Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పల్లేరు కాయలు-7

[ప్రముఖ రచయిత శ్రీ డా. బి.వి.ఎన్. స్వామి రచించిన ‘పల్లేరు కాయలు’ అనే నవలికని ధారావాహికంగా అందిస్తున్నాము.]

ఉద్యోగం వచ్చి ఐదు సంవత్సరాలయింది. ఆర్థిక స్థితి మెరుగయింది. అవసరాలు పుంజుకున్నయి. ఆదాయానికి మూరెడు ముందు దూరంలో అవసరాలు ఉంటున్నవి. ఆ సమయంలో మొదటి ప్రమోషన్‌ వచ్చింది. చాలా సంతోషం అనిపించింది. పని చేస్తున్న సెక్టర్‌కు చెందిన సౌకర్యం మొదటిసారి దొరికింది. ప్రమోషన్‌ రావడం వల్ల సుల్తానాబాద్‌ నుండి కరీంనగర్‌ పట్టణానికి వచ్చిన తెల్లారితే విద్యా మహాసభలు. హరగోపాల్‌సార్‌ వస్తున్నడట. ఈసారి వెళ్ళాలి. చాలా రోజులైంది. సామాజిక సంఘటనల్లో పాల్గొనక. ఎంతసేపు పిల్లలు, కుటుంబం, ఆర్థికం, వీటి మధ్య తచ్చాడుతూ తాబేలు జీవితం గడుపుతుండడం నచ్చడం లేదు. ఏదో ఒక సంఘంలో క్రియాశీలక సభ్యుడిగా పనిచేయాలని పించింది. మహాసభకు వెళ్ళిన. ఎంత సంరంభం అది. పదిమంది ఒకచోట కలిస్తే జీవశక్తి తొణికిసలాడుతది. ఏదో ఒక ఆశయం కోసం మానవ వనరులు ఏకీకృతం కావడం వల్ల ఎంతో శక్తి ఉద్భవిస్తది. దాని వల్ల బలహీనుడు సైతం బలం పుంజుకుంటడు. గడ్డిపోచలు కూడా గడ్డపారలై నిలుస్తయి. ఆ గుణం తెలంగాణలో ఎక్కువ. ఈ నేల మీద ఏదో ఒక మూలన ఎప్పుడూ ఒక ప్రత్యామ్నాయ ఆలోచన పురుడు పోసుకుంటది. అలాంటి ఆలోచనకు కార్యరూపమే ఈ సభలు.

విద్యాపరిరక్షణ-సవాళ్ళు అనే అంశంపై సార్‌ మాట్లాడుతున్నడు. తన ప్రసంగంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం తెలుస్తది. ప్రపంచీకరణలో భాగంగా విద్య ప్రైవేట్‌ రంగం చేతుల్లోకి పోవడం, వ్యక్తుల చేతుల్లో నుండి, కార్పోరేట్‌ శక్తుల చేతుల్లోకి వెళ్ళడం, ఫీజుల భారం వల్ల తల్లిదండ్రులు కుదేలవడం, ప్రాథమికావసరం అయిన విద్య అందనంత దూరంలో ఉండడం, దాని వల్ల ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు మూతబడడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేక పరిణామాలు పతనదిశగా ఎలా వెళుతు న్నాయో చక్కగా వివరించిండు. ఆ ప్రభావాలు ఉపాధ్యాయుల ఉన్నతిని ఏ విధంగా దెబ్బతీస్తున్నవో కూడా ఆసక్తిగా వివరించిండు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల బడిలో ఉన్న ఉపాధ్యాయ్యుల సంఖ్యను ప్రభుత్వం కుదించింది. అందువల్ల కొత్తగా నియామకం కాబోయే నిరుద్యోగులపై దెబ్బపడింది. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై బదిలీ వేటుపడింది. ఉద్యోగాల్ని తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక లాభం జరిగింది. ఈ క్రమం ప్రాథమిక పాఠశాల నుండి డిగ్రీ కళాశాల వరకు సాగుతున్నది. నిరుద్యోగిత పెరుగుతున్నది. పనిచేస్తున్న ఉపాధ్యాయులకు దీని వల్ల పదోన్నతుల అవకాశం కుంటుపడింది. ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, కాలేజీ లెవల్‌కు, డిగ్రీ స్థాయి వరకు ఎలా వెళ్ళగలడు? అన్ని అర్హతలు ఉండి కూడా జూనియర్‌ మరియు డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేయలేకపోవడం అనే విషాదమే జీవితాల్లో చోటుచేసుకోబోతున్నది. కనుక ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకునే దిశగా కదలండి అంటూ ముగించిండు.

నిన్న గాక మొన్న పదోన్నతి పొందిన నాకు తల దిమ్మెక్కింది. ఇక ముందుకు పోయే అవకాశం లేదా అనిపించింది. సామాజిక పరిణామాల్ని అంచనా వేయాలన్నా భవిష్యత్‌ అవగాహన కలగాలన్న క్రియాశీలకంగా ఉండాల్సిందేనన్న విషయం మళ్ళీ ఒకసారి రుజువైంది. క్రమశిక్షణాయుతమైన అభివృద్ధికి కుటుంబం దోహదపడుతుంది అనడంలో ఎంత నిజం ఉందో, మనిషిని కుటుంబం నియంత్రిస్తుంది అనడంలో కూడా అంతే నిజం ఉంది. వెనకా ముందు ఆసరా లేకపోవడం ఒంటి చేత్తో నావను నడపడం లోనే వ్యక్తి శక్తులు హరించుకపోతయి. కుటుంబ, సమాజ అవసరాల్ని తీర్చాలంటే మనిషికి ఆసరా తప్పనిసరి. అది లేకపోతే ఏదో ఒక దానిపై దృష్టి ఉంటది. ఇంకొక దానిపై దృష్టిపెట్టే అవకాశం తగ్గుతుంది. రెంటిపై దృష్టి పెట్టి ఇతోధికంగా సమాజసేవ చేయాలంటే ఎలా? అనేప్రశ్న నిలువెత్తు తాటి చెట్టులా నా ముందు నిలబడింది. అప్పటి వరకు ఉపాధ్యాయ సంఘంలో నామకః తిరుగుతూ పనిచేస్తున్న నాకు నేనున్న స్థితి మేరకు నా మనసు నిర్దేశించిన వరకు, నాకు అనువైనదిగా భావించిన సాహిత్య రంగంలో క్రియాశీలకంగా పనిచేయడం సరి అయినది అనిపించింది. అందుకు గతంలో నేను చదివిన చదువులు, ఆసక్తులు, ప్రస్తుత ఉద్యోగం కూడా ప్రధాన కారకాలుగా నిలబడ్డవి. వర్తమాన చోదక శక్తులుగా కరీంనగర్‌లో పనిచేస్తున్న సాహితీసంస్థలు వ్యక్తుల కారణంగా కూడా ఆ నిర్ణయం తీసుకున్నాను.

నేను పనిచేస్తున్న పాఠశాలకు కొత్తగా ఒక లేడీ టీచర్‌ వచ్చింది. మంచి వృత్తి నిబద్దత ఉన్న తెలుగు టీచర్‌. పాఠం చెప్పడం, చదివించడం, రాయించడం పరీక్షపెట్టడం, ప్రోత్సహించడం ఇలా చాలా రకాలుగా ఆమె విద్యార్థులతో మమేకమవుతుంది. ఆమె పనివిధానం ఆకట్టుకుంది. ప్రక్కనే ఉన్న జూనియర్‌ కాలేజీ పిల్లలకు కూడా ప్రిన్సిపాల్‌ గారి ఆదేశాల మేరకు బోధిస్తుండేది. ఆమెను చూస్తే ఆశ్చర్యమనిపించేది. ఒకరోజు స్టాఫ్‌ రూంలో కూర్చున్నప్పుడు ఆమె ఇలా అంది.

“మీరు కూడా కాలేజీలో క్లాసులు తీసుకోవచ్చు కదా”

“కాలేజీ పిల్లలకు చెప్పడం కష్టం కదా”

“ఎందుకు, నేనుచెప్పుతున్నాను కదా, నాకంటే మీరు సీనియర్‌ కూడా”

“నాకు యం.ఏ. తెలుగు లేదు. చెప్పకూడదు కదా”

“మీరు సాకులు చెప్పుతున్నారు. భయము, న్యూనత అనేవి మీలో ఉన్నవి. అవి వదిలించుకోండి.”

“అదేం కాదు. నేను కూడా చెప్పగలను”

“ప్రిన్సిపాల్‌ గారు అడిగినపుడు చెప్పడానికేం అభ్యంతరం అయినా తెలుగులో పీ.జీ. చేయండి అనామకులెందరో చేస్తున్నరు. మీలాంటి వాళ్లు ఎందుకు చేయరు. కుటుంబము, బాధ్యతలు, ఆర్థికం ఇలాంటివి చెప్పకండి. ఇవన్నీ మన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడం కోసం మనం చెప్పుకునే సాకులు. అలా చెప్పుకుని ఆత్మతృప్తి పొందకూడదు” అన్నది.

ఏర్పడిన బాటలోనే నడవాలనే కఠిన క్రమశిక్షణతో బాల్యం గడిచింది. సుడిగాలిలా ముప్పిరిగొన్న బాధ్యతల బరువు వల్ల కొత్తబాట వైపు తొంగి చూడలేదు. టీచర్‌ మాటల స్ఫూర్తితో కాలేజీ క్లాసులు తీసుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడింది. ధైర్యాన్నిచ్చింది. న్యూనతను తొలగించింది. యం.ఏ. తెలుగు దూరవిద్య ద్వారా పూర్తి చేసిన. అదే ఊపులో యం.ఇడి. పూర్తి చేసిన. ఈ రెండు సర్టిఫికెట్లు ఎంతో ఉపయోగ పడినవి. దూరవిద్యలో తెలుగు యం.ఏ. విద్యార్థులకు బోధించిన. ఎం.ఇడి ఉండడం వల్ల మూడు సంవత్సరాలు టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు విద్యార్థులకు కాలేజీకి వెళ్ళి రెగ్యులర్‌గా బోధించగలిగిన. మూడు సంవత్సరాలు కాలేజికి డిప్యూటేషన్‌పై వెళ్ళి పనిచేయగలిగిన. అక్కడ నేను పొందిన తృప్తి జీవితంలో యాది పెట్టుకోదగ్గది. మంచి వ్యక్తుల స్పూర్తి జీవితంలో పూల పరిమళంలా సేద తీరుస్తుంది.

నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే సాహిత్యమంటే అభిరుచి పెరిగింది. దానితోనే ఎక్కువగా పుస్తకాలు చదవడం అలవాటయింది. ఎన్నడూ సృజన జోలికి వెళ్ళలేదు. చదువుకునే రోజుల్లో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. అందుకోసం సాయంత్రాలు పిల్లలకు ట్యూషన్స్‌ చెప్పేది. అట్లా వచ్చిన డబ్బుతో అవసరాలు వెళ్ళదీసుకునేది. కంటికి కాని, మనసుకు కాని నచ్చింది కొనుక్కోవడానికి “పర్సు పర్మిషన్‌” ఇచ్చేది కాదు. దాని మాట ‘లక్ష్మణరేఖ’ లాంటిది. రేఖదాటి సీతలాగా కష్టాలు తెచ్చుకోవడానికి భయపడేది. ఆ భయం రక్తగతమై నడిపిస్తుంది. జీవితం పెట్టిన పరీక్షల వల్ల సృజనకు దూరమైన ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకునే వ్యవధి దొరికింది. పాత సాహితీ వాసన గుప్పుమంది యం.ఏ. తెలుగు సర్టిపికెట్‌ కోసం చదివిన చదువు దానికి తోడైంది. సాహితీ సమావేశాలకు వెళ్ళడం మొదలైంది. డిగ్రీ చేసేటప్పుడు సాహితీ సమావేశాలకు వెళ్ళిన అనుభవం గుర్తుకొచ్చింది. రెండు థాబ్దాల తరువాత సాహితీ వనంలో అడుగుపెట్టిన. ఆనాడు వచనంపై ఏర్పడ్డ అభీష్టం చెక్కు చెదరలేదు. ఆనాడైనా, ఈనాడైన మొదటినుంచి కవిత్వందే పై చేయి. సాహితీ సమావేశ విశేషాలను బడిలో టీచర్‌తో పంచుకునేవాడిని. ఆమెకు సమావేశాలంటే ఇష్టం ఉండేది కాదు. పక్కా ఫర్‌ఫెక్షనిస్ట్‌. ఆమెను చూస్తే నా మిత్రుడు ‘అతడు’ గుర్తుకు వచ్చేవాడు. సమావేశాల పట్ల ఆమె అభిప్రాయాల్ని కొట్టి వేయలేక పోయేవాణ్ణి.

“జరుగుతున్న సమావేశాల ద్వారా తెలుసుకునేది ఏమీ లేదనిపిస్తుంది.” అంది ఒక రోజు.

“సమావేశాల ద్వారా సాహితీ వాతావరణం ఏర్పడుతుంది” అన్నాను

“అంతకంటే లైబ్రరీ వాతావరణం గొప్పది”

“పుస్తకాలతో మాట్లాడలేం కదా”

“అవే నీతో మాట్లాడుతయి. విషయాలు నేర్పుతాయి”

“కవి సమ్మేళనాల ద్వారా కవులు తయారవుతున్నరు కదా”

“వాటితో నీకేం పని. నీకు వచనం అంటే ఇష్టం కదా”

“నీతో మాట్లాడడం కష్టం. తెలుసుకోవడానికి కాకున్నా కలసుకోవడానికైనా ఇవి ఉపయోగపడతాయి.”

“గెలుపు కోసం వాదించకండి. నిజం తెలుసుకోవడానికి మాట్లాడండి. మీకు వచనం అంటే ఇష్టం అంటిరి కదా. కథపైనో విమర్శపైనో దృష్టి పెట్టండి బాగుంటది”

“పెద్దవాళ్ళు మీరు చెప్పినట్లే చేస్త” అంటూ అక్కడి నుంచి లేచిన.

తరగతి గదులు లేని బడిలో నా చదువు సాగింది. నేను చెబుతున్న బడిలో గదులకు కొదవలేదు. వానొస్తే నాడు బడికి సెలవు. బంద్‌ పిలుపొస్తే నేడు సెలవు. కిటకిట మంటూ తూనీగల్లాంటి విద్యార్థులకు నాడు కొదవలేదు. ఆనాడు ప్రతి బడిలో ఉపాధ్యాయులు కరువు. నేడు విద్యార్థుల కరువు. చెబుతున్న చోటునే నివసించే ఉపాధ్యాయుల కనుసన్నల్లో నాటి విద్యార్థుల అభ్యసన సాగింది. నేడది పూర్తిగా కరువైంది. విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు క్షీణించినయి. సర్కారు బడి తప్ప మరొకటి తెలియని రోజులవి. వాడకో ప్రైవేటు బడితో సర్కారు బడి కునారిల్లుతున్న రోజులివి. ఎవరిపై ఏ వేటు పడుతదో తెలియని సందర్భంలో బడి బతుకు సాగుతున్నది. నూతన బోధనాభ్యసన ప్రక్రియతో విద్యావ్యవస్థను గాడిలో పెట్టాలని ప్రయత్నం జరిగినప్పుడల్లా అనేక ఎదురుదెబ్బలతో ముందుకు కదలలేని పరిస్థితి. నిబద్ధతగల ఉపాధ్యాయులతో దూసుకెళ్ళిన విద్యావ్యవస్థ నాడుంది. విద్య ప్రతి ఒక్కరి ఇంటిముందుకు వచ్చి వాలిన వేళ ఇది. నాడు చాలా కొద్దిమందికి మాత్రమే విద్యాగంధం అంటింది. ఇలా అనేక ఒడిదొడుకులు, కుదుపులతో ముందుకెళుతున్న విద్యావ్యవస్థ అనేక పరిణామాలను మూటగట్టుకుంది. రేషనలైజేషన్‌, స్కూల్‌ మ్యాపింగ్‌ అనే రెండు పరిణామాలు, ఉపాధ్యాయలోకానికి ప్రభుత్వ బడికి ఆశనిపాతాలు అయినయి.

బడిలో విద్యార్థుల సంఖ్యకు ఉపాధ్యాయుల సంఖ్యకు మధ్య ఒక నిష్పత్తి ఏర్పాటైంది. విద్యార్థుల సంఖ్య తగ్గితే ఎక్కువ ఉన్న ఉపాధ్యాయులను గుర్తించి వేరే చోటికి అంటే విద్యార్థులు ఎక్కువగా ఉన్న చోటికి బదిలీ చేయడం రేషనలైజేషన్‌ (క్రమబద్దీకరణ)ముఖ్య ఉద్దేశం. ఆ విధానం వల్ల నేను తప్పని సరిగా, విధిలేక బదిలీ కావలసి వచ్చింది. నేను వెళ్ళిన కొత్తబడిలో కూడా ఎక్కువ మంది పిల్లలు లేకపోవడం దుఃఖకారణమైంది. ఆ బడి పరిస్థితులు హృదయవిదారకంగా ఉన్నవి. అదొక ప్రాథమికోన్నత పాఠశాల, నగరం నడిబొడ్డున ఉంది. మాసిపోయిన గోడలు, గాలి, వెలుతురు చొరలేని గదులు, అక్షరాలు చెరిగిపోయి వేలాడుతున్న పాఠశాల బోర్డు. మొత్తంగా పాఠశాల పాడెమీద పడుకున్న మనిషిలా ఉంది. “ఉదరపోషణార్థం బహుకృత వేషం” అన్నట్లు బడిలో పన్నెండుగురు ఉపాధ్యాయులు. అందులో నేను ఒకణ్ణి. బడి చుట్టూ అపరిశుభ్ర వాతావరణం. చిన్న సందులు, చీకటి గుహలను తలపించే ఇళ్ళు. ఒకవైపు వ్యభిచార కొంపలు, మరోవైపు గుజ్జన గూళ్ళ వంటి గుడిసెలు. పందుల వీరవిహారం, దోమలతో నిండిన డ్రైనేజీ వ్యవస్థ. మరోవైపు పెద్ద కార్పోరేట్‌ ఆఫీసు  పెట్టని కోటలా ఉండి, ఇటు వీచే గాలిని అడ్డుకుంటుంది. ఇంకో వైపు చిన్న కాలిబాట. ఆ బాట నుండే బడికి రాకపోకలు సాగుతున్నవి. బడిని చూసి ఏడుపొచ్చినంత పని అయింది.

వలస వచ్చిన వారి పిల్లలు, తోపుడు బండ్లు అరటిపండ్లబండ్ల వారి పిల్లలు, పూటకు లేని వారి పిల్లలు, ఏక వ్యక్తి కుటుబంలోని పిల్లలు, చెడు తిరుగుళ్ళు అలవాటైన పిల్లలు, గుట్కా, తంబాకు, భంగులాంటి పదార్థం ఉపయోగించే పిల్లలు, వచ్చేది బడికి అనే సోయిలేని పిల్లలు. వీళ్ళంతా ఒకచోట చేరడానికి ఏర్పరచబడిన కేంద్రం ఆ బడి. వీళ్ళంత దాన్ని ఒక విడిది లాగా భావిస్తూ గడుపుతున్నరు. బడి వెనకే ఉన్న వ్యభిచార గృహాలపై రైడింగ్‌ జరిగినప్పుడల్లా వారు రాత్రులందు బడిలోనే తలదాచుకోవడం అలవాటు అయింది. అందుకు అనువుగా తలుపులు ముసలివై ఉండడం, ఒక్కోసారి రైడింగ్‌లో అవి విరగడం, తెల్లవారి వాటిని మేం బాగుచేసుకోవడం, ఇదంతా ఒక బాగోతం. అక్కడ పనిచేసే ఉపాధ్యాయులంతా మనసు చంపుకొని, పొట్ట చేత పట్టుకొని నిస్తేజంగా రోజులు గడుపుతున్నరు. ఆ స్థితిలో వెళ్ళిన నేను పరిసరాలతో మమేకమై, విద్యార్థులు లేరనే నెపంతో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందోననే భయంతో సంఖ్యను పెంచిన. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. వెల్లువగా వచ్చిన విద్యార్థులు, మధ్యలనే వారి అవసరాల మేరకు వెనక్కి వెళ్ళినారు. ఈసారి ప్రమాదం స్కూలు మ్యాపింగ్‌ పేరు మీద వచ్చింది. సంఖ్యలేని బడులను మూసివేయడం, అందులోని స్టాఫ్‌ను ఇతర పాఠశాలలకు తరలించడం దీని ఉద్దేశం. ఉన్నత పాఠశాలలు కొన్ని మూతబడినవి. ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దయినవి. ఆ విధంగా నేను మరొక పాఠశాలకు బదిలీ అయ్యాను. యాభై కిలోమీటర్ల దూరం గల హుజురాబాద్‌కు వెళ్ళాల్సి వచ్చింది.

అది సెలవు రోజు. కొండలు పగలేసిన అలసట ఆవరించింది. పడుకున్నాను. ఈ మధ్య తరచూ అలసట అనిపించి శరీరం  విశ్రాంతి కోరుకుంటుంది. శరీరంలో మార్పులు తెలుస్తున్నయి. ఆరోజు నిద్ర రాకున్నా కళ్ళుమూసుకొని పడుకున్న.

“నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది

కన్నుల్లో నీరు తుడిచి, కమ్మటి కల ఇచ్చింది.”

రింగ్‌టోన్‌ మోగుతుంది. దృశ్యంలోని విషాదం కనబడింది. గొంతులో వణుకు వినిపించింది. నేపథ్యంలో అమాయకత గుర్తుకొచ్చింది. గీతంలోని భావుకత అర్థమైంది. సంగీతంలోని మృదుత్వం మెత్తగా తట్టింది. దీనంతటికి కారకులైన వారికి నమస్కరించిన రింగ్‌టోన్‌ మళ్ళీ మోగింది. పదే పదే మోగుతుంది. ఎవరో ఫోన్‌ చేస్తున్నట్టుంది అనుకుంటూ సెల్‌ ఆన్‌ చేసిన. కొత్త నెంబర్‌

“హలో” అన్నాను

“ఎవర్ని నేను” ప్రశ్నించిండు

“అతడు” పట్టేసిన

“ఎలా ఉన్నవు” అడిగిండు

“ఈ కొత్త నెంబర్‌ ఏమిటి?

“నాకు జిల్లా విద్యాశాఖాధికారిగా ప్రమోషన్‌ వచ్చింది. ఇది అఫీషియల్‌ నెం. ఇది కూడా ఉండని’

“కంగ్రాజులేషన్స్‌”

“రెండు రోజుల తరువాత ఇంటికి వస్తున్న కార్యక్రమాలేవి పెట్టుకోకు. నిన్ను కలుస్త.”

“అట్లాగే” పెట్టేసిన.

ప్రతిరోజు ఉద్యోగం చేయడానికి వంద కిలోమీటర్లు చేసిన ప్రయాణం నా నడుముకు ఎసరు పెట్టింది. బ్యాక్‌ పేయిన్‌ ఎక్కువయింది. పనిచేస్తున్న చోటునుండి కరీంనగర్‌కు రావాలంటేమూడు విధాలున్నవి. 1) ట్రాన్స్‌ఫర్‌ 2) ప్రమోషన్‌ 3) డిప్యూటేషన్‌. మొదటి రెండు అయ్యేవి కావు. అవకాశాలు లేవు. మూడవదానికి నా శక్తి సరిపోదు. ఆఫీసర్స్‌ దగ్గర అంత పలుకుబడి లేదు. కాలం గడుస్తుంది. కరీంనగర్‌ దగ్గరలో ఉన్న డైట్‌ కళాశాల (జిల్లా విద్యాశిక్షణాసంస్థ)లో పనిచేయడానికి అర్హులైన టీచర్స్‌ కావాలని ప్రకటన వచ్చింది.

“సార్‌ నేటి వార్త చూసారా” అన్నాడు హెడ్‌మాస్టర్‌

“తెల్లారి లేస్తే హడావిడేనాయే! పేపర్‌చూసే తీరిక ఎక్కడిది”

“డైట్‌ కాలేజీలో డిప్యూటేషన్‌పై పనిచేయడానికి కలెక్టర్‌ అప్లికేషన్స్‌ కోరుతున్నడు”

“అవునా!”

“మీకు విద్యార్హతలతో పాటు, సీనియారిటీ కూడా ఉంది కదా అప్లయ్‌ చేయండి”

అప్లై చేసిన. దానంతట అదే వచ్చింది. వచ్చి చేరిన. అలా ఇంటికి దగ్గరగా రాగలిగిన. బస్సు ప్రయాణం తప్పింది. డైట్‌లో పనిచేసిన కాలం మరువలేనిది. ఆ ప్రాంగణం ఏ కార్పోరేట్‌ కళాశాలకు తీసిపోని విధంగా ఉంది. ప్రభుత్వ సంస్థను ఆ విధంగా తీర్చిదిద్దిడం అసాధారణం. దాని వెనుక అకుంఠిత దీక్ష, సడలని ప్రేమ, వృత్తి నిబద్ధత కలిగిన వ్యక్తులు కనిపించారు. ఒక ప్రభుత్వ సంస్థలో అలాంటి వాళ్ళు ఉండడం విస్మయం కలిగించింది. అక్కడి ప్రధానాచార్యుల కర్తృత్వం, మార్గదర్శనం ప్రేమతో కూడి ఉంది. అందులోకి వచ్చే పేద, మధ్య తరగతి విద్యార్థినీ విద్యార్థులకు అదొక రక్షణకవచం. భవిష్యత్తునిచ్చే బడి. అదొక అమ్మఒడి.

చెప్పినట్లుగానే అతడు వచ్చిండు. పదొన్నతి వచ్చిందనే సంతోషం ఉంది. నేను కలలుగన్న స్థాయిని చేరుకున్నాననే తృప్తి కూడా ఉంది. కాని ఇది టెన్షన్‌ బతుకు. నాలాంటి వాడు ఇందులో ఇమడడం కష్టం. దూరపు కొండలు నునుపు అన్నట్లు దూరం నుంచి చూస్తే నా పదవి, అధికారము, ఆకర్షణ. దగ్గరగా చూస్తే బరువు-బాధ్యత, జవాబుదారీగా ఉండడం తప్పనిసరి అవుతుంది. స్కూల్‌ టీచర్‌కున్న స్వాతంత్య్రం ఎక్కువ” అన్నాడు.

“స్కూల్‌టీచర్‌ అనేక బంధనాల మధ్య ఉన్నాడు”

“ఎట్లనో చెప్పగలవా” వ్యంగ్యం ధ్వనించింది. గొంతులో

“చదివిన చదువుల అర్హతలను పక్కకు పెట్టి, టీచర్‌ ఉద్యోగానికి టెట్‌ (Teacher Eligibility Test) పాస్‌ కావడం ఒక అర్హతగా విధించడం, అది పాస్‌ అయితేనే డిఎస్సీ రాయడానికి అనుమతి ఇవ్వడం ఒక ధారుణం. సివిల్స్‌తో సమానమైన డిఎస్సీలో సెలెక్ట్‌ అయి టీచర్స్‌గా స్కూళ్ళలో చేరుతున్నరు. టీచర్‌ ఉద్యోగం సంపాదించడానికి పడే యాతనకు కొలమానాలు లేవు. దానికదే కొలమానం. తీరా వచ్చాక ఇక్కడి పరిస్థితులు వారిని వెక్కిరించేవిధంగా ఉంటున్నవి. టెలీకాన్ఫరెన్స్‌, వీడియోకాన్ఫరెన్స్‌, స్కూల్‌ కాంప్లెక్స్‌ మీటింగ్‌, డీఈవో మీటింగ్‌, ఎయిడ్స్‌ ట్రైనింగ్‌, రకరకాల ఎడతెరిపి లేని ట్రైనింగ్‌ క్లాసులు, సైన్స్‌ ఫెయిర్స్‌ ఇలా ఒకవైపు పిల్లల డ్రెస్‌లు, ట్రెజరీ బిల్లులు, టెక్ట్స్‌ బుక్కులు, మిడ్డే మీల్స్‌ రిపోర్టులు, చైల్డ్‌ ఇన్ఫో సిసిఇ మొదలగు బాధ్యతలు మరోవైపు. స్టాఫ్‌ డిటేల్స్‌, విద్యార్థుల మార్క్స్‌, స్టూడెంట్స్‌ పర్టికులర్స్‌ పదే పదే అడిగినప్పుడల్లా పంపడం. ఈ మధ్య కాలంలో సంవత్సరానికోసారి మారుతున్న పరీక్షా విధానం వల్ల బోధన కంటే రిజిష్టర్స్‌ నింపడం ఎక్కువైతుంది. క్లర్క్‌లా పనిచేయాల్సి వస్తుంది. ఇవన్నీ పిల్లల్ని పక్కనుంచుకొని చెయ్యాల్సిందే. ఆ సమయంలో పిల్లలు కొట్టుకుంటే బాధ్యత వహించాల్సింది టీచర్సే. తల్లిదండ్రులు ఒంటికాలుమీద లేస్తరు. అధికారులు అక్షింతలు వేస్తరు.

పిల్లవాడి ఆధార్‌కార్డుకు, అంగిలాగులకు, ఆరోగ్యానికి, మధ్యాహ్న భోజనానికి చదువుకు, పుస్తకాలకు, ఆటలకు, ఉత్తీర్ణతకు జవాబుదారీగా నిలబడాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ససేమిరా పట్టించుకోరు. ఇంట్ల విచ్చలవిడిగా విద్యార్థి ప్రవర్తిస్తడు. బడిలో వాణ్ణి బాగు చేయడం బ్రహ్మతరం కాకుండా ఉన్నది. విసుగొచ్చి చేయి చేసుకుంటే చేయి తీసేసే పరిస్థితులు దాపురించినవి. అన్ని రకాల  విధులు చేస్తూ, బడి పరీక్షలు నిర్వహించి ప్రొగ్రెస్‌ కార్డ్స్‌ ఇవ్వడం ఒక సవాల్‌ లాంటిది. ఇవన్నీ చేస్తూ సిలబస్‌ పూర్తి చేస్తం. పిల్లలకు నోట్స్‌ ఇచ్చి, దిద్ది, పరీక్ష పెట్టి రిజల్ట్స్‌ ఇచ్చి, నానా రకాల రిజిష్టర్స్‌లో వేస్తం. టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ తయారు చేస్తం. టీచర్‌ డైరీ రాస్తం. లెస్సన్‌ ప్లాన్‌ రాస్తం. సమస్త సర్వేలకు వెళ్తం. జన్మభూమి కార్యక్రమానికి బోధనేతర పనులకు వెళ్తం.

ఇప్పుడు చెప్పు టీచర్లకు పని ఏం తక్కువ వున్నది. లోకంలో ప్రభుత్వ టీచర్లు చదువు చెప్పరు. జీతాలు మాత్రం తీసుకుంటరు అనే అపవాదు ఉంది. దానికి కారణం లోకులకేం తెలుసు. మీ లాంటి అధికారులు తెలిసినా పట్టించుకోరు. అందుకే కొన్ని సార్లు టీచర్లు చేతులు ఎత్తేస్తరు. దాన్ని చూసిన మీరు టీచర్లకు స్వేచ్ఛ ఎక్కువ అని కామెంట్‌ చేస్తరు. టీచర్లకు జీతాలు దండగ అని రాజకీయ నాయకులు, సెలవులు ఎక్కువ అని ప్రజలు అంటరు. టీచర్లు తీసుకునే సెలవులు కనబడతయి. ఇతరులు సంవత్సరానికి పదమూడు నెలల జీతం తీసుకునే విధం కనపడది. అదొక విషాదం. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ మెంబర్‌ మొదలుకొని ప్రధానమంత్రి వరకు టీచర్లకు సుద్దులు-బుద్దులు చెప్పేవాళ్ళే. అంతెందుకు ఇటీవలి కాలంలో విద్యార్థులు కూడా టీచర్లకు సూచనలు ఇస్తున్నరు.”

“ఎట్లనో చెప్పగలవా” ఆసక్తిగా అడిగిండు అతడు.

“అది తొమ్మిదవ తరగతి గది. బోధనలో భాగంగా టీచర్‌ పాఠం చదివిస్తున్నడు. ఒకరు పాఠం చదువుతుంటే, మిగతా వారు నిశ్శబ్దంగా చూడాలి. అందుకు విరుద్దంగా గుసగుసలుపోతున్నరు. ఒకడు డెస్క్‌పై జారగిలబడి కూర్చున్నడు. మరొకడు దానిపై పడుకొన్నడు. ఇంకొకరు కిసకిస నవ్వుతున్నడు. చదివేవాడి తప్పులను సవరిస్తున్నట్లు ఒకరిద్దరు చదవి చెబుతున్నరు. అందులో చెప్పడం కంటే, ఎంజాయ్‌ చేస్తున్న తీరు కనబడుతుంది. మరొకడు గట్టిగా ఆవలింత తీస్తున్నడు. ఇదంతా చూసిన సార్‌ గట్టిగా ‘సైలెన్స్‌’ అని అరిచిండు. అందరు కూడా భయం నటిస్తూ బుద్దిగా కూర్చున్నరు. చీమ చిటుక్కుమనిపించేటట్ట్లు ఉంది క్లాసు. చదివించడం అయినట్లుంది. విషయాన్ని అర్థం చేయించడంకోసం బోధిస్తున్నడు. ఎప్పటిలాగే గుసగుసలు, ఇకఇకలు, పరధ్యానాలు, చూసుకోవడాలు, అన్యమనస్కాలు, అంతా గజిబిజి. ‘ఎదుటి వారు వింటేంది. వినక పోతేంది. నేను చెప్పుకుంటూ పోత” అనేరకం కాదు ఆ సార్‌ అందుకే ‘మళ్ళీ ముచ్చట, అల్లరి పెడుతున్నరు. సైలెన్స్‌గా వినండి నేను పాఠం చెప్పాల్నా, మిమ్మల్ని గాడిలో పెట్టాల్నా’ అని విసుగ్గా అన్నడు.

‘సార్‌ రెండు పనులు చేయండి’ అన్నాడో విద్యార్థి

ఏమీ అనలేక మౌనం వహించాడా సార్‌. ఇప్పుడు చెప్పండి. వాడామాట అమాయకంగా అన్నట్లా, గడుసుతనంగా అన్నట్లా! ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా చెప్పవచ్చు. మీకు కూడా తెలుసు మొదట్లో మీరు కూడా టీచర్‌గా పనిచేసిన వారే కదా. లేడీ టీచర్స్‌ కూడా పిల్లల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నరు.”

“కాలం మారింది. ప్రతి దాన్ని పట్టించుకుంటే పనిచేయలేం” అన్నాడు.

“మీ ముచ్చట మీరేనా” అంటూ స్వీట్స్‌ పండ్లు తెచ్చి ముందు పెట్టింది మా ఆవిడ. కాసేపు కాలక్షేప కబుర్లు సాదక బాధకాలు కలబోసుకొన్నాక ‘అతడు’ వెళ్ళిండు.

డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న డైట్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ మేడమ్‌ తప్ప మిగతా వారంతా టీచర్‌గా నియామకమై పదోన్నతి ద్వారా లెక్చరర్‌గా పనిచేస్తున్నరు. నేను, మరిద్దరం మాత్రం టీచర్‌గా ఉంటూనే డిప్యూటేషన్‌పై కాలేజీలో పనిచేస్తున్నం. ప్రిన్సిపాల్‌ సమత్వ దృష్టి వల్ల మాపై ఎక్కడా వివక్ష కనపడలేదు. లెక్చరర్స్‌ కొందరు డిప్యూటీ ఇ.ఓ.గా ఇంచార్జ్‌. బాధ్యతలు తీసుకొని పనిచేసేవారు. వారు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చినప్పుడు పాఠశాల విద్య మీద చర్చలు జరిగేవి. ఎప్పటిలాగే ఆ రోజు ప్రార్థన ముగిసింది. ఫస్ట్‌ పీరియడ్‌ క్లాస్‌కెళ్ళి వచ్చిన. తరువాత కొంత మంది లెక్చరర్స్‌తో కలిసి కాఫీ కోసం, కళాశాల బయట ఉన్న గుడిసె హోటల్‌ కెళ్ళినం. చుట్టూ ఎతైన చెట్లు వాటి నీడలో గుడిసె, పెద్ద పెద్ద రాతి కనీలే బేంచీలుగా ఉన్నవి. వాటిపై కూర్చొంటే ప్రకృతి ఒడిలో కూర్చున్నట్లు ఉంటది. దానికి తోడు హోటలమ్మ అప్పటికప్పుడు మా కోసం చేసే కాఫీ అమృతాన్ని తలపించేది. ఆ పూట తాగితే మరోపూట కూడా రావాలనిపించేది. ఆ దంపతుల జీవనపోరాటం చూస్తే జాలి కలిగేది. వారు కొడుకును ఎంబీబీఎస్‌ చదవిస్తున్నారని విని ఈర్ష్య కూడా కలిగేది. మొత్తానికి వారి పట్టుదలకు చేతులెత్తి దండం పెట్టాలనిపించేది. శ్రమజీవులు వాళ్ళు అలాంటి వారి సమక్షంలో మా వాళ్ళు బాతఖాని వేసేవాళ్ళు. వాళ్ళతో పాటు తప్పదన్నట్లు ఒక్కోసారి నేను. ఆ రోజు కూడా అందరం అలాగే కూర్చున్నం. ఇంచార్జ్‌ డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న లెక్చరర్‌ మా గుంపులో ఉన్నడు. ఎక్కడో పాఠశాలలో జరిగిన సంఘటనపై ఎంక్వయిరీ ఆఫీసర్‌గా వెళ్లిండట. తన అనుభవాన్ని వివరిస్తూ ఉపాధ్యాయులపై బాణాలు ఎక్కుపెడుతున్నడు. దానికి గతంలో ఉపాధ్యాయసంఘ నాయకుడిగా ఉన్న ప్రస్తుత లెక్చరర్‌ వంత పాడుతున్నడు. ఎవరో ఒకరిని ఉద్దేశించి చెప్పుతున్నవి కాదు. మొత్తం ఉపాధ్యాయ లోకం గురించి మాట్లాడుకుంటున్నం. ఇందుకు మినహాయింపుగా కొంతమంది ఉపాధ్యాయులు కనపడుతున్నరు అంటూ మాట్లాడిండు.

ఎక్కడున్నా ఉపాధ్యాయులను గుర్తు పట్టొచ్చు. టీఏలు, డిఏలు, ఐఆర్‌లు, పీఆర్సీలు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్‌ఫర్స్‌, ప్రమోషన్స్‌ వీటిగురించే ఎక్కువ మాట్లాడుకుంటరు. రియలెస్టేట్‌లు, చిట్టీలు నడపడం లాంటి ప్రైవేట్‌ వ్యాపారాల మీద ఉన్న దృష్టి బోధన మీద పెట్టరు. బడిలో ఉంటరు. క్లాసులకు పోరు. వాట్సప్‌ మెసేజ్‌లు, సెల్‌ సంభాషణలు రాజకీయాలతో పొద్దుపుచ్చడాలు చేస్తుంటరు. స్కూల్‌ బయట ట్యూషన్స్‌ చెబుతూ, క్లాస్‌లో పిల్లలచేత పరీక్ష పేపర్స్‌ దిద్దిస్తరు. విద్యార్థులెవరైనా ప్రశ్నలు అడిగితే అసహనంతో ‘కూర్చోరా’ అంటరు. విద్యార్థులకు ముందే పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు చెప్పి బట్టిపట్టిస్తరు. ఎక్కువ మార్కులు వేసి అభిమానం చూరగొంటరు. కారణాలేమైనా, బళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. పిల్లలను పంపించమని ఎందుకు వస్తలేరని వెళ్ళి తల్లిదండ్రులను కలువరు. గ్రామస్థులతో సంబంధాలు పెట్టుకోరు విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్న బడికి బదిలీల్లో కోరుకొని వెళ్ళుతరు. పనిభారాన్ని ఇష్టపడరు. అంకితభావం లేదు. వృత్తి నైపుణ్యాలు పెంచుకోవడం లేదు. రెండు వందల కిలోమీటర్లకు పైన గల బడికి రాకపోకలు సాగిస్తరు. కాని అక్కడే ఉండి కాలం గడిపే ఉద్దేశం, పరిస్థితులు ఎవ్వరికి ఉండడం లేదు. ఇది బోధనపై ప్రభావం చూపిస్తున్నది. సమయపాలన అనేది గగన కుసుమం అయింది. ఉపాధ్యాయుల తప్పులను వెనుకేసుకొచ్చే, సమర్థించే సంఘాలు, సంఘ నాయకులు కనిపిస్తున్నరు. బడిలో అనైతిక కార్యక్రమాలు చోటుచేసుకుంటున్నయి. బళ్ళు మూతపడడానికి ప్రభుత్వ విధానాలతోపాటు, ఉపాధ్యాయుల వైఖరి కూడా కారణం అవుతుంది. పదవతరగతి పిల్లవాడికి కూడా చదవడం, రాయడం గుణకార, భాగహారాలు వస్తలేవంటే ఉపాధ్యాయులను తప్పుపట్టకుండా ఎవర్ని తప్పుపడుతరు. పది సంవత్సరాలు వాళ్ళ చేతిలో ఉన్నవాడికి కనీసం చదవడమైన రావాలి కదా!”

“విద్యావ్యవస్థ కుప్పకూలడానికి ఉపాధ్యాయులే కారణమంటారా అందరు మీరు చెప్పినట్లే ఉన్నరా” అడిగిన.

“అందరు కాదు. కొందరు ఉపాధ్యాయులు కూడా కారణం అంటాను. నిజానికి భవిష్యత్‌ తరం ఉపాధ్యాయుని చేతిలోనే తయారు అవుతది. ఇప్పుడా పరిస్థితులు లేకుండా పోయినయి. ఇది బాధాకరం కాదా”

“ఉపాధ్యాయుడు, విద్యార్థి, తల్లిదండ్రులు, ప్రభుత్వం ఈ నాలుగుకాళ్ళమీద విద్యావ్యవస్థ నిర్మించబడి ఉంది. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా వ్యవస్థ కూలుతది. కాని కారణాలన్నీ, చూపుడు వేళ్ళన్నీ ఉపాధ్యాయుడివైపే గురిపెట్టి ఉండడం విషాదకరం” అన్నాను.

“ప్రైవేటు వ్యవస్థ. ఇంగ్లీషు మీడియం చదువులకు ప్రాముఖ్యతనిచ్చింది. ప్రభుత్వం అనుమతినిచ్చింది. తల్లిదండ్రులు అటువైపు తరలినారు. ఈ పరిణామం ప్రభుత్వ విద్యకు అశనిపాతమైంది.” కర్ణుని చావుకు కారణాలు అనేకం అన్నట్లు గవర్నమెంట్‌ బడి ‘మూతబడి’ కావడానికి కారణాలు అనేకం మరొకరు అన్నారు.

ఆపరేషన్‌ బ్లాక్‌ బోర్డ్‌ (ఓబిబి) ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక విద్యాపథకం (అపెప్‌) జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డిపెప్‌), సర్వశిక్షా అభియాన్‌ (ఎస్‌.ఎస్‌.ఎ. లేదా రాజీవ్‌ విద్యామిషన్‌) ల ఆధ్వర్యంలో అనేక శిక్షణలతో పాటు ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యలో బోధనలోని అంశాలపైన శిక్షణల మీద శిక్షణలను ఇచ్చి ప్రయోగాల మీద ప్రయోగాలు జరిపారు. బోధనతో పాటు పరీక్షలలో సంస్కరణలు అవసరమని నిరంతర సమగ్ర మూల్యాంకనం (సి.సి.ఇ.)ని కూడా ప్రవేశపెట్టారు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఇప్పటి వరకు ఉన్న సర్వశిక్షా అభియాన్‌ పథకం, సమగ్ర శిక్షా అభియాన్‌గా మారింది. నర్సరీ నుండి పన్నెండవ తరగతి వరకు సమగ్ర శిక్షగా విద్యను అందించడానికి నిర్ణయించారు. 5+3+3+4 అనే విధానం రాబోతుంది. దానికి అనువుగా టీచర్స్‌ను సమాయత్తం చేయడంలో భాగంగా “ఇంటిగ్రేటెడ్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌” (సమగ్ర శిక్ష ప్రాయోజిత పథకం)ను చేపట్టారు. అందుకు “నిష్ఠ” (నేషనల్‌ ఇనీషియేటివ్‌ ఫర్‌ స్కూల్‌ హెడ్స్‌ అండ్‌ టీచర్స్‌ హోలిస్టిక్‌ అడ్వాన్స్‌మెంట్‌) కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల్లో సామర్థ్యాలను పెంపొందించి, పాఠశాల విద్యనాణ్యతను మెరుగుపరచడం కోసం, విద్యార్థులలో విమర్శనాత్మక ఆలో చనను ప్రోత్సహించుటకు ఉపాధ్యాయులను తయారుచేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. దీనివల్ల బోధనా విధానంలో మార్పులు జరగనున్నాయి. ఇన్‌ఫర్‌మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐ.సి.టి)ని ఉపయోగించి, విద్యార్థులకు ఆకర్షణీయంగా ఉండేటట్లు పాఠ్యభాగాల్ని తయారుచేసి బోధించాలనేది ఈ కార్యక్రమంలోని అసలు విషయం. బోధన, అభ్యసనల్లో మార్పులు తేవాలి అనుకున్నప్పుడు మదింపు (మూల్యాంకనం)లో కూడా మార్పులు తేవాల్సి ఉంటది. అందుకే ఇప్పుడున్న “నిరంతర సమగ్ర మూల్యాంకనం” స్థానంలో “స్కూల్‌ బేస్డ్‌ అసెస్‌మెంట్‌”ను తెచ్చిపెట్టారు. పనిలో పనిగా ఇప్పుడున్న పాఠ్యభాగాల్ని కూడా మార్చుతున్నారు. ఇలా గత 30 సంవత్సరాలుగా ప్రయోగాల మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు అయింది. ఇంక మన విద్యావ్యవస్థ ప్రయోగథలోనే ఉంది. కమిటీలు, నివేదికలు చర్విత చరణాలయ్యాయి. అభివృద్ది చెందిన దేశాల నమూనాలు, పథకాలు, శిక్షణలు మనకు మార్గనిర్దేశకాలయ్యాయి. మన దేశానికే చెందిన సాంఘిక నమూనా ఒకటి ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని దీర్ఘకాలికంగా ఉపయోగపడ గల “విద్యానమూనా” ఎన్నటికి వస్తుందో తెలియడం లేదు. ఇందుకు ఎవర్ని తప్పుపట్టినా, నష్టపోయేది విద్యార్థులే. నష్టపోతున్నామని తెలుసుకున్నరేమో, ప్రభుత్వ బడులు ఖాళీ అవుతున్నవి. బడులు ఎక్కువగా మూతబడుతున్నవి.” ఒకరు బాధతో అన్నారు.

“ఇక చాలు నీ మాటలు వింటే భయమేస్తున్నది. ఏడు పదుల భారతావనిలో ఎందరో విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, రాజనీతిజ్ఞులు తయారు అయ్యారు. ఇదే విద్యావ్యవస్థ వారిని ప్రపంచానికి అందించింది. ఎంత మంచి విధానం ఏర్పరచినా అందులో కొంత పనికి రానిది ఉండకపోదు. సంపూర్ణ సత్యము, మంచి అనేవి ఉండవు. అందుకే ఈ ప్రయోగాలు అవసరమవుతున్నవని నేననుకుంటున్నా. మన బడుల నుండి వెళ్ళిన విద్యార్థి మరో బడికి వెళ్ళాల్సిందే కదా. వారి కోసం రకరకాల బడులు ఉన్నవి. ప్రైవేట్‌ స్కూల్స్‌, సెమీరెసిడెన్షియల్‌, రెసిడెన్షియల్‌, మాడల్‌, నవోదయ, కేజీబీవీ, కేంద్రీయ మొదలగు అనేక పాఠశాల వ్యవస్థలు ఉన్నవి. ఇవన్ని విద్యార్థి కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు. వీటిని అందుకోవడంలో విద్యార్థి, అందివ్వడంలో ఉపాధ్యాయుడు సఫలం అయ్యే విధంగా అధికారులు శ్రద్ధ వహించాలి. అంతకు మించి వ్యక్తులు నిబద్దతతో పనిచేయాలి. అప్పుడే సామాజిక కళ్యాణం సాధ్యమవుతుంది.” ఒకరి ఉద్భోధ.

“తవ్వుకుంటా వెళ్తే పెంకాసులే బయటపడేటట్లు ఉన్నవి, వెళ్దాం పద” అన్నారొకరు.

అలా చల్లటి ఒడి నుండి వేడివేడిగా బయల్దేరినం.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version