[కన్నడంలో సరితా నవలి గారు రచించిన కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]
వసుధ ఎప్పటిలాగే మంచంపై కుడివైపుకి ఒరిగి కళ్లు తెరిచినప్పుడు గోడ గడియారంలో సమయం ఉదయం 5:50 అయ్యింది. ఆరు గంటలకు ఇంకా పది నిమిషాలు ఉండగానే మెలకువ రావడం చూసి, ‘మనకి నిద్రలేవడానికి అలారాలు అవసరం లేదు. ఉదయాన్నే లేచి కొడుకు, కోడలు, మనవళ్లకి టిఫిన్ చేసి, లంచ్ బాక్సులు సిద్ధం చేయాలన్న ఆలోచనే చాలు’ అని తనలో తాను అనుకుంటూ, మంచం దిగి వచ్చి దేవుడి గది ముందు నిలబడి దండం పెట్టుకుని ఆ రోజు పనులు మొదలుపెట్టింది.
వంటగది ఊడ్చి, వాకిలి చిమ్మడానికి ముందు తలుపు తీసినప్పుడు, తలుపు గడియకు తగిలించిన సంచిలో కేవలం మూడు పాల ప్యాకెట్లు మాత్రమే ఉండటం చూసి, ‘ఈ మధ్య పాల నరసింహయ్యతో ఇదే గొడవ, నాలుగు కూపన్లు పెట్టినా మూడు ప్యాకెట్లే వేస్తాడు. తర్వాత అడ్జస్ట్ చేస్తాను ఆంటీ అంటాడు. రాత్రికి పాలు కావాలని మళ్ళీ నేనే వెళ్లి తీసుకురావాలి. కొడుకు, కోడలు ఆఫీసు నుండి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అవుతుంది. మనవళ్లేమో స్కూల్ నుండి వచ్చాక కంప్యూటర్, మొబైల్ నుండి తల పైకి ఎత్తరు. ఇక ఆయనగారైతే ఏ పుస్తకమో, పేపరో పట్టుకుని కూర్చుంటే నా మాట ఆయన చెవికి ఎక్కదు. కావాల్సినప్పుడు పాలు, కూరగాయలు తెచ్చే పని నాకు తప్పదు’ అని గొణుగుతూ పాల ప్యాకెట్లు తీసుకుని లోపలికి నడిచింది.
తరువాత స్నానం చేసి, దేవుడికి దీపం వెలిగించి, వంట పనిలో నిమగ్నమైంది. కొడుకు, కోడలు, మనవళ్లు తయారై వచ్చేసరికి టిఫిన్ సిద్ధం చేసి, నాలుగు లంచ్ బాక్స్లు నింపి పెట్టి, మధ్యలో ఆపిన పూజను కొనసాగించడానికి దేవుడి గదిలోకి వెళ్లిన వసుధకు కొడుకు విజయ్ గొంతు వినిపించింది.
“అమ్మా, ఆఫీసుకి వెళ్లి వస్తాం. నాన్నా, వెళ్లి వస్తాం” అని షూ లేస్ కట్టుకుంటూ లాప్టాప్ బ్యాగ్ భుజానికేసుకుని చెప్పాడు విజయ్.
“వెళ్లి వస్తాను మావయ్య” అంది రశ్మి.
అక్కడే హాలులో వార్తాపత్రిక చదువుతూ కూర్చున్న వేణుగోపాలరావు గారు చిరునవ్వుతో కొడుకు, కోడలికి వీడ్కోలు పలికారు. కొడుకు కారు గేటు దాటి వెళ్ళాక వసుధ భర్తతో మాట్లాడింది.
“చూశారా, రశ్మి మీకు మాత్రమే చెప్పి వెళ్ళింది. నేనొకదాన్ని ఉన్నానని ఆ మహారాణికి స్పృహే లేదు.”
“అయ్యో, ఉదయాన్నే ఆ విషయాలన్నీ ఎందుకులే, ఇంకో కప్పు కాఫీ ఇవ్వు” అని వేణుగోపాలరావు గారు పేపర్ నుండి కళ్లు తిప్పకుండానే అన్నారు.
“నా మాట అంటే మీకెవ్వరికీ లెక్క లేదు” అని గొణుగుతూ మళ్ళీ వంటగదిలోకి వెళ్లిపోయింది.
***
బ్యాంక్ మేనేజర్‌గా రిటైర్ అయిన వేణుగోపాలరావు, గృహిణి అయిన వసుధలది ఒక సంతోషకరమైన చిన్న కుటుంబం. ఇద్దరు పిల్లలు. కూతురు వినయ పెళ్ళై అమెరికాలోని న్యూజెర్సీలో ఉంటోంది. కొడుకు విజయ్, కోడలు రశ్మి, మనవళ్లు రమ్య, రమణ్ లతో కలిసి వీరు ఉంటున్నారు. కొడుకు, కోడలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, మనవళ్ళు హైస్కూల్లో చదువుతున్నారు.
పెళ్ళై వచ్చినప్పటి నుండి భర్త, ఆ తర్వాత పిల్లల అవసరాలు తీర్చడమే వసుధ జీవిత ధ్యేయమైంది. పిల్లలు పెద్దయ్యాక, ముసలి అత్తామామల బాధ్యతను కూడా వసుధ ఎంతో ఓపికగా చూసుకుంది. అత్తామామలను హాస్పిటల్‌కు గానీ, గుడికి గానీ తీసుకువెళ్ళినప్పుడు, చాలా మంది వసుధ ఆ పెద్దల కూతురే అయి ఉండవచ్చని అనుకున్నారు.
“మీరు వీరి కూతురా?” అని అడిగేవారు.
“కాదు కోడలిని” అంటే అందరూ ఆశ్చర్యపోయేవారు.
“ఓ, కోడలా! మీరు వీరిని అంత ప్రేమగా చూసుకుంటుంటే కుమార్తె అయి ఉంటారని అనుకున్నాను.”
వారి మాటలు విని ఆశ్చర్యపోయి లోలోపల ఆనందపడుతూ వసుధ, ఈ విషయమై తనలో తానే ఈ విధంగా ప్రశ్నించుకుంది. పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చిన కోడలు ఇంటి బిడ్డగా మారడం, అత్తమామలు కోడలికి అమ్మానాన్నలుగా మారడం – ఇవి అన్నీ వారి వారి మానసిక పరిణతిపై, పెరిగిన వాతావరణంపై, అలవడిన సంస్కారాలపై, జీవిత విలువలపై ఆధారపడి ఉంటాయి కదా? ప్రేమ – వాత్సల్య భావనలు హృదయపు లోతుల నుంచి రాకుండా కేవలం ప్రదర్శించుకునే విధంగా కనిపించినప్పుడు, సంబంధాల తంతువులను మనమే సడలించినట్లు కాదా?
కోడలిగా వచ్చిన రశ్మిని వసుధ కూతురిలాగే చూసుకుంది కానీ, ఎప్పుడూ ‘అత్త’లా ప్రవర్తించలేదు. మనవళ్లు చిన్నప్పుడు వారిని తనే పెంచింది. కానీ ఇప్పుడు పెరిగిన మనవళ్లకు నాన్నమ్మ ప్రేమ, జాగ్రత్తలు ఏవీ అక్కర్లేదు.
“రమ్యా పాపా, ఎక్కడికి బయలుదేరావు? కుడుములు, జంతికలు ఇవ్వనా తినడానికి?”
“వద్దు.”
“అయ్యో, వద్దా? మీ ఇద్దరికీ పిజ్జా తీసుకురావాలా?”
“హూమ్.”
“ఎక్కడికో బయలుదేరినట్టున్నావ్? ఇదేం రా, ఇంత చిన్న స్కర్ట్ వేసుకున్నావు బుజ్జీ?”
“ఇప్పుడిదే ఫ్యాషన్. మీకు అర్థం కాదు నాన్నమ్మా.”
రమ్యకు నాన్నమ్మ మాటలు అంటే చిరాకు. అయినా ఆమె ముందు ఎక్కువగా మాట్లాడకుండా, ఆ విషయం గురించి అమ్మ రశ్మి ముందు చెప్పి మండిపడేది. కూతురు మాటలు విన్న రశ్మి పైకి నిశ్శబ్దంగా ఉన్నా, ఆ విషయాలను చిలవలు పలవలు చేసి విజయ్‌కు వివరించేది. అమ్మ స్వభావం తెలిసిన విజయ్ ఇవన్నీ పట్టించుకోకుండా తన పనిలో తాను మునిగిపోయేవాడు. పగలు – రాత్రి తేడా లేకుండా పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకు ఇంట్లో అత్తా కోడళ్ళ గొడవల గురించి ఆలోచించే సమయం ఎక్కడుంటుంది?
పాఠశాల నుంచి వచ్చినప్పటి నుంచి చేతిలో ఉన్న ఫోన్లోనే మునిగిపోయే మనవరాలు ఒకవైపు; చెవులు పగిలేంత శబ్దంతో టీవీ పెట్టుకుని గోల చేసే మనవడు మరోవైపు. పిల్లలకు సమయం కేటాయించడం కంటే, ఖరీదైన బహుమతులు ఇచ్చి తమ ప్రేమను చూపించే కొడుకు – కోడలిని చూసి వారికి బుద్ధి చెప్పాలనుకున్న వసుధకు నిరాశే కలిగేది.
“రశ్మీ, రేపు భీముని అమావాస్య కదమ్మా. నువ్వూ పూజ చేయాలి. సెలవు పెడతావా?”
“కుదరదు అత్తయ్యా. రేపు ఆఫీసులో నా కాలీగ్‌కి బేబీ షవర్ పార్టీ ఉంది. ఏర్పాట్లన్నీ నేనే చేయాలి. పైగా రేపు నేను లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళను.”
“అయ్యో, అమావాస్య రోజున సీమంతమా? ఇంకో మంచి రోజు చూసుకుని పెట్టుకోవాల్సింది.”
“అవన్నీ మీ కాలంలో నడిచేవి. ఆఫీసులో ఎవరు పంచాంగం చూసి ముహూర్తాలు పెట్టుకుంటారు అత్తయ్యా?”
ప్రశ్నకు ఎదురుప్రశ్నలు వచ్చినప్పుడు సమాధానం చెప్పలేక వసుధ బాధపడేది.
కాలం మారితే సంస్కారాలు మారిపోతాయా? కాదు కదా. మారిన పరిస్థితులు, మనస్తత్వాలకు కాలమే కారణమని చెప్పి వాటిని ఎవరూ పాటించకపోవడమే గానీ.. పాపం, వసుధ ప్రశ్నల్లోని అమాయకత్వాన్నైనా, సంప్రదాయ – సంస్కారాల పట్ల ఆమె చూపే, కోరుకునే శ్రద్ధనైనా అర్థం చేసుకోవడం యువతరానికి అవసరమే అనిపించేది కాదు.
అయినా వసుధ మాతృహృదయం మాత్రం ఏ విషయానికీ ప్రాధాన్యం ఇవ్వకుండా ఎప్పుడూ ప్రేమ చూపడంలో ముందుండేది.
గౌరి పండుగ రోజుకూడా చిన్న స్కర్ట్ వేసుకుని స్నేహితులతో పార్టీకి బయలుదేరిన మనవరాలిని చూసి వసుధ రశ్మి వద్ద దీనిపై అభ్యంతరం తెలిపింది. తమ జీవనశైలి గురించి, ప్రతి విషయంలో వసుధ ప్రశ్నించడం గురించి ఇద్దరి మధ్యా మాటకు మాట పెరిగింది. చివరికి రశ్మి వసుధతో మాట్లాడటాన్నే మానేసింది.
***
ఆ రోజు శనివారం. కొడుకు విజయ్ ఇంట్లో ఉన్నప్పుడు, కోడలు తనతో సరిగ్గా మాట్లాడటం లేదని వసుధ ఆక్షేపిస్తూ మాట మొదలుపెట్టింది. రశ్మి కూడా నిశ్శబ్దంగా ఉండకుండా మాటకు మాట కలపడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం ప్రారంభమైంది.
“అత్తయ్యా, మీరు మమ్మల్ని అందరినీ అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించకండి. మా ఇష్టానుసారం ఉండనివ్వండి.”
“రశ్మి చెప్పింది నిజమే అమ్మా. నువ్వు అందరినీ నీ గుప్పెట్లో ఉంచాలనుకుంటావు. అలా చేసి అందరినీ దూరం చేసుకుంటున్నావు,” అని విజయ్ కూడా చెప్పేశాడు.
ఇలాంటి విషయాల్లో ఎన్నోసార్లు ఎవరి పక్షానా నిలవని విజయ్ ఆ రోజు మాట్లాడిన మాటలు వసుధకు తీవ్రంగా తగిలాయి. తల్లి చూపే వాత్సల్యం, మమత పిల్లలను అదుపులో ఉంచే ప్రయత్నమా?
మనసు నొచ్చుకుని మరేం మాట్లాడకుండా గదిలోకి వెళ్లిపోయింది. “నువ్వు అందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఉంచాలనుకుంటావు.. అలా ప్రయత్నించొద్దు అమ్మా..” అనే కొడుకు మాటలు మళ్లీ మళ్లీ చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ఎంత కన్నీరు కార్చినా మనసుకు శాంతి కలగలేదు.
కొడుకు మాటలను మనసు నుంచి దూరం చేసుకోవడానికి ఏదైనా పనిలో నిమగ్నం కావాలనుకుని చుట్టూ కనిపించిన బట్టలన్నీ సర్ది అలమారలో అమర్చడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడే బట్టల కింద ఉన్న ఆ పట్టుచీర ఆమె కంటపడింది.
విజయ్ పుట్టే ముందు జరిగిన సీమంతానికి అత్త ఇచ్చిన చీర అది! ఆ చీరను కొనుక్కొని తెచ్చిన అత్తమామలు తమ బంధువులందరినీ ఆహ్వానించి ఆనందంగా తనకు సీమంతం చేసిన సందర్భాన్ని వసుధ గుర్తు చేసుకుంది.
తనతో వారు చూపిన ప్రేమ, తాను వారికి చేసిన సేవ, వారి ఇంటి వాతావరణానికి సర్దుకుపోయి జీవనం సాగించిన తీరు, ఇంటి పెద్దల సంస్కార – సంప్రదాయాలను కొనసాగిస్తూ వచ్చిన జీవితం, అత్తమామలు అభిమానంతో తనను, పిల్లలను ఆశీర్వదిస్తూ ఉండటం – ఇవన్నీ ఒక్కసారిగా మదిలో మెదిలి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
ఆ సీమంతపు పట్టుచీరను గత నలభై ఐదు సంవత్సరాల్లో ఎన్నిసార్లు కట్టుకుని సంబరపడిందో, అంతే ప్రేమతో, జాగ్రత్తతో దాచిపెట్టుకున్న వసుధ ఇప్పుడు అలమార నుంచి తీసి చూసింది. చీర రంగు వెలిసిపోయి మసకబారినట్టుగా కనిపించింది. నేసిన నూలు దారాలు కొన్ని చోట్ల సడలినట్టు, కొంచెం ఒత్తిడి పడినా చీర చిట్లిపోతుందేమో అనిపించింది.
ఆ చీరను చూస్తూ వసుధ మనసులో ప్రశ్నలు మళ్లీ మొలిచాయి. ప్రతి కుటుంబం కూడా ఈ పట్టుచీరలాగే ప్రేమ – వాత్సల్యం, మమత – నమ్మకాల నూలు దారాలుతో నేయబడలేదా? రోజులు గడిచే కొద్దీ సంబంధాలు కూడా ఈ రంగు వదిలిన చీరలా మసకబారిపోతాయా? చీర దారాలు సడలినట్టే బంధాల తీగలూ సడలిపోతాయా? కాలం మారినకొద్దీ పరిస్థితులు, మనస్తత్వాలు ఇంతగా మారిపోతాయా?
ఈ ఆలోచనల మధ్య కొద్దిసేపటి క్రితం కొడుకు చెప్పిన మాటలు మళ్లీ గుర్తొచ్చి బాధ ఉప్పొంగింది.
‘మన విజయ్ ఎంతగా మారిపోయాడు! నేను అందరినీ గుప్పెట్లో పెట్టుకుని ఉంచాలనుకుంటున్నానని అన్నాడే?’
ఈ విషయాన్ని వేణుగోపాలరావుగారితో చెప్పినా ఆయన నిర్లిప్తతే సమాధానమని వసుధకు తెలుసు. ఇక కూతురికి చెబితే, “ఇవన్నీ పట్టించుకుని బీపీ పెంచుకోకు” అని చెప్పేస్తుంది. అవసరం లేనివారికి ఎక్కువ ప్రేమ చూపితే, వారు ఆ ప్రేమను గౌరవించరనే వాదన కూతురిదని కూడా ఆమెకు తెలుసు.
“అవసరం లేనివారికి ఎందుకంత చేస్తావమ్మా? వాళ్ల జీవితం వాళ్లే చూసుకుంటారు. నాన్నలా నువ్వూ సంగీతం విను, సాహిత్యం చదువు,” అని తన అనుభవంతో కొంత ఉపదేశం కూడా చేస్తుంది.
దూర దేశంలో ఉన్న ఆమెకు చెప్పి ఎందుకు మన గురించి ఆలోచించేటట్టు చేయాలి అన్న భావంతో వసుధ బట్టలన్నీ సర్ది మళ్లీ అలమారలో పెట్టడానికి ఉపక్రమించింది.
కాలం మారినట్లు సంబంధాలూ మారిపోతాయనేదానికి నిదర్శనంగా వృద్ధాశ్రమాల్లో చేరిన, ఒంటరిగా జీవిస్తున్న స్నేహితులు, బంధువులు గుర్తుకొచ్చి వసుధ మనసును కలవరపెట్టాయి. ఇంతవరకు తన గురించి ఆలోచించకుండా కుటుంబానికే అంకితమై జీవించిన వసుధ, ఇప్పుడు తన భవిష్యత్ జీవితం గురించి ఎన్నో ఊహలు చేసుకుంటూ, భయంతో ఇంటి బయటకు నడిచింది.
దారంతా ఇంట్లో జరిగిన సంఘటనల్ని గుర్తు చేసుకుంటూ, చుట్టూ ఏమి జరుగుతోందో కూడా గ్రహించకుండా నడుస్తూ రోడ్డుకి చివర్లో ఉన్న ‘సంధ్యాదీప సేవాశ్రమం’ వద్దకు చేరుకుంది. కళ్ల ముందంతా మసకబారినట్టు, శక్తి తగ్గినట్టు అనిపించి అక్కడే పక్కన ఉన్న అరుగుమీద కూర్చుంది.
వివాహం చేసుకుని వచ్చిన రోజుల నుంచి పిల్లల బాల్యం, వారి పెంపకం, పాఠశాల – కాలేజీ, పెళ్లి సంబరాల వరకూ జరిగిన దృశ్యాలన్నీ కళ్ల ముందు కదిలాయి.
అప్పుడే ఆశ్రమం లోపల నుంచి ఒక స్వరం వినిపించింది. అదే దారిలో ఎన్నోసార్లు తిరిగినా, లోపలికి వెళ్లాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు. కానీ ఈ రోజు మనసు నొచ్చిన ఆమెకు ఆ స్వరం ఏదో అర్థం చెప్పేలా, ఓదార్పు నిచ్చేలా అనిపించి ఆ దిశగా అడుగులు వేసింది.
సంధ్యాదీప సేవాశ్రమంలో సాయంత్రపు హారతి సమయం. దానికి ముందు ఆశ్రమ గురూజీ అక్కడి సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తలుపు దగ్గరే నిలబడి వసుధ ఆయన మాటలు వినడం ప్రారంభించింది.
జీవితపు విలువలు, మనం పాటించే ఆదర్శాల గురించి గురూజీ మాట్లాడుతున్నారు. జీవిత విలువల విషయంలో తన అభిప్రాయం సరిగానే ఉందనిపించినా, మారిన కాలం – పరిస్థితులు – మనోభావాల్లో వాటిని ఎవరూ పాటించడం లేదనే ఆలోచన ఆమెను వెంటాడింది.
కొన్ని విషయాలు వివరిస్తూ గురూజీ ‘మంకుతిమ్మన కగ్గ’లోని కొన్ని పద్యాలను పఠించి వాటి అర్థాన్ని వివరిస్తున్నారు. చాలాసేపటినుంచి ఆయన మాటలు వింటూ నిల్చున్న వసుధ అకస్మాత్తుగా ఏదో అర్థం అయినట్లుగా బయటకు వచ్చింది. వెనుక నుండి గురూజీ గొంతు వినిపిస్తోంది.
“జారిపడు పొత్తము నిద్రావస్థనున్న చదువరి చేతినుండి;
వేరుపడు తరువునుండి పక్వంబైన ఫలంబు; జీవన
చరమాంకమందున సడలిపోవు సంబంధ నియమంబులు;
జారిపోవునన్నియు బ్రతుకు మాగినపుడు మంకుతిమ్మ!”
బయటికి నడిచి వచ్చిన వసుధ కళ్లలోని నీళ్లను తుడుచుకుని ఇంటివైపు అడుగులు వేసింది.
అలమారలో పెట్టిన ఆ పట్టుచీర – రంగు వెలిసిపోయి, నూలు పోగులు సడలిపోయి, ప్రేమతో నేసిన ఆ చీర – కట్టుకుంటే చిట్లిపోతుందేమోనని ఎంతో జాగ్రత్తగా దాచుకున్న ఆ పట్టుచీర – ఆమె కళ్ల ముందుకు తేలియాడుతూ కనిపించింది.
కన్నడ మూలం: సరితా నవలి
తెలుగు అనువాదం: కోడీహళ్ళి మురళీమోహన్
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
