[సంచిక – డా. అమృతలత సంయుక్తంగా నిర్వహించిన 2024 దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన పద్మావతి దివాకర్ల గారి ‘నిజం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]


‘ఓహో’ టివి చానల్లో తెలుగులో వార్తలు చదివే వారి కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది. తన పేరు పిలవగానే టివి చానల్ మానేజింగ్ డైరెక్టర్ పార్థసారథి గదిలోకి వయ్యారంగా అడుగుపెట్టింది ఆ యువతి. లోనికొచ్చిన ఆమెని తేరిపార చూసాడు పార్థసారథి. అప్పుడే వార్తలు చదవడానికి సిద్ధమైనట్లు పూర్తి మేకప్‌తో వచ్చిందామె. ముఖాన మందంగా తెల్లటి పౌడర్ పులిమింది. పెదవులపై ఎర్రటి లిప్‌స్టిక్ కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. జుట్టు భుజాలపై అడ్డదిడ్డంగా, గజిబిజిగా వేలాడుతోంది. కూర్చోమని సౌంజ్ఞ చేసి, తన ముందున్న కాగితంలో రాసున్న ఆమె బయోడాటా చదివి, పేరు చూసి విస్తుపోయాడు.
“అదేమిటి నీ పేరు ఉన్మాదిని వా? అదేం పేరు?” అని అడిగాడు.
“యస్ సార్! నా పేరు సరికొత్తగా ఉండాలని, అలాంటి పేరు ఇంకెవరికీ ఉండకూడదని, చిన్నప్పుడు మా అమ్మా, నాన్నా పెట్టిన ‘కుముదిని’ అన్న పేరును మార్చుకున్నాను. ఏం సార్, ‘ఉన్మాదిని’ అన్న నా పేరు బాగా లేదా?” అని అడిగిందామె వెర్రి నవ్వు నవ్వుతూ.
‘ఆ పేరుకు అసలు అర్ధం తెలుసునా నీకు? చూడబోతే పేరే కాదు, నువ్వు కూడా ఉన్మాదిలా ఉన్నావే!’ అన్నమాటలు నోటి చివరిదాకా వచ్చినా దిగమింగుకొని, మొహాన నవ్వు పులుముకొని, “సరే! మీ అర్హతలు ఆన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ అర్హతలు మా టివిలో వార్తలు చదవడానికి ఎంతవరకు పనికివస్తాయో ఓ మారు తెలుసుకోవాలి. దయచేసి ఈ వార్తాపత్రికలో ఉన్న వార్తల్ని చదవండి.” అని ఆమెకో పత్రిక అందించాడు.
ఆమె పేరు ఏమైతేనేమి, వాలకం ఎలాగుంటేనేమి, ఉచ్చారణ బాగుంటే చాలు. ఇంతకు ముందు వార్తలు చదివే అమ్మాయి వినోదిని తెలుగు భాషను ఖూనీ చేసినా, చేసేదిలేక ఆమెనే కొనసాగించాడు ఇప్పటివరకూ. ఆమె ఓ రాజకీయ నాయకుడి గారాల పుత్రిక కావడమే అందుకు గల కారణం. తన మొహం రోజూ టివిలో కనపడాలనే ఉబలాటం ఆమెది. తన తండ్రి తరచూ వార్తల్లో ఉన్నట్లే తనూ కనిపించాలన్న కోరిక ఆమెది. అందుకే ఆమెకి ఉద్యోగం ఇవ్వక తప్పలేదు. ఒత్తులు, దీర్ఘాలు లేని ఆమె తెలుగు భాష కొందరికి వినోదాన్ని, తెలుగు భాషాభిమానులకు విచారాన్ని కలిగించేది. ఈసారి ఎన్నికల్లో ఆ రాజకీయ నాయకుడికి ప్రజలు డిపాజిట్ కూడా దక్కనియ్యలేదు. తన మొహం ప్రజలకి చూపించలేక, ఎక్కడో తల దాచుకున్నాడు. ఇప్పుడు ఆమెని తప్పించి, వార్తలు బాగా చదివే అమ్మాయి కోసం ఇంటర్వూ నిర్వహిస్తున్నాడు. వినోదినిని తప్పించడానికి మరో బలమైన కారణం కూడా ఉంది. ఈమధ్యనే పార్థసారథి అనుకోకుండా చిన్నప్పుడు బడిలో తనకి తెలుగు చదివించిన పురుషోత్తం గారిని కలిసాడు. తన సారధ్యంలో ‘ఓహో టివి’ నడుస్తోందని తెలిసి, అందులో ప్రసారమవుతున్న వార్తలు మీద ఓ పెద్ద క్లాసే పీకాడతను. అందుకే ఈ ఇంటర్వ్యూ.
ఉన్మాదిని ఆ పత్రిక అందుకొని చదవడం ఆరంభించింది.
“రాస్ట్రంలో ఇటీవల సంబవించిన వరద వల్ల, కోట్లలో నస్టం వాటిల్లింది. అపార ప్రాన నష్టం జరిగింది. వరద బాదితులకి సహాయ, సహకారం అందించిన రాస్ట్ర ప్రబుత్వం. కేంద్ర ప్రబుత్వం ఆర్థిక సహాయం అందజేయాలని ముక్యమంత్రి విగ్యప్తి..” ఇంకా చదవబోతున్న ఆమెను “చాలు.. చాలు..” అంటూ ఆపాడు పార్థసారథి రెండు చెవులూ మూసుకుంటూ.
“చాలా బాగా చదివా కదా సార్! నాకీ ఉద్యోగం తప్పకుండా ఇస్తారు కదా!” అందామె పొంగిపోతూ.
చాలు.. చాలు అంటే చాలా బాగుందని అనుకుందన్నమాట ఉన్మాదిని. ఏమనాలో తోచలేదు ఓ క్షణం. అమె నిజంగా ఉన్మాదినే అనుకున్నాడు మనసులో.
“ఏ విషయమూ త్వరలో తెలియబరుస్తాం.” అని ఆమెని సాగనంపి తల గోక్కున్నాడు పాపం పార్థసారథి.
ఆ తర్వాత వచ్చిన అమ్మాయిని కూర్చోమని సైగ చేసి, “మీ పేరేమిటి?” అని అడిగాడు.
ఆమె కుర్చీలో కూర్చుంటూ, “హాయ్! మై నేం ఈజ్ విచిత్ర!” అంది.
ఆ పేరేదో తెలుగులో చెప్పొచ్చు కదా అని మనసులో అనుకున్నాడు పార్థసారథి. ఆమెకి వార్తాపత్రిక ఇచ్చి చదవమన్నాడు.
“ఐ డోంట్ నో టెల్గూ! ఐ కాంట్ రీడ్. నాకు తెలుగు చదవడం రాదు. ఇంగ్లీష్‌లో రాసిస్తే చదవగలను.” అందామె అదో విధమైన యాసతో. పేరు మాత్రమే విచిత్ర కాదు, ఆమె భాష, యాస కూడా చిత్ర విచిత్రంగా ఉంది.
ఇదేదో విచిత్రంగా ఉంది. తెలుగు చదవడం రానప్పుడు, ఇంటర్వూకి రావడమేల? తెలుగుని ఇంగ్లీషులా టాకడమెందుకు? అని మనసులో అనుకొని అంతలోనే నాలిక కరుచుకొన్నాడు. ఈ విచిత్రమైన భాష తనకి కూడా అంటకముందే ఆమెని పంపించాలని నిశ్చయించుకొని, “ప్రస్తుతం మా టివి తెలుగు వార్తలు మాత్రమే ప్రసారం చేస్తోంది. మున్ముందు ఆంగ్లంలో వార్తలు ప్రసారం చేసినా, లేక మరో ఆంగ్ల ఛానల్ పెట్టినా తప్పకుండా మీకే ప్రాధాన్యం ఇస్తాను.” అని చెప్పి ఆమెని వదిలించుకొని ఓ దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు పార్థసారథి. ఇప్పటికే పాతిక మందిని ఇంటర్వూ చేసాడు. అందులో ఒక్కరు కూడా తెలుగు సరిగ్గా చదవలేకపోయారు. అందరూ భాషను ఖూనీ చేసినవారే.
‘ఏమిటీ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సరిగ్గా చదవగలిగిన వాళ్ళే కరువయ్యారా?’ అనుకొని చివరి అభ్యర్థిని పిలిపించాడు. “నమస్కారం!” అంటూ మృదు మధురంగా వినిపించగా తలెత్తి చూసాడు పార్థసారథి.
ఎదురుగా నిరాడంబరమైన దుస్తులతో, ఆకర్షణీయంగా ఉందా అమ్మాయి. పదహారణాల తెలుగుపిల్లలా ఉంది.
కూర్చోమని సైగ చేసి ఆమె పేరేమిటోనని చూసాడు. ఆమె పేరు ‘యామిని’. చక్కటి పేరు.
స్వయంగా ఆమె నుండి వివరాలు అడిగి తెలుసుకొని మరింత సంతృప్తి చెంది, అందరికీ ఇచ్చినట్లుగానే ఆమెకీ వార్తాపత్రిక ఇచ్చి చదవమన్నాడు. వీణ మీటినట్లు ఉంది ఆమె స్వరం. తప్పులు లేకుండా ఉన్న ఆమె ఉచ్చారణ పార్థసారథికి బాగా నచ్చింది. తను ఇంతకాలం అలాంటివారికోసమే ఎదురు చూస్తున్నాడు. తను అనుకున్నదానికంటే, ఆమెకి ఎక్కువ జీతం ఇవ్వడానికి నిశ్చయించుకొన్నాడు. పార్థసారథి తన నిర్ణయం చెప్పేసరికి, యామిని చాలా సంతోషించింది.
వినోదినికి మరో పని అప్పగించి, ఆమె స్థానంలో యామినిని నియమించాడు వార్తలు చదవడానికి. ఆ మరుసటి రోజు నుండి యామిని చదివిన వార్తలు ప్రసారమవసాగాయి. స్పష్టమైన ఉచ్చారణతో, మంచి హావ భావాలతో ఆమె వార్తలు చదువుతూంటే తన టివికి మహర్దశ పట్టిందని పొంగిపోయాడు పార్థసారథి.
ఇక తన ‘ఓహో’ టివి టీఆర్పీ రేటింగ్ పైకెగసిపోవడం ఖాయం. ఆ రోజే తన గురువు పురుషోత్తం గారి నుండి మెచ్చుకుంటూ ఫోన్ కూడా వచ్చింది. తెలుగు వార్తలు ప్రసారం చెయ్యడంలో తన ఛానలే మిన్న అని ఉప్పొంగిపోయే వేళ, పార్థసారథికి ఓ చేదు నిజం తెలిసింది. అదేమిటంటే, తన ఛానల్ టీఆర్పీ రేటింగ్ పెరగడానికి బదులు, కిందికి వేగంగా దిగిపోతోదన్నది ఆ భయంకర నిజం. అదెలా జరిగిందో తెలియక విస్తుపోయాడు పార్థసారథి. అందుకు గల కారణాలను విశ్లేషణ చేసాడు. వీక్షకుల అభిప్రాయాలు సేకరించాడు. అసలు సంగతి తెలుసుకొని విస్తుపోయాడు. అదేమిటంటే, ఇన్నాళ్ళూ కల్తీ తెలుగు వార్తలు విని విని, అలాంటి భాషకే అలవాటుపడిపోయిన వీక్షకులకు అసలు సిసలు తెలుగుభాష రుచించలేదు. మరో విధంగా చెప్పాలంటే, స్వచ్ఛమైన తెలుగు ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే యామిని చదివిన వార్తలు ప్రసారమైన రోజు నుండి ‘ఓహో’ టివికి వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. మరో వార్తా ఛానల్‌కి మారిపోయారు. అదీ అసలు కారణం! ఇప్పుడు మళ్ళీ యామినిని మార్చి వినోదిని చేత వార్తలు చదివిస్తేగానీ, తన టివికి మనుగడలేదని అర్థమైందతనికి. నిజాన్ని జీర్ణించుకోవడం కష్టమైంది పాపం పార్థసారథికి.