[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘పరమానందయ్య శిష్యుల కథలో పరమార్థం’ అనే రచనని అందిస్తున్నాము.]
పరమానందయ్య శిష్యుల కథలు హాస్యానికి ప్రతీతి. చిన్నప్పుడు అవి సినిమాలో చూసి తెగ నవ్వుకునే వాళ్ళం. శాపగ్రస్తులైన ఆ శిష్యులు (ఎనిమిది మంది అనుకుంటాను) చేసే పనులు పైకి మూర్ఖంగా నష్టం కలిగించేవిగా ఉన్నా కూడా చివరకు మేలు చేసేవిగా పరిణమిస్తాయి అన్నది ఆ కథల్లోనే ఉంది. ఒక కథ విన్న తరువాత ఆ విషయం మనకి తెలుస్తుంది. ఆ తరువాతి కథల్లో వాళ్ళు చేసే పనులకి నవ్వుకుంటూనే ఆ జరగబోయే మంచి ఏమిటని ఉత్కంఠగా ఎదురు చూస్తాం. ఇది కాక ఇంకా ఏదో సందేశం వీటిల్లో నిగూఢంగా ఉందని నాకు ఎందుకో చాలా కాలం నుంచి మనస్సులో ఒక అనుమానం ఉంది. అలా ఆలోచిస్తుంటే, ఒక తలంపు మనస్సులోకి వచ్చింది. అదే ఇప్పుడు చెబుతున్నాను.
ఒక సారి శిష్యు లందరు నదీ స్నానానికి వెళ్లి వస్తారు. వాళ్ళల్లో ఒకడికి అందరూ తిరిగి వచ్చారో లేదో అని అనుమానం వస్తుంది. వాడు మిగిలిన వాళ్ళని వరసగా నుంచోమని చెప్పి లెక్కపెట్టడం మొదలు పెడతాడు. ఎన్ని సార్లు లెక్కపెట్టినా ఏడుగురే ఉంటారు. అయ్యో! మనలో ఒకడు తప్పిపోయాడని ఏడుపు మొదలుపెడతాడు. నువ్వు తప్పుకోరా అని ఇంకోడు వాణ్ణి తన స్థానంలో నిలబెట్టి తను విడిగా నుంచుని లెక్క పెడతాడు. వాడికి కూడా ఏడుగురే తగులుతారు. ఇట్లా అందరికీ ఏడుగురే ఉన్నట్లు ఒకడు బహుశా నదిలో మునిగిపోయాడేమో అని అనిపిస్తుంది. అందరూ కలిసి ఏడుస్తూ గురువుగారికి ఈ విషయం చెబుతారు. ఆయన, “ఓరి చవటల్లారా! ఎవరు లెక్కపెడుతున్నా, ముందు తనను తాను లెక్కపెట్టి అప్పుడు మిగిలిన వాళ్ళని లెక్కపెట్టాలిరా” అని చెబుతారు. అలా చేసి శిష్యులు విషయం అర్థం చేసుకుంటారు.
నిత్య జీవితంలో మనని మనం వదిలేసి మిగిలిన వాళ్ళని లెక్క పెట్టడమో లేదా పరిగణనలోకి తీసుకోవడమో చాలా సందర్భాలలో చేస్తాము. అందాకా ఎందుకు, ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు, వాళ్ళు తమని తాము మినహాయించుకుని మిగతా వాళ్ళంతా చెడ్డ వాళ్ళయినట్లు వేరే వాళ్ళని ఆడిపోసుకోవడం మనకి చాలా సార్లు అనుభవం లోకి వచ్చి ఉండాలి. మనం కూడా అలా చాలా సార్లు చేసి ఉండాలి. అలా మినహాయించుకునే సందర్భాలు నా అనుభవం లోకి వచ్చినవి ఒకటి రెండు చెబుతాను.
గవర్నమెంటులో (Government) వేరు వేరు శాఖలు (Departments or Sections) ఉంటాయి. వాటిల్లో సిబ్బంది (staff) ఎంత మంది ఉండాలో సమీక్షించి చెప్పడానికి ఒక ప్రత్యేక శాఖ ఉంది. దాన్ని స్టాఫ్ ఇన్స్పెక్షన్ యూనిట్ (Staff Inspection Unit) అంటారు. వాళ్ళు సుమారుగా ఐదు సంవత్సరాలకి ఒక మాటు ప్రతి శాఖ లోని ఉద్యోగుల సంఖ్యని సమీక్షించి నిర్ణయిస్తారు. ఆ యూనిట్ వాళ్ళు వచ్చినప్పుడు, వాళ్ళకి కావలసిన సదుపాయాలు రికార్డులు అందించడానికి ఒక ఉద్యోగిని ప్రతి మంత్రిత్వ శాఖ లోను నియమిస్తారు. అతణ్ణి ఎక్కువగా ఎడ్మినిస్ట్రేషన్ (Administration) నుంచి తీసుకుంటారు. యూనిట్ వాళ్ళు, అతడూ కూడా ఆ సమీక్ష చేసేటప్పుడు అలా సాయం చేస్తున్న వ్యక్తిని మినహాయించి మిగతా వాళ్ళని వాళ్ళు చేసే పనిని మాత్రమే సమీక్షించి వాళ్ళు అవసరమా కాదా అని చూస్తారు.
సంబంధ బాంధవ్యాలలో చాలా సార్లు ఈ మినహాయింపులు చేసే అలవాటుని చూస్తాము. చేసిన ప్రతిసారి దురుద్దేశంతో కాకపోవచ్చు, సదుద్దేశంతోనూ కాకపోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గానీ స్నేహితుల మధ్య గానీ ఒకే చోట పని చేసే వాళ్ళ మధ్య గానీ పేచీలు వస్తే, మమత్వం మిత్రత్వం బాగా పనిచేయడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళు వర్గాలుగా ఏర్పడి ఒక వర్గం ఒకళ్ళ వేపు రెండో వర్గం వేరొకరి వేపు వత్తాసు పలకడం మనం చూస్తాము. ఆ పేచీ రావడానికి మూల కారణం వెతికే క్రమంలో ఎవరికి వాళ్ళు తమని తాము మినహాయించేసుకుంటారు. ఉదాహరణకి ఒక భర్త బంధువులు మాట్లాడేటప్పుడు పేచీకి కారణం భార్యలోనో భార్య తల్లిదండ్రులలోనో ఆమె తరఫు బంధువులలోనో లేదా భర్త మిత్రబృందంలోనో భర్త సహోద్యోగులలోనో వెతుకుతారు. తమలో ఒకళ్ళు కూడా కారణం అయ్యే అవకాశం కూడా ఉందని అనుకోరు.
ఈ మినహాయింపుల సందర్భాలు మనం చాలా చూసుంటాము. కొన్ని సార్లు అలాంటి వాటిల్లో మనం కూడా పాలు పంచుకొని ఉంటాం. మరి, మనం పరమానందయ్య శిష్యుల కన్నా తెలివైన వాళ్ళ మంటారా?

ఎం.వి.ఎస్. రంగనాధం గారు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్‌లో డైరక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు.