కాలం నవ్వుతోంది,
మనిషి ప్రవర్తనకు-
కాలం దుఃఖిస్తోంది
మనిషి వేసే నిందకు..!
కాలం తికమక పడుతోంది..
అర్ధంకాని మనిషి వాదనకు!!
అందలాలెక్కితే అంతా తాను,
అధః పాతాళానికి మాత్రం బాధ్యుణ్ణి తాను కాను…
ఆ పాపం కాలానిదే!!
ఎదుటి మనిషి మాటలు,
కాలం చెల్లిన నాణేలు,
తాను చేసే సోత్కర్ష మాత్రం,
సమయస్ఫూర్తి సూక్తులు!!
ప్రత్యర్థికి నష్టం వాటిల్లితే-
అది కాలం చెప్పిన సమాధానం,
తాను నష్టపోతే మాత్రం,
అది కలసి రాని కాలం!!
భిన్న రకాల చేష్టలతో,
విభిన్న మనస్తత్వాలతో..
మనిషి ఆడే నాటకాలకు,
కాలాన్ని ఒక సాకుగా చూపడమే-
అర్థం కాని వింత ప్రక్రియ!!
కాలవాహినిలో మనిషి పయనమే,
మనిషి ముందున్న కర్తవ్యం,
మనిషి వేసే విభిన్న వేషాలకు,
నిశ్శబ్ద నిరంతర పయనమే-
కాలమిచ్చే సమాధానం!!

సాగర్ రెడ్డిగారి పూర్తి పేరు పెనుబోలు విద్యాసాగర్ రెడ్డి. స్వంత ఊరు నెల్లూరు జిల్లా, నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామము. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్య నెల్లూరుపల్లి కొత్తపాళెంలోని ప్రాదమిక మరియు జిల్లాప్రజాపరిషిత్ పాఠశాలలో పూరి చేశారు. ఎన్ బి కె ఆర్ సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్ నుంచి బికాం వరకు చదివారు. చెన్నై లోని విక్కీ ఇండస్ట్రీస్‌లో మార్కెటింగ్ విబాగంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నారు. కవితా రచనలు ప్రవృత్తి. ఇప్పటి వరకు 400 కవితలు రచించడం జరిగింది.
2 Comments
డా కె.ఎల్.వి.ప్రసాద్
ప్రతి దానికీ కాలాన్ని నిందిస్తు
త న కర్తవ్యాన్ని మరుస్తున్న
మనిషి మనస్తత్వం గురించి
చక్కగా చెప్పారు.
అభినందనలు చి.సాగర్ రెడ్డి కి.
—-డా కె.ఎల్.వి.ప్రసాద్.
Sagar
ధన్యవాదములు సర్