Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

పెళ్ళిచూపులు

[మణి గారు రాసిన ‘పెళ్ళిచూపులు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

చాలా రోజుల తర్వాత రాజేశ్వరి, మోహిని కలిసారు. వారిద్దరూ కాలేజీ క్లాస్‌మేట్స్. మాట్లాడుకుంటూంటే, వారిద్దరికి సమయం గడిచింది కూడా తెలియలేదు. చూస్తూండగానే సాయంత్రం కావడంతో మోహిని, “వెళ్తాను!..” అంటూ బయలుదేరడంతో, రాజేశ్వరి “మా ఇంటికి పక్కనే శివుని గుడి వుంది. చూసి వెళ్దువు రా!” అంటూ తీసుకు వెళ్ళింది.

అక్కడ, చాలామందే ఆడవాళ్ళు వుండడం, అందరూ రాజేశ్వరిని పలకరించడం చూసి “ఏమిటే రోజూ వస్తావా ఏమిటి అందరూ పలకరిస్తున్నారు?” అంది మోహిని.

“ఊ! వస్తూ వుంటా! అందరూ మనలా వయసు వాళ్ళే కదా, కాస్సేపు కబుర్లు చెప్పుకోడానికి ఇది ఒక సమావేశ స్థలం లాగ వుంటుంది.” అంటూ నవ్వింది రాజేశ్వరి.

దేవుడిని చూసాక, అందరితో పాటు మోహిని, రాజేశ్వరి కూడా ఆలయం ఆవరణలో కూర్చున్నారు.

కొంతమంది, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడు కుంటున్నారు.

“అబ్బాయిలకి మంచి పెళ్ళి సంబంధం దొరకడం కష్టంగా వుందండి. అనకూడదు కానీ అమ్మాయిలు ఎలా వుంటున్నారని?”

“అవును! అవును! అమ్మాయిలంటున్నారు! మరి అమ్మాయి తల్లులు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా?”

“పెళ్ళయ్యాక వేరే కాపురం పెట్టాలి. అబ్బాయి తల్లి తండ్రులు. అబ్బాయి దగ్గర వుండకూడదు..”

“అయ్యో! ఆడపడుచు కూడా వుండకూడదు.. అంటున్నారండి!”

“మొన్న మా కజిన్ కొడుకుకి సంబంధం కోసం, అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అమ్మాయి ఎంత పొగరుగా వుందని?? ఇంక, ఆ తల్లి గురించి చెప్పక్కరలేదు! మమ్మల్ని అసలు మాట్లాడనిస్తేనా!”

“మంచి అమ్మాయి దొరకడం కష్టం గానే వుందండి..”

“ఆడపిల్లలకి, ఇప్పుడు ఎన్ని కోరికలో?! కోరికల పట్టిక ఇచ్చేస్తున్నారు. ఈ బాధ భరించలేక నా కజిన్ కొడుకు అసలు పెళ్ళే వద్దంటున్నాడు..”

“కలికాలం అంటారు ఇదే మరి..”

ఇలా జరుగుతోంది సంభాషణ అక్కడ..

కొద్దిగా దూరంగా కూర్చున్నా వారి మాటలు మోహిని, రాజేశ్వరిలకి వినిపిస్తూనే వున్నాయి..

వున్నట్లుండి రాజేశ్వరి అంది “ఇక్కడ వున్న, మనమంతా, ఒకటే వయసు వాళ్ళం. అంటే అరవై.. అరవై అయిదు ఏళ్ళకి పైపడ్డ వాళ్ళం. మనం, బాల్య వివాహాలు.., ఇష్టం లేని పెళ్ళిళ్లు, బాల్య వితంతువులు, కన్యాశుల్కాలు, వరకట్న బాధలు.. ఎన్ని రకాలుగా, ఆడవాళ్ళు బాధ పడ్డారో, మనం, అన్నీ చూసాము. మగవాళ్ళూ, వాళ్ళ కోరికల పట్టిక ఇస్తూంటే, తల వంచి బాధపడ్డాం తప్ప, ఒక్క మాట, అన్నది లేదు. మగవాళ్ళ తల్లితండ్రులు, ఏది కోరినా, ఆ శక్తి లేదని, నేరం చేసిన వాళ్ళలా తలవంచుకునే వారు, ఆడవాళ్ళ తల్లి తండ్రులు. అంతే కానీ, తల ఎత్తి ప్రశ్నించిన పాపాన, పోలేదు.. అవి, అన్ని మర్చిపోయి, మనం ఇలా మాట్లాడడం, ఏమయినా బాగుందా?!..”

అందరూ ఒక్కసారి నిశ్శబ్దం అయిపోయారు. ఆ తర్వాత ఎవరూ మాట్లాడలేదు. కాస్సేపుండి, రాజేశ్వరి, మోహిని, ఇంటికి బయలుదేరారు.

రాజేశ్వరి మాటలకి మోహిని ఆశ్చర్య పోయింది. రాజేశ్వరి మాటలలో తప్పు ఒప్పుల గురించి అటువుంచి, వాళ్ళూ ఏదో మాట్లాడుకుంటున్నారులే అని వదిలెయ్యకుండా, వాళ్ళకి అడ్డుపడడం ఎందుకు దీనికి? అనుకుంటూ, మోహిని అంది.

“నువ్వు ఏమీ మారలేదు. నీకెందుకే, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని వదిలెయ్యక?.. అయినా, అందరూ అనుకునేదే, వాళ్ళు అంటున్నారు. తప్పేముంది?.. నిజంగానే అమ్మాయిలు, ఆ విధం గానే వున్నారు”

“నువ్వూ, మొదలు పెట్టావూ?!.. ఆడపిల్లలు ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఆడపిల్లలని తక్కువగా భావించడం మన రక్తంలో వుందేమోనే! అందుకే అంతా, ఆడపిల్లలు తగ్గి వుండాలి, తలవంచుకుని వుండాలి అనుకోవడం!. ‘మగపిల్లలతో సమానంగానూ, వాళ్ళ కన్నా ఎక్కువగానూ చదువుకుంటున్నారు. పెద్ద వుద్యోగాలు చేస్తున్నారు. ఎందుకు తల వంచుకోవాలి?’ అని అనరేం?? ఆడపిల్లగా పుట్టినందుకా, తల వంచుకునేది?..”

మళ్ళీ అంది “మనం తెలియకుండానే మనం అందరమూ, ఒక ఆలోచనా పద్ధతికి నియంత్రించబడతాం. దానిలోంచి, బయటికి రావడం కష్టమే అవుతుంది.. అందుకే, ఆడవాళ్ళ, ఆత్మ విశ్వాసాన్ని, పొగరుగా భావిస్తున్నారు. ఇంతవరకూ, మగవాళ్ళ కోరికలకి, తలవంచిన అందరికి, ఆడవాళ్ళు, నొరెత్తడమేకాదు, ..వాళ్ళకీ, కోరికలు వుంటాయని చెపితే.. జీర్ణించుకోవడం, కష్టమే అవుతుంది.”

“ఊ!.. నీ అంత సునిశితంగా ఆలోచించడం నాకు రాదు. ఆలోచించాలని కోరిక లేదు. మందితో గోవిందా అనుకోవడం తప్ప..” అంటూ నవ్వింది మోహిని.

“నువ్వు, ఏమీ కంగారు పడకు.. అదేదో తక్కువని, చివరకి, అందరం చేసేది అదే!” అంటూ రాజేశ్వరి నవ్వింది.

“ఈ మధ్యనే., మా అన్నయ్య కూతురు, దాని పెళ్ళిచూపుల, ఉదంతం చెప్పుకు వచ్చింది.. నీకు అది చెప్తాను. అది విన్నాక, నీకు ఏమనిపిస్తుందో చెప్పు..” అంటూ రాజేశ్వరి మొదలుపెట్టింది.

మోహిని, కుతూహలంగా “ఊ! చెప్పు!..” అంటూ, వినసాగింది.

“నా మేనకోడలు, పేరు బిందు. ఎంటెక్. చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్‌గా పని చేస్తోంది. యిరవై అయిదు సంవత్సరాలు. ఆమె తల్లి నా వదిన. పేరు రామలక్ష్మి. ఆవిడవన్నీ పాత కాలం పద్ధతులు. బిందు తండ్రి, నా అన్నయ్య, నారాయణ రావు.

***

ఆ రోజు బిందుకి పెళ్ళి చూపులు. తల్లి తండ్రుల మాట, కాదనలేక ఒప్పుకుంది. పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేక కాదు. కానీ, ఆ తతంగమంతా, ఆమెకి ఇబ్బందిగా అనిపిస్తుంది.

“అమ్మా! మేమిద్దరమూ బయట కలుస్తాం. మాకిద్దరికీ పరస్పరం నచ్చాక, అందరం కలిస్తే బాగుంటుంది.. ఈ తతంగం, అప్పుడు చేసుకుందాం.” అంటే రామలక్ష్మి పడనివ్వడం లేదు.

“ఎవరయినా ఏమనుకుంటారు?” అంది

“అమ్మా! నేను ఊద్యోగం చేస్తున్నాను.. మేము, బయటకి, అందరితో కాఫీకి, లంచ్‌కి వెళ్తూనే వుంటాము.”

“అది వేరు. పెళ్ళి సంబంధం కోసం, వెళ్ళినప్పుడు, కాస్త పద్ధతిగా వుండొద్దూ”

“నీ పద్ధతిల కోసం, నేను వచ్చిన వాళ్ళందరి ముందూ, తల వంచుకుని కూర్చోలేను. అందుకే నేను, ఇంట్లో వద్దనేది. నువ్వు ఏదో ఒక విధంగా, నన్ను తల వంచుకునేలా చేస్తావు” విసుగ్గా అంది బిందు.

“తల వంచుకుంటే తప్పేముంది”

“ఎందుకు తల వంచుకోవాలి? ఏం తప్పు చేసాను?..”

తల్లి కూతుర్ల, గొడవకి నారాయణ కలగ చేసుకోక తప్పింది కాదు.

“లక్ష్మి! బిందు, పెద్దది అయింది. పెద్ద ఊద్యోగం చేస్తోంది. ఇంకా తనని నువ్వు కంట్రోల్ చేస్తే ఎలా?”

“అమ్మా, బిందూ! నీకు, ఏ విధంగా ఇష్టం అవుతే ఆ విధం గానే చేద్దాం. కాకపోతే మీ అమ్మ వాళ్ళని సాయంత్రం రమ్మని పిలిచిందట. ఈ రోజు నీకు శెలవు కూడా కదా! ఆవిడ మాట ఎక్కడ పోతుందో అని ఆవిడ ఆరాటం”

అంటూ బిందుకి, నచ్చచెప్పే ప్రయత్నం చేసాడు,

కాస్సేపు మౌనంగా వుండి బిందు “సరె అయితే! కానీ నన్ను కాఫీలు గీఫీలు. తెచ్చి ఇవ్వమంటే ఇవ్వను.” అంది

“మీ పిన్ని వస్తుందట లే! ఆమె చూసుకుంటుంది అవన్నీ!”

“అయినా నాన్నా!, నాకు కదా, అబ్బాయి నచ్చాలి. అబ్బాయికి, నేను నచ్చాలి. మేము. అది ఏదో, బయట కలిసి, తేల్చుకుంటే, అందరమూ కలిస్తే బాగుంటుంది. ఏదీ లేకుండా, ఈ హడావిడి నాకు నచ్చదు” అంది బిందు.

“ఈ. సారికి, ఇలా కానిచ్చేద్దాం.. ఇంక ఈ పైన నీ ఇష్టం.. ఏమంటావు?”అన్నాడు నారాయణ రావు.

తండ్రి మాటకి ఎదురు చెప్ప లేక, “ఊ!..” అంటూ లోపలకి వెళ్ళిపోయింది.

“లక్ష్మి! నువ్వు కూడా అమ్మాయిని అర్థం చేసుకో. ఆఫీసులో బిందు కింద, ఒక ఏభయి మంది పని చెస్తారు. తనని పెళ్ళిచూపులంటూ, తలవంచి, కూర్చోపెడతా, అంటే ఎలా? ఇంక తనని ఇబ్బంది పెట్టకు” అన్నాడు నారాయణ రావు.

“దాన్ని ఇబ్బంది పెట్టాలనా నా ఉద్దేశ్యం? బాగుందండి. మీరు చెప్పడం. ఉద్యోగం చేస్తే పెళ్ళి చేసుకోరా? ఏ తతంగాలూ, లేకుండా పెళ్ళిళ్ళు అవుతాయా??” విసురుగా లోపలకి వెళ్ళిపోయింది రామలక్ష్మి.

***

మేరేజి బ్యూరో నుంచి ఒకరు దగ్గర వుండి తీసుకు వచ్చారు అబ్బయిని, అబ్బాయి తల్లి తండ్రులని.

అందరూ కూర్చున్నారు. నెమ్మదిగా, ఒకరిని ఒకరు, పరిచయం చేసుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.

తనని, తన భార్య పద్మని పరిచయం చేసుకుంటూ శివ కుమార్, ”మా అబ్బాయి. పేరు రోహిత్. యూఎస్‌లో ఎం.ఎస్. చేసాడు. స్టార్ట్ అప్ కంపెనీ పెట్టుకున్నాడు. బాగా సంపాదిస్తున్నాడు.” అంటూ కొడుకుని పరిచయం చేసాడు.

నారాయణరావు కూడా, తనని, తన భార్య రామలక్ష్మిని, పరిచయం చేసుకుంటూ, “నా కూతురు, బిందు” అంటూ బిందుని పరిచయం చేస్తూ, చదువు, ఉద్యోగం గురించి చెప్పాడు.

మర్యాదలు అయ్యక, రామలక్ష్మి చెల్లెలు, లీల అంది “మీకు అభ్యంతరం లేకపోతే.. అబ్బాయిని అమ్మాయిని వేరేగా మాట్లాడు కోనిద్దాం.”

“మాకేం అభ్యంతరం?..” అంటూ కొడుకు కేసి చూసింది రోహిత్ తల్లి పద్మ.

రోహిత్, “నాకు ఓకె..” అనడంతో, లీల బిందుని, రోహిత్‌ని, పక్కనే వున్న గదిలో, కూర్చోబెట్టి, బయటకి వచ్చింది.

రోహిత్ చాలా హై స్పిరిట్స్‌లో వున్నాడు. అతని సక్సెస్ గురించి చెప్పుకునే అవకాశాన్ని కాస్త కూడా వదిలేలా లేడు.

అతని మాటలు, చాలా ఓర్పుగా వింటోంది బిందు.

కాస్సేపు అతని కంపెనీ గురించి చెప్పాడు. అతని ఆదాయం గురించి చెప్పాడు. “నాకు కావాల్సింది ఏమీ లేదు, చాలా సింపుల్. నాకు వచ్చే భార్య, మా అమ్మ నాన్న ని బా గా చూసుకోవాలి.. ఈ మధ్య ఇక్కడ అమ్మాయిలు, అత్త గారు మావగారు వుండకూడదు అంటున్నారట. ఎలా దిగ జారిపోయింది మన సంస్కృతి. అందుకే, నా మొదటి ఎక్స్‌పెక్టేషన్, నాకు కాబోయే భార్య, నా అమ్మ నాన్నలని, బాగా చూసుకోవాలి.. ఈ రోజు, ఈ విధం గా వున్నానంటే, వాళ్ళే కారణం. నేను బాగా సంపాదిస్తున్నాను. ఏ లోటూ లేకుండా చూసుకోగలను. అందరిలానే, భార్య చదుకోవాలి.. అందంగా వుండాలని అనుకున్నాను. మీరు.. అఫ్కోర్స్!.. అందంగానే వున్నారు.. చదువుకున్నారు”, అంటూ బిందుని, పై నుంచి, కింద వరకూ ఒకసారి చూసి “నాకు మీరు ఓకె! కాకపోతే చెప్పానుగా, నా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకోవాలి.” అంటూ ముగించాడు.

అతను మాటలు పూర్తి ఆయ్యాక, బిందు అంది “నాకూ, నాకు కాబోయే భర్త గురించి, కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ వున్నాయి. నేను ఎంటెక్ చదివాను.. మంచి ఊద్యోగమే చేస్తున్నాను. ఊ!, దాదాపు సంవత్శరానికి ఏభయి లక్షలు వస్తుంది. అంతా ఏం ఖర్చు పెట్టుకుంటాను. అందుకే బాగానే నిలవ వేసాను. నాకూ, అమ్మా నాన్న, వున్నారు. అఫ్కోర్స్! అందరికీ, అమ్మానాన్నలు వుంటారు, కదా. నేను ఈ రోజు ఈ విధంగా వున్నానంటే వాళ్ళే కారణం. మరి నేనూ వాళ్ళని, జాగ్రత్తగా, చూసుకోవాలి. నాకు వచ్చే భర్త కూడా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అని, దానికోసమే, నేను పెళ్ళి చేసుకోవాలి అని అనుకోవటం లేదు. ఎందుకంటే, అవసరం అవుతే, వాళ్ళని చూసుకోవడానికి, అటెన్డెంట్స్ ని పెట్టుకొంటాను. అది నేను ఎఫర్డ్ చేయగలను. ఇంక, నాకు కాబోయే భర్త, అతని ఇష్టాలు, అయిష్టాలు చెప్పడమే కాదు, నా ఇష్టాలు, అయిష్టాలు, కూడా తెలుసుకోవాలి. నా అభిప్రాయాలు, తెలుసుకోవాలి. ఆ విధమయిన ప్రయత్నం, మీరు ఏమీ చేయలేదు.. సారీ! మనకి మేచ్ అవదనుకుంటున్నా!” అంది బిందు.

ఒక క్షణం ఆశ్చర్యపోతూ, అయోమయంగా ఆమె కేసి చూసాడు. తన లాంటి సక్సెస్‌ఫుల్ వ్యక్తిని, అంత తేలికగా ఆమె వద్దనడం అతనికి మింగుడు పడలేదు. అతను ఆశ్చర్యం లోంచి తేరుకోక ముందే, ”ఆల్ ది బెస్ట్..” అంటూ కుర్చీ లోంచి లేచింది బిందు. ఇంక, అతనికి, లేవక తప్పింది కాదు.

 బయటకి వచ్చిన, ఇద్దరి వైపు, అందరూ ఆసక్తిగా చూసారు. రోహిత్ మొహంలో కాంతి లేకపోవడం చూసి, దగ్గరకి వచ్చిన కొడుకుతో “ఏమయింది?..” అని గుసగుసలాడింది, రోహిత్ తల్లి, పద్మ.

“వెళ్దాం పద!..” అన్నాడు రోహిత్.

 అందరూ, ఒకసారి, మొహమొహలు చూసుకున్నారు.

“ఇంక మేము వెళ్తాం..” అంటూ వెళ్ళిపోయారు రోహిత్, అతని తల్లి తండ్రులు.

***

రామలక్ష్మి ఆశ్చర్య పోతూ అంది “ఏమయిందే?..” అని అడిగింది.

“అతనికి కావాల్సినవి అతను చెప్పాడు. నాకు కావాల్సినవి నేను చెప్పాను. మాకిద్దరికి మేచ్ అవదని అనిపించింది. అదే చెప్పాను”

“అలా ఎలా చెప్తావు? తప్పు కదా!.. ఇష్టం లేకపోతే మాట్లాడక వూరుకోవాలి. కానీ మొహం మీద ఎందుకు చెప్పడం?..”

“అతనికి కావాల్సింది, ‘కేర్ టేకర్’.. జీవిత భాగస్వామి, కాదు.. అందుకే, మేచ్ కాదని, చెప్పాను. దానిలో తప్పేమిటి?..”

“అందరూ, ఏమనుకుంటారు? అమ్మాయికి, తలబిరుసు అనుకోరూ?.. నీ వ్యవహారం, నాకేమి నచ్చలేదు.. ఆడపిల్ల అన్న తర్వాత కాస్త ఒద్దిక గా వుండాలి..”

బిందు అదేమీ పట్టనట్లు, లోపలకి వెళ్ళిపోయింది.

ఆ తర్వాత రామలక్ష్మికి, చుట్టాలలో ఒక ఆవిడ ఫోన్ చేసింది “అదేమిటే లక్ష్మీ! రోహిత్ వాళ్ళు, మాకు చుట్టాలే. మీ అమ్మాయిని చూడడానికి, మీ ఇంటికి వస్తే, మీ అమ్మాయి పొగరుగా మాట్లాడిందట?” అంది.

“అదేమీ, లేదే!..” అంది సంకోచపడుతూ రామలక్ష్మి.

“అబ్బాయి, చక్కా, సెటెల్ అయ్యాడు. ‘మా అమ్మని నాన్నని, చూసుకోవాలి’, అని అన్నాడుట అంతే!. దానికే మీ అమ్మాయి, నచ్చలేదని చెప్పిందిట. వాళ్ళు చెప్తూంటే, నాకు, మీరు చుట్టాలు అవుతారని, చెప్పడానికి కూడా, సంశయించాను, అనుకో.”

***

అలా, ఒక దూరం చుట్టం, నా వదినతో అనేసరికి, ఆవిడ అది పట్టుకుని, బిందు బుర్ర తినేసింది.

“ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఆడపిల్లని తక్కువగా చూడడం అలవాటు అయింది. దానినుంచి బయట పడలేకపోతున్నారు. ఎవరి మాటో ఎందుకు?! సాక్షాత్! నా వదిన!.. అదే బిందు తల్లి! .. బిందూని ఆ సంఘటన తర్వాత, చాలా సాధించేసేది.

ఆమె బిందూని ఎప్పుడూ, ఒక ఆడపిల్లలా చూడడమే తప్ప, ఒక సక్సెస్‌ఫుల్ వ్యక్తిగా, ఎప్పుడూ చూడలేదు. అందరూ, కూతురిని ఏమనుకుంటారో అనే బాధ తప్ప, కూతురిని, అర్ధం చేసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చేయలేదు. అన్నయ్య, చెప్పి చెప్పి విసిగి పోయాడు. ఇంక, ‘ఓల్డ్ స్కూల్!..’ అంటూ వదిలేసాడు.

ఆవిడ సాధింపు తట్టుకోలేక, బిందు, నా దగ్గరకి వచ్చి, కొన్నాళ్ళు వుంది. ఇప్పుడు తన అపార్ట్మెంట్ లోకి మారిపోయింది. “అమ్మ తప్పేమీ, లేదు అత్తా! ఆవిడ, అప్పటి సమాజానికి, ప్రతీక. అప్పటిలా, ఇప్పుడు, నన్ను వుండమంటే, ఎలా వుంటాను??.. నేను ఎందుకు, తల వంచుకోవాలి?.. నా ఆత్మవిశ్వాసాన్ని, ఎందుకు వదులు కోవాలి?” అంటుంది బిందు.

“ఇప్పుడు చెప్పు, మోహినీ! బిందుది, ఏమి తప్పు వుందని?.. దాని అభిప్రాయం అది చెప్పింది. అయినా, తల్లి తండ్రులు, అబ్బాయికే కాదు, అమ్మాయికీ వుంటారనేది చాలా తేలికగా, మర్చిపోతారు. వాళ్ళ ఉనికికి, ఏం విలువ వుందనా?? రోహిత్, అతని తల్లి తండ్రుల గురించి, బాగా చూసుకోవాలి, అని చెప్పేడప్పుడు, బిందు తల్లి తండ్రుల, గురించి కూడా, చూసుకుంటాను, అని చెపితే బాగుండేది కదా.

అమ్మాయిలు, ఇన్నాళ్ళు,మనసులో ఏ అభిప్రాయలు వున్నా, ఏ కోరికలు వున్నా, ఏమీ చెప్పకుండా, తల దించుకొని, అన్నిటికీ, తల ఊపేవారు. అదే అలవాటు అయి, అమ్మాయి మాట్లాడితే చాలు, పొగరుగా వుందంటున్నారు.” నవ్వుతూ అంది రాజేశ్వరి.

మళ్ళీ అంది, “ఈ ఉదంతమంతా చెప్తూ, బిందు ఒక మాట అంది, ‘భావనలలో మార్పు రావాలంటే మాటలు కూడా మారాలి. భార్య అనే పదంలో, జీవిత భాగస్వామి, అనే భావన కన్నా, కేర్ టేకర్ అనే భావనే.. ఎక్కువగా వుంది, కండిషనింగ్ వల్ల. అందుకే, భార్య అనే పదం బదులు, జీవిత భాగస్వామి అనే పదం వాడుకలో వస్తే, కాస్త ఈ కేర్ టేకింగ్ అనే ఎక్స్‌పెక్టేషన్ తగ్గుతుందేమో’ అని! బిందు అన్నది కూడా నిజమే అనిపిస్తోంది నాకు..”

మోహిని కూడా నవ్వింది. “అదేలే! అదేలే!..” అంటూ.

మోహిని ఏమీ మాట్లాడక పోవడం చూసి,”నువ్వేమీ మాట్లాడటం లేదు?!.. అందరిలాగా, నువ్వూ, ఆడపిల్లలు, ఆడపిల్ల తల్లి తండ్రులు, పొగరు పట్టి వుంటున్నారు, అని అనుకుంటున్నావా?” అంది రాజేశ్వరి నవ్వుతూ, వాతావరణాన్ని తేలిక చేస్తూ.

“నేనెప్పుడూ, ఈ విషయాన్ని ఇంత లోతుగా ఆలోచించలేదు. నువ్వు చెప్పింది అంతా విన్నాక, నువ్వు చెప్పింది సరైనదే అనిపిస్తోంది. మనం, – ఆడపిల్లని కంటే ఆ తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టే వాళ్ళని, చూసాం! భ్రూణ హత్యలు చూసాం!, ఆడపిల్లకి తల్లి తండ్రులమని, తల ఎత్తుకుని, చెప్పుకోలేని, తల్లి తండ్రుల పరిస్థితి చూసాం!. ఇప్పటికీ, కుటుంబ మర్యాదలంటూ కూతురినే చంపుకునే తల్లి తండ్రులని చూస్తున్నాం! తమ ఆలోచనల గురించి, కోరికల గురించి ఆత్మవిశ్వాసంతో మాట్లాడే ఆడపిల్లలని ‘మా అమ్మాయికి, ఏమి తక్కువ?’ అనే, ఆడపిల్లల తల్లి తండ్రులని, ఇప్పుడే కదా, చూస్తున్నది?.. మరి, షాకింగ్ గానే వుంటుంది.” అంది మోహిని.

“అదే!.. అదే!.. ఆడవాళ్ళు, ఇప్పుడు, ఆర్థిక స్వాతంత్రంతో, వాళ్ళని వాళ్ళు, వ్యక్తులుగా, ఆవిష్కరించుకుంటున్నారు. అది, ఒక విధంగా, కల్చరల్ షాక్! ఆ షాక్ నుంచి వచ్చిన కామెంట్స్ ఇవన్నీ! ఆడవాళ్ళని వ్యక్తులుగా, ఒప్పుకోడానికి అంగీకరించడం ఇంకా కష్టం గానే వుంది అందరికీ. అందుకే ఈ కామెంట్స్!.. అప్పుడప్పుడు, ఎవరో ఒకరు, ఖండిస్తూ వుండాలి. లేకపోతే, అదే నిజమనుకుంటారు.!.. ఎవరూ కాస్త కూడా ఆత్మావలోకనం చేసుకోరు.” అంది రాజేశ్వరి.

ఊకొడుతూ, “నువ్వు చెప్పింది వింటూంటే, తల్లి తండ్రులలో కూడా, చాలా మార్పు రావాలి, అనిపిస్తోంది. మనం కాలేజీలో వున్నపుడు, ‘ఆడవాళ్ళని, వ్యక్తులుగా గుర్తించండి!’ అంటూ, నినాదాలు చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా, చెయ్యాలి ఏమో!. ‘అస్సలు బుర్రని ఉపయోగించకూడదు’ అనుకునే నన్ను, ఆలోచించేలా చేసి, నా బుర్రకి పనిపెట్టావు!.. ఆ పాపం ఊరికే పోదు” అంది మోహిని.

“ఒక్కరినయినా, ఆలోచించేలా చేయాలనే నా తాపత్రయం, ఆశ నెరవేరాయి అయితే! నువ్వు శపించినా పర్వాలేదు”

“ఒకటి మాత్రం కచ్చితంగా చేస్తాను. ఎవరు భార్య అనే పదం వాడినా, జీవిత భాగస్వామి అని కరెక్ట్ చెస్తూ వుంటాను.. నేను సైతం, ఒక సమిధని, ఆహుతి ఇచ్చాను అనుకుంటూ..” అంటూ నవ్వింది మోహిని.

మోహిని మాటలకి, రాజేశ్వరి కూడా నవ్వుతూ, మోహినిని దగ్గరగా తీసుకుని, “నేనూనూ!!..” అంది.

Exit mobile version