దేవుడిని అదీ ఇదీ కావాలని అడగకు
కోరికల చిట్టా చుట్టచుట్టి పక్కన పెట్టు
దాని వల్ల ఒరిగేది నకారమే.
నీ ‘కర్మ’తో ఆయనకేం పని?
ఆయనేమీ ‘గ్రీవెన్స్ సెల్’ నడపడం లేదు
నీ మొక్కుబడులతో, పూజలతో
ఆయన్ను ప్రలోభపెట్టాలని చూడకు
నీ బలహీనతలన్నీ ఆయనకూ ఆపాదించకు
నీవు మొక్కులు తీర్చకపోతే, సందర్శించకపోతే
ఆయనకు కోపం వస్తుందనీ, అనర్థం జరుగుతుందనీ
అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం లేదు.
తన పేరు పెట్టలేదని, బారసాల నాడు
చంటిపాప నేడ్పించేవాడు
దేవుడెలా అవుతాడు?
కోపాలకూ, ప్రతిచర్యలకూ,
కృతజ్ఞతకూ, కృతఘ్నతకూ
అతీతమైనదే దైవత్వం
నీ చేతలూ తలపోతలే నీ తలరాతలు
అవే నీ సంతోషాన్ని, నిశ్చింతనూ నిర్ణయిస్తాయి.
దేవుడు కానే కాదు.
నీ విధి నీవు చిత్తశుద్ధిగా నిర్వర్తించు
పనిలోనే భగవానుని చూడు
సేవ, సహాయాలే ఆయన కిష్టమైన పూజా విధానాలు
స్వర్గం నరకం అనేవేవీ ఉండవు
ఉంటే గింటే, అవి నీలోనే వున్నాయి
నీ సంతోషమే స్వర్గం, నీ దుఃఖమే నరకమని
సుమతీ శతకం సూక్ష్మంగా చెప్పింది.
సహజనులలో స్వామిని దర్శించు
సర్వజన హితమే నీ ప్రార్థన పరమార్థం
అదే నిర్మలానందపు మర్మం.
మతాలు దేవుడిని రకరకాలుగా ఆవిష్కరిస్తాయి
వేరే దేవుళ్ళను నమ్మొద్దంటాయి
‘ఏకం సత్! విప్రాః బహుధా వదంతి’
అన్న సూత్రమే నీకు ప్రమాణం
‘నదీనాం సాగరో గతిః’ అన్నట్లు
అన్ని మతాల గమ్యం ఒకటే అని గ్రహించి
నీ మతాన్ని విడువక, అన్ని మతాలనూ ఆదరించు
అదే నిజమైన సెక్యులరిజం!
పరమాత్మ మనుషుల్లో ప్రకృతిలో
వ్యాప్తంగా ఉంటాడు
వేరే రూపం ఉండదాయనకు
అంతర్ముఖుడివై ఆయనను దర్శించుకో
బంధనాలకూ, పక్షపాతానికీ అతీతుడవైతే
మిగిలిందంతా ప్రశాంతం!
విముక్తి మార్గం నీకిక సుగమం!

శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.