[హిందీలో శ్రీ అయోధ్యా సింహ్ ఉపాధ్యాయ్ ‘హరిఔధ్’ రచించిన ‘ఏక్ బూంద్’ అనే కవితని అనువదించి అందిస్తున్నారు శ్రీ కస్తూరి రాజశేఖర్.]
![](http://sanchika.com/wp-content/uploads/2024/09/OkaNeetiBinduvuPoemFI.png)
![](https://sanchika.com/wp-content/plugins/wp-content-copy-protector/images/transparent.gif)
ఒత్తయిన మేఘాల పొత్తిళ్లలోంచి
ఒక్క నీటి చుక్క
క్రిందకు జారి పోతోంది-
‘ఇల్లెందుకు దాటానం’టూ పిల్ల మనసు
తల్లడిల్లుతోంది!
‘దైవం నా తలరాత ఏమి రాశాడో?
నేను నిలుస్తానా –
లేక ధూళిలో కలుస్తానా?
అగ్గిలో బుగ్గి అవుతానా –
కలువ మొగ్గలో కుదురుకుంటానా?
అని తలపోస్తూ తపిస్తోంది!
అప్పుడే గాలివాటుగా ఆ వర్ష బిందువు
ఆ సాగర గర్భం జేరింది –
అందమైన ఆల్చిప్ప నోరు తెరచింది –
అందులో ముద్దుగా జారి
ముత్యమై మెరిసింది!
మనిషి కూడా అంతే..
ఇంటి సుఖాల ఒడి వీడాలంటే
ఆలోచనల అలజడి –
సంకోచాల సందడి!
కానీ,
బంధాల బంధనాల్లోంచి బయటపడితే సాహసమే శ్వాసనిస్తుంది –
అనుభవం అందలాన్నిస్తుంది!
అది
ముత్యమల్లే మారే వర్షబిందువు –
నీవు
ముల్లోకాలు గెలిచే హర్ష సింధువు!
~
హిందీ మూల కవిత:
एक बूंद
ज्यों निकल कर बादलों की गोद से
थी अभी एक बूंद कुछ आगे बढ़ी
सोचने फिर फिर यही मन में लगी
आह क्यों घर छोड़ कर मैं यों बढ़ी।
दैव मेरे भाग्य में है क्या बदा
मैं बचूंगी या मिलूंगी धूल में
या जलूंगी गिर अंगारे पर किसी
चू पड़ूंगी या कमल के फूल में।
बह गई उस काल कुछ ऐसी हवा
वह समुंदर ओर आई अनमनी
एक सुंदर सीप का मुंह था खुला
वह उसी में जा पड़ी मोती बनी।
लोग यों ही हैं झिझकते सोचते
जबकि उनको छोड़ना पड़ता है घर
किंतु घर का छोड़ना अक्सर उन्हें
बूंद लौं कुछ ओर ही देता है कर।
∼ अयोध्या सिंह उपाध्याय ‘हरिऔध’
మూలం: అయోధ్యా సింహ్ ఉపాధ్యాయ్ ‘హరిఔధ్’
స్వేచ్ఛానువాదం: కస్తూరి రాజశేఖర్
![](http://sanchika.com/wp-content/uploads/2024/05/KasturiRajasekhar-scaled.jpg)
హైదరాబాద్ వాస్తవ్యులైన శ్రీ కస్తూరి రాజశేఖర్ వృత్తిరీత్యా -విశ్రాంత యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (పూర్వ ఆంధ్రా బ్యాంక్) చీఫ్ మేనేజర్. ప్రవృత్తి రీత్యా రచయిత, అనువాదకులు.
ఎం. ఏ. (తెలుగు), ఎం.ఎస్. (పబ్లిక్ రిలేషన్స్), ఎం.ఎస్ సి. (గణితం) విద్యార్హతలు. ప్రస్తుతం ఎం. ఏ. (సైకాలజీ) చేస్తున్నారు.
అనువాదకునిగా – నేషనల్ బుక్ ట్రస్ట్, న్యూ ఢిల్లీ వారికి అనువాద/ప్రూఫ్ రీడింగ్ సేవలందించారు. జోతిరావు ఫూలే చరిత్ర, భక్త్ ఖాన్ అనువదించారు. ఈనాడు ఆదివారం పత్రికకు ఎన్నో సిండికేట్ ఆర్టికల్స్ అనువాదం చేశారు.
పి. దినకర రావు గారి ‘Ramblings’ ఇంగ్లీష్ కవితా సంపుటి తెలుగులోకి అనువాదించారు.
వీరి కథలు ఈనాడు ఆదివారం పత్రిక, విపుల (అనువాద కథలు), చతుర పత్రికలలో ప్రచురితమయ్యాయి. ‘ఓ సారి చూడండి అంతే.. whatsapp ప్రసారభారతి సంచిక’ నిర్వహించిన కథల పోటీలో వీరి కథ ‘ఎక్కడ ఉన్నా.. ఏమైనా..’ బహుమతి పొందింది
వీరి నవల ‘చక్రవ్యూహం’ ఆంధ్రప్రభ దీపావళి నవలల పోటీలో 3వ బహుమతి పొంది 28 వారాల పాటు ధారావాహికగా ప్రచురితమైనంది.
నాటక రచనలు:
– ఆమె త్యాగం (చలం గారి కథకు నాటక రూపం – అజో విభో కందాళం సంస్థ వారి కథా నాటికల పోటీలో ప్రదర్శింపబడింది.)
– నాతిచరామి (న్యూ ఢిల్లీ – శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్ వారు నిర్వహించిన జాతీయ నాటక పోటీలలో 2వ బహుమతి)
– త్వమేవాహం (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో 8 బహుమహతులు), తిరుపతి మహతి స్టేడియం, మరెన్నో వేదికల పైన ప్రదర్శింపబడింది.
– శతమానం భవతి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పోటీలో జ్ఞాపిక )
– సర్వేజనా సుఖినోభవంతు (హైదరాబాద్ BHEL నాటక పోటీలో ఉత్తమ బాల నటుడు బహుమతి)
– పారిజాతం (డిసెంబర్, 2022 – న్యూ ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్, జనవరి, 2023 – హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ, జనవరి , 2023 – విజయవాడ లలో ప్రదర్శింపబడింది)
– పరంపర (రస రంజని వారి ఆధ్వర్యం లో 26-10-2023న శ్రీకృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్స్, గుడివాడ వారిచే ప్రదర్శింపబడింది)
– గురుభ్యోనమః
ఇవి కాక, ఈనాడు అదివారం పత్రిక కోసం పుస్తక సమీక్షలు చేశారు. యండమూరి రచనల సమీక్షా వ్యాసానికి బహుమతి పొందారు. 2016 బాంకాన్ సమావేశ పత్రాల ముద్రణలో సహాయ సేవలందించారు. డా. బి. కామేశ్వర రావు వ్రాసిన ‘ఆనంద విజయం’ (బెర్ట్రాండ్ రస్సెల్ ఆంగ్ల రచన – ది కాంకేస్ట్ అఫ్ హ్యాపీనెస్‌కు అనువాదం) కు; సీహెచ్ శ్రీనివాస శాస్త్రి వ్రాసిన ఇంగ్లీష్ రచన – the unanswered questions కు, కొండపల్లి సనత్‌కుమార్ రచించిన ‘శ్రీ సాయి బాబా చరిత్ర’ (ఇంగ్లీష్)కు సంపాదకత్వ బాధ్యలు నిర్వహించారు. ఆంధ్రాబ్యాంక్ house magazine ‘magicart’ సంపాదక మండలి సభ్యులు.
ఎన్నో కవితలు రాశారు. ‘కాల ధర్మం’ ప్రసిద్ధి చెందిన కవిత. ఆల్ ఇండియా రేడియోలో కవితా శ్రవణం. అభినందన పంచరత్నాలు వగైరాలు.
‘పడమటి ఉషస్సు’ అనే లఘుచిత్రానికి కథ, మాటలు అందించి, నటించారు. Kasturi Dreamworks అనేది వీరి యూట్యూబ్ ఛానెల్.
పలు తెలుగు ప్రకటనలకు డబ్బింగ్ చెప్పారు. ఢిల్లీ, హైదరాబాద్ లలో ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈనాడు – ఆదివారం, విపుల, చతుర పత్రికలకు సబ్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఫోన్: 9848378034
3 Comments
Krishna Kumar Satelli
నీటి బిందువు.. రాజశేఖర్ గారి హిందీ కవిత కు అనువాదం.. చాలా బాగుంది.. మనసుకు హత్తుకునేలా,ఆలోచించేలా వుంది.
కొల్లూరి సోమ శంకర్
ఇది ఎన్. జగదాంబ గారి వ్యాఖ్య: *చాలా బాగుంది. నిజం చెప్పాలంటే original కంటే అనువాద కవిత యే బాగుంది. Career building కోసం ఇంటిని విడిచి ఎక్కడెక్కడికో వెళ్ళవలసి వస్తున్న ఈ తరం పిల్లలందరికీ ఇది ఒక మంచి సలహా.. direction/inspiration ఇచ్చారు/చెప్పారు. Congrats![👏](https://s.w.org/images/core/emoji/15.0.3/svg/1f44f.svg)
-జగదాంబ N.*
D V RAGHAVA
చాలా బాగుంది కవిరాజ శేఖరా. శేఖరుని కవితలు, మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తూ. రాఘవ డీ.వీ. హైదరాబాద్