నడి రాతిరిని సాగనంపి వేకువమ్మ పిలువంగా
తొలి కోడి కూసి నిదుర మగతను మేల్కొల్పగా
ఎగిరంగానే ఏగిల్లు వారాంగా హిమపు దూపమేసినట్టుగా
మంచు ముత్యాల ధార ధాత్రిని ముద్దాడంగా
పచ్చని పసిరికలో పులకరింతలు పుట్టంగా
తరువు లేలేత సొబగులు కనులకింపుగా
చిగురులు తొడిగి చిందులేయంగా
కొమ్మకొమ్మకు జలసుమాలు సరులుగా
సుందర దృశ్యం సూపును కట్టిపడేయంగా
తూరుపు ఇంటిన పొద్దు పొడవంగా
చెదరము అద్ది చందనము నెట్టినట్టుగా
పసిడి భానువులతో భాస్కరుడు ప్రభావించంగా
వెలుగు రేఖల రాశులు నేలను తాకంగా
ఆ తాకిడికి పుడమి ఒళ్ళు విరిచుకోగా
తల్లి పొదుగును నోటితో ముద్దాడుతుండంగా
లేగ దూడ మూతికి పాలనురుగు మీసాలు బెట్టంగా
పెంకుటిల్లు ప్రేమగా రమ్మని పిలువంగా
వాకిలేమో వయ్యారంగా వలపు లొలుకుతుండంగా
కల్లాపి వాన సినకులోసుకొని స్నానమాడంగా
సుద్దతోన సుక్కలు వెట్టి సింగారించంగా
గృహమావరణలోని చెట్ల పూలు పుప్పొడులవగా
సింగిడి వర్ణాలై విచ్చుకుని సుక్కల వరుసను కలపంగా
ముత్యాల ముగ్గు ముచ్చట్లేన్నో జెప్పంగా
వడివడిగా రమ్మంటూ గుమ్మం సుట్టమల్లే పిలువంగా
ఆహ్వానం పలికి అరుగు మంచి,చడ్డలడుగంగా
గడపేమో సుమగంధాల సామ్రాన్నేయగా
పసుపు,కుంకుమతో ముత్తైదువులా బోట్లేట్టుకోగా
తలుపులు తారసపడి సడి చేసి సంగీతాన్ని మోగించంగా
అడుగులును భూదేవి తన తనువున చుంబనాలల్లే మురవంగా
నేల మీద పరిచిన సాప సింహాసనమై అదిష్టిoచమనగా
మట్టి గోడల్లోని అణువణువునా మానవత్వం పరిమలించంగా
పలకరింపుల్లోన అనురాగం యేరులా ఉరకలెత్తంగా
తనువంతా తన్మయత్వం నిండి వరదై పొంగగా
అదొక భూతల స్వర్గమల్లే తోచింది

నమస్తే. నా పేరు తాటి హరీష్. ప్రస్తుతం విద్యార్థిని. ఐటిఐ పూర్తి చేశాను.
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కవితలు, కథలు, పద్యాలు రాయడం, చదవడం నూతన తెలుగు సాహితీ పక్రియలు నేర్చుకోవడం నా అభిరుచులు.
మెరుపులు ద్విశతక ప్రక్రియలో – మెరుపు రత్న పురస్కారం, ముత్యాల పూసలు శతక ప్రక్రియలో మోతి శ్రీ పురస్కారం, హరివిల్లు ప్రక్రియలో త్రిశతకానికి, కవి భూషణ్ పురస్కారం, తేనియలు ప్రక్రియలో శతక పురస్కారం , 2020లో కవిసమ్మేళనంలో సేనా పత్రిక వారి జ్ఞాపిక, ప్రతిలిపిలో సారంగదరియా పోటీలో విజేత పత్రం, నవ భారత్ నిర్మాణ్ సంఘ్ ఆధ్వర్యంలో జూమ్ ద్వారా నిర్వహించిన కవి సమ్మేళనం లో మొదటి విజేతగా నిలవడం, వాగ్దేవి సాహీతీ కళా వేదిక వారి సంక్రాంతి పోటీలలో బాల వ్యాకరణం పుస్తకాన్ని విజేత బహుమతిగా అందుకోవడం నాకు లభించిన అభినందనలు.
ఇప్పటి వరకు దాదాపు 500 పైగా మినీ కవితలు పూర్తి చేశాను. పద్య పక్రియలో శతకం పూర్తి అయింది.
2 Comments
Shiva
It’s mind blowing hats pff writer
Shiva
It’s mind blowing hatspff writer