[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]
ఆరోజు ఆదివారం. శరీరం కంటే మనసు ఎక్కువగా అలసిపోయింది. అలసిన మనసు ఏకాంతాన్ని కోరుకుంది. హరితహారంలోని మొక్కల్లా సమస్యలు పచ్చగా ఉంటున్నవి. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నవి. ఒక సారి అనారోగ్యం రూపంలో మరొకసారి ప్రమాదం వేషంలో ఇలా రకరకాల రూపాల్లో వెంటాడుతున్నవి. వాటితో యుద్ధం చేస్తూ రాజీపడుతూ, గెలుస్తూ, ఓడుతూముందుకు సాగుతున్న క్రమంలో మనసు అలుపుకు గురౌతుంది. నిద్రించి విశ్రాంతిన్విడమా? సంతోషపెట్టి శక్తి నివ్వడమా? ఎటూ తేల్చుకోలేక పడకవేసిన.కన్ను అంటుకోలేదు. తలలో కందిరీగలు ప్రవేశించినయి. మెదడును అలజడికి గురి చేసినయి. పక్కమీద దొర్లుతున్న
“డాడీ! ఎవరో వచ్చిండ్రు మీకోసం”
బయటికి వచ్చి చూసేసరికి ‘అతడు’. ఆశ్చర్యపోయిన. లోపలికి రమ్మని, కూర్చోమని చెప్పిన. “ఏమిటి, సంగతులు”అడిగిన
“ఇవ్వాళ సెలవు కదా, కలుద్దామని వచ్చిన, పెద్ద విశేషం ఏమీలేదు”
“సెలవు రోజులు ఎట్లా గడుపుతవు, నీకు పెద్ద బాధ్యతల్లేవు కదా!
“బాధ్యతలు ఏమీ లేవు కాని బాపును భరించడానికి కష్టం అయితుంది. అన్నయ్యకు పెళ్ళి అయింది. పిల్లలు సంపాదన తక్కువ. నీలాగే మాట అంటే పడని మనిషి. బాపుది ఆధిపత్య ధోరణి. ఆయనను భరించడం కష్టం. అన్నయ్యలాంటి వారికి మరింత కష్టం. ఈ మధ్య వాళ్ళిద్దరికి పడటం లేదు. అన్నయ్యను ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మన్నడు. నాకు ఇంట్లో ఉండబుద్ది కాక వచ్చిన.”
“మీ బాపును అర్థం చేసుకోవడం కష్టం. సమస్యల పరిష్కర్తగా కనబడతడు. కాని నిజమైన సమస్య అతడే అనిపిస్తుంది.”
“నువ్వు చెప్పింది నిజమే”
“ఇంట్లో గొడవలు నా చదువును అడ్డుకుంటున్నయి”
“మీ బాపు నాకు అర్థమయిండు. ఇలాంటి వారు ఇతరులతో ఆత్మీయంగాను, ఇంటి వారితో కఠినంగాను ఉంటరు.”
“నిజమే, నీవు చెప్పిందాంట్లో సత్యముంది.”
“మీ బాపు కష్టాల్లోంచి ఎదిగిండు. తనలాగే ఇతరులు కూడా కష్టపడాలనుకుంటడు.”
“అవును. తను ఉప్పిడి ఉపాసముండి పైకి వచ్చిండు. తన వాళ్ళను అర్ధాకలితో ఉంచడం సబబేనా? తనకు పైస ఎట్లుంటదో తెలియదు. ఇతరులకు అది రుచి చూపించాలా? తను పక్కా అభద్రతలో పెరిగిండు. పక్కవారికి భయాన్ని కల్పించాలా? ఒకరి ఆధిపత్యం కింద బతికిండు. సన్నిహితుల స్వేచ్ఛ హరించాలా? అతడు అనాథలాగా గడిపిండు. కుటుంబీకుల్ని పేదగా ఉంచాలా? సున్ననుండి ఎదిగిండు. ఎదుటి వారిని సున్నా లాగా పరిగణించాలా? పరిస్థితులే ఇతని పాలిట శాసనాలయ్యాయి. దగ్గరివారిని తనే శాసించాలా? అనివార్యాలన్నీ ఆయన పాలిట శిక్షలయ్యాయి. క్రమశిక్షణ పేర ఆయన శిక్షలు విధించాలా? అతనొక సంప్రదాయవాది. ఇతరులు తన వాదననే ఒప్పుకొని తీరాలా? రాజకీయాలు తెలిసినవాడు, వంటింట్లో కూడా రాజకీయాలు చేయాలా? ఎదుగుతున్న క్రమంలో హింసల పాలయ్యాడు. ఇతరులను హింసించాలా? నచ్చిన వారే తనవారనుకున్నడు. ఆ ప్రాతిపదికపై తన పర బేధం లేకుండా చూసిండు. తనను సమర్థించని వారి గొంతు నొక్కాలా? తను నమ్మిందాన్ని ఇతరులకు కష్టమైనా ఆచరించాడు. ఇతరులు అదేపని చేస్తే పగ పెంచుకోవాలా? భక్తి, ఆధ్యాత్మికతల్ని బోధించాడు. పగ ప్రతీకారాలతో బతికిండు.” అతడు ఆవేదనగ అన్నడు.
“అన్నయ్య ఏం చేస్తడు. ఎక్కడికెళ్తున్నడు. ఆయనకు అత్తగారి సపోర్ట్ ఉందా”
“ప్రైవేట్ గుమస్తాగా పనిచేస్తడు. ఎవరి సపోర్ట్ లేదు. మా వాడలోనే చిన్న రూం కిరాయికి తీసుకున్నడు. పిల్లలు గుర్తుకొస్తే బాధ కలుగుతున్నది. అందుకే ఆర్థిక స్వేచ్ఛ లేంది బరువులు నెత్తిన పెట్టకోవద్దు. దానికి తోడు తెలంగాణ ఉద్యమమని మరొకటని అన్నయ్య తిరుగుతుంటడు. తన సంసారం చక్కబెట్టుకోలేనోడు లోకాన్నేం చక్కబెడ్తడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తిరగడం కూడా బాపు కోపానికి ఒక కారణం అయింది. సకల జనుల సమ్మెలో చురుకుగా పాల్గొన్నడు. ఆయనకు డైరీ రాసే అలవాటు ఉన్నది 42 రోజుల సమ్మెను రికార్డు చేసిండు. ఆ డైరీలన్నీ ఇంట్లో పడేసి వెళ్ళిండు. వాటిని బాపు చూస్తే ఇల్లు కురుక్షేత్రం అయితది. అందుకే పట్టుకొని వచ్చిన”
“నాకివ్వు చూస్త” అని డైరీ తిరిగేయడం మొదలుపెట్టిన. సకలజనుల సమ్మె జరిగిన తేదీలతో సహా వివరాలను ఇలా నమోదు చేసిండు.
13-08-2011
తెలంగాణల సెప్టెంబర్ పదమూడు నుండి సకల జనుల సమ్మె మొదలయింది. ఇది మరపురాని రోజు. ఉద్యోగులంటే జీతం, భత్యం, ప్రమోషన్ అనే అపవాదు నుండి, ప్రజలకోసం అవన్నీ త్యాగం చేస్తమని తయారైన రోజు. నిన్న కరీంనగర్లో జరిగిన టిఆర్ఎస్ సభ వల్ల బలం వచ్చినట్లయింది. ఆరోజు నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ ఊదిండ్రు. పాలన ఆగింది. సకలం బంద్ అయింది. యుపి.ఎ ప్రభుత్వం తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటదనిపిస్తంది.
14-09-2011
సమ్మెలో ఉద్యోగులు, కార్మికులు ముందున్నరు. గవర్నమెంట్ ఆఫీసులు మూతపడ్డయి. నో వర్క్, నో పే… అని ప్రభుత్వం చెప్పింది. సింగరేణి బంద్‌తో బొగ్గుపెల్ల పెగల్లేదు. కరెంట్ కోతలు మొదలయినయి. సర్కారీ సేవలు బంద్ అయినయి. విశాఖపట్నానికి చెందిన న్యాయవాది పి. వెంకటనారాయణ సమ్మెపై ప్రజాప్రయోజనవ్యాజ్యం వేసిండు. విద్యుత్ ఉద్యోగులు నిరసన మొదలు పెట్టిండ్రు.
15-09-2011
సమ్మెకు మద్దతుగా సినిమా థియేటర్ల యాజమాన్యాలు బంద్ పాటించాయి. తపాలా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రవాణాతో పాటు ట్రెజరీ, రిజిస్ట్రేషన్లు, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, గనుల శాఖల్లో సమ్మె తీవ్రం అయింది. వేల కోట్ల ఆదాయానికి గండి పడింది. సర్కారు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టింది. దిష్టిబొమ్మల దహనం జరిగింది. ఊరేగింపులు ఉదృతమైనయి. తెలంగాణ ద్రోహులను హెచ్చరించారు.
16-09-2011
పది జిల్లాల్లోని ఉపాధ్యాయ లోకం సమ్మె బాట పట్టింది. ప్రభుత్వ, ఎయిడెడ్, మండల పరిషత్, రెసిడెన్షియల్ పాఠశాలలు మూతపడ్డాయి. ఉపాధ్యాయ సంఘాలు సమ్మెను మొదలుపెట్టినయి. సాంఘీక గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంటికి వెళ్ళారు. ఈ సమయంలో జరగాల్సిన త్రైమాసిక పరీక్షలు జరగుతయో, లేదో అనే అవస్థ మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటిస్తామని ప్రకటించినయి. బోధన బంద్ అయింది.
17-09-2011
ఉద్యోగుల అరెస్టులు, నిర్బంధాలు జరిగినయి. నగరంలో 144 సెక్షన్ పెట్టిండ్రు. పెద్ద ఎత్తున విలీన దినోత్సవం జరపాలని కోదండరాం అన్నారు. జాతీయ జెండా ఎగరేసి దాని పక్కన తక్కువ ఎత్తులోనే తెలంగాణ జెండా ఎగరేయాలి. అమరుల కోసం ఒక నిమిషం మౌనం పాటించాలని అన్నారు.
18-09-2011
తెలంగాణ ఇవ్వకుంటే ముఖ్యమంత్రిని, పీసీసీ చీఫ్‌ను, చిరంజీవిని, తెలంగాణలో తిరగనివ్వమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెదిరించారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పనులు మూలకు పడ్డయి. ఎస్మా పరిధిలోకి ఆటోలు, బస్సులను తెచ్చింది ప్రభుత్వం లాఠీచార్జీలు, అరెస్టులు లెక్కచేయకుండా ప్రభుత్వ కార్యాలయాల పైన తెలంగాణ జెండాలు ఎగిరినయి. అన్ని జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నయి.
19-09-2011
ప్రధాన రహదారుల దిగ్భంద కార్యక్రమానికి రాజకీయ ఐకాస పిలుపునిచ్చింది. జాతీయ రహదారుల దిగ్బంధం జరిగింది. 85 డిపోలు, ఆర్టీసీ బస్సులు, వేలాది మంది ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొన్నరు. ఉత్తర, దక్షిణ భారతాల మధ్య సంబంధాలు తెగినయి. కోస్తాకు బస్సు వెళ్ళలేదు.
20-09-2011
తెలంగాణ అంతటా మానవహారాలు ఏర్పడ్డాయి. నిజాం హాస్టల్ విద్యార్థులపై ఖాకీలు విరుచుకుపడ్డారు. చితకబాదారు. పోలీసుల దాడిని కేసీఆర్ ఖండించారు. సింగరేణి యాజమాన్యం కార్మికులను ప్రలోభపెట్టింది. డ్యూటీలకు వచ్చినట్లయితే వారు అనుకున్న చోట కోరుకున్న బొగ్గుగనికి పంపిస్తామని చెప్పింది. కార్మికులు లొంగలేదు.
21-09-2011
తెలంగాణ అంతటా కుటుంబాలతో సహా నిరాహార దీక్షలు సాగినయి. ట్రాన్స్‌కో, జెన్కో, సీపీడీసీయల్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ ఐదు జిల్లాల విద్యుత్ ఉద్యోగులు “కరెంటోళ్ళ శంఖారావం” పేరిట సభ జరిపారు. ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దేవాదాయ శాఖ, అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో అర్చకులు తెలంగాణ కోరుతూ హోమం చేసిండ్రు.
22-09-2011
తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సమన్వయకర్త కె.రఘు, ఉదయం 11.30గంటలకు విద్యుత్ సౌధలో 72 గంటల నిరాహార దీక్ష ప్రారంభించిండు. న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఖమ్మంలో బహిరంగ సభ జరిగింది.
23-09-2011
తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. తెలంగాణ ద్రోహులుగా తమని చిత్రీకరించడం తగదని ప్రజాప్రతినిధులు మొరపెట్టుకున్నారు. రోడ్డు పొడవునా వంటావార్పులు కనిపించినాయి. కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించిండ్రు.
24-09-2011
తెలంగాణలో రైల్‌రోకో జరిగింది. సకలం బంద్ అయింది. రైళ్ళు బస్సులు ఆటోలు ఆగిపోయినయి. ఉద్యమకారులు పొద్దంతా పట్టాలపైన కూసున్నరు. ధూంధాంలు, ప్రసంగాలు సాగినయి. రైలు పట్టాలు, స్టేషన్ ఫ్లాట్‌ఫాంలపై ప్రజలు కొలువుదీరిండ్రు. సోనియాగాంధీకి తెలంగాణలోని పరిస్థితులు వివరిస్తామని జైపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ సెగ ఢిల్లీకి తాకింది.
25-09-2011
సకలజనుల సమ్మెలో ఇది 13వ రోజు. తెలంగాణరాష్ట్ర సాధన ఉద్యమంలో దాదాపు రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పాల్గొన్నరు. ప్రజాజీవనం పూర్తిగా స్తంభించింది. ఈరోజు రకరకాల రూట్లలో సమ్మె జరిగింది. ఈ రోజటి సమ్మె దేశ ప్రజలందరి దృష్టికి వెళ్ళింది.
26-09-2011
ఈరోజు జరిగిన సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక హెచ్చరికగా సాగింది. ఆంధ్ర బస్సుల్ని అడ్డగించారు. వంటావార్పులు చేసారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారు. పరిశ్రమలు బంద్ నిర్వహించినయి. దసరా, బతుకమ్మ పండుగలను తెలంగాణకు అంకితం చేసామని కేసీఆర్ అన్నరు.
27-09-2011
ఆర్టీసీ కార్మికుల ర్యాలీలు సాగినయి. విమలక్క ఆధ్వర్యంలో గచ్చీబౌలీలోని ఎమ్మార్ ప్రాపర్టీస్ గోల్ఫ్‌కోర్స్‌ను తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ముట్టడించింది. అరెస్టులు జరిగినయి.
28-09-2011
భారీగా రాస్తారోకోలు జరిగినయి. ఊరూరా బతుకమ్మ పండుగ మొదలు కావడంతో బతుకమ్మ ఆటలు జోరుగా సాగినయి. ఎంఐఎం పార్టీ తెలంగాణ డిమాండ్‌పై తన పాత వైఖరి మార్చుకొని మెత్తబడినట్లు కనబడింది. “లగడపాటి కాదు… లంగపాటి”లాంటి నినాదాలు మిన్నంటినయి. శవయాత్రలు సాగినయి.
29-09-2011
విద్యుత్ కోతకు నిరసనగా తెలంగాణ ప్రజాప్రతినిధుల ఇళ్ళముట్టడి జరిగింది. తెలంగాణ కాంట్రాక్టర్లు సమ్మెలో దిగినారు. ఎడ్లబండి ర్యాలీలు, ఉదృతమైనయి. బతుకమ్మ ప్రజాగర్జనలు హోరెత్తించినయి. స్వామిగౌడ్‌పై హత్యాయత్నాన్ని అరెస్ట్‌ను ముక్తకంఠంతో ఖండించారు. ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే దారి లేదంటూ 14 మంది మంత్రులు సోనియాకు లేఖ రాసారు.
30-09-2011
తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అందుకు నిరసనగా హైదరాబాద్ బంద్‌కు కోదండరాం పిలుపునిచ్చారు. ర్యాలీలతో నగరం దద్దరిల్లింది. పాతబస్తీలో బతుకమ్మలు కొలువుదీరాయి. న్యూస్‌పేపర్ హ్యాకర్ల బంద్‌తో పత్రికా పాఠకులు సందిగ్దంలో పడ్డారు.
01-10-2011
ఈరోజు తెలంగాణరాష్ట్రాన్ని కాంక్షిస్తూ కాగడాల ప్రదర్శన జరిగింది. భారీ ర్యాలీలు, మహాపాదయాత్రలు జరిగినయి. బోధన్‌లో 33 కులాలు భారీ ర్యాలీలు చేపట్టినయి.
02-10-2011
సబ్బండ వర్ణాలు పాల్గొన్న సకలజనుల సమ్మె 20వ రోజుకు చేరింది. రహదారులపై టోల్‌టాక్స్ కట్టకుండా ప్రయాణం సాగించారు. పన్ను బహిష్కరణ జరిపారు. కోర్టులకు తాళాలు వేశారు.
03-10-2011
బతుకమ్మ ఉత్సవాల్ని వినూత్నంగా నిర్వహించారు. ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ప్రతిబింబించేలా కార్యక్రమాలు సాగినయి. పండుగలను తెలంగాణకు అంకితం ఇచ్చారు.
04-10-2011
కార్మికులతో పాటు కర్షకులు సమ్మెలోకి దిగినారు. సకల జనుల సమ్మె విరమించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ కోరితే, కేసీఆర్ తిరస్కరించారు. ఆత్మహత్యలు జరుగుతున్నవి. విద్యార్థి బలిదానాలకు మేధావి వర్గం తల్లడిల్లింది. ఆత్మహత్యలు ఆపండి అని పిలుపునిచ్చారు.
05-10-2011
నేషనల్ హైవే-9 ఆందోళనకారులపై 39 కేసులు పెట్టినారు. దసరాకు వెళ్ళిన సీమాంధ్రులను తిరిగి రానివ్వమని విద్యార్థి జేఏసి హెచ్చరించింది. నీ సంపదను అక్రమంగా కూడబెట్టిన ధనాన్ని పంచుతావా? అని లగడపాటిని విమలక్క అడిగింది. త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డయి. బార్లలో పనిచేసే సిబ్బంది బంద్‌కు సహకరించారు. మద్యం బంద్ అయింది.
06-10-2011
డప్పుల దరువు, దీక్షలు, ర్యాలీలు, అర్థనగ్న ప్రదర్శనలు వైద్యుల గర్జన ఉద్యోగుల ధర్నాలు, రైతుల కోడెద్దుల ప్రదర్శన, ట్రాక్టర్ ర్యాలీలు జోరుగ జరిగినయి.
07-10-2011
ఈరోజు దసరాద పండుగ, దినపత్రికలకు సెలవు. “దశకంఠ కాంగ్రెస్” సంహారం పేరుతో దహనం జరిపారు.
08-10-2011
దసరా పండుగ సందడి కనిపించలేదు. కాంగ్రెస్ నేతల ఇళ్ళ ఎదుట ధర్నాలు జరిగినయి. దసరా ఉత్సవాల్లో ప్రజలు బలంగా తమ ఆకాంక్షను తెలియజేశారు. “ఉద్యోగులు అలసిపోయారు” అని స్వామిగౌడ్ చేసిన వ్యాఖ్యలపై చర్చ తారాస్థాయికి చేరింది.
09-10-2011
కాంగ్రెస్ ఎంపీలు ఆమరణ దీక్షకు సిద్దం అయ్యారు. బడులు తెరిచేది లేదని ఉపాధ్యాయ ఐకాస స్పష్టంచేసింది. తెలంగాణ వ్యాప్తంగా కుల, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు, మార్వాడీ, గుజరాత్ మంచ్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు రాస్తారోకో చేపట్టాయి.
10-10-2011
జ్యుడీషియల్ సిబ్బంది రోడ్లు ఊడ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరు రకరకాలుగా తమకు తోచిన రీతిలో సమ్మెను నూనత పద్దతులలో నడిపించారు.
11-10-2011
ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ప్రయోజనాల మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని తెలిపారు. కోదండరాం అరెస్టు, విడుదల జరిగింది. తెలంగాణ ఆర్టీసీ (టీఎన్‌ఎంయూ) యూనియన్ బస్సులు తిరగనివ్వం అని తేల్చింది. తెలంగాణలో రైల్రోక్ ఉందని 137 రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేసారు. సెలవుల తర్వాత స్కూళ్ళు తెరుచుకోలేదు.
12-10-2011
‘రైల్‌రోకో’ వాయిదా పడింది రైళ్ళ రద్దును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఉపసంహరించుకున్నారు. అనేక విషయాలపై ముఖ్యంగా ఉద్యమ నాయకులపై పెట్టిన కేసుల గురించి ప్రభుత్వంతో చర్చలు జరపాలా వద్ద అనే సంశయంలో ఐకాస పడింది. సమ్మె వల్ల ఉపాధి కోల్పోయిన కూలీలకు ఉద్యోగ సంఘాల నేతలు తమ వేతనాలను ఇస్తారా? అని అడిగిన లగడపాటికి జవాబుగా “నీవు తెలంగాణలో ఆక్రమించిన భూములను పంచి పెట్టగలవా? అని విమలక్క ప్రశ్నించింది.
13-10-2011
ఎస్కార్ట్ సహాయంతో బస్సులు నడిచినయి. తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల పరిస్థితి దయనీయంగా మారింది. నెల రోజులు గడిచినా “సకల జనుల సమ్మె”లో దూకుడు తగ్గలేదు. ప్రభత్వంతో ఐకాస జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఉద్యమ అణచివేతలో భాగంగా సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్న వారిని అక్రమంగా అరెస్టు చేసి కుట్ర కేసులు బనాయించారు.
14-10-2011
ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులపైన కఠినంగా వ్యవహరిస్తే అత్యవసర సర్వీసులు కూడా నిలిచిపోతాయని, తెలంగాణకోసం అన్ని త్యాగాలకు సిద్దంగా ఉన్నామని ఐకాస హెచ్చరించింది. సమ్మె విరమిస్తే ఆలోచిస్తామని ప్రభుత్వం షరతు పెట్టింది. రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన సిపీఐ కామ్రెడ్లపై లాఠీ నాట్యం చేసింది. సమ్మెలో ఉన్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలకు, “బ్రేక్ ఆఫ్ సర్వీస్”అస్త్రాన్ని ప్రయోగించా లని ప్రభుత్వం ఆలోచించింది. రైల్ రోకోను భగ్నం చేయడానికి జమ్ము కాశ్మీర్లో భద్రతా విధుల్లో ఉన్న 18 కంపెనీలను కేంద్ర పారామిలటరీ బలగాలను ప్రత్యేక రైలులో హైదరాబాద్‌కు తరలించారు.
15-10-2011
రైల్‌రోకోను విజయవంతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చిండు. తెలంగాణలో అరెస్ట్‌ల పర్వానికి తెర లేచింది. సుమారు వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. ముప్పై రోజులు దాటినా తెలంగాణాలో అన్నీ బంధ్ అయినా కేంద్రం మౌనం వీడలేదు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులపై దాడులు జరిగాయి. గృహ నిర్భందాలు, సైనిక కవాతులు, అక్రమ అరెస్టులు గగనతల నిఘా తెలంగాణలో చోటు చేసుకున్నాయి.
16-10-2011
సకల జనుల సమ్మెలో భాగంగా మూడు రోజుల రైల్‌రోకో కార్యక్రమం జరిగింది. రైల్వేలకు నష్టం జరగకున్నా అరెస్టులు జరిగినయి. తెలంగాణ రోడ్ మ్యాప్‌ను ప్రకటించేదాకా తాము సకల జనుల సమ్మె విరమించబోమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు. రైల్‌రోకో జరిపిన అన్ని పార్టీల నాయకులను అరెస్ట్ చేసారు. దాదాపు జేఏసీ నాయకులందరిపై రైల్వే కేసులు పెట్టారు.
17-10-2011
జేఏసీకి సమాచారం లేకుండానే సమ్మె విరమణపై ఉపాధ్యాయ జేఏసీ నిర్ణయం తీసుకోవడం, ప్రకటన చేయడం చర్చనీయాంశం అయింది. ఆర్టీసీ కార్మికులు ఇదే విధంగా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సమ్మె విషయంలో సంఘాలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవద్దని, అలాగే వారికి చెందిన నిర్ణయాలు జేఏసీ సొంతంగా తీసుకోవద్దని తీర్మానించారు. హైద్రాబాద్‌ను దిగ్భందించాలని గద్దర్ పిలుపునిచ్చారు. ఆందోళనకారులు బస్సులను తగులబెట్టారు.
18-10-2011
సింగరేణి కార్మికులు సమ్మె విరమించారు. ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, మానవహారాలు జరిగాయి. ప్రశాంతంగా తెలంగాణ బంద్ జరిగింది. ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. సకల జనుల సమ్మె సడలింది.
19-10-2011
అవినీతి నిర్మూలన సుపరిపాలన అవసరాన్ని చెబుతూ అద్వాని చేసిన రథయాత్రలో తెలంగాణ నినాదం ప్రతిద్వనించింది. సమ్మె ఆగదని స్వామిగౌడ్ ప్రకటించారు. కేంద్ర ప్రకటన వచ్చేదాకా సమ్మె చేస్తామని టీఎన్జీవో ప్రకటించింది.
20-10-2011
కేబుల్ ఆపరేటర్లు మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. తెలంగాణ సాధించే వరకు సమ్మెకు ఎలాంటి విరామం తాము ఇవ్వమని గెజిటెడ్ అధికారుల సంఘం స్పష్టం చేసింది. సకలజనుల సమ్మె విజయవంతం అయింది. ఆ ఫలితాలు టీఆర్ఎస్కు దక్కుతాయి.
21-10-2011
ఆం.ప్ర. రాష్ట్రావతరణ (01-11-2011) ఉత్సవాల్లో పాల్గొనవద్దని వాదనలు బయల్దేరాయి.
22-10-2011
“సమ్మె ఎంతకాలం కొనసాగిద్దాం! క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది? 45 రోజులుగా సమ్మె చేస్తున్నా కేంద్రం ప్రకటన చేయలేదు.15 రోజుల్లోనే స్పందన వస్తుందనుకున్నాం. కానీ రాలేదు. కాంగ్రెస్ కోర్ కమిటీలో చర్చ జరిగింది తప్ప నిర్ణయం కాలేదు. ఉద్యోగులు వొక నెల జీతం కోల్పోయారు. మరో నెల జీతం కూడా కోల్పోవాల్సిన పరిస్థితి. ఫలితంగా చిరుద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.” అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
23-10-2011
సకలజనుల సమ్మె 40వ రోజుకు చేరింది. నవంబర్ రెండో వారంలో లక్షల మందితో “తెలంగాణ మార్చ్”నిర్వహిస్తామని ప్రకటించారు. ఉస్మానియా ఆస్పత్రి మెడికల్ జేఏసి ఆధ్వర్యంలో ఆస్పత్రిలో చండీయాగం చేసారు.
24-10-2011
సమ్మె 41వ రోజుకు చేరింది. దీపావళి, బక్రీద్ లాంటి పండుగలను దృష్టిలో ఉంచుకొని సమ్మె విరమించాలి. తెలంగాణ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కనుగొంటామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు గులాంనబీ ఆజాద్ అన్నారు. 144 సంఘాలకు చెందిన మేధావులు ఆలోచించి తెలంగాణ ఉద్యమ రూపకల్పన చేసారు.
25-10-2011
నవంబర్ ఒకటి తేదీన తెలంగాణ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో నల్లజెండాలను ఎగరవేయాలని తెలిపారు. “సమ్మె తాత్కాలికంగా మాత్రమే ఆగింది. ఉద్యమం ఆగలేదు”అని రాత్రి 11 గంటల సమయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం ప్రకటించారు.
నేను డైరీ చదివినంత సేపు అతడు టీ తాగుతూ పేపర్ చదివిండు. “నిజంగా తెలంగాణది ఎంత బాధ”అన్నాను.
“నాకు, మా అన్నయ్య బాధనే కనపడుతుంది”
“తెలంగాణ కూడా మీ అన్నయ్య లాంటిదే”
“అర్థం కాకుండా మాట్లాడి చంపకు”
“సమాజంతో అంత డిటాచ్డ్గా ఉంటే ఎట్ల. కనీసం మన లెక్కల రమేశ్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పు”
“వాడంటే నాకు చిన్నప్పటినుండి ఇష్టమే. తన భవిష్యత్తును చక్కగా ప్లాన్ చేసుకున్నడు. ఇంటర్ పూర్తి కాగానే టీచర్ ట్రైనింగ్ చేసిండు. చాలా రోజులు ప్రైవేట్ స్కూల్లో చేసిండు. ఆ తరువాత గవర్నమెంట్ జాబ్ కొట్టిండు. చిన్నతనంలోనే గవర్నమెంట్ టీచర్‌గా సెటిల్ అయిండు. వాడికి మండలంలో మంచి పేరుంది. నేను రెగ్యులర్‌గా డిగ్రీ చేసినా, వాడి జీతంతో సమానంగా లేను. నీవు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినా, నా జీతంతో సమానంగా నీ సంపాదన లేదు. అందుకే వాడి ప్లానింగ్ అంటే నాకు ఇష్టం.”
“వాడిల్లు దగ్గరేనా! వెళ్ళి కలుద్దామా, చాలా రోజులైంది కలువక” అన్నాను.
ఇద్దరం కలిసివాడి ఇంటికి బయల్దేరినం. అరగంటలో వాడి ఇంటి ముందున్నం. పిలువగానే బయటకు వచ్చిండు. నన్ను చూసి ఆశ్చర్యపోయిండు. సంతోష పడ్డడు.
“ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి, ఏం చేస్తున్నవు. ప్రశ్నలతోనే స్వాగతించిండు.
“ఇప్పుడు మేం ఇద్దరం కోలీగ్స్ము” అన్నాను.
“అవునా మంచి సమయంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం, విద్యావ్యవస్థలో అనేక ప్రయోగాలను చేపట్టింది. నువ్వు అందులో చురుకుగా పాల్గొను. డబ్బు, పేరు పుష్కలంగా వచ్చే వీలు ఉంది” అన్నాడు.
“వీడెందుకు పాల్గొంటలేడు” అడిగిన
“వాడు గ్రూప్స్‌కు తయారవుతున్నడు”
“ఆ ప్రయోగాల్లో నీకు అనుభవం ఎక్కువ అని తెలిసింది. నేనేమో సర్వీస్‌కు కొత్త జరిగిన విషయాలు తెలిస్తే పాల్గొనవచ్చు.”
“ఇప్పుడే చెప్పమంటే చెబుత. ఎంతసేపు”
వాడు విద్యావ్యవస్థ గురించి చెప్పడం మొదలు పెట్టిండు.
ఆర్థికంగా, సాంకేతికంగా ఇంగ్లండ్ సహాయసహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్య పథకం (ఏపీఈపీ) నడిచింది. ప్రాథమిక విద్య వెనుకబడి ఉంది. దానికి ప్రాధాన్యతనిచ్చి పిల్లల్ని బడివైపు ఆకర్షితుల్ని చేయడం, అందుకు నూతన పాఠశాల భవనాల్ని నిర్మించడం, మానవ వనరుల్ని అభివృద్ది చేయడం ఈ పథకం ఉద్దేశ్యాలు. ఈ పథకం మొదటి దశ 1984-87 వరకు, రెండవ దశ 1987 నుండి 1996 వరకు సాగింది. 1) అభ్యసన కృత్యాలను అందించడం 2) కృత్యాధార బోధన 3) వ్యక్తిగత, జట్టు, మరియు తరగతి గది కృత్యాల్ని అభివృద్ది పరచడం 4) విద్యార్థుల వైయక్తిక బేధాలను గుర్తించి బోధన చేయడం 5) స్థానిక వనరుల్ని ఉపయోగించి బోధన చేయడం 6) తరగతి గదిని ఆకర్షణీయంగా తీర్చి దిద్దడం ఈ పథకపు ముఖ్య సూత్రాలు. తర్వాత వచ్చిన అనేక పథకాలకు ఇది మాతృకగా పనిచేసింది.
ఆరునుండి పదకొండు సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలకు సార్వత్రిక ప్రాథమిక విద్య అందించడం జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డిపిఈపి) ముఖ్య ఆశయం. ఇది 1996-1997 వరకు నడిచింది. ప్రాథమిక తరగతులలోని బాలబాలికలందరికి గుణాత్మకమైన విద్యను అందించడం ద్వారా తరగతికి నిర్దేశించిన కనీస అభ్యసన స్థాయిలను సాధింపజేయడం కూడా ఈ పథక లక్ష్యం.
బడిలో చేరిన పిల్లలందరూ చదవడం,రాయడం, చతుర్విదప్రక్రియలు (శ్రవణ, భాషణ, పఠన, లేఖనం) చేయగల్గడమే లక్ష్యంగా ఏర్పరచిన కార్యక్రమమే పిల్లల భాషాభివృద్ది కార్యక్రమం (సీఎల్ఐపి) ఇది 2005-2006 వరకు జరిగింది.
చదవడం, రాయడం చేయగల్గిన పిల్లలకు ఆయా తరగతి వారి సామర్థ్యాలను అందించడం కోసం తయారు చేసిన కార్యక్రమమే “పిల్లల అభ్యసనాభివృద్ది కార్యక్రమం”. ఇది 2006-2007 వరకు జరిగింది.
2009-10 సం|| నుండి భాషా బోధనోద్దేశాలు నెరవేరేలా దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి అభ్యసనాభివృద్ది కార్యక్రమం (ఎల్ఈపి) అమలుపరిచారు. కార్యక్రమంలో భాషా సామర్థ్యాలను నిర్ధారించారు. ప్రధానంగా ఆలోచించడం, వ్యక్తపరచడం, సృజనాత్మకత, కల్పనాశక్తి మొదలయినవి కీలకమైన అంశాలుగా గుర్తించి భాషా సామర్థ్యాలను నిర్ణయించారు.
పిల్లలంతా ఆనందంగా చదవాలి. చదవడం ద్వారా అభివృద్ది చెందాలి. అందుకే “చదువు ఆనందించు-అభివృద్ది చెందు”అనేది ఒక కార్యక్రమం. దీనినే ఆంగ్లంలో Read Enjoy and Develop (READ) అని అంటారు. అలాగే Quality Improvement Program (QIP) అనేది ఒకటి. ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల్ని పెంపొందించడం, గుణాత్మక విద్యను అందించడం ప్రధాన ఉద్దేశ్యాలు. అన్ని పథకాల్లో కూడా బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్దపెట్టారు.
విద్యా వ్యవస్థను అభివృద్ది చేయుటకు, అందులో అకడమిక్ పట్ల శ్రద్ద పెట్టుటకు, మరియు పాఠశాల భవన నిర్మాణాలకు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ గురించి ప్రత్యేక బాధ్యతలను వహించుటకు వ్యవస్థలను ఏర్పాటు చేసారు. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఎ) సమగ్ర శిక్షాఅభియాన్ ఇలాంటి కార్యాలయాల ద్వారా పాఠశాల సర్వతోముఖాభివృద్దికి ప్రభుత్వం పాటుపడింది.
విద్యార్థుల సర్వతోముఖాభివృద్దికోసం ప్రస్తుతం “నిరంతర సమగ్ర మూల్యాంకనం పేరున ఒక విద్యావిధానం అమలులో ఉంది. దాని ప్రకారం పరీక్షలు నిర్వహించడం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడం జరుగుతుంది.
“వీడు సామాన్యుడు కాదు” అన్నాను. అంతా విన్నాక
“ఆ విషయం ముందు చెప్పిన కదా” అన్నాడతడు.
“చాలా ఏండ్ల తరువాత కలిసినం. అందరం కలిసి భోజనం చెద్దాం” ప్రతిపాదించాడు.
అలా ఆరోజు చిన్ననాటి స్నేహితులం ముగ్గురం కలిసి భోజనం చేసినం. చిన్నప్పటి స్నేహాలు గుర్తు చేసుకున్నం. బడి చదువుల్ని కలబోసుకున్నం. కుటుంబ కష్టసుఖాలు చెప్పుకున్నం. నాటి టీచర్ల బోధనల తీరు, వారి వ్యవహారశైలి గూర్చి మాట్లాడుకున్నం. పిల్లల చదువులు, ఫీజుల ముచ్చట్లు చర్చకు వచ్చినయి. తల్లిదండ్రుల ఆరోగ్యాలు, అన్నదమ్ముల వ్యవహారాలు, రాజకీయాలు, నాటికి నేటికీ వచ్చిన మార్పులు ఒకటేమిటి సమస్తం వచ్చినయి మా మధ్యకు.
“మ్యాట్నీ షో టైం అయితుంది. సినిమాకు వెళ్దామా” అన్నాడతను.
“ఇవ్వాళ వీడి తలలో నాగజెముడు మొలిచింది. కుదురుగా ఉండలేకపోతున్నడు” అన్నాను.
“ఫర్వాలేదు. చాల్రోజుల తర్వాత కలిసినం. అందరం కలిసి వెళ్దాం” అన్నాడు రమేశ్.
ముగ్గురం కలిసి ముందుగానే బయల్దేరినం. సినిమా టాకీస్ వద్దకు వచ్చేసరికి టికెట్ ఇష్యూయింగ్ ఇంకా మొదలు కాలేదు.
“ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బాగుండు” అసహనంగా అన్నాడతడు.
“ఆన్లైన్లో కాఫీ తాగగలమా” అన్నాను.
“కాఫీ తాగుదాం పద. టైం పాస్ అవుతది.” అన్నాడు రమేశ్.
ముగ్గురం కాఫీ సిప్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన అనేక మార్పులను ముచ్చటించుకున్నం. సినిమా రంగం కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, సినిమా టాకీసులు మూతపడడం, బుల్లి తెరప్రభావాలు, పైరసీ వివాదాలు చిన్న సినిమా తట్టుకోలేకపోవడం, హీరో వర్షిప్ తగ్గడం, గ్రాఫిక్స్ మాయలు పెరగడం, సమాంతర సినిమా చిన్నబోవడం, ఫిలిం సొసైటీ ఉద్యమం సన్నగిల్లడం ఇలా అనేక విషయాలు మా మధ్య చర్చకు వచ్చినవి. టికెట్ తీసుకునే దగ్గర క్యూ లేదు. సంతోషంతో తీసుకొని వెళ్ళి లోపల కూర్చున్నం. కొద్దిసేపట్లోనే హాల్ నిండింది. టికెట్ రిజర్వ్ చేయించుకున్న వాళ్ళే ఎక్కువ మందని అర్థం అయింది. సినిమా మొదలయింది. చూసాక ఎవరిళ్ళకు వాళ్ళం వెళ్ళినం అలా ఆరోజు గడిచింది.
(మళ్ళీ కలుద్దాం)
డాక్టర్ బి.వి.ఎన్. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్ 16న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.
2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.
