[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
~
19వ తారీఖు ఉదయం కూడా నా జ్వరం తీవ్రంగానే ఉంది. డాక్టర్లు నన్ను మంచం దిగవద్దని నొక్కి చెప్పారు. కానీ చేయాల్సిన పనులు బోలెడున్నాయి. జనరల్ రాజేంద్ర సింహ్‌జీ వస్తున్నారు. విమానాశ్రయం వెళ్ళి ఆయనను ఆహ్వానించకపోవటం అమర్యాదకరం అవుతుంది.
నా శక్తినంతా కూడగట్టుకుని విమానాశ్రయానికి వెళ్ళాను. అక్కడ మేజర్ జనరల్ చౌధరీ ‘మీ సంగతేమిట?’ని నన్ను అడిగాడు.
ఆయన యువకుడు. గెలుపు ఉత్సాహంలో ఉన్నాడు. కాబట్టి ఈ అసందర్భ, అనుచితమైన ప్రశ్నను నేను పట్టించుకోలేదు.
“నా గురించి అనవసరంగా ఆలోచించకండి. ఇక్కడ నా పని పూర్తయిపోయింది. నిన్ననే నేను సర్దార్కు వ్యక్తిగతంగా ఉత్తరం రాశాను. నన్ను ఇక్కడి బాధ్యతల నుంచి తప్పించమని అభ్యర్థించాను.”
జనరల్ రాజేంద్ర సింహ్‌జీ వచ్చారు. ఆయన, ఆయన అధికారులతో నేను మధ్యాహ్న భోజనం చేశాను. మధ్యాహ్న భోజనం అయిన తరువాత వారికి వీడ్కోలు తెలిపి నేను ఇంటికి వెళ్ళి మంచం ఎక్కాను. అప్పుదు నాకు 104°F జ్వరం ఉంది.
స్వామి రామానంద తీర్థ పత్రికలవారితో సంభాషిస్తూ ఇలా అన్నాడు – “హైదరాబాద్ ప్రజలకు కొండంత బలంగా నిలిచిన హైదరాబాద్ ఏజంట్ జనరల్ కె.ఎం. మున్షీని భవిష్యత్తు తరాల వారు తమను కష్టాల నుంచి గట్టెక్కించిన వాడిగా గుర్తుంచుకుంటారు.”
న్యూడిల్లీలో కొందరి దృష్టిలో నేను చెడ్డవాడినయ్యానని తెలియక ముందు చేసిన వ్యాఖ్య ఇది.
సెప్టెంబర్ 20న నా జ్వరం 105° లకు పెరిగింది. బొంబాయి నుండి డాక్టర్ నాథుభాయ్ డి. పటేల్, డాక్టర్ సుఖ్తాకర్లు హైదరాబాద్ వచ్చారు.
సర్దార్ – జనరల్ రాజేంద్ర సింహ్‌జీ, మేజర్ జనరల్ చౌధరీలతో తాను ఢిల్లీలో సమావేశమవుతున్నానని, ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ రమ్మని కబుర్ చేశారు. కానీ టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న నేను ఢిల్లీ వెళ్ళలేకపోయాను. మంచం పై నుంచి కదలలేకపోయాను.
22న నా భార్య, డాక్టర్లు నన్ను ఇంటికి తీసుకువెళ్ళారు. మంచంపై నుంచి లేచి కూర్చోలేని స్థితిలో ఉన్నాను నేను.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ముందు, నిజామ్ స్వచ్ఛందంగానే హైదరాబాద్ ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ రేడియో ప్రసంగం చేశాడన్న విషయాన్ని ఎ. రామస్వామి ముదలియార్ ప్రతిభావంతంగా వాదించారన్న విషయం తెలిసి సంతోషించాను. భారత సేనలు హైదరాబాద్ చేరకముందే నిజామ్ భద్రతామండలి నుంచి హైదరాబాద్ సమస్యను ఉపసంహరించుకున్నాడని అన్నారాయన. నిజానికి నిజామ్ ఆహ్వానాన్ని పురస్కరించుకుని భారత సేనలు హైదరాబాద్‌లో అడుగు పెట్టాయి.
విదేశంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 22న నేను ముస్లిం దేశాలకు నిజామ్ ఇవ్వాల్సిన సందేశాన్ని తయారు చేశాను. కొన్ని మార్పులు చేర్పులతో 23వ తారీఖున నిజామ్ ఆ ఉపన్యాసాన్ని రేడియో ద్వారా ప్రసారం చేశాడు. ఈ ఉపన్యాసం నుంచే రామస్వామి ముదలియార్ భద్రతామండలికి ఉదాహరణలిచ్చాడు.
హైదరాబాద్‌ను స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలన్న తన ఆకాంక్షను సంపూర్ణంగా త్యజిస్తూ, ఈ విషయాన్ని ప్రపంచానికి ఈ విధంగా ప్రకటించాడు:
“గత నవంబరులో కొందరు ఓ సైన్యంలా ఏర్పడి, నా ప్రధాని ఛత్తారీ నవాబ్ ఇంటిని చుట్టుముట్టారు. ఇది హైదరాబాద్ సంస్కృతికి వ్యతిరేకం. ఛత్తారీ నవాబ్‌ను, నా రాజ్యాంగ సలహాదారు వాల్టర్ మాంక్టన్లను చుట్టుముట్టి ఒత్తిడి చేసి, నాకు విశ్వాసపాత్రులైన మంత్రివర్గంతో రాజీనామా చేయించి, నాపై లాయక్ అలీ మంత్రివర్గాన్ని రుద్దారు. కాశిమ్ రజ్వీ నేతృత్వంలో ఏర్పడ్డ ఈ సైన్యానికి దేశంపై ప్రేమ లేదు. దేశ సేవ చేసిన నిదర్శనాలు లేవు. వీరు హిట్లర్‌ను తలపింపచేసే పరిస్థితులలో రాష్ట్రాన్ని హస్తగతం చేసుకున్నారు. సమాజాన్ని భయభ్రాంతను చేశారు. లూటీలు చేశారు. హిందువులయినా, ముస్లింలయినా, తమకు మోకరిల్లని వారిని హత్యలు చేశారు. గృహాలను తగులబెట్టారు. వీరు అందరిపై అత్యాచారాలు చేస్తూ ప్రత్యేకంగా హిందువులపై అధికంగా అత్యాచారాలు చేసి, వారిని నిర్బలులను చేశారు. నేను ఎప్పటి నుంచో భారత ప్రభుత్వంతో సామరస్యపూర్వకమైన ఒప్పందానికి రావాలని సిద్ధంగా ఉన్నా, హైదరాబాదును ఇస్లామిక్ రాజ్యంగా నిలపాలని, హైదరాబాదులో ముస్లింలకు మాత్రమే పౌరహక్కులుండాలన్న దురాశతో వీరు భారత ప్రభుత్వం ప్రతిపాదనలకు నేను ఆమోదం తెలపకుండా అడ్డుపడ్డారు. అన్ని ప్రతిపాదనలను తిరస్కరించేట్టు ఒత్తిడి చేశారు. నేను ఇస్లామీయుడను. ముస్లిం అయినందుకు గర్విస్తున్నాను. అయితే హైదరాబాద్ భారతదేశం నుండి విడివడి స్వతంత్రంగా ఉండలేదని నాకు తెలుసు. నా పూర్వీకులు – 86 శాతం హిందువులు, 14 శాతం ముస్లింల నడుమ – ఎలాంటి భేదభావం, వివక్షతలను ప్రదర్శించలేదు. భారతదేశంలో ఇతర ఏ ప్రాంతంలో లేని విధంగా, ఇక్కడి హిందూ ముస్లింలు, రాజకీయంగా, సామాజికంగా, ధార్మికంగా అత్యంత సామరస్య పూర్వక సంబంధ బాంధవ్యాలతో ఉన్నారు. నా పూర్వీకులు, నేను అవలంబించిన పద్ధతుల వల్ల ఈ సాంఘిక సామరస్యం సాధ్యమయింది. గత ఎనిమిది నెలలుగా రజాకార్ల సహాయంతో అధికారానికి వచ్చిన ప్రభుత్వం హిందూ ముస్లింల నడుమ తీవ్రమైన కలతలకు కారణమయింది. దురదృష్టవశాత్తు నేను ఉన్న నిస్సహాయ స్థితి వల్ల నేను ఈ ద్వేష భావనల విస్తరణను అడ్డుకోలేకపోయాను. నిరోధించలేకపోయాను.”
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
దాతా పీర్-17
పొదుగు
సాధనమున సమకూరు
సంగీత సురధార-21
బాలా : బాలనెరపు
ఆకాశవాణి పరిమళాలు-25
జానపద గేయాల సేకరణ కర్త ‘మానారె’ సాహితీ కృషి
సహృదయము, సదవగాహనతో చేసిన సద్విమర్శ – ‘శతారం’
మహతి-57
తిరుమల రామచంద్ర ఆధ్యాత్మిక రచనలు
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
చక్కటి ఇంటర్యూ. యువ రచయిత్రికి అభినందనలు
All rights reserved - Sanchika®