పెంచ్ నేషనల్ పార్క్ చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా, ఈ మధ్యే ఆ కోరిక తీరింది.
మన దేశంలోని ముఖ్యమైన నేషనల్ పార్క్‌లలో పెంచ్ ఒకటి. ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. మొత్తం 758 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది మధ్యప్రదేశ్ దక్షిణ భాగంలో, ప్రత్యేకంగా చెప్పాలంటే, సియోని మరియు చింద్వారా జిల్లాల్లో ఉంది, ఇది మహారాష్ట్రతో సరిహద్దును కూడా పంచుకుంటుంది. ఈ పార్క్ యొక్క 257 చదరపు కిలోమీటర్ల అదనపు ప్రాంతం మహారాష్ట్రలో ఉంది, కానీ మధ్యప్రదేశ్ నుండి కూడా చేరుకోవచ్చు. గొప్ప వృక్షజాలం మరియు జంతుజాలానికి నిధిగా ఉన్న ఈ జాతీయ ఉద్యానవనాన్ని రెండు విభాగాలుగా విభజించారు.
ఎ) ప్రియదర్శిని నేషనల్ పార్క్ మరియు మోగ్లీ పెంచ్ అభయారణ్యం, ఇది 299 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. బి) 464 చదరపు కిలోమీటర్లు బఫర్ ఏరియాగా పరిగణించబడుతుంది.
ఈ జాతీయ ఉద్యాననానికి – ఉత్తరం నుండి దక్షిణానికి ప్రవహిస్తూ, జాతీయ ఉద్యానవనాన్ని తూర్పు మరియు పశ్చిమ అర్ధభాగాలుగా దాదాపు సమాన భాగాలుగా విభజించే `పెంచ్’ నది పేరు పెట్టారు. ఈ పార్క్ వన్యప్రాణులకు మాత్రమే కాకుండా మానవులకు కూడా నిలయం. పార్క్ లోపలా, చుట్టూ 10 గ్రామాలు ఉన్నాయి, వాటిలో ఫుల్జారి అనే గ్రామం పార్క్ లోపల, మిగిలిన తొమ్మిది గ్రామాలు పార్క్ అంచున
ఉన్నాయి. పెంచ్ను 1965లో అభయారణ్యంగా ప్రకటించారు. 1975లో, దీనికి జాతీయ ఉద్యానవనం హోదా లభించింది. ఇక్కడ పులులు భారీ సంఖ్యలో ఉన్నందున, దీనిని 1992 లో టైగర్ రిజర్వ్‌గా మార్చారు. ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ కింద పనిచేస్తోంది. అలాగే ఈ ప్రదేశం యొక్క అందాన్ని రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన క్లాసిక్ ‘ది జంగిల్ బుక్’ లో ప్రస్తావించారు.
పెంచ్ నేషనల్ పార్క్ మహువా, వైట్ కులు, సలై, సజా, బిజియాసల్, ధౌరా, అమల్తాస్, ఇంకా అనేక ఇతర వృక్ష జాతులకు నిలయం. చెట్లతో పాటు, ఈ పార్క్ గడ్డి భూములు, పలు రకాల మొక్కలతో నిండి ఉంది.
పెంచ్ నేషనల్ పార్క్ అనేక రకాల వన్యప్రాణులకు నిలయం. ఈ ప్రదేశం నిజమైన షేర్ ఖాన్స్ (బెంగాల్ టైగర్స్) నివాసం, చిటల్, జంగిల్ క్యాట్, వోల్ఫ్, ఇండియన్ చీటా, గౌర్, నాలుగు కొమ్ముల జింక, స్లాత్ బేర్, ఇంకా అనేక ఇతర వన్య ప్రాణులకు నెలవు. క్రో ఫెసెంట్, నెమలి, పిన్‌టైల్, లెస్సర్ విజిలింగ్ టీల్, ఇండియన్ రోలర్, వాగ్టైల్, మునియా, వాటర్‌ఫౌల్, బ్లూ కింగ్‌ఫిషర్, క్రిమ్సన్-బ్రెస్ట్ బార్బెట్, రెడ్-వెంటెడ్ బుల్బుల్ వంటి అనేక రకాల పక్షులు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
***
గతంలో తడబ అడవికి వెళ్లినప్పుడే, పెంచ్ వనం కూడా చూసి రావాలని అనుకున్నాం. సెప్టెంబర్‌లో తడబ వెళ్ళితే, మార్చిలో పెంచ్కి వెళ్ళాము. పెంచ్కి మేము, మా పిల్లలందరం కలసి వెళదామని చెప్పి ప్రణాళిక వేసుకున్నాము. అదే సమయంలో మా ఇంట్లో ఒక పెళ్లి కార్యక్రమం ఉంది. పెళ్లి అయిన వెంటనే బయలుదేరాలనుకున్నాము. అలా అనుకొని నేను, ఇంద్రరెడ్డిగారు, అజయ్‌రెడ్డి, ప్రియాంక, సంహిత, అయాంష్ – హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు ట్రైన్‌కి బుక్ చేసుకున్నాము. హైదరాబాద్‌లో మధ్యాహ్నం ఒంటిగంటకు ఎక్కితే నాగ్‌పూర్‌లో రాత్రి 8.30 కి దిగాము. ఈ ఏడున్నర గంటల ప్రయాణం చాలా హాయిగా గడిచింది. ఎందుకంటే చక్కగా వందేభారత్‌లో ఎ.సి చైయిర్ కార్ బుక్ చేసుకున్నాము. నేను వందేభారత్‌లో ప్రయాణం చేయడం ఇది నాలుగోసారి. మొదటి సారి చండీఘర్ నుంచి ఢిల్లీ వెళ్ళాను. రెండోసారి కొత్తగూడెం వరకు వెళ్ళాము. మూడోసారి వరంగల్‌కి వెళ్ళాను. నాలుగోసారి హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్‌కి వెళ్ళాను. ఈ వందేభారత్ రైల్లో మాత్రం సర్వీసు చాలా బాగా ఇస్తున్నారు, అదొక్కటే కాకుండా చాలా శుభ్రంగా, యూరోపియన్ దేశాల రైళ్ళలో ఉన్నట్టు చక్కటి అద్దాలతో ఉన్న బోగీల నుంచి మనం బయట అన్ని చూసుకుంటూ హాయిగా కూర్చుని ప్రయాణం చేయవచ్చు. ఎనిమిది గంటలలో ఒక గంట నిద్ర పోయాము. తరువాత ఒక నాలుగు గంటలు బయట అన్ని చూస్తూ స్టేషన్స్ చూస్తూ వచ్చాము. ఓ రెండు గంటలు ఫోన్‌తో కాలక్షేపం అయిపోయింది. ఈ విధంగా మేము నాగ్‌పూర్ చేరుకుని, అక్కడ ఒక హూటల్ బుక్ చేసుకున్నాము. ఆ హూటల్ లోనే భోజనం తెప్పించుకొని రాత్రి 9.30 కల్లా తినేసి, పడుకున్నాము.
***
ఆ తరువాత రోజు ఉదయం 10.30 కి ఒక కారు అద్దెకు తీసుకున్నాము. మేమున్న హోటల్ నుంచి పెంచ్కి నాలుగు వేలు చెప్పాడు. సరే అని ప్రయాణం ప్రారంభించాము. అది ఇన్నోవా కారు. మేము ఆరుగురం కలసి సామానంతా వెనక్కి వేసేసి, హాయిగా ఒకటిన్నర గంటలలో పెంచ్ అడవికి చేరుకున్నాము. పెంచ్కి చేరుకోగానే మేము రిసార్ట్ బుక్ చేసుకొని, విశ్రాంతి తీసుకున్నాం. మా పిల్లలు, మిగతా పిల్లలు కారులో హైదరాబాద్ నుంచి ఉదయం నాలుగున్నరకి బయలుదేరి మధ్యాహ్నం మూడున్నర కల్లా నేరుగా స్టెర్లింగ్ హాలీడే రిసార్ట్‌కి చేరుకున్నారు. వాళ్ళు తమతో పాటు మాకు భోజనం – పులిహార, పప్పు, అన్నం, చికెన్, మటన్ ఐటమ్స్ తీసుకుని వచ్చారు. అందరం మూడున్నరకి తినేసి హాయిగా పడుకున్నాము. సాయంత్రం ఐదు గంటలకు లేచి, స్టెర్లింగ్ రిసార్ట్ అంతా తిరిగి చూశాం. కాసేపు వాకింగ్ చేశాం. ఓ చోట టీ తాగి, మా బసకి చేరాం. ఆ రోజు రాత్రికి ఒక డాబా హూటల్‌కి వెళ్ళాం. అక్కడ అప్పటికప్పుడు వేడిగా చేసిన రోటీలు ఇస్తున్నారు. దాల్మక్ని, పన్నీర్ బట్టర్ మసాల తోటి రోటీలు తినేసి, పిల్లలందరితో కలసి ఐస్‌క్రీం తింటూ రిసార్ట్‌కి చేరి కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకున్నాము.
***
మర్నాడు ఉదయం ఐదు గంటలకు తురియా గేటు నుంచి అడవి లోకి వెళ్ళేందుకు రెండు సఫారీ జీపులని మాట్లాడుకున్నాము, ఆ రెండు సఫరీ జీప్స్ ఐదున్నర కల్లా రిసార్ట్‌కి తీసుకొచ్చారు. రిసార్ట్‌లో వాళ్ళు మాకు టిఫిన్స్ తయారు చేసి బాక్స్‌లో పెట్టిచ్చారు. అవి తీసుకొని మేము అడవిలోకి బయలుదేరాము. ఆరు గంటలకు లోపలకి అడుగు పెడితే, లోపలంతా తిరుగుతూ 11.30 వరకు అడవి అంతా చుట్టి, చుట్టి, చుట్టి వచ్చాము. ఈ అడవిలో చూస్తున్నప్పుడు మాకు తెలిసిందేంటంటే ఇక్కడ 153 టైగర్స్ ఉన్నాయట. అడవిలో ఎన్నో సెక్టార్లు ఉన్నాయి. చాలా గేట్స్ కూడా ఉన్నాయి.


సో, తురియా గేట్ నుంచి వెళితే మాత్రం ఖచ్ఛితంగా పులిని చూడవచ్చని అక్కడ ఉన్న వారంతా చెప్పారు. అందువల్ల తురియా గేటులో మనకు సఫారీ దొరకడం కూడా కష్టం కాబట్టి ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము.
మేము తీసుకున్న రెండు సఫారీలలో ఒక దాంట్లో ఆరుగురం, ఒక దాంట్లో ఐదుగురం కూర్చున్నాం. ఐదుగురు కూర్చున్న దాంట్లో వాళ్ళకి పులి కనబడింది. ఆరుగురు కూర్చున్న జీప్ని సఫారీ అంతా తిప్పారు గాని, పులి తప్ప, పలు రకాల ఇతర జంతువులు మాత్రం చాలా కనబడ్డాయి. జాకాల్, నెమలి, బైసన్, సంబార్ జింకను చూసాము. మంచి బ్రౌన్ రంగు బొట్టుతో ఉన్న జింకను చూసాము. ఇలా చాలా రకాలు చూసాము. పులిని మాత్రం చూడలేదు. అయితే తిరిగి వస్తూ ఆ రోజు సాయంత్రం మళ్ళీ వెళ్ళదాం అనుకున్నాము. పులిని చూడటానికి ప్లాన్ చేసుకొని అక్కడ ఉన్న ఒక షాపులో టీ షర్ట్స్ అన్ని కొన్నాం. మనీ అంతా కూడా ఫారెస్ట్ డిపాట్మెంట్కి చెందుతుందట. అక్కడ కొన్ని కొనుక్కుని బసకి వచ్చి భోజనం చేసి కాసేపు పడుకున్నాం. మరల తొందరగా లేచి ఐదు గంటలకి ఇంకో గేటు వద్దకి వెళ్ళాము.


అది కవాసా గేటు. అది కంజర్వేట్ జోన్ అట. సో, ఆ గేటులో సాయంత్రం నైట్ సఫారీకి వెళ్ళాం. మేము ఆరుగురం కలసి నైట్ సఫారీకి ఒక వ్యాను మాట్లాడుకొని బయలుదేరాము. అందులో నుంచి వెళ్ళేటప్పుడు డ్రైవరు అన్నాడు – “ఎలాగైనా మీకు పులిని చూపించడానికి ట్రై చేస్తాను, సాధ్యమయినంతవరకు అవకాశం ఉంటుంది” అన్నాడు. బయలుదేరిన దగ్గరనుంచి కలసిన ప్రతి వాహనం డ్రైవర్లకి ఆ అబ్బాయి చెప్పుతున్నాడు – “మీకు ఎవరికైన పులి కనిపిస్తే చెప్పండి, నాకు కనిపిస్తే నేను చెబుతాను” అని. అలా ఒక ఇరవై మందికి చెప్పి ఉండవచ్చు. సో కరెక్టుగా ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే తొమ్మిదిన్నర వరకు రెండున్నర గంటలు మా అన్వేషణ సాగింది. ఇందులో మళ్ళీ జింకలను చూసాము, తరువాత ఒక చోట ఎవరో ఫోన్ చేసి ఇక్కడ పులి ఉందనే సరికి అందరం అక్కడకి పరిగెత్తి చాలా మౌనంగా అరగంట సేపు ఎదురు చూసాము. ఏదైతే లోపలకి వెళ్ళిందో అది అక్కడ కూర్చుండిపోయింది. నడవడం లేదు. అది విశ్రాంతి తీసుకుంటుందేమో మనకేమి కనిపించడం లేదు. ఆ అబ్బాయి మరల ఫోన్ చేసి మీకు పులి కనిపిస్తే మళ్ళ వెంటనే కాల్ చేస్తే వస్తామని చెప్పి, మా వ్యాన్ తీసుకొని ఓ సైడ్ కి వెళ్లాడు. అక్కడకి వెళ్ళినప్పుడు అక్కడ ఆల్రడీ ఒక వ్యాను ఆగి ఉంది. అక్కడకి వెళ్ళి వాళ్ళని అడిగితే మాకేమి కనిపించలేదు అని చెప్పారు. ఈలోపల ఒక అడవి పంది శబ్దాలు వినిపించాయి. గట్టిగా కేకలు అరుపులు అయితే అడవి పంది అని అనుకున్నాము. కాని పులికి సాధారణంగా అడవి పంది చాలా ఇష్టమైన ఆహారం అన్నమాట. వెంటనే దాన్ని పట్టుకోవటానికి రెండు పులులు వచ్చాయి. అది మా కంటపడింది అది. మా డ్రైవర్ జేమ్స్‌బాండ్ సినిమాలో లాగా చక్కగా వ్యాన్ని టప్పుమని తిప్పేసి, పులి వెంబడి తీసుకెళ్ళాడు. అవి చాలా దూరం పరిగెత్తుకుంటూ, పరిగెత్తుకుంటూ అడవిలోకి వెళ్లిపోయాయి. అందరం పులిని చూసినందుకు చాలా సంతోష పడ్డాము. ఈ రోజు 20 వాహనాల వరకు సఫారీ వెళ్ళితే మా ఒక్క వాహనానికే ఈ పులులు కనిపించడం మాకు చాలా సంతోషంగా అనిపించింది.


మా పిల్లలందరు ఒకటే కేరింతలు.. అసలు ఆ సంతోష సమయంలో కోతికి కొబ్బరికాయ దొరికినట్లుగా చాలా ఆనందపడిపోయారు. మేము వచ్చిన అడవికి ఆ పులిని చూసిన సంతోషంతో అందరు కేరింతలు కొడుతూ హ్యాపీ, హ్యాపీగా ఆ వెన్నెలలో పాటలు పాడుకుంటూ బసకి తిరిగి వచ్చాము. అక్కడకి రాగానే గైడ్‌కి, ట్యాక్సీ డ్రైవర్‌కి ఇద్దరికి, సఫారీ డ్రైవర్‌కి ఇద్దరికి టిప్స్ ఇచ్చి మా సంతోషాన్ని వెలిబుచ్చుకున్నాము.
***
తరువాత రోజు మాములుగా లేచి మేము ఒక ఊరికి వెళ్లాము. పచ్తాళ్ విలేజ్ అనే గ్రామానికి వెళ్ళాము. ఆశ్చర్యకరమై విషయం ఏమిటంటే మొత్తం ఆ ఊరి నిండా కుండలు తయారుచేస్తున్నారు. ఆ కుండలు అక్కడ బాగా ప్రసిద్ధి చెందినవని చెప్పారు. నేను అక్కడకి వెళ్ళి ఆ కుండలు తయారు చేసే విధానము చూసాను. కుండలను పిల్లల తోటి కూడా తయారు చేయిస్తున్నారు. అక్కడి నుంచి బయలుదేరి మేము ఒక సరస్సుకి వెళ్లాము. దానిపేరు కోక లేక్. ఈ కోక లేక్ చాలా అందంగా ఉంది. సూర్యాస్తమయం సమయానికి ముందు వెలుగుండగా అందరు పడవలలో వెళ్ళాము.


చక్కగా బోటు డ్రైవింగ్! మా మనమరాళ్ళు తోటి చక్కని సాయంసమయమున గోల్డ్‌న్ విజువల్ కనులపండువగా అనిపించింది. ఆ నీళ్లు బంగారు వన్నెలో తళతళలాడుతూ ఆ ప్రదేశం అంతా మెరిసిపోయింది. అబ్బ!.. ఆ అందమైన దృశ్యం వర్ణించనలవి కానిది.


ఇన్ని అనేక రకాల అడ్వంచర్ ట్రిప్స్ ఉన్నాయి. అంటే సైకిల్ మన సర్కస్‌లో వెళ్ళినట్లుగా ఇలా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఒక సైకిల్ మీద మనము ఆటోమెటిగా తిరుగుతూ ఉంటుంది. దాని మీద కూర్చోవాలి. ఆ మిషన్ తోటి దాన్ని నడిపిస్తారు. అలాంటిది ఒకటి, తరువాత మనుషులు నడుచుకుంటూ తాడు మీద నడుస్తూ వెళ్లే ఒక వంతెన, తరువాత గాలిలో తేలే ఒక చిన్న డ్రైవ్ లాంటిది, అదొక్కటే కాకుండా బోటింగ్ కూడా చాలా చాలా బాగుంది. మేము అందరము పడవ ఎక్కి ఆ రోజు సూర్యస్తమయం టైమ్ వరకు షికారు చేసాము. ఆ షికారుకి తీసుకెళ్ళిన ఆ అబ్బాయి కూడా జేమ్స్‌బాండ్ సినిమాలోలాగ పడవని చక్కగా ఇటు అటు అలలతో పాటు నడుపుతూ మాకు ఉత్సాహం కలిగించాడు. ఎగురుతూ, గెంతుతూ చక్కగా విన్యాసాలు చేస్తూ మమ్మల్నందరిని అలరించాడు.


అలాగే ఈ లేక్ పక్కకి మనకు అడవి కూడా కనిపిస్తుంది. మేము చూస్తున్నప్పుడు మాత్రం మాకు జింకలు కనిపించాయి. కాని ఎండాకాలం వెళ్ళితే ఈ లేక్ దగ్గరకు కూడా పులులు వస్తాయట. ఎందుకంటే చాలా చల్లగా హాయిగా ఉంటుందేమో, ఎక్కువ జంతువులు అక్కడకే వస్తాయని విన్నాను. అవి అన్ని చూస్తూ మేము ఆ రోజు సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి మా రిసార్ట్‌కి చేరుకున్నాము.
***
పెంచ్ అడవిలో ఒక విశిష్టత యేమిటంటే 28 కిలోమీటర్ల పొడవులో ఒక రోడ్డును నిర్మించారు. ఆ రోడ్డుకి ఇరు ప్రక్కల సౌండ్ ప్రూప్ కోసం ఆకుపచ్చని తడిక లాంటిది ఒకటి కట్టారు. అది సౌండ్ ప్రూప్ కోసమట! ఎందుకంటే జంతువులకి లారీలు, బస్సులు హారన్స్ వినబడకుండా ఆ విధంగా కట్టారట. అదొక్కటే కాకుండా ఆ జంతువులు సునాయాసంగా, హాయిగా తిరగటానికి వాటిని ఏమి ఆటంకపరచకుండా వంతెన క్రింద జంతువులు తిరిగేటట్టుగా పెట్టారు. ఇది చాలా చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన వన్యప్రాణుల గురించి ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు మాత్రం చాలా అద్భుతంగా అనిపించాయి. అయితే ఇంకో విశేషం ఇక్కడ ఏమిటంటే రుడ్యార్డ్ కిప్లింగ్ తాను రాసిన క్లాసిక్ – ‘ద జంగిల్ బుక్’ లో మొత్తం ఈ ప్రాజెక్టు కింద ఈ ప్రదేశములోని టైగర్ రిజర్వ్ గురించి ఆయన రాసారు. తరువాతి కాలంలో, ఈ జంగిల్ బుక్ అనేది ఒక సినిమాలాగా, సీరియల్లాగా వచ్చింది. నిజంగా అది చాలా చాలా అందమైన ప్రదేశం. అవి అన్ని చూస్తూ మేము ఆ రాత్రి ఆ వెన్నెల రాత్రిలో చీమ చిటుక్కుమన్నా వినిపించని, చిటుక్కుమంటే కూడా వినిపిస్తున్న ఆ గాలిలో మాతో మెడిటేషన్‌లాగా చేయించారు. దగ్గర దగ్గర అరగంటసేపు అలా రకరకాల జంతువులు, పక్షులు, గుడ్లగూబ అరిచే అన్ని రకాల శబ్దలతోటి మా మనసు పులకరించిపోయింది. అదే నాకు మొదటిసారి – రాత్రి పూట ఇలాగ అడవిలోకి వెళ్లటం! చాలా బాగా అనిపించింది. ఇంక సాయంకాలం చల్లగా ఉందేమో జంతువులు కూడా చాలా బయటకి వచ్చాయి. ఇది అంతా చూస్తూ మేము ఆ అడవి అందాలను చూస్తూ తడిచి ముద్దయి పోయాము.


పడవల్లో తిరిగి, రాత్రి ఏడున్నరకి బసకి వచ్చి రాత్రి భోజనం చేసి పడుకున్నాము.
***


మర్నాడు ఉదయం ఐదు గంటలకు లేచి ఒక కారు తీసుకొని పెంచ్ నుంచి నాగ్‌పూర్ వరకు వచ్చి తొమ్మిదిన్నరకు ట్రైను ఎక్కి, సాయంత్రం ఐదున్నరకి హైదరాబాద్‌లో దిగాము. ఇలా ఆ దట్టమైన అడవిలో చక్కటి ఎన్నో వేల కిలోమీటర్ల హెక్టార్లలో ఉన్న అడవిలో నాలుగు రోజుల పాటు ప్రకృతిని ఆస్వాదిస్తూ గడిపి, అందరం హ్యాపీగా ఇంటికి చేరుకున్నాం.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన డా. నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.