Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నడవాలని వుంది

[మణి గారు రాసిన ‘నడవాలని వుంది’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

ట్రాఫిక్ జామ్‌తో, ఆ ప్రదేశం అంతా హడావిడిగా వుంది. పొలీసులు అందరిని అదలిస్తున్నారు.. “పక్కకి తొలగండి!..”. “పక్కకి తొలగండి!”, అంటూ. ట్రాఫిక్ అంతా ఎక్కడది అక్కడ ఆగిపోయింది. ట్రాఫిక్ ఎంతకి క్లియర్ కాకపోవడంతో కారులో వున్న సూర్యానికి అసహనంగా అనిపించింది. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేడప్పుడు, ఎంత తొందర గా వెళ్దామా అని వుంటుంది. అందరికి అదే తొందర వుండడంతో, అందరూ అసహనం గానే వుంటారు. ట్రాఫిక్ జామ్స్ ఏ కారణం వల్ల అయినా ఓర్చుకునే పరిస్థితిలో ఎవరూ వుండరు..

సూర్యం కూడా అదే పరిస్థితిలో వున్నాడు. ఇల్లు కూడా దగ్గర పడడంతో అనుకోని విధంగా ఎదురయిన ఈ ట్రాఫిక్ జామ్‌కి అతనికి అసహనంగా అనిపించింది.

పక్కనే ఆగివున్న స్కూటర్ పైన వున్న వ్యక్తిని, “ఏమయింది ట్రాఫిక్ జామ్ అయింది?.. ఇంత సేపు పడుతోంది?..” అని అడిగాడు.

అతను “ఏమోనండి!!..” అంటూ స్కూటర్ మీద నుంచే మెడ కాస్త సాగతీసి ముందుకు చూసాడు ఏమయినా కనిపిస్తుందేమో అని..

అంతలో ఒక వ్యక్తి వెనకకి నడుస్తూ.. “క్లియర్ చేస్తున్నారు లెండి..” అంటూ సమాధానం చెప్పాడు.

“ఏమయింది?” ఇంకో వ్యక్తి అడిగాడు, కుతూహలంగానూ, అసహనం గానూ.

“ఒక పెద్ద అవిడ స్కూటర్ తగిలి పడిపోయింది..”

“అయ్యో! ఆవిడకి ఏమీ అవలేదు కదా?..”

“అదృష్టం! ఏమీ అవలేదు.. పడిపోయింది అంతే.. షాక్‌గా వుంటుంది కదా. అందులోనూ పెద్ద ఆవిడ. తొందరగా లేవలేదు కదా! అందరూ సాయం చేయాల్సి వచ్చింది.. ఆవిడ లేచింది లెండి.. ఇంక క్లియర్ చేస్తారు..”

వాళ్ళల్లో వాళ్ళు అక్కడ వున్న అందరూ మాట్లాడుకుంటున్న ఆ మాటలు సూర్యం చెవిన కూడా పడ్డాయి. తొందరగా క్లియర్ అవుతే బాగుండును అనుకుంటూ ముందుకి చూస్తున్న సూర్యానికి ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది. దూరంగా ఎర్ర జరీ అంచు పసుపు చీరలో ఒక ఆవిడని అందరూ పక్కకి నడిపిస్తున్నారు.

‘ఆ చీర తను అమ్మకి కొన్న దానిలానే వుంది.. కొంప తీసి అమ్మ కాదు కదా..’ అనుకుంటూ కారు ఇంజన్ ఆఫ్ చేసి కారు తలుపు తీసి, బయటకి వచ్చి, ముందుకు నడిచాడు కంగారుగా..

దగ్గరకి వెళ్ళిన సూర్యం ఇద్దరు వ్యక్తులు పక్కకి నడిపిస్తున్న అవిడ తన తల్లే అవడంతో ‘అమ్మా!’ అంటూ ఒక పెద్ద కేక వేసాడు. ఆ కేకకి అందరూ సూర్యం కేసి చూసారు.

ఆవిడ కూడా అతని కేసి చూసి, “సూర్యం!..” అంటూ సూర్యం కేసి నడిచింది, తనని పట్టుకున్న వాళ్ళని మృదువుగా పక్కకి నెట్టుతూ.

కంగారుగా తల్లిని పొదివి పట్టుకుని, పైకి, కిందకి, ఒకసారి చూసి “దెబ్బలు తగిలాయా?” అంటూ ఆదుర్దాగా అడిగాడు. అందరూ అతని కేసి కాస్త సానుభూతిగా చూసారు.

“ఏమీ అవలేదు కంగారు పడకు” అంది మృదువుగా పెదాలమీదకి నవ్వు తెచ్చుకుని.

“కంగారుపడకు ఏమీ అవలేదులే బాబూ! అదృష్టం..” అంటూ పక్కకి జరిగారు చుట్టూ వున్న వాళ్ళు.

తల్లిని జాగ్రర్తగా నడిపించి కారులో కూర్చోపెట్టాడు. కారులోవున్న నీళ్ళ బాటిల్ తల్లి చేతికి ఇచ్చాడు,

“కాస్త నీళ్ళు తాగు..” అంటూ. అప్పటికి ట్రాఫిక్ క్లియర్ అవడం మొదలు పెట్టింది.

తల్లి నీళ్ళు తాగాక కార్ స్టార్ట్ చేసి, ముందుకు డ్రైవ్ చేసాడు. ఇంటికి వెళ్ళేవరకూ ఇద్దరూ మౌనం గానే వుండిపోయారు.

***

తలుపులు తీసిన సూర్యం భార్య సుశీల, సూర్యం తల్లిని పట్టుకుని తీసుకు రావడం చూసి, “ఏమయింది?” అంటూ కంగారుగా అడిగింది. ఆమెని ఒకసారి చూసి ఏమీ సమాధానం చెప్పకుండానే తల్లి నిపట్టుకుని లోపలకి వచ్చాడు. అతని తల్లి కామేశ్వరి ఒకసారి సుశీల కేసి చూసి, “ఏమీ అవలేదు సుశీలా! కంగారుపడకు” అంది.

హాలులో సోఫాలో తల్లిని కూర్చోపెట్టి, అతను మోకాళ్ళమీద కూర్చుని, “దెబ్బలు ఎమైనా తగిలాయా?” అన్నాడు ఆందోళనని పైకి తెలియ నీయ కుండా.

“పడిపోయాను కదా. మోకాళ్ళు, మోచేతులు, కాస్త కొట్టుకుపోయాయి. పెద్ద దెబ్బలు కాదు, కంగారు పడకు.” అంది కామేశ్వరి.

“ఏమయింది?” మళ్ళీ అడిగింది సుశీల కంగారు పడుతూ. సూర్యం జరిగినదంతా సుశీలకి చెప్పాడు.

తల్లి కేసి చూసి “అసలు నువ్వు అక్కడ ఎందుకు వున్నావమ్మా?..”

“వాకింగ్‌కి అని వెళ్ళాను. ఎంత సేపు ఇంట్లో కూర్చుంటాను? విసుగుగా వుంటుంది కదా! మన వూరులో అయితే, ఇరుగు పొరుగు పలకరిస్తారు. అదో కాలక్షేపం. అయినా రోజూ రెండు మైళ్ళైనా నడవకపోతే నాకూ తోచదు. అలవాటు అయిపోయింది..”.

“అవునండి! అత్తయ్య నాకు చెప్పే వెళ్ళారు. సిటీ కదా రోడ్ మీద అన్నీ వాహానాలే. అసలు నడవలేము అని కూడా చెప్పాను..” సంజాయిషి చెప్తున్న సుశీల మాటలకి అడ్డు పడుతూ

“అసలు ఏం జరిగింది అమ్మా, ఎలా పడిపోయావు?..” అన్నాడు సూర్యం.

“నేను రోడ్డు మిద ఒక పక్కనే నడుస్తున్నాను రా! ఒక సైకిలు ఒక స్కూటర్ ఢీ కొట్టుకొని వాళ్ళు నామీద పడ్డారు. అదృష్టం ఏమిటంటే, వాళ్ళ వెహికిల్స్ ఒక వైపు, మేము ఒక వైపు పడ్డాము. లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది.”

ఆమె చెప్పేది వింటూనే, సూర్యం, ఆమె మోచేతులు, మోకాళ్ళు పరీక్షించాడు.

సుశీల హడావిడిగా లోపలకి వెళ్ళి, ఫస్ట్ ఐడ్ బాక్స్, తీసుకుని వచ్చి సూర్యానికి ఇచ్చింది. కామేశ్వరి దెబ్బలని శుభ్రంచేసి, ఆయింట్మెంట్ రాసాడు.

“ఇప్పుడు ఏమంత ప్రమాదం జరిగిందని మీరిద్దరు కంగారు పడుతున్నారు?” నవ్వుతూ అంది కామేశ్వరి.

“దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదులే! ఇంక నువ్వు ఎప్పుడూ బయటకి వెళ్ళకు. చూసావుగా! కాస్తలో ప్రమాదం తప్పింది. ఇదేమయినా అనకాపల్లి అనుకున్నావా? హైద్రాబాద్! హైద్రాబాద్ అమ్మా!.. రోడ్ అంతా వాహనాలతో నిండిపోయి వుంటుంది. రోడ్ మీద నడవడానికి చోటు వుండదు. ఇటువంటివి జరుగుతూనే వుంటాయి. అందుకే నువ్వు ఇంక బయటకి వెళ్ళడానికి నేను ఒప్పుకోను. అంతగా నీకు నడవాలి అనిపిస్తే, ఇంట్లోనే టైం పెట్టుకుని నడు. లేకపోతే, టెర్రేస్ మీదకి వెళ్ళి నడు. అంతే కాని బయాటకి నో వే!” అంటూ లోపలకి వెళ్ళి బట్టలు మార్చుకొని, కాళ్ళు చేతులు మొహం కడుక్కొని కూర్చున్నాడు.

అంతలో సుశీల టీ పట్టుకుని వచ్చింది. కామేశ్వరికి, సూర్యానికి తలో కప్పు ఇచ్చి, తనూ ఒక కప్పు తీసుకుని కూర్చుంది. ముగ్గురూ టీ తాగుతూ మౌనం గా వుండి పోయారు కాస్సేపు.

“ఈ రోజు లేచిన వేళ మంచిది అత్తయ్య గారూ! ఎంత గండం తప్పింది?!” అంది సుశీల. కామేశ్వరి చిన్న నవ్వు నవ్వి వూరుకుంది.

సూర్యం, సుశీలతో, గంభీరంగా “అమ్మని బయటకి ఒక్కర్తెనే వెళ్ళనీయకు..” అన్నాడు.

“నేనేమయినా చిన్నపిల్లని ఏమిటిరా?!..” అంది కామేశ్వరి నవ్వుతూ.

“చిన్నపిల్లవని కాదు. ఈ రోజు ఏమయిందో చూడు. మేమే ధైర్యంగా రోడ్ మీద నడవటం లేదు. చిన్న రోడ్లు, లెక్కలేని వాహనాలు. నువ్వు ఈ విధంగా ధైర్యం చేయడం మంచిదికాదు.. ఇప్పుడు నీకూ తెలిసింది కదా!” అన్నాడు సూర్యం.

“నువ్వు చెప్పినది నిజమేలే.. కానీ రోడ్దంతా వాహనాలకే అనుకుంటే మరి నడివి వేళ్ళాల్సిన వాళ్ళ మాట ఏమిటి? వాళ్ళకి భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదూ?.. నాలాంటివాళ్ళు వుంటారు. వాహనాలు నడపలేరు.. నడిచి వెళ్ళక తప్పదు.. వారి మాట ఏమిటి.. అందరూ ఈ విధంగా బయట నడవడానికి భయపడుతూ వుంటే. పురపాలకులు ఏదో ఒకటి చేయాలి కదా?!.. ఎవరూ ఏమీ పట్టించు కోకపోతే, ప్రజలకి నడిచే హక్కుకి దూరం చేసినట్లే కదా.. రోడ్ వాహానాలకే అన్నట్లు చెప్పకనే చెప్తున్నట్లుంది.. నడిచే వాళ్ళ మాట ఏమిటి అని అడగాలి కదా?.. “

“ఎవరిని?..” అన్నాడు సూర్యం.

“సిటీ మేయర్‌ని..”

“భలే చెప్తున్నావమ్మా! ఎంత సులువుగా చెపుతున్నావో! మనం అడగడమే ఆలశ్యం, వాళ్ళు చేసేస్తారు అన్నట్లు.”

“అడగనిదే అమ్మ అయినా పెట్టదు అంటారు, అంటున్నా..”

“ఆ విషయం అన్ని చోట్లా పని చేయదు అమ్మా!.. ఒక్కొక్కప్పుడు అడగడమే, నేరంలా భావిస్తారు.. అయినా అడిగామని, నడవడానికి వీలుగా ఫుత్‍పాత్‌లు, క్రాసింగ్ జంక్షన్స్ ఏర్పాటు చేసేస్తారా?.. రోడ్లు గుంటలు పడితే బాగు చేసే నాథుడు లేడు కానీ..”

“మన వంతు మనం పాలకుల దృష్టి లోకి తీసుకు రావాలి కదా. దానిలో తప్పేముంది?..”

“పాలకులు మన చుట్టాలన్నట్లు మాట్లాడుతున్నావ్! మొత్తానికి నువ్వు హెడ్‌మిసెస్ అనిపించుకున్నావ్!..” అంటూ,  సూర్యం అక్కడనుంచి వెళ్ళిపోయాడు.

***

ఒక పది రోజుల తర్వాత సుశీల నెమ్మదిగా ఒక వార్త సూర్యం చెవిలో వేసింది.

“మీ అమ్మగారు ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి సంతకాలు తీసుకుని, మేయర్ కి, సిఏంకి, సిటీలో పాదచారులకి భద్రత కల్పించాలంటూ ఒక పిటిషన్ పోస్ట్ చేసారు..” అని.

సూర్యం ఆశ్చర్యపోయాడు. “ముందే ఎందుకు చెప్పలేదు?” అంటూ సుశీలని కోప్పడ్డాడు.

సూర్యానికి, తల్లి గురించి తెలుసు. ఆవిడకి అన్యాయం అనిపిస్తే, అడగడానికి కాస్త కూడా సంకోచించదు. “నేను టీచర్‌ని అయివుండి కళ్ళముందే అన్యాయం జరుగుతూంటే ఎలా కళ్ళు మూసుకుని వుంటాను?” అంటుంది, ఏమన్నా అంటే.

ఆరోజు, భోజనాలు. అయ్యాక తల్లి దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆ విషయం ప్రస్తావించాడు.

“అమ్మా! మేయర్‌కి, సిఎంకి పిటిషన్ పోస్ట్ చేసావుట.?..” అంటూ ప్రశ్నార్ధకంగా ఆమె కేసి చూసాడు.

“ఊ! అవును రా!..” అని కామేశ్వరి మౌనంగా వుండి పోయింది. సూర్యం అసహనంగా అటూ ఇటూ కదిలాడు.

“ఊ!.. నీకు కోపం వస్తుంది.. నాకు తెలుసు. ఆ కాస్త అయినా, మనకోసం మనం చేసుకోకపోతే ఎలా రా? అందరికి ఈ పరిస్థితి కష్టంగా వుంది.. ఆ విషయంలో ఏమయినా చేయండి అంటే, దానిలో తప్పేమిటి?..” అంది కామేశ్వరి ఎటువంటి ఉద్వేగం లేకుండా. సూర్యం ఏమీ మాట్లాడలేదు.

“అన్నిటికీ మనకి పట్టనట్లు వుండకూడదు రా. కాస్తో కూస్తో మన వంతు మనం చేయాలి. నేను ఒక లాయర్ ద్వారా కోర్ట్‌లో కూడా కేసు వేద్దామనుకుంటున్నా!.. రోడ్ అంతా వాహనాలు ఆక్రమించుకుంటే, నడిచేవాళ్ళు ఎక్కడ నడుస్తారు? ఎక్కడ రోడ్ క్రాస్ చేస్తారు?.. వారికి భద్రత ఎక్కడ? ఇవన్నీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత పాలకులదే కదా.. వాళ్ళు అది మర్చిపోతే వాళ్ళకి గుర్తు చేయాల్సిన బాధ్యత, మనకి కూడా వుంటుంది.” అంది కామేశ్వరి గంభీరంగా.

సూర్యం కాస్సేపు అవాక్కయి, ఆమె కేసి అయోమయంగా చూసాడు.

“అమ్మా! నువ్వు తెలిసి మాట్లాడుతున్నావా? తెలియక మాట్లాడుతున్నావా?.. ఏదయినా పని చేస్తే, ఫలితం వుంటుందంటే చేయాలి. ఏ ఫలితం వుండదని తెలిసి కూడా, టైం, ఎనెర్జీ వేస్ట్ చేసుకోవడం, అవివేకం కాదూ?..”

“మనమంతా చిన్నప్పుడు ఒక కధ చదువుకున్నాం. కాకికి, దాహమేసి నీళ్ళ కోసం చూస్తుంది. ఒక కూజాలో నీళ్ళు అడుగున వుంటే అది తెలివిగా రాళ్ళు తెచ్చి ఆ కూజాలో వేస్తుంది. నీళ్ళు పైకి వచ్చాక తాగి దప్పి తీర్చుకుంటుంది.. ఆ కధ ఏమి నేర్పిస్తుంది రా?.. కష్టం వస్తే, అది తీర్చుకునే ప్రయత్నం చేయాలనే కదా?! ఆ కాకి దాహంతో కష్టపడుతూ వుండదుగా! నీళ్ళ కోసం వెతుకుతుంది.. నీళ్ళని తాగడానికి వీలుగా అందుబాటులో తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగానే మనమూ కాస్తో కూస్తో ఏదో ఒక ప్రయత్నం చేయాలి..”

“నువ్వు చెప్పేది సరి అయినదే అమ్మా! కానీ మనకి ఎందుకు ఇదంతా? హాయిగా వుండకుండా, లేని పోని చీకాకులు, నెత్తిమీద వేసుకోవడం కదా!.. ఇన్నాళ్ళు ఇల్లు, ఉద్యోగం అంటూ అన్ని బాధ్యతలు మోసావు. హాయిగా వుండకుండా, ఇప్పుడు ఇవన్నీ నెత్తీమీద వేసు కోవడం ఎందుకు? కోర్ట్ అంటే తిరగాలి?.. నీకు తెలియని విషయం కాదు.. డబ్బు ఒక్కటే కాదు.. నీ టైం, ఎనెర్జీ.. వెచ్చించాలి.” అసహనంగా అన్నాడు సూర్యం.

కాస్సేపు ఇద్దరూ మౌనంగా వుండి పోయారు..

‘అమ్మని ఎలానూ నేను కన్విన్స్ చేయలేను.. సత్యం అంకుల్ తో మాట్లాడిస్తాను’ అనుకుంటూ – “ఒక పని చేయ్యమ్మా! సత్యం అంకుల్ అభిప్రాయం తీసుకో. ఆయన రెటైర్ద్ జడ్జ్ కదా. కోర్ట్ విషయాలు వారికి బాగా తెలుస్తాయి. మంచి లాయర్‌ని కూడా నీకు సజ్జస్ట్ చేయగలరు.” అన్నాడు.

ఒకసారి సాలోచనగా కొడుకు కేసి ఒకసారి చూసి ”అలాగే!..” అంది.

“రేపు ఆదివారం.. నాకూ ఆఫీసు లేదు.. లంచ్ చేసాక నిన్ను అంకుల్ ఇంటి దగ్గర దింపుతాను.”

అంగీకారంగా తల ఊపింది కామేశ్వరి. “అంకుల్‌కి ఫోన్ చేసి చెపుతాను, రేపు మనం వస్తున్నామని” అంటూ, సూర్యం లోపలకి వెళ్ళాడు.

***

కామేశ్వరి, సత్యం చిన్నప్పటినుంచి స్నేహితులు, ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు కలిసే చదువుకున్నారు. సత్యం పూర్తి పేరు సత్యమూర్తి. కామేశ్వరి డిగ్రీ అయ్యక, ‘బిఇడి.’ చేసి టీచింగ్ లోకి వస్తే, సత్యం, ‘లా’, చేసి, మేజిస్ట్రేట్‌గా చేరాడు.. ఆ విధంగా విడిపోయిన ఇద్దరూ, సత్యం, అనకాపల్లికి మెజిస్త్రేట్‌గా, రావడంతో మళ్లీ కలుసు కోవడం జరిగింది. కామేశ్వరి భర్త ప్రభాకర్, సత్యమూర్తి మంచి స్నేహితులయ్యారు.

దానితో ఇద్దరి కుటుంబాల మధ్య కూడా, స్నేహం ఏర్పడి ఇంకా దగ్గర అయ్యారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఒకరితో ఒకరు పంచుకోవడం అలవాటు అయింది. ఆ అలవాటు, ప్రభాకర్ మరణం తర్వాత కూడా ఆగలేదు. ఇప్పటికీ సూర్యం ఏ సమస్య అయినా సత్యమూర్తి సలహా తీసుకోకుండా వుండడు. ఆ విధంగానే సత్య మూర్తి కూడా, సూర్యంతో అన్ని విషయాలు సంప్రదిస్తూనే వుంటాడు.

***

కామేశ్వరిని దింపి “మళ్ళీ వచ్చి అమ్మని తీసుకు వెళ్తాను.” అని సూర్యం, సత్యమూర్తితో, చెప్పి వెళ్ళిపోయాడు.

కుశల ప్రశ్నలు, టి తాగడాలు అయ్యాక.. సత్యం అన్నాడు – “ఏమిటే కామేశ్వరీ. రోడ్ మీద పడి పోయావుట?! సూర్యం చెప్పాడు ‘కాస్తలో, ప్రమాదం తప్పింది!’ అని.. అయినా, ఇక్కడ వాహనాలు ఎక్కువ అయి రోడ్ మీదకి ఎవరూ వెళ్ళ లేక పోతున్నారు. సిటీ, నీకు ఎక్కువ అలవాటు లేదు కదా. నడవడానికి రోడ్ మీదకి ఎందుకు వెళ్ళావు? ఇంట్లో నడిస్తే అవదూ?..”

“నువ్వు కూడా అలా మాట్లాడుతావు?.. రోడ్ అందరిదీ కాదా? వాహనదారులు ఒక్కరిదేనా? మరి నడిచే వాళ్ళు ఎటుపోవాలి?..” కామేశ్వరి ఆవేశపడకుండా వుండడానికి ప్రయత్నిస్తూ అంది.

“నువ్వు ఏమీ మారలేదు. అన్నిటికీ ఆవేశపడిపోతావు!..”

“నేను ఏమి ఆవేశపడ్డాను!.. నెమ్మదిగానేగా మాట్లాడుతున్నాను.”

“అదే పిటిషన్ ఏదో, మేయర్‍కి, సిఎంకి పంపావుట..”

“అవును. నడిచి వెళ్ళే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత పౌరులకి వుంటుంది కదా. అదే చేసాను..”

“ఊ!..” అంటూ ఆమెని ఒకసారి ఎగాదిగా చూసి, “మరి కోర్టులో కేసు వేస్తా అన్నావుట.”

“ఆ విషయం గురించేగా నీ దగ్గరకి వచ్చింది? నువ్వు మంచి లాయర్ ఎవరిని అయినా సజ్జెస్ట్ చేస్తావని నీ దగ్గరకి వచ్చాను. ఇన్ని చెప్పినవాడు ఇది చెప్పలేదా సూర్యం?”

“చెప్పేడులే!.. అయినా ఈ వయసులో ప్రశాంతంగా కాలక్షేపం చేయాలనుకోవాలి కానీ ఇవన్నీ నీకెందుకు చెప్పు?.. నువ్వు కోర్టులో కేసు వేసావే అనుకో, అదేమయినా ఇప్పుడు తేలుతుందంటావా? అది అయ్యేవరకూ నువ్వు కోర్ట్‌కి తిరుగుతూనే వుండాలి! డబ్బు ఖర్చు! అదొక్కటే కాదు నీ టైం, ఎనెర్జీ,.. అవసరమా నీకు ఇది..”

“ఏమిటి రా, నేను ఏదో తప్పు చేస్తున్నట్లు, కౌన్సిలింగ్?..”

“నీకు, నేనేం చెప్తాను?! చిన్నప్పటినుంచే నువ్వు ఇంతే అంటున్నాను.. తప్పా? ఏదో ఉద్ధరించాలనే తాపత్రయం తప్ప ముందు వెనక ఏమీ చూసుకోవు!.. నువ్వే ఆలోచించు.. కోర్టు ఏమీ, వెంటనే తీర్పు ఇవ్వదుగా! ఇచ్చినా వెంటనే, నడిచేవాళ్ళ కోసమని ఫుట్‌పాత్‌లు, క్రాసింగ్ జంక్షన్‌లు వెంటనే కట్టరుగా. నీకు అర్థం కావటం లేదు. రోడ్ రిపేర్‍లు చేయలేకపోతున్నారు. రోడ్ గుంటల వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, మ్యాన్‌హోల్స్ వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి?!.. అవి సరి చేసే నాథుడు లేదు. కానీ నువ్వు ఒక పిటిషన్ ఇస్తే, ఒక కోర్ట్ కేసు వేస్తే, ఏమి జరుతుందనుకుంటున్నావు? నీకు,.. నీ వల్ల, సూర్యానికి ఇబ్బంది.. తప్ప, ఒరిగేది ఏమీ లేదు.. సూర్యం కొడుకులు ఇద్దరూ, ఉద్యోగాలు వచ్చి, పెళ్ళిళ్ళు అయి ఇప్పుడిప్పుడే సెటిల్ అయ్యారు.. సూర్యం, ఇప్పుడేగా ఊపిరి పీల్చుకుంటున్నాడు. నువ్వు కొత్త కొత్త సమస్యలు వాడికి తీసుకు వస్తే ఏలా?.. వాడూ పెద్దవాడు అవటం లేదూ? ఇంక ఒక అయిది సంవత్శరాలు అవుతే వాడూ రిటైర్ అవుతాడు. అందరూ అనకాపల్లి వెళ్ళిపోతారు. ఈ సిటీలో నువ్వు వుండవు. వాడూ వుండడు..”

“నువ్వు మొదటనుంచి చెప్పేదే చెప్తున్నావు. ‘చుట్టు పక్కల ఏమి జరుగుతున్నా పట్టించుకోకు. నీ బతుకు నువ్వు బతుకు’ అని. కానీ, అది సరైనదే అని నీకు అనిపిస్తోందా? చిన్న చిన్న విషయాలలో కూడా మనం కాస్తో కూస్తో చేయాలి అని కూడా, అనుకోకూడదు అంటే, నా వల్ల కాదురా, సత్యం!”

“పిటిషన్ ఇచ్చావు.. బాగుంది.. ఈ కోర్ట్‌లో కేసు వేస్తా అనడం మాత్రం నేను హర్షించనే కామేశ్వరి! సూర్యం గురించి ఆలోచించి అయినా ఇటువంటి పనులు మానేయ్!. నువ్వు ప్రశాంతంగా వుండి, వాడిని ప్రశాంతంగా వుండని!”

“ఒరేయ్ నీకు ఇలా చెప్పడానికి సిగ్గు లేదురా. మళ్ళీ జిల్లాకి జడ్జ్ చేసావు.. ప్రభుత్వానికే కాదు, ప్రజలకి కూడా బాధ్యతలు వుంటాయి.. వారి హక్కులని వాళ్ళే రక్షించుకోవాల్సిన బాధ్యత.. వారి సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాల్సిన బాధ్యత.. అది తప్పు అన్నట్లు మాట్లాడుతున్నావు?”

అంతా వింటున్న మీనాక్షి కలగ చేసుకుంది.. “అవును అండి! కామేశ్వరి చెప్పినది కూడా కరెక్టే.. కోర్టుకి వద్దు అన్నారు బాగుంది.. ఏదో విధంగా సమస్యని అందరి దృష్టికీ తీసుకు రావాల్సిన బాధ్యత, మన మీద కూడా వుంటుంది కదా?!..”

సత్యమూర్తి భార్య వైపు ఒక సారి కాస్త కోపంగా చూసి.. “ఊ!..” అంటూ మౌనంగా వుండిపోయాడు.

అందరూ కొంచెం సేపు మౌనంగా వుండిపోయారు..

“నువ్వు చెప్పాల్సింది చెప్పావుగా, ఇంక నేను వెళ్తానులే!..” అంటూ కామేశ్వరి లేచింది.

కామేశ్వరికి, కోపం వచ్చిందని అర్థమయింది సత్యమూర్తికి. ఇది అలవాటే సత్యానికి. కామేశ్వరి ఆవేశపడడం, సత్యం ఆమె ఆవేశం మీద కాస్త నీళ్ళు జల్లడం.. ఆమె కోపగించుకున్నా, చివరకి చల్లపడడం అన్నీ ఇద్దరికీ అలవాటు అయింది. అందుకే సత్యమూర్తి మామూలుగానే వున్నాడు.

ఏమి తోణకకుండా “వుండు. డ్రైవర్‌ని పిలుస్తాను. నిన్ను ఇంటి దగ్గర దింపుతాడు,..” అంటూ సత్యమూర్తి డ్రైవర్‌ని పిలిచి, ఆమెని వదలి రమ్మన్నాడు..

సత్యమూర్తి మొదటనుంచి కామేశ్వరికి, ఒకటే చెప్తూ వుండేవాడు. “ప్రతీ వ్యక్తికీ, సామర్థ్యం బట్టి, పరిమితులు ఏర్పడతాయి.. అది అర్థం చేసుకోకపోతే, సమస్యలు తప్పవు. ఆవేశంలో అది మర్చిపోయి సమస్యలు కొని తెచ్చుకుంటూ వుంటారు.” అని..

కామేశ్వరికి ఎంత ఆవేశం వచ్చినా, సత్యమూర్తి మాటలలో సత్యాన్ని అంగీకరించకుందా వుండదు. అందుకే, సత్యమూర్తి మీద ఆమెకి కోపం రాదు. అందుకే ఆమె, ఎటువంటి పరిస్థితిల్లో అయినా, తన ఆలోచనలనీ, దానికి అనుగుణంగా, ఆమె ప్రవర్తనని మార్చుకోవడానికి, ఏమీ సంకోచించదు. ఆ విషయం సత్యమూర్తికీ తెలుసు.

“ఆవిడకి కోపం వస్తుందేమో అండి!..” అంటూన్న మీనాక్షి మాటలకి మాటలకి అడ్డుపడుతూ, “మా ఇద్దరికి ఇది అలవాటే. కోపం వచ్చినా, నిదానంగా ఆలోచించి నేను చెప్పేది సరి అయినదే అని అర్ధం చేసుకుంటుంది.” అంటున్న సత్యమూర్తి  పెదాల మీద ఒక నవ్వు వెలిగింది. “కామేశ్వరి భర్త ప్రభాకర్ కూడా, ఇలాంటి పరిస్థితి వస్తే, నన్నే చెప్పమనే వాడు.. మంచి చేయాలనే తాపత్రయం మంచిదే కానీ, ముందు వెనక ఆలోచించుకోకపోతే ప్రమాదంలో పడతారు.. ఆవేశంలో ముందుకు వెళ్ళినా, చెప్తే ఆలోచించుకుంటుంది..”

“నాకు మాత్రం మీ అందరూ, ఆవిడ వెనక గూడుపుఠాణి చేసి, ఆవిడని నిర్వీర్యం చేస్తున్నారు అని అనిపిస్తోంది” అంది నవ్వుతూ మీనాక్షి.

“నేను చేప్పినదానిలో ఏదయినా తప్పుందా? కోర్టు కేసు అంటే.. చెప్పినంత సులువుగా అవుతుందా!..”

“ఇంకో రకంగా ‘ఈ విషయాన్ని, ఏ విధంగా అందరి దృష్టికి తీసుకు రాగలమేమో అని ఆలోచిద్దాం’ అని చెప్పితే బాగుండేది..,” అంది మీనాక్షి.

ఆమె కేసి కాస్త ఇంటరెస్టింగ్‌గా చూసి “ఊ!..” అన్నాడు.

“కామేశ్వరి చెప్పినది చాలా కరెక్ట్.. నడిచి వెళ్ళే వాళ్ళకి భద్రత లేదు.. ఆ విధంగా నడిచి వెళ్ళడాన్ని డిస్కరేజ్ చేయడమే అవుతుంది గదా.. ఈమధ్య డబ్బులు వున్న వాళ్ళు, గేటడ్ కమ్యూనిటీస్ అని వెళ్ళిపోతున్నారు.. అవి ఎఫర్డ్ చేయలేకపోతే, ఈ బాధలు తప్పవు..” కాద్త బాధగా నిట్టూర్చింది.

మీనాక్షి ఎప్పటినుంచో, “ఈ ఇల్లు అమ్మి గేటడ్ కమ్యూనిటి లో ఫ్లాట్ తీసుకుందాం” అని చెప్తోంది. ఏ అవకాశం వచ్చినా ఆ విషయం, వక్కాణించకుండా వుండదు.

కానీ తనకే ఇష్టం లేదు. “గేటడ్ కమ్యూనిటీలో వాకింగ్ ట్రాక్, చెట్లు, స్విమ్మింగ్ పూల్ అంటూ ఏవేవో చెప్తారు. ఎన్ని బెడ్ రూమ్‌లు అని చెప్పినా ఇల్లు లోపల ఏరియా తక్కువే వుంటుంది.. ఇప్పుడు వుండే ఇల్లు విశాలంగా వుంటుంది. వెళ్ళి వెళ్ళి, ఇప్పుడు ఇరుకు ఇంట్లో ఏమి వుంటాము అనిపిస్తుంది. అయినా రిటైర్ అయ్యాక చేతిలో డబ్బులు వుంచుకోవాలి.. ఇన్వెస్ట్మెంట్స్ అని పరిగెట్టకూడదు.” అని తన అభిప్రాయం.. పిల్లలు ఎంత బాగా సెటిల్ అయినా, వాళ్ళని ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం తనకి ఇష్టం లేదు.. ఇవన్నీ చెప్పినా మీనాక్షి, ఆ ఆలోచన వదలి పెట్టదు.

“చక్కగా పొద్దున్నే ఇద్దరమూ వాకింగ్‌కి వెళ్ళొచ్చు.. మాట్లాడడానికి ఇరుగు పొరుగు వుంటారు. పిల్లలకి ఆడుకోవడానికి, వుంటుంది..” ఇలా చెప్పుకు పోతుంది.

ఆమె ఆలా అన్నప్పుడల్లా అతను “మన ఇంటి చుట్టూ తిరగితే, అదే వాకింగ్.. అయినా నువ్వు ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీకి మార్కెటింగ్ చేస్తున్నట్లుంది.. ఏదయినా రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరకూడదూ?” అంటూ జోక్ చేస్తాడు.

కానీ ఇప్పుడు, ఆమె మాటలు, అతనిలో ఆలోచనలు రేకెత్తించాయి.. ‘నెమ్మది, నెమ్మదిగా, తెలియకుండానే చాలా కోల్పోయాము.. రోడ్ మీద భయపడ కుండా నడవలేకపోతున్నాం. అందువల్ల వాహనం వుంటే కానీ, రోడ్ మీదకి వెళ్ళడం మానేసాం. తెలియకుండానే పిల్లలు ఆడుకునే ప్రదేశాలు మాయమయ్యాయి.. పిల్లలు ఇంట్లోనే, ఇండోర్ గేమ్స్‌కి అలవాటు పడ్డారు.. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్.. ఎవరు ఎటువంటి వారో అనుకుంటూ, ఎవరూ తలుపులు కూడా తీయరు. దానితో సోషలైజింగ్ తగ్గింది.. అపార్ట్మెంట్స్ ఎక్కువ అయి చెట్లకి చోటు లేకుండా అయింది.. వీటికి గేటడ్ కమ్యూనిటీస్ పరిష్కారంగా చూపిస్తున్నారు అంటే, వూరికే కాదు కదా?.. తాగే నీరుకి కూడా డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి. పీల్చే గాలి ఒకటి మిగిలింది. ఇంక ముందు ముందు అది కూడా తప్పదనే అంటున్నారు.. ఎందుకు ఇలా జరుగుతోంది అనే ప్రశ్న రాకుండా అందరూ జాగ్రత్తగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు.. నాతో సహా. కామేశ్వరి లాంటి వాళ్ళని సవా లక్ష కారణాలు చెప్పి, నా లాంటి వాళ్ళు, నిరుత్సాహపరిచి నిర్వీర్యులని చేస్తున్నారు. కామేశ్వరి ఆవేశ పడుతుందని కానీ, అది చెప్పినదానిలో తప్పు ఏముంది?’

తను ఎక్కడో చదివిన సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ గుర్తుకువచ్చింది.. ‘బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రొం..’ అంటారు. ఒక కప్పని ఒక్కసారే మరుగుతున్న నీళ్ళల్లో వేస్తే, అది వెంటనే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అదే చల్ల నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళ వేడిని నెమ్మదిగా పెంచుతూ వుంటే, అది, దాని సర్వైవల్‌కి అవసరమయిన ఎలెర్ట్‌నెస్‌ని, కోల్పోయి ప్రమాదాన్ని ముందుగా గ్రహించలేక, చనిపోతుంది.. మనం కూడా ఆ విధంగా అవుతున్నామా? – ఆలోచిస్తూ పెద్దనిట్టూర్పు విడిచాడు.

‘ఈ విషయంలో తను ఏమైనా చేయగలడా?’ అనే ఆలోచన అతనికి తెలియకుండానే అతనిలో చోటు చేసుకుంది.

***

“అమ్మా! అమ్మా!..” అంటూ హడావిడిగానూ, సంతోషం గాను ఒక పేపరు తీసుకుని, తల్లి దగ్గరకి వచ్చాడు, పేపర్ తల్లికి ఇచ్చాడు “చదువు!” అంటూ.

కామేశ్వరి తీసు కుని చూసింది. హిందూ పేపర్ అది.

‘పాదాచారులకి రోడ్ మీద నడిచే హక్కులేదా?.. రోడ్లు వాహనాలకే పరిమితమా?’ అనే పేరుతో వ్యాసం. రాసినవారు సత్యమూర్తి, రెటైర్డ్ జిల్లా న్యాయమూర్తి. వ్యాసం ఇంగ్లీషులో వుంది.

అది చూసి అశ్చర్యంతోనూ సంతోషం తోనూ ఒకసారి సూర్యాన్ని చూసింది.

“సత్యం అంకుల్ రాసిన వ్యాసం.. నీకు చూపించమని ఇంతకుముందే చెప్పారు.” అన్నాడు సూర్యం కూడా సంతోషంగా.

“నా చిన్ననాటి స్నేహితురాలు, సీనియర్ సిటిజెన్, వాకింగ్‌కి వెళ్ళి, రోడ్ మీద ఏక్సిడెంట్ అయి, పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న సంఘటన, నన్ను ఆలోచించేలా చేసింది.” అంటూ మొదలయింది వ్యాసం.

రోడ్ ఏక్సిడెంట్స్.. వాటి సంఖ్య, రోడ్లు బాగోకపోడం వల్ల జరిగిన ఏక్సిడెంట్స్ సంఖ్య.. ఆ విధంగానే పాదాచారులు క్రాసింగ్ చేస్తూ చనిపోయిన వారి సంఖ్య, రోడ్ మీద నడుస్తూ ప్రమాదానికి గురి అయిన వారి సంఖ్య, ఇలా గణాంకాలతో సహా రోడ్స్ భద్రత గురించి విశ్లేషిస్తూ రాసిన వ్యాసం.

చివరగా, “రోడ్స్ బాగు కూడా చేయలేని పరిస్థితిలో వున్న మనకి, పాదచారులకి కూడా రోడ్ మీద నడిచే హక్కు గురించి మాట్లాడుతూ, వారికి భద్రత కల్పిస్తూ డెవెలప్డ్ దేశాలలో వున్న విధంగా ఫుట్‌పాత్స్, జీబ్రా క్రాసింగ్ సెక్షన్స్ ఏర్పాటు జరగాలని ఆశించడం, అడగడం, అత్యాశగానే పరిగణించబడుతుందంటే, నేను ఆశ్చర్యపోను. కానీ ఆ విధంగా వుండాలని ఆశించడంలో తప్పు లేదని గుర్తిస్తే, ఈ రోజు కాకపోతే రేపు అయినా, ఆ ఆశ వాస్తవంగా రూపుదిద్దుకోవచ్చు. అంత వరకూ పాదచారులకి, రోడ్ మీద నడిచే హక్కుని వారికి దూరం చేసినట్లే అవుతుందని, ఒప్పుకోడంలో తప్పు ఏమయినా వుందా?!.. మనకి తెలియకుండా మనం కోల్పోతున్న హక్కులలో ఇది కూడా ఒకటా? పిల్లలకి ఆడుకోవడానికి సరైన స్థలం లేదు. ఆ విధంగా వారు ఆడుకునే అవకాశం నుంచి దూరం చేసాం. దగ్గర దగ్గరగా అపార్ట్మెంట్స్, ఇంక చెట్లకి చోటు ఎక్కడ? గ్రీనరీకి మొహం వాచిపోయాము.

తాగడానికి మంచి నీళ్లు శుభ్రంగా లేక కొనుక్కుంటున్నాం.. కల్తీలు ఎక్కువై, మార్కెట్‌లో ఆర్గానిక్ పదార్ధాలు, కూరలు, పళ్ళు, కల్తీ లేదు అని ఎక్కువ ఖరీదు పెట్టి మరీ, కొంటున్నాం. ఇంక కొంత కాలం పోతే, పీల్చడానికి గాలిలో ఆక్సిజెన్ వుండదు, ఆక్సిజన్ కొనుక్కోవాలి అంటున్నారు.. ఇలా చెప్తూ వుంటే,.. మనకి సహజంగా ప్రాప్తించిన హక్కులకి దూరం అయినట్లే కదా!.. ఆలోచిస్తే, ఇది. ‘ఒక బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోం’ లాంటిది కాదు కదా? అని అనిపించక మానదు.” అంటూ ముగించబడింది వ్యాసం.

చదివిన కామేశ్వరికి చాలా సంతోషం వేసింది. ఆ విధంగా, సమస్యని అందరి దృష్టికి తీసుకు రావడం వల్ల. ఎంతో కొంత, ఫలితం వుండకుండా వుండదు, అనుకుంటూ వుండగా, “అంకుల్, నీతో మాట్లాడుతా అన్నారు..” అంటూ ఫోన్ తెచ్చి ఇచ్చాడు సూర్యం, తల్లికి.

“థేంక్స్ రా సత్యం! బాగా రాసావు. నాకు కాస్త ఊరట. ఏమి చేయ్యలేకపోయాను అనుకుంటూ బాధపడుతున్నాను. మనం చిన్నప్పుడు చదువుకున్నాము, ‘ఎటర్నల్ విజిలెన్స్ ఈజ్ ది కాస్ట్ ఆఫ్ లిబర్టీ’ అని.. సమస్య వస్తే దానికి బాధ్యులు అయిన వాళ్ళని ప్రశ్నించడం, పౌరులుగా మన బాధ్యత కూడా.. అది ఎందుకో నా మనసులో బాగా వుండి పోయిందిరా! అందుకే నేను మౌనంగా వుండలేను..వుంటే గిల్టీగా వుంటుంది..” గబ గబా చెప్పింది కామేశ్వరి, మళ్ళీ ఎక్కడ సత్యం ఆపుతాడో అన్నట్లు..

సత్యం నవ్వాడు.. “నువ్వు చెప్పాలా? నీ గురించి, నాకన్న ఎక్కువ ఎవరికి తెలుసు చెప్పు? మనం ఎలిమెంటరీ స్కూల్ నుంచి గ్రాడ్ వరకు, క్లాస్మేట్స్.. ఇంతకీ నీకు సంతోషమేగా!.. ఇంక ఈ విషయం గురించి నువ్వు మర్చిపోయి రిలాక్స్‌డ్‌గా వుండు. సరేనా!” మృదువుగా అన్నాడు సత్యం. సత్యం మాటలకి కామేశ్వరికి కళ్ళ నీళ్ళు తిరిగాయి.

“ఒరేయ్ సత్యం! యూ ఆర్ ది బెస్ట్..”

“అమ్మా! పొగడక్కర్లే, తిట్టకుండా వుంటే, చాలు..” నవ్వుతూ అంటూ ఫోన్ పెట్టేసాడు సత్యం.

ఆ తర్వాత అనుకోని విధంగా సత్యమూర్తి రాసిన వ్యాసాన్ని, సత్యమూర్తిని అభిమానించే శిష్యులు కొంతమంది సోషల్ మీడియా షేర్ చేయడం, దానికి చాలామంది స్పందించి, వారి వారి అనుభవాలు షేర్ చేయడంతో, ఆ వ్యాసం వైరల్ అయింది. దాని పైన చాలా చర్చలు జరగడం మొదలు అయింది. దానితో, టివీలో, కూడా అన్ని చానెల్స్ లోనూ, ఆ చర్చ చోటు చేసుకుంది.

“పాదచారులకి కూడా రోడ్డు మీద నడిచే హక్కు వుంది. వారికి తగిన భద్రత కల్పించాలి” అనే పోస్టర్స్‌తో ప్రొసెషన్‌లు జరిగాయి.

అది, కామేశ్వరితో పాటు, ‘నడవాలని వుంది!’ అనుకునే చాలామందిలో, ఏదో ఒక మార్పు వస్తుందనే ఆశ, చోటు చేసుకునేలా చేసింది.. ఆశేగా మనిషిని నడిపించేది.. చూడాలి ఏమవుతుందో!!

Exit mobile version