
దిగులుపడుతు దీనుడౌతు కుములుతుంది నాన్నేగా
నీకోసమె కలవరించి
బాధంతా ఉగ్గబట్టి
నువ్వురాక ప్రాణాలను
విడుస్తుంది నాన్నేగా..
(ఇది ఒక నాన్న కథ. అనేక మంది నాన్నల వ్యథ. నాన్న గొప్పతనం మనిషికి తను నాన్న అయినప్పుడే తెలుస్తుంది. నాన్నకు ప్రేమతో..)

శ్రీ పారుపల్లి అజయ్ కుమార్ పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకులు. ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణవాసి.
సాహిత్యం అంటే ఇష్టం. నవలలు చదవటం మరీ ఇష్టం. పదవి విరమణ తరువాత సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మంలో ‘పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట – చావా రామారావు మినీ రీడింగ్ హాల్’ పేరిట ఒక చిన్న లైబ్రరీని తమ ఇంటి క్రింది భాగంలో నిర్వహిస్తున్నారు. సుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి. నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు.. రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు.
ఉచిత లైబ్రరీ.. మంచినీరు, కుర్చీలు, రైటింగ్ ప్యాడ్స్, వైఫై, కరెంటు అంతా ఉచితమే. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల దాకా ఉంటారు.