[అంటోన్ పావ్లోవిచ్ చెహోవ్ రచించిన The Bet అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చింతకుంట్ల సంపత్ రెడ్డి.]
అది శరదృతువు.
ఓ చీకటి రాత్రి..
తన స్టడీ రూమ్ లో.. ఆ ముదుసలి బ్యాంకర్ అటునుండి ఇటు, ఇటునుండి అటు నడుస్తూ.. పదిహేను సంవత్సరాల క్రితం తాను ఏర్పాటు చేసిన ఓ సాయంకాలపు విందులో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆ రోజు చాలా మంది మేధావులు అక్కడ సమావేశమయారు. అలాగే.. ఆసక్తిదాయకమైన మాటా మంతి జరిగింది. ఆ మాటల్లో మరణశిక్ష గురించి కూడా చర్చకు వచ్చింది. వచ్చిన అతిథుల్లో.. చాలా మంది పాత్రికేయులు, మేధావులు మరణశిక్ష పట్ల సుముఖంగా లేరు. క్రైస్తవ దేశాల్లో అలాంటి శిక్షకు కాలం చెల్లిందని, అది అనైతికమని, తగనిదని అభిప్రాయపడ్డారు. అందులో కొంతమంది మరణశిక్ష బదులు యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని అన్నారు.
“నేను మీతో ఏకీభవించను,” అంటూ ఆ బ్యాంకర్ మాట్లాడసాగాడు, “మరణశిక్ష గాని, యావజ్జీవ కారాగార శిక్ష గాని నా అనుభవంలోకి రాలేదనుకోండి. కాని ఆలోచిస్తే.. మరణశిక్ష ఓ వ్యక్తిని వెంటనే చంపేస్తుంది. యావజ్జీవ కారాగార శిక్ష అతన్ని నెమ్మదిగా చంపుతుంది. ఇందులో ఎవరు దయామయుడు? కొద్ది నిమిషాల్లో మీ ప్రాణాన్ని హరించేవాడా లేక.. కొన్ని సంవత్సరాల పాటు మిమ్మల్ని కొద్ది కొద్దిగా చంపేవాడా?”
“రెండు అనైతికమైనవే,” అన్నాడో అతిథి, “రెండింటి ధ్యేయం ఒకటే. ప్రాణాలను హరించడం. రాజ్యం అంటే దేవుడేమీ కాదు. తిరిగి ఇవ్వలేని దానిని.. తాను కావాలనుకున్నప్పుడు తీసుకునే హక్కు దానికి ఉండదు.”
వచ్చిన అతిథుల్లో.. ఓ పాతికేళ్ళ కుర్ర లాయర్ ఉన్నాడు. అతని అభిప్రాయం అడిగినప్పుడు ఇలా సెలవిచ్చాడు:
“మరణశిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష.. రెండు ఒకే విధంగా అనైతికమైనవే. కాని.. ఆ రెండింటి మధ్య ఎన్నుకునే అవకాశం ఉంటే.. నేను రెండవదానిని ఎన్నుకుంటాను. మరణించడం కన్నా.. ఏదో విధంగా బ్రతికి ఉండడం మేలు.”
తర్వాత చాలాసేపు చర్చ కొనసాగింది. అప్పటికింకా యవ్వనంలోనే ఉన్న ఆ బ్యాంకర్.. ఆ రోజుల్లో చాలా అసహనంగా ఉండేవాడు. అకస్మాత్తుగా ఆవేశపడిపోతూ, తన పిడికిలితో బల్లను చరుస్తూ ఆ కుర్ర లాయర్‌తో ఇలా అన్నాడు:
“అది నిజం కాదు. ఐదు సంవత్సరాలు కూడా ఒంటరిగా నువ్వు ఓ దిగ్బంధంలో ఉండలేవు. రెండు మిలియన్ల పందెం.”
“నాకూ మీ పందెం సమ్మతమే. ఆ విషయంలో మీరు మీ మాటపై నిలబడితే, నేను ఐదు కాదు.. పదిహేను సంవత్సరాలు ఉంటాను.”
“పదిహేను సంవత్సరాలా? సరే!” అరిచాడు బ్యాంకర్, “జెంటిల్మన్! రెండు మిలియన్ల పందెం నాది.”
“ఒప్పుకుంటాను. మీరు రెండు మిలియన్ల పందెం కాస్తే. నేను నా స్వేచ్ఛను పణంగా పెడుతున్నాను.”
-2-
ఇక.. ఆటవికమైన, అర్థం పర్థం లేని.. ఆ పందెం మొదలైంది.
గారాభంతో చెడిపోయి, చపలచిత్తుడైన ఆ బ్యాంకర్ లెక్క తెలియని తన డబ్బు మురిపెంతో ఆ పందెం పట్ల చాలా సంతోషించాడు. సాయంత్రం భోజనాల దగ్గర ఆ యువకుడిని ఆటపట్టిస్తూ ఇలా అన్నాడు:
“బాగా ఆలోచించుకో యువకుడా! ఇంకా సమయం ఉంది. రెండు మిలియన్లు నాకో లెక్క కాదు. కాని.. నీ జీవితంలో.. అత్యంత విలువైన మూడు, నాలుగు సంవత్సరాలు నువ్వు కోల్పోబోతున్నావు. నేను మూడు, నాలుగే అని అంటున్నాను. అంతకుమించి నువ్వు ఉండలేవు. మరో విషయం మరిచిపోవద్దు. ఆ విధంగా కోరి కోరి బందీగా ఉండడం అనేది తప్పనిసరిగా అనుభవించాల్సిన శిక్ష కన్నా చాలా కష్టంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే.. నీ స్వేచ్ఛను కోరుకుంటూ బయటికి రావడానికి నీకు హక్కు ఉంటుంది. కాని.. అది నీ జైలు జీవితాన్ని విషంతో నింపుతుంది. నీ మీద నాకు జాలి వేస్తున్నది.”
అటు ఇటు నడుస్తూ.. ఇప్పుడు.. అదంతా గుర్తుకు తెచ్చుకున్నాడా బ్యాంకర్. తన్ను తాను ప్రశ్నించుకున్నాడు. ‘ఆ పందెం ప్రయోజనం ఏమిటి? ఆ వ్యక్తి తన జీవితంలోని పదిహేను సంవత్సరాలు కోల్పోవడంలోనూ.. నేను నా రెండు మిలియన్లను విసిరివెయ్యడంలోనూ ఏం మంచి జరిగింది? దీనివల్ల.. మరణశిక్ష.. యావజ్జీవ కారాగార శిక్షకన్నా మంచిదా, చెడ్డదా అనే విషయం తేలిపోతుందా? లేదు! లేదు! ఇదంతా వ్యర్థమైనది, అర్థం లేనిది. నా విషయంలో.. ఇది గారాబంగా పెరిగిన ఓ మనిషి చపలత్వం; అతని పరంగా చూస్తే అది డబ్బు కోసం పేరాశ.’
తర్వాత.. ఆ రోజు సాయంకాలం జరిగిన సంఘటనలు మరికొన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. బ్యాంకర్ తోటలోని ఓ కుటీరంలో.. కఠినమైన నిఘా నీడలో.. ఆ యువకుడు బందీగా ఉండే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఒప్పందం ప్రకారం, అతను ఆ కుటీరపు గుమ్మం దాటి బయటికి రావడానికి గాని, ఎవరితోనైనా మాట్లాడడానికి గాని, మనిషి గొంతు వినడానికి గాని.. వీల్లేదు. ఉత్తరాలు అందుకోవడం, వార్తాపత్రికలు చదవడం నిషిద్ధం. అతను ఓ సంగీత వాయిద్యాన్ని, పుస్తకాలను ఎంచుకోవచ్చును; ఉత్తరాలు రాయవచ్చు, మద్యం తాగవచ్చు, పొగ పీల్చవచ్చు. ఒప్పంద నియమాల ప్రకారం.. బయటి ప్రపంచంతో అతనికి సంబంధం కోసం.. ఓ చిన్న కిటికీ ఏర్పాటు చేయబడింది. పుస్తకాలు, సంగీతం, మద్యం లాంటివి ఏవి కావాలన్నా, ఎంత కావాలన్నా అతను కోరవచ్చు. కాని.. అవన్నీ అతనికి ఆ కిటికీ ద్వారానే అందజేయబడతాయి. ఆ ఒప్పందంలో ప్రతి చిన్న విషయం కూడా ఎంతో వివరంగా రాయబడింది. అతని బందీ జీవితం.. నవంబర్ 14, 1870 రోజున 12 గంటలకు మొదలై.. తిరిగి నవంబర్ 14, 1885 రోజున 12 గంటలకు.. ఖచ్చితంగా పదిహేను సంవత్సరాలకు ముగుస్తుంది. ఆ నియమాల్లో ఎక్కడ చిన్న ఉల్లంఘన జరిగినా.. కనీసం రెండు నిమిషాల ముందైనా సరే. ఆ బ్యాంకర్ ఏమాత్రం డబ్బు చెల్లించనక్కర్లేదు.
-3-
కారాగార వాసంలోని మొదటి సంవత్సరంలో.. అతను రాసుకున్న చిన్న చిన్న నోట్స్‌ను పరిశీలిస్తే ఆ ఖైదీ ఒంటరితనంతో బాధపడినట్టు, వ్యాకులత చెందినట్లు మనం నిర్ణయించవచ్చు. అతని కుటీరం నుండి రాత్రింబవళ్లు పియానో వాయిద్యం వినిపించేది. మద్యం, పొగాకు ముట్టలేదు. మద్యం.. కోరికలను రేకెత్తిస్తుందని, కోరికలు ఖైదీకి పరమ శత్రువులని రాసుకువచ్చాడు. అంతేకాకుండా.. మంచి మద్యం సేవించి ఎవరినీ చూడకుండా గడపడం వ్యథాభరితంగా ఉంటుందని రాశాడు. పొగ తాగడం తన గదిలోని గాలిని కలుషితం చేస్తుందని అంటాడు. ఆ మొదటి సంవత్సరంలో అతను కోరిన పుస్తకాలు ప్రధానంగా తేలికైనవే. వాటిల్లో.. క్లిష్టమైన ప్రేమ దాగిన సంచలనాత్మకమైన, అద్భుతమైన కథనాలు ఉండేవి.
రెండవ సంవత్సరంలో.. పియానో నిశ్శబ్దమైంది. ఆ ఖైదీ కేవలం ప్రామాణిక గ్రంథాలనే కోరుకున్నాడు. ఐదో సంవత్సరంలో.. తిరిగి పియానో శబ్దాలు వినిపించసాగినవి. అతను మద్యం కోసం అడిగేవాడు. ఆ చిన్న కిటికీలో నుండి లోనికి తొంగి చూసిన వారికి ఆ సంవత్సరం పొడవునా.. అతను ఏ పని చేయకుండా.. తింటూనో, తాగుతోనో లేదా పడుకునో కనిపించేవాడు. అప్పుడప్పుడు ఆవులింతలు తీస్తూ తనలో తానే కోపంగా మాట్లాడుకునేవాడు. పుస్తకాలు చదవలేదు. కొన్నిసార్లు.. రాత్రిపూట గంటల కొద్దీ ఏదో రాసేవాడు. ప్రొద్దున్నే.. రాత్రి రాసిన కాగితాలన్నింటినీ చించివేసేవాడు. మరికొన్నిసార్లు.. ఏడుస్తూ ఉండేవాడు.
ఆరవ సంవత్సరం.. సగభాగం అయిపోయింతర్వాత.. అతను.. భాషా శాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర పుస్తకాలు పట్టు పట్టి తీవ్రంగా చదవడం మొదలుపెట్టాడు. అతను ఎంత ఉత్సుకతో చదివేవాడంటే. ఆ పుస్తకాలన్నింటినీ సేకరించడానికి బ్యాంకర్ కష్టపడాల్సి వచ్చేది. ఆ ఖైదీ కోరిక ప్రకారం మొత్తంగా నాలుగు సంవత్సరాల కాలంలో.. ఆరువందల గ్రంథాలు సేకరించబడ్డాయి. ఇదే సమయంలో.. ఆ ఖైదీ రాసిన ఈ క్రింది ఉత్తరాన్ని బ్యాంకర్ అందుకున్నాడు:
“ప్రియమైన జైలర్ గారికి,
ఈ క్రింది వాక్యాలను నేను ఆరు భాషల్లో రాస్తున్నాను. ఆయా భాషలను తెలిసినవారికి వాటిని చూపించండి. వారిని వాటిని చదవమనండి. అందులో ఏ ఒక్క తప్పు కూడా వారు కనుక్కోలేకపోయినట్లయితే.. తోటలో.. ఓసారి గాలిలోకి తుపాకి కాల్చండి. నా ప్రయత్నం వృథా కాలేదని నాకర్థం అవుతుంది. అన్ని యుగాల్లోని.. అన్ని నేలలకు చెందిన మేధావులు రకరకాల భాషలు మాట్లాడతారు. కాని, వారందరిలో ఒకే జ్వాల మండుతున్నది. వాటిని అర్థం చేసుకుని, నా ఆత్మ అలౌకికమైన ఆ సంతోషాన్ని ఎంతగా అనుభవిస్తున్నదో మీకు తెలిస్తే.. ఎంత బాగుంటుందో!”
ఆ ఖైదీ కోరిక నెరవేరింది; బ్యాంకర్.. రెండుసార్లు కాల్పులు జరపమని ఆదేశించాడు.
పదవ సంవత్సరం తర్వాత.. టేబుల్ వద్ద కదలకుండా కూర్చుని సువార్త తప్ప మరేమీ చదివేవాడు కాదు ఆ ఖైదీ. నాలుగు సంవత్సరాల్లో.. ఆరువందల ఉద్గ్రంథాలను ఔపోసన పట్టిన మనిషి సులభంగా అర్థమయ్యే సువార్తను చదవడంలో.. సుమారు ఓ సంవత్సరాన్ని వృథా చేయడం బ్యాంకర్‌కు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ధర్మశాస్త్రాలను, మతాల చరిత్రను అతను అధ్యయనం చేస్తూ ఉండేవాడు.
తన చివరి రెండు సంవత్సరాల నిర్బంధంలో.. అంతులేనన్ని పుస్తకాలను ఓ పద్ధతి అంటూ లేకుండా చదివేవాడతను. ఓసారి.. ప్రకృతి శాస్త్రాలను చదవడంలో నిమగ్నమై ఉండేవాడు. వెంటనే.. బైరన్, షేక్స్పియర్ పుస్తకాలను అడిగేవాడు. అతని నోట్స్ ప్రకారం.. రసాయన శాస్త్రం, ఓ వైద్యశాస్త్ర గ్రంథం, ఓ నవల; తత్వశాస్త్రాల పైన, ధర్మశాస్త్రాల పైన రాసిన కొన్ని వ్యాఖ్యాన గ్రంథాలను అడిగేవాడు. సముద్రంలో ప్రమాదానికి గురైన ఓడ శిథిలాల్లో.. తన జీవితాన్ని రక్షించుకునే ప్రయత్నంలో.. ఆశతో ఓసారి.. ఓ తెరకొయ్యను, మరోసారి.. మరోదాన్ని అందిపుచ్చుకుని సముద్రాన్ని ఈదే వాడిలా అతని పుస్తక పఠనం కొనసాగేది.
ఇదంతా గుర్తుకు తెచ్చుకుని.. ఆ ముదుసలి బ్యాంకర్ ఆలోచించసాగాడు:
‘రేపు పన్నెండు గంటలకు అతనికి స్వేచ్ఛ లభిస్తుంది. ఒప్పందం ప్రకారం, నేనతనికి రెండు మిలియన్లు చెల్లించాలి. అంత పెద్ద మొత్తం అతనికి చెల్లిస్తే.. నా దగ్గర చిల్లిగవ్వ మిగిలి ఉండదు. నేను పూర్తిగా నాశనం అయిపోతాను.’
‘పదిహేను సంవత్సరాల క్రితం.. తన దగ్గర ఉన్న ఎన్ని మిలియన్లు ఉండేవో? ఇప్పుడు తనకు.. సంపద ఎక్కువ ఉందా? అప్పులు ఎక్కువ ఉన్నాయా?’ తన్ను తాను ప్రశ్నించుకోవడానికి భయపడ్డాడతను. స్టాక్ ఎక్స్చేంజ్లో జూదం, అందులోని ఆటుపోట్లు.. రోజులు గడిచినా కొద్ది అతన్ని నిలదొక్కుకోకుండా చేసినవి. అంచెలంచెలుగా.. అతని సంపద హరించుకుపోయింది. ఒకప్పడు తాను భయమంటేనే తెలియని గర్విష్టి. తన పట్ల తనకు ఎంతో ఆత్మవిశ్వాసం ఉన్న కోటీశ్వరుడు. ఇప్పుడు.. సాధారణస్థాయికి పడిపోయి, తన పెట్టుబడుల్లోని హెచ్చుతగ్గులను గుర్తుకు తెచ్చుకుని ‘వెధవ శాపపు పందెం’ అని గొణుక్కున్నాడు; నిరాశతో తలపట్టుకున్నాడు. ఆ మనిషి ఎందుకు చావడం లేదు. అతనికి కేవలం నలభై ఏళ్లే. నా దగ్గర నుండి చివరి పైసా వరకు లాక్కుంటాడు; పెళ్లి చేసుకుంటాడు; జీవితాన్ని ఆస్వాదిస్తాడు; ఎక్స్ఛేంజిలో జూదం ఆడతాడు. నాకు నేనుగా ఓ బిచ్చగాడిలా మారి, అతన్ని చూడాల్సి వస్తుంది. అప్పుడతను “నా జీవితంలోని సంతోషం పట్ల నేను మీకు ఋణపడి ఉంటాను. మీకు నన్ను సహాయం చేయనివ్వండి.” అని ప్రతిరోజూ.. నాతో అంటూ ఉంటాడు. నేనది తట్టుకోలేను. ఈ దివాలాకోరుతనం నుండి, ఈ అవమానం నుండి బయటపడడానికి ఒకే మార్గం.. అదే.. ఆ మనిషి చావు.
గడియారం మూడు గంటలు కొట్టడాన్ని బ్యాంకర్ విన్నాడు. ఇంట్లో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. చల్లటి. చెట్ల ఒరిపిడి శబ్దం తప్ప మరే శబ్దం లేదు. సడి చేయకుండా.. మంటల్లో గురై కూడా కాలిపోని తన భోషాణంలోనుండి.. ఈ పదిహేను సంవత్సరాలుగా తెరవని ఆ ఖైదీ కుటీరపు తాళం చెవి తీసుకున్నాడు. ఓవర్ కోట్ వేసుకుని ఇంటి బయటకు వెళ్లాడు.
-5-
గార్డెన్లో చీకటి.. వర్షం కురుస్తున్నది. చలి పెడుతున్నది. తేమ నిండిన గాలి విసురుగా.. చెట్లకు ఏమాత్రం విశ్రాంతి ఇవ్వకుండా వీస్తూనే ఉంది. బ్యాంకర్ కళ్లు చిట్లించి చూశాడు. అతనికి నేల గాని, ఆ కుటీరం గాని, తెల్లటి విగ్రహాలు గాని, చెట్లు గాని.. ఏవీ కనిపించడంలేదు. కుటీరంవైపు నడుస్తూ కాపలాదారుని కోసం రెండుసార్లు కేక వేశాడు. జవాబు రాలేదు. వంటగదిలోనో, గ్రీన్ హౌస్‌లోనో తల దాచుకోవడానికి వెళ్లి ఉంటాడు.
నేననుకున్న పని చేస్తే తప్పకుండా అది కాపలాదారుడి మీదకే దారితీస్తుంది.. అనుకున్నాడా వృద్ధుడు.
చీకట్లోనే కుటీరపు మెట్లను, తలుపును పసిగట్టాడు. గుమ్మం వైపు నడిచాడు. తడుముకుంటూ సన్నని దారిలో నిలబడి.. ఓ అగ్గిపుల్ల వెలిగించాడు. ఏ జీవి అలికిడి లేదు. అక్కడ ఓ పరుపులేని మంచం, ఓ మూలన ఓ పోత ఇనుప పొయ్యి ఉన్నాయి. ఖైదీ గది లోపలికి వెళ్లే తలుపుకు వేసిన సీళ్లు చెక్కుచెదరకుండా, వేసినవి వేసినట్టే ఉన్నాయి.
అగ్గిపుల్ల ఆరిపోయిం తర్వాత.. ఉద్వేగంతో వణికిపోతూ ఆ వృద్ధుడు.. ఆ చిన్న కిటికీలో నుండి తొంగి చూశాడు. ఖైదీ గదిలో కొవ్వొత్తి మండుతున్నది. అతని వీపు, తలవెంట్రుకలు, చేతులు తప్ప మరేదీ కానరావడం లేదు. తెరిచి పెట్టిన పుస్తకాలు.. కొన్ని టేబుల్ పైన, కొన్ని రెండు వాలు కుర్చీల్లో, కొన్ని టేబుల్ దగ్గర తివాచీ పైన పరిచి ఉన్నాయి.
ఐదు నిమిషాలు గడిచిపోయాయి. ఖైదీ ఒక్కసారి కూడా కదలలేదు. పదిహేను సంవత్సరాల ఖైదు జీవితం.. అతనిలో కదలిక లేకుండా చేసింది. ఆ కిటికీ దగ్గర వేలితో తట్టాడు బ్యాంకర్. ఖైదీ నుండి ఎలాంటి స్పందన లేదు. జాగ్రత్తగా.. తలుపు మీద సీళ్ళు అన్నిటిని బద్దలు కొట్టాడు. తెచ్చుకున్న తాళం చెవి కన్నంలో దూర్చాడు. తుప్పుపట్టిన తాళం ఏదో శబ్దం చేసింది. తలుపు కీచుమన్నది. శబ్దాలు విని అతను ఆశ్చర్యంతో అరుస్తాడని బ్యాంకర్ అనుకున్నాడు. మూడు నిమిషాలు గడిచినా గది అలాగే నిశ్శబ్దంగా ఉంది. ఇక.. లోపలికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడతను.
బల్ల దగ్గర.. ఆ వ్యక్తి ఏ కదలిక లేకుండా కూర్చుని ఉన్నాడు. అస్థిపంజరంలా ఉన్న ఆ ఆకారపు ఎముకలకు చర్మం అతుక్కుని ఉంది. స్త్రీలకు ఉన్నట్లు అతని పొడవాటి వెంట్రుకలు ఉంగరాలు తిరిగి ఉన్నాయి. అతని గడ్డం చిందర వందరగా ఉన్నది, దవడలు పీక్కుపోయి ఉన్నాయి. వీపు పొడుగ్గా సన్నగా ఉంది. చిందరవందరగా ఉన్నతన తలను ఆన్చి పెట్టిన అతని చేయి బక్క చిక్కి, సున్నితంగా, చూడడానికి భయంకరంగా ఉంది. అతని వెంట్రుకలు అక్కడక్కడ తెల్లగా మెరుస్తున్నాయి. క్షీణించిపోయి వయసు పైబడినట్టున్న అతని ముఖంలో వృద్ధాప్యం కనబడుతున్నది. అతనికి కేవలం నలభై ఏళ్లే అంటే ఎవరు నమ్మలేరు. అతను నిద్రలో మునిగి ఉన్నాడు. వంచిన అతని తల ముందు.. టేబుల్ పైన అందమైన దస్తూరితో రాసిన ఒక కాగితం ఉన్నది.
-6-
‘పాపం, బడుగు జీవి!’ అనుకున్నాడా బ్యాంకర్.
పడుకుని, తనకు దక్కబోయే మిలియన్ల గురించి కలలు కంటున్నట్టున్నాడు. ఇప్పటికే సగం చనిపోయిన ఈ మనిషిని మంచంలోకి తోసి, కొద్దిగా దిండుతో అదిమితే.. ఎంతటి ఆత్మశుద్ధి గల వైద్యశాస్త్ర నిపుణుడైనా సరే.. దానిని భయంకరమైన చావుగా కనుక్కోలేడు. కాని, ముందుగా అందులో ఏం రాసి ఉందో చదువుదాం.’
బ్యాంకర్ ఆ కాగితాన్ని టేబుల్ పై నుండి తీసి, చదవడం మొదలుపెట్టాడు:
“రేపు పన్నెండు గంటలకు నాకు స్వేచ్ఛ లభిస్తుంది. అందరితో కలిసి ఉండే అర్హత లభిస్తుంది. కాని, నేను ఈ గది వదలి వెళ్ళబోయేముందు, సూర్యుణ్ణి చూసే ముందు.. మీకు కొన్ని విషయాలు చెప్పవలసిన అవసరమున్నదని నేను భావిస్తున్నాను. నా అంతరాత్మ చెప్పినట్టు, నన్ను చూస్తున్న భగవంతుడి ముందు.. స్వేచ్చ, జీవితం, ఆరోగ్యం, మీ పుస్తకాల్లో.. ప్రపంచంలోని మంచి విషయాలు అని పిలవబడిన వాటినన్నింటినీ నేను అసహ్యహించుకుంటున్నాను.
పదైదు సంవత్సరాలపాటు లౌకిక విషయాలను అధ్యయనం చేశాను. నిజమే.. నేను భూమిని గాని, మనుష్యులను గాని చూడలేదు. కాని, మీ పుస్తకాలలో సువాసన నిండిన మధువును గ్రోలాను; పాటలు పాడాను; అరణ్యాల్లో జింకలను, పందులను వేటాడాను; తమ మేధస్సుతో మీ కవులు సృష్టించిన స్త్రీలను.. తేలిపోయే మబ్బుల్లాంటి అప్సరసలను ప్రేమించాను. వారు రాత్రిళ్ళు నా దరిచేరి గుసగుసగా చెప్పిన అద్భుతమైన కథలు నా మస్తిష్కాన్ని మత్తెక్కించాయి.
మీ పుస్తకాల్లో నేను ఎల్ బర్జ్, మాంట్ బ్లాంక్ పర్వతశిఖరాలను అధిరోహించాను. అక్కడినుండి సూర్యుడు ఎలా ఉదయిస్తాడో, సాయంసమయంలో పడమటి తీరాల్లో ఎలా విస్తరిస్తాడో; సముద్రాలను, పర్వతసానువులను తన బంగారు కిరణాలతో ఎలా మెరిసేట్టు చేస్తాడో గమనించాను. అక్కడినుండి, నా పైన మబ్బుల్ని చీలుస్తూ కాంతిపుంజాలను వెదజల్లిన మెరుపులు చూశాను; పచ్చటి అరణ్యాలు, పొలాలు, నదులు, నగరాలు చూశాను; సైరెన్లు పాడుతూ ఉంటే విన్నాను; పాన్ పైపర్ గారడి సొన్నాయి విన్నాను; భగవంతుడి గురించి చెప్పడానికి నా వద్దకు ఎగురుతూ వచ్చిన అందమైన రాక్షసుల రెక్కలను తడిమాను. మీరు సమకూర్చిన పుస్తకాల్లో నాకు నేను అంతుతెలియని అఘాతాల్లోకి తోసివేయబడ్డాను; అద్భుతాలను ఆవిష్కరించాను; నగరాలను దహించి భూమట్టం చేశాను; కొత్త మతాలను భోదించాను; దేశాలన్నింటినీ జయించాను.
మీ పుస్తకాలు నాకు జ్ఞానాన్ని ప్రసాదించాయి. శతాబ్దాలుగా అలసటనెరుగక సృజించిన మానవ భావచింతన నా మెదడులో ఓ మూలన చిన్న దిక్సూచిలా పడి ఉన్నది. మీ అందరికన్నా నేను తెలివైనవాడినని నాకు తెలుసు.
నేను మీ పుస్తకాలను అసహ్యించుకొంటున్నాను. ప్రపంచపు ఆశీర్వాదాలు, విజ్ఞానాన్ని నేను హేయమైనవిగా భావిస్తున్నాను. ప్రతిది ఒక ఎండమావిలాగా శూన్యం, దుర్భలం, మిథ్య. మేము అందమైనవారిమని మీరు గర్వపడవచ్చు. అయినప్పటికీ, భూగర్భంలోని ఎలుకలవలె మరణం మిమ్మల్ని భూమిపై తుడిచివేస్తుంది; మీ రానున్న తరాలు, మీ చరిత్ర, మీ మేధావుల అమరత్వం ఒక వ్యర్థమైన మంచుముద్దలాగా మారుతుంది. అవన్నీ మారడమో లేదా భూగోళంతో పాటు మండిపోవడమో జరుగుతుంది.
మీరు పిచ్చివాళ్ళు. మీరు విచక్షణ కోల్పోయారు. మీరు నిజాన్ని అబద్డంలాగా, వికారమైనదానిని అందమైనదానిగా పరిగణిస్తారు. అకస్మాత్తుగా ఒకవేళ ఆపిల్, నారింజ చెట్లకు ఫలాలకు బదులుగా కప్పలు, బల్లులు కాస్తే, ఒకవేళ గులాబిపూలు గుర్రపుచెమటవాసన వేస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందువల్ల స్వర్గానికి బదులుగా భూమిని బదలాయింపు చేసుకున్నందుకు నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతున్నాను. నాకు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని లేదు.
వేటిపట్ల మీరు ప్రేమతో జీవిస్తున్నారో, వాటినన్నిటినీ నేను మనసా, వాచా, కర్మణా తృణప్రాయంగా తిరస్కరిస్తున్నాను. ఒకప్పుడు రెండు మిలియన్లు స్వర్గతుల్యం అని కలలుగన్నాను. కాని ఇప్పుడు వాటిని అసహ్యించుకుంటున్నాను. వాటిని పొందానికి నా హక్కును కోల్పోవడం కోసం, ఇక్కడినుండి నిర్ణీతగడువుకు అయిదు గంటల ముందుగా నేనే బయటకు వెళతాను. ఆ విధంగా మన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాను..”
చదివింతర్వాత.. ఆ కాగితాన్ని టేబుల్ పైన పెట్టాడు. ఖైదీ నుదుటిమీద ఓ ముద్దు పెట్టాడు. దుఃఖిస్తూ ఆ కుటీరం బయటకు నడిచాడు. స్టాక్ ఎక్స్చేంజ్లో భారీగా నష్టపోయినప్పుడు కూడా తనకు తాను అంతగా చులకనగా అనిపించలేదు. ఇంటికి వెళ్లి పడుకున్నప్పటికీ, కన్నీళ్లు, ఉద్వేగం అతనికి నిద్ర రాకుండా చేశాయి.
మర్నాడుదయమే పాలిపోయిన ముఖంతో కాపలాదారుడు పరుగెత్తుతూ వచ్చాడు. కుటీరంలో ఉన్న మనిషి.. కిటికీలోంచి తోటలోకి దుమికి.. గేటు దగ్గర మాయం అయ్యాడని చెప్పాడు. వెంటనే తన ఇతర నౌకర్లతో కలిసి కుటీరానికి చేరుకున్నాడు బ్యాంకర్. ఖైదీ తప్పించుకున్న విషయం నిర్ధారించుకున్నాడు. అనవసరమైన మాటలు ఎవరూ మాట్లాడకుండా ఉండేందుకు టేబుల్‌పై ఉన్న మిలియన్లను కాలదన్నుతున్న ఆ కాగితాన్ని తీసుకున్నాడు. ఇంటికి వెళ్లగానే, దాన్ని తన భోషాణంలో పెట్టి తాళం వేశాడు.
మూలం: అంటోన్ పావ్లోవిచ్ చెహోవ్
అనువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి
చింతకుంట్ల సంపత్ రెడ్డి (వయసు 73) ఎం.ఏ (హిస్టరీ), ఎం.ఏ (ఇంగ్లిష్), మరియు సి.ఐ.ఇ.ఎఫ్.ఎల్ నుండి పి.జి.సి.టి.ఐ పట్టభద్రులు. సాంకేతిక విద్యాశాఖలో ఇంగ్లిష్ లెక్చరర్‌గా సుదీర్ఘకాలం పనిచేసి, 2011లో హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్‌గా పదవీ విరమణ పొందారు. ఉద్యోగ కాలంలో పాలిటెక్నిక్ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, అధ్యాపకుల కోసం టీచర్స్ బుక్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు రాజేంద్రనగర్‌లోని ఎన్.ఐ.ఆర్.డి మరియు పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఇంగ్లిష్ ఎడిటర్‌గా సేవలందించారు. CS Reddy అనే కలం పేరుతో తెలుగు వివరణలతో వీరు రచించిన English Grammar Fundas పుస్తకం విశాలాంధ్ర, నవచేతన ప్రచురణల ద్వారా విడుదలై అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామర్ పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం దాదాపు 500 పేజీల Your Words are Your Power అనే వొకాబులరీ పుస్తకం తుది దశలో ఉంది.
పుస్తక పఠనం, అనువాదం, మరియు ఫోటోగ్రఫీలను తన ప్రవృత్తులుగా మలుచుకున్న వీరు సాహిత్య, ఛాయాచిత్ర రంగాలలో విశేష కృషి చేశారు. మనుబెహన్ గాంధీ రచన బాపు-నా మాతృమూర్తి, లియో టాల్‌స్టాయ్ హిందువులకో ఉత్తరం, జయప్రకాశ్ నారాయణ్ సామ్యవాదం నుండి సర్వోదయ వరకు వంటి ప్రముఖ రచనలతో పాటు వివిధ దేశాల ఉత్తరాలు, ఉపన్యాసాలు, కవితలు, మరియు చెహోవ్, వూల్ఫ్ గాంగ్ బోర్శర్ట్ కథలను తెలుగులోకి అనువదించారు; అంతేకాకుండా హన సూట్ కేస్, రబీంద్రనాథ్ టాగోర్ రచనలైన ఊర పక్షులు, మిణుగురులు, నాలుగు అధ్యాయాలు వంటి అనువాద పుస్తకాలు అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ రంగంలోనూ 1982లో FIP వారి మంత్లీ కాంపిటేషన్‌లో ‘గ్రాండ్ అవార్డ్ (సిల్వర్ మెడల్)’, 1984లో UNICEF నిర్వహించిన ‘Focus on the Girl Child’ అంతర్జాతీయ పోటీలో పంపిన మూడు చిత్రాలకు గాను ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ జ్యూరీ అవార్డ్’ అందుకున్నారు. ఇటీవల అక్టోబర్ 2025లో ప్రపంచ వన్యప్రాణి సంస్థ (WWF) మరియు తెలంగాణ అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీలో కూడా వీరు రెండవ బహుమతిని గెలుచుకున్నారు.
