వైరి పై పోరుకు…
వెలుగు దివిటీలు కళ్ళలో..
వెలిగించుకెళ్ళావు!!
నువు లేని క్షణం.. ఒక్కో..
నవయుగంలా…
నన్ను తిరిగి తిరిగి పుట్టిస్తున్నాయి!!
నీకై వేచి వేచి నా కళ్ళకలువలు,
కెందామరలై…నాయి.
ఏ అలికిడి విన్నా…నువ్వొస్తున్నావనే
ఊహే!!
మబ్బులు కదలాడితే…
నీ అల్లరి అలకలు గుర్తొచ్చి,
మనసు కన్నీటి జల్లవుతోంది!!
నెలరాజు నను చూసి..ఏడి
నీ జోడు నా సరికాడంటివని,
పరిహసిస్తున్నట్లుంది!
మన తోట పూలన్నీ…
ఒంటరినైన నన్న జాలిగా..
చూస్తూ..,
పరిమళాన్ని
పంచకుండుంట వశ్యం కావటం లేదు సుమా!
కన్నీరు జారే నీలాగే అంటున్నాయి!!
నీ విధి నా ధర్మమని తెలిసినా…
ఏవిటో..మనసు మాట వినదు,
అదిగో నీకోసం చూసి చూసి
వెన్నెలంతా..ఏట్లో మునిగిందిప్పుడే..!!
తూరుపు గూట్లో…ఎర్రపిట్ట రెక్కలు విప్పుతోంది,
రెప్పలంటని నాకళ్ళలో నిప్పు రాజుకుంటోంది!!
అలసిన మేను నీ గుండె తలగడ కోరుతున్నా..
శత్రుమూకలపై తలపడుతున్న నిన్ను తలచుకుంటూ….
నా మోకాళ్ళ పై తల ఆన్చి….
ఈ నట్టింట నేలపై ఆనే నీ పాదాలకై. ఎదురు చూస్తూ…
నీ..రాకకై….నీ సఖి!!
1 Comments
పుప్పాల కృష్ణ చంద్ర మౌళి
ప్రోషితభర్తృకను కళ్ళకి కట్టినట్లు ఆవిష్కరించారు. సైనికుని భార్య అని ఆరంభంలోనే తెరతీసారు. నవ యుగంలా… పుట్టిస్తున్నాయంటూ ఆతని చెలిమి తలపులు ఆమెను ఎప్పుడూ నూతనంగానే ఉంచడంవలన ఆమె *జీవితాన్ని* మొదలుపెట్టిన తొలి అంకంలోనే ఉందన్నట్టు తలపులలోనే మునిగింది.కళ్ళకలువలు కంటే నా కలువ కన్నులు అని వుంటే రసజ్ఞత ఇనుమడించేది. అలా అని ఎక్కడా పట్టుసడలనీయ లేదు మీరు. మరో శకుంతలలా… తన తలపులలో తేలియాడుతూ ప్రతి చిరు సవ్వడిలో… ఆతని స్పర్శనే అనుభూతి చెందడం ఓహ్ రసజ్ఞత నిండిపోయిందమ్మా! అల్లరి అలకలను మేఘం తలపిస్తే జ్ఞాపకాల జల్లులను మనసు కురిపించడం చాలా సహజంగా ఉందమ్మా. నెలరాజు దెప్పుళ్ళు సరే తోటలోని పూలు విచారంగానేనైనా పరిమళాలను వెదజల్లక తప్పడం లేదంటూ ఈమెను విరహోత్కంఠితను చేయడం మధుర కావ్యఘట్టంలోని సన్నివేశంలా ఉంది. నీ విధి అంటూ ఓ బాధ్యతగల వనితగా నాయకిని పరిపక్వతతోడి పడతిని చేసారు. వెన్నెలను తోసేసి ఎర్రపిట్టంటూ దినరాజునుదయింపజేసి మరో రోజుని వేచియుండాల్సిందేమోనని అంటూ ఆమెకే తెలియజెప్పారు ప్రకృతి ద్వారానే! నెలరాజైనా దినరాజైనా నాయకిని సేదదీర్చలేదాయె. అందుకే నిదురరాదాయె. అలసిన పిదప సేద తీరేది ఆతని నీడలోనేగా!? అందుకే యుద్ధంలో వీరవిహారిని తలపోస్తూ బీభత్సంగా కొదమసింహంలా సంచరించే ఆ పాదద్వయం మృదు మధుర మంద మలయానిలాన్ని తోడుగా తనవైపే వస్తాయని చరణసేవకై చకోరసదృశ నయనాలతో స్వాగతం పలికేందుకు నట్టింటనే ముడుచుకున్న అరవిందంలా ఉందామె…
ఓ రసవత్తర కావ్యంలో ఉండ వలసిన రసజ్ఞత అంతా నీ కవనఝరిలో చాలా సున్నితమైన భావాక్షరాలలో పొదిగావమ్మా! ఎక్కడా వలపు తలపుభావనను హద్దు మీరనీయకుండా ఓ త్యాగమూర్తి, ఓ రాధ,ఓ నాయకి వంటి వనిత మనసుని ఆవిష్కరించిన తీరు పరమాద్భుతం! వాగ్దేవి మీ కలంలో నిరంతరం వసియించుగాక! అభిజ్ఞాన శాకుంతలం కూడా ఇంతందంగా ఉండదు చెల్లమ్మా! టోపీ తీసేసాను సోదరీ! అభినందనలు.