అమెజాన్ నదీ ఆండీస్ పర్వతాలలో ఉద్భవించి పెరూ నుండి ఈక్వేడార్, కొలంబియా, వెనిజులా, బొలీవియా నుండి ప్రవహిస్తూ, అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది.


ఈ అమెజాన్‌కి… ఎక్కడైతే ఆండీస్ పర్వతాలు వున్నాయో అక్కడికి మేమిద్దరం… నేనూ, మా శ్రీవారు వెళ్ళాము.
పెరూలో ఉన్న ప్రపంచ అద్భుతం ‘మచు పిచ్చు’ చూడాడానికి వెళ్ళి, అక్కడ్నించి అతి అద్భుతమైన ఈ అమెజాన్ నదీ ప్రవాహాన్ని సందర్శించాం.
ఆ నీటి ప్రవాహం, ఆ హోరు, ఆ నీటి తుంపరలు… అక్కడి ప్రదేశాన్ని అంతంటినీ ఆక్రమించుతున్నాయి.
ఈ నది గురించి:


అమెజాన్ నది దక్షిణ అమెరికాలో అతి పెద్ద నది. ప్రపంచంలో పది నదుల మొత్తం ప్రవాహంలో అయిదవ వంతు అమెజాన్ నదీ ప్రవాహమే. దీని విశాలమైన ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని దీనికి ‘నదీ సముద్రం’ (రివర్ సీ) అని మరో పేరు కూడా ఉంది.
ఈ నదిపై వంతెనలు లేవు. వంతెనలు అసలు కానరావు. ఈ నది వెడల్పు ఎక్కువ కావడం మూలానా వంతెనలు నిర్మించలేక పోతున్నారు.
మచు పిచ్చు ట్రెక్:
మేము ఎంతో ఉత్సుకతతో మచ్చు పిచ్చు ట్రెక్ తీసుకున్నాము.
మేము మొదట ఆండీస్ పర్వతాలపై మా నడక ప్రారంభించాము. ప్రపంచంలోని ఏడు వింతలలో ఈ మచ్చు పిచ్చు ఒకటి. ఇక్కడికి వెళ్ళేందుకు ముందుగా మేము cusco అనే ప్రాంతానికి వెళ్లాము. మచ్చు పిచ్చుకి నడుస్తూ వెళ్ళాలంటే ఈ cusco కి తప్పనిసరిగా వెళ్ళాలి. ఇక్కడ ‘ఇన్కా’ (inca) అనే మార్గాల నుండి నడుస్తూ వెళ్ళాలి. ఈ నడక ఎంతో అద్భుతమైనది. లోయలు, పచ్చని పర్వతాలు, అక్కడక్కడా కన్పించే గొర్రెలు చుక్కల్లో చంద్రుని లాగ తెల్లగా మెరుస్తూ ఎంతో ఎత్తుగా వుంటాయి. వీటి బొచ్చు ప్రపంచంలోకెల్లా ఖరీదైనది.




ఇది చూస్తూ మేము ‘సేక్రెడ్ వేలీ’ (sacred valley) లోకి అడుగుపెట్టాము. ఇక్కడ ఆదిమజాతులవారు నివసిస్తున్నారు. ఇక్కడ quenchua అనే భాషలో మాట్లాడుతున్నారు. వీరు ఇక్కడ దుస్తులు ధరిస్తున్నారు. వీరి బట్టలు, స్వెటర్లు చాలా మందంగా చలి ప్రదేశాలకి తట్టుకునే విధంగా వున్నాయి.
Alpaca అనే జాత్రి గొర్రెలు… కానీ బర్రెలలాగ అంతటి పొడవునా పెద్ద పొట్టేలుకి వున్నటువంటి కొమ్ములతో ఎంతో అందంగా వుంటాయి. ఈ Alpaca బొచ్చుతో ఎన్నో స్వెటర్లు, అన్ని రకాల వస్తువులు తయారు చేస్తున్నారు. Inca అనే జాతి వారికి ఈ Alpaca అనే గొర్రెలే జీవనాధారం. ఎన్నో వేల కుటుంబాలు దీని బొచ్చుతోను, చర్మంతోనూ రకరకాల టోపీలు, చేతి గ్లౌవుజులు, మెడ చుట్టూ వేసుకునే అలంకారప్రాయమైన వస్త్రాలని తయారు చేసి అమ్ముతున్నారు.
లంచ్ తర్వాత మేము quillia quillarumiyoc అనే ప్రదేశానికి వెళ్లాము. దీనినే ‘temple of moon’ అని అంటారు. ఇదంతా ఒక పది కిలోమీటర్ల మేర నడిచి వుంటాము. temple of moon ఎంతో పురాతన గుడి. ఎన్నో మెట్లు ఎక్కి అక్కడికి చేరుకున్నాము. దారి వెంట అన్నీ దుకాణాలు వున్నాయి. అవి చూస్తూ నడిచాము. ఆ కొండ నుండి చూస్తే క్రింది మొత్తం ఎంతో అందంగా కన్పిస్తుంది.
అప్పటి ‘inca’ సామ్రాజ్యం గొప్పది! ఆ తలుపులు చాలా ఎత్తుగా వున్నాయి. అవి 4400 మీటర్ల ఎత్తులో వున్నాయి. ఇది మొత్తం విల్కాబాంబా (vilcabamba) మరియు విల్కానోటా అనే పర్వత పంక్తుల మధ్య ఉంది. ఈ దృశ్యాన్ని చూస్తూ మనం ఊపిరి పీల్చడం మర్చిపోతామేమో! అంతటి అందమైన ప్రదేశం.
క్రింద నుండి పై వరకు నడిచి వచ్చినా ఆయాసం అంతా మరిచిపోయి, చల్లని పిల్లగాలులతో ఆదమరిచి ఆ ప్రాంతమంతా కలయతిరిగాము.
ఇది quillarumiyoc అనే ప్రదేశం. దీనినే హమ్మింగ్ బర్డ్ టెంపుల్ అని కూడా అంటారు. ఆ రోజు మేము 13 కిలోమీటర్లు నడిచాము. ఎత్తైన కొండలు క్రిందకి దిగటం 13 కిలోమీటర్లు మాత్రమే. కానీ 20 కిలోమీటర్లు నడిచినంత ఆయాసం ఈ ఎత్తుకు ప్రయాణిస్తుంటే. అంతటి చలిలో కూడా చెమటలు పోస్తున్నాయి.
అక్కడి నుంచి క్రిందకి దిగి, అక్కడే వున్న ఒక ఇంట్లో పడుకున్నాం వారి అతిథులుగా. ఇక్కడి భోజనం – గొర్రెల మాంసం, గట్టి బన్ రొట్టెలు. అవి తినేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది.


మూడవ రోజు మేము క్రిందకి దిగడం ప్రారంభించాము. ఇక్కడ Kengo Mayu నది పక్కగా నడుస్తూ 11 కిలోమీటర్లు నడిచాము. ఒక ప్రాంతంలో మనను చక్కని ibises, caracaras అనే పక్షులు, ఎర్రటి కొంగలు, పొడుగుగా ఉన్న పక్షులు, గుంపులు గుంపులుగా కనిపించాయి. ఎంతో అందంగా వున్నాయి. వాటి పొడుగాటి ముక్కులతో చేపలు, పురుగులు, తింటున్నాయి. అందమైన ‘దృశ్యమాలిక’ లాంటి అవి అన్నీ చూస్తూ 11 కిలోమీటర్ల నడక బడలిక మరిచిపోయాము. క్రిందకి దిగుతూ లోయలు, పచ్చటి పచ్చిక పాన్పు వేసినట్టు వున్న ప్రాంతాలని తనివితీరా చూస్తూ బయలుదేరాము.
ఇక్కడ ప్రతీ రాత్రి అక్కడి ప్రాంతంలో నివసించే వారి ఇళ్ళల్లో మా విడిది. చాలా బీద కుటుంబాలు. మన దగ్గర ‘లంబాడీలు’ ఎలా సంచారజీవులో వాళ్ళు కూడా అలాగే. ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ మచ్చు పిచ్చుకి వెళ్ళాము. ఇక్కడ Sun Gate నుంచి ప్రవేశం,
ఇక్కడ మాకు గైడ్ మూడు గంటలకి మా విడిది నుంచి జీప్‌లో తీసుకెళ్ళి ట్రైన్ స్టేషన్లో దించాడు. ఈ చిన్ని రైలు టాయ్ ట్రైన్ లాగా రోజుకి కొంత మందిని మాత్రమే తీసుకెళ్తుంది. ఐదు గంటలకి రైలు.
ఒక రోజుకి 280 మందిని మాత్రమే ఇక్కడి తీసుకుని వెళ్తుంది. పార్లర్స్, కుక్స్, గైడ్స్ అందరూ రోజుకి 280 మంది టూరిస్టులని తీసుకుని వెళ్ళగలుగుతారు.


దీనినే inca trail అని అంటారు. ఇది ఒక అద్భుతమైన పురాతన నగరము. రజనీకాంత్ రోబో సినిమాలో ‘కిలిమంజారో’ పాటని ఈ మచ్చు పిచ్చు లో చిత్రీకరించారు.
ఇక్కడ inca అనే తెగవారు నివసిస్తున్నారు. ఇది 2430 మీటర్ల ఎత్తులో వుంది. ఇది పెరూ దేశంలోని కాపిటల్ లిమా అనే ప్రదేశంలో వుంది. ఇక్కడి భాష స్పానిష్.


ఇది 15వ శతాబ్దంలో నిర్మింపబడింది. ఉరుంబా ప్రాంతంలోని cusco లో వుంది ఈ మచ్చు పిచ్చు. ఒక కొండ శిఖరం మీద ఈ మచ్చు పిచ్చు అనే నగరాన్ని నిర్మించారు. ఇక్కడ ఉరుంబా నది ప్రవహిస్తుంది. Panchakuti అనే రాజు 1438 – 1472 వరకు పరిపాలించారు. ఆ రాజు కొరకు ఈ సుందరమైన నగరాన్ని నిర్మించారని కొందరు చెబుతున్నారు అని పురాతత్వ శాస్త్రవేత్తలు వివరించారు. ఆ రోజుల్లో అది ఎంతో సుందరమైన నగరం అని పురాతత్వ శాస్త్రవేత్తలు వర్ణించారు.
అయితే 1911 హిరామ్ బింగం అనే ఒక బాటసారి ఈ ప్రదేశాన్ని కనిపెట్టి దీనిని అంతర్జాతీయ దృష్టికి తీసుకువెళ్ళాడు. అతను ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవాడు. ఈ ట్రెక్కింగ్ చేస్తూ ఈ అందమైన ప్రదేశం గురించి ప్రపంచానికి తెలియజేశాడు. అప్పటికి నుండి ఇది పర్యాటక ప్రాంతంగా చెందింది. ఈ ప్రాంతంలో కట్టిన కట్టడాలు చూస్తే ఎవరో గ్రహాంతరవాసులు వచ్చి కట్టివెళ్ళారా అనే అంత అద్భుతంగా వుంటాయి. ఈ కట్టడాలకు వాడిన రాళ్ళు ఆధునిక సాంకేతికలో రాళ్ళని పదును పెట్టే విధంగా – ఆ రోజులలో ఆ రాళ్ళని అంతటి నునుపుగా అంత కొండపైకి ఎలా చేర్చారో అనీ, ఎలా అంతటి సుందరమైన నగరం కట్టారో అనీ ఆశ్చర్యానికి గురవుతాం.


మేం ఆ ట్రైన్ దిగగానే ఒక ఫొటో తీసుకున్నాం. మళ్ళీ పైకి వెళ్తుంటే ఒకటే ఆయాసం. ఉదయం ఆరు గంటలకి వెళితే మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆ ప్రదేశాన్నంతా తిరిగి చూసేసరికి 30 కిలోమీటర్లు నడిచినంత అలసట.
ఈ ప్రాంతమంతా చూసి మళ్ళీ నడుస్తూ క్రిందకి వచ్చాము. ఈ ప్రదేశంలో, sun, moon టెంపుల్స్ వున్నాయి. ఈ ప్రాంతమంతా తిరిగి చూస్తునప్పుడు మన హిందూ ధర్మాన్ని ఇక్కడ ఆచరించారా అని నాకు అనుమానం కలిగింది. ఎందుకని అంటే మనం పూజిస్తున్న సూర్యభగవానుడిని ఆ ప్రదేశంలో చూసి ఒకింత ఆశ్చర్యపోయాను. అలాగే అక్కడి inca తెగల వారు ధరించే దుస్తులు మన లంబాడీవారు ధరిస్తున్న దుస్తుల ఒకలాగే అనిపిస్తాయి.


ఈ ప్రాంతాన్ని 1983లో యునెస్కో వారి ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించారు.
మాకు గైడ్‌గా పనిచేసిన అతను ఒక బుక్ రాశారట. నేను ఆశ్చర్యంగా, ‘అబ్బా, ఒక రచయితని కలిసాన’ని ఎంతో సంతోషపడ్డాను.
అప్పటికి నేను రచయిత్రిని కాలేదు. కాని ఎప్పుడు ఒక రచయితని కలిసినా ఎంతో సంతోషం, ఎంతో ఆనందం.
అక్కడ ఒక ఫేమస్ హోటల్లో కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాము. కాఫీ త్రాగుతూ గ్లాస్ డోర్స్ నుండి చూస్తే నది ప్రవహిస్తూ కనబడింది. ప్రవాహ వేగానికి ఆ నది తుంపరలు ఎక్కడో వున్న మా మీద పడుతున్నాయి. అంతటి ఫోర్స్‌తో వస్తున్న నది! ఇది ఉరుంబా నది! అమెజాన్ నదిలో కలుస్తుంది. నది ఉరకలు పరుగులు చూస్తూ వేడి వేడి కాఫీ త్రాగుతూ అలౌకిక ఆనందం పొందాము.
అప్పుడు ‘గలగల పారుతున్న గోదారిలా’ అని పాట పాడుకుంటూ ఆనందించాము. తర్వాత మళ్ళీ టాయ్ ట్రైన్లో ఆరు, ఏడు గంటల మధ్య తిరుగు ప్రయాణం. చిన్ని టాయ్ ట్రైన్లో కొంతమంది యువతీ యువకులు పాలుగారే బుగ్గలతో, ఎంతో అందంగా వున్నారు. వారు స్వెటర్, మఫ్లర్స్, గ్లౌజులు, ఊలు టోపీలు, Alpaca గొర్రె బొచ్చుతో తయారు చేసినవి షాల్స్ – అన్నీ సంగీతం పెట్టి ‘కేట్ వాక్’ చేస్తున్నట్లుగా సంగీతం, డాన్సుతో అన్ని వస్తువులను మా అందరికీ ఒక ప్రదర్శనలా చూపించారు. వారు ఆ డాన్స్ పూర్తి అయ్యేవరకు వారి దగ్గర వున్న అన్ని వస్తువులను మాకు చూపించారు. ఆ డాన్సు, మ్యూజిక్ అయిన తర్వాత అందరికి ఎవరికి ఏది నచ్చితే అది కొనుక్కోవడానికి ఒక పాంఫ్లెట్ ఇచ్చారు.
ఎవరికి ఏది ఇష్టమైతే అది డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు. చాలా వెరైటిగా అన్పించింది ఆ అమ్మే పద్ధతి. అందరినీ ఆకట్టుకుంది. ఎందుకంటే మనం ధరిస్తే ఎలా వుంటుందో చేసి చూపించారు. అక్కడ వున్న సామానంతా అమ్ముడుపోయింది. వారి పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం.
అక్కడి నుండి Rainbow Mountain వెళ్ళాము. ఇది చాలా high altitudeలో వుంది. ఈ Rainbow Mountain చూడాలంటే cusco నుంచి మూడున్నర గంటలు పడుతుంది. మూడు నుంచి నాలుగు గంటలు పైకి ఎక్కాలి. చాలామంది ఆక్సీజన్ సిలిండర్స్ తీసుకుని వెళ్తున్నారు. మేము వెళ్ళే బస్ నుండి వెళ్ళినవారు, ఈ ట్రెక్ చేసినవాళ్ళు ఉన్నారు. 5000 meters altitude పైకి వెళ్ళాలి.






చాలా కష్టమైన ట్రెక్. కోంతమంది గుర్రాల మీద వెళ్తున్నారు. కానీ మేం ఈ ట్రెక్ చేయలేదు. ఇలాంటిదే Rainbow Mountain చైనాలో చూశాము.
చైనాలో అయితే చాలా దగ్గరకి వెళ్ళి చూడవచ్చు. ఇక్కడ మచ్చు పిచ్చులో కంటే చైనాలో బాగా దగ్గరగా చూడవచ్చును. కానీ 13 కిలోమీటర్లు నడిచి ప్రతి ప్రాంతంలో చూడవచ్చు.
ఆ రోజు మొత్తం ఈ Rainbow Mountain చూసిన ఆనందం, అక్కడి వారితో మాట్లాడి ప్రపంచ వింత చూశామని తృప్తితో తిరిగి వచ్చాము.
నిర్విరామ విహారిణిగా పేరుపొందిన డా. నర్మద రెడ్డి ఎన్నదగిన స్త్రీ యాత్రికురాలు. ఇప్పటివరకూ ప్రపంచంలోని 169 దేశాలను సందర్శించారు. తమ పర్యటనానుభవాలతో “ఆగదు మా ప్రయాణం”, “కొలంబస్ అడుగుజాడల్లో” అనే పుస్తకాలు వెలువరించారు. ‘ఉమెన్ ఆన్ గో’ పురస్కారం పొందారు.
1 Comments
SambaSivaRao,Peela
Yes.Machu Picchu is one of the the best and most wonderful places in Latin American countries.Praying Sun God I’ve seen in a movie with regarding to Mayan civilization.Also praying fire.Ranibow mountain is good at last.But it’s really nice unique culture and tradition in Latin American countries.I like to make some movies there