ఒక వాక్యం గొప్పదే అవుతుంది
లోన భావం విశాలమైన
లోతైన, సాంద్రమైన ఆలోచనతో
అర్థం అద్భుతమై వెంటాడితే
పరమార్ధం సమాజ హితమైనచో
పరికించిన ఈ వాక్యానికి ప్రాణం
సుందర అక్షరాల సుమాల దారం
నడిపిస్తుంది జగతిని సృజనాత్మే
వాడిన పూలే
వికసించినవా కవితలో
పోరాడిన పదాలే
ఉదయించినవా కావ్యమై
కష్టాల కన్నీటి కనులే
రాలినవా చెమట తడి కవిత్వమై
శ్రమ సౌందర్యం జీవించిందా
బడుగు బతుకుల పనీ పాటగా
బాటసారి రాగమాల
పరవశించి నడిచిందా
లయలో హృదయ స్పందన
వినిపించిందా మౌనగీతం
సడిలేని సవ్వడి వొడిలో
కనిపెంచిందా అమ్మ జోల పాట
పొడి పొడి వాక్యంలో పుప్పొడి
చేసిందా హూందాగా నాట్యం
ఆకుపచ్చ ఆకుల్లో తీపి గీతం
పాడిందా తడి తడిగా ప్రకృతి
ప్రతీ స్పందనలో వీచిన పూల గాలి పాట
సామాజిక నేపధ్యంలో గొప్ప వాక్యం ఇదేనేమో!

డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
1 Comments
ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
కవిత్వం వింటే మోడైనా చిగురిస్తుంది అనే భావన మీ కవిత ద్వారా నిరూపించారు.