ప్రకృతి ప్రాణ వాయువు ప్రసాదిస్తుంది కదా!
మనిషేమిటి, కాలుష్య వాయువును వెదజల్లు తున్నాడు!
మలయ మారుతంతో, మంచి గంధపు వాసనలతో
మనసు ఉల్లాస డోలలు ఊగాలి కదా!
పూల పరిమళాలతో, పక్షుల కిలకిల రావాలతో
హరిత తోరణంలా భువి విరాజిల్లాలిగా!
రాగ రంజితం కావాలిగా!
విష వాయువులు విశృంఖలంగా విరజిమ్మితే
తావిలేని పువ్వులు పూస్తాయేమో !
కూతలేని పిట్టలు వస్తాయేమో !
మేథలేని పిల్లలు పుడతారేమో!
వరద బీభత్సాలు
భూకంపాల భారీ నష్టాలు
సునామీ శవాల గుట్టలు
ఇప్పటికే చూశాంగా!
వీటి ప్రభావం తాత్కాలికమేనని
జనాళి ఉపేక్షిస్తుందేమో!
ఇప్పటి నుంచి దీర్ఘకాలిక దుష్ప్రభావాలు
జీవకోటిని అతలాకుతలం చేస్తే-
మానవాళికి మేలుచేసే
క్రిమి కీటకాలు అంతరించిపోతే-
పరాగ సంపర్కానికి భ్రమరాలు
గ్రహణ శక్తిని కోల్పోతే !
తుమ్మెదలు గ్రోలే మకరందం
పువ్వులకు లేకుండాపోతే
వట్టి పోయిన విరులే మిగిలితే
నేలను సారవంతం చేసే
వానపాములు కనుమరుగై తే
పారిశ్రామిక వ్యర్ధాలూ
పురుగు మందులు వాటి సంతానోత్పత్తిని దెబ్బతీస్తే!
ఆహార చక్రం అతలాకుతలం అయితే
పిచ్చుకల కిచకిచలతో
అలరారే గూళ్లు మూగనోము పాటిస్తే
కాలుష్య ప్రభావానికి లోనై
పుట్టుకొచ్చే సముద్ర పక్షులు (గల్ఫ్స్)
వికృతిగా ప్రవర్తిస్తే..!
కనకుండానే గర్భస్రావాలు
పుట్టుకతోనే లోపాలు కొనసాగితే
ప్రకృతి వికృతి కాదా!
బ్రహ్మాండం బడబానలం కాదా!

సాదనాల వేంకట స్వామి నాయుడు ప్రముఖ సినీ గేయ కవి, నటుడు, గాయకుడు, పత్రికా సంపాదకుడు. ఉత్తమ ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత, డబ్బింగ్ కళాకారుడు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో బంగారు ‘నంది’ని బహుమతిగా అందుకున్నారు.
- భారత ప్రభుత్వ పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ నుంచి వచన కవితకు జాతీయస్థాయి బహుమతిని 1994లో స్వీకరించారు.
- తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ‘కృష్ణాపత్రిక సాహిత్య సేవ’ లఘు సిద్ధాంత వ్యాసానికి బంగారు పతకాన్ని 1991లో అందుకున్నారు.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2011లో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు.
- 1989లో జీసీస్ క్లబ్ ‘అవుట్‌స్టాండింగ్ యంగ్ పర్సన్ అవార్డు’, 1990లో ‘రోటరీ లిటరరీ అవార్డు’ లను పొందారు.
- దృశ్య కవితా సంపుటికి రెండు రాష్ట్రస్థాయి పురస్కారాలను అందుకున్నారు.
- ఆకాశవాణి ‘సుగమ్ సంగీత్’ జాతీయ కార్యక్రమంలో రెండు సార్లు సాదనాల రాసిన లలిత గీతాలు దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాల నుంచి ప్రసారమయ్యాయి.
- దక్షిణమధ్య రైల్వే నుంచి ఉత్తమ ఉద్యోగిగా సీనియర్ డి.పి.వో, డి.ఆర్.ఎం, సి.పి.వోల నుంచి పలుమార్లు అవార్డులను అందుకున్నారు.
- నాయుడు బావ పాటలు ‘గేయసంపుటి’ ‘పూలాచావ్లా’ పేరుతో ఒరియాలో సంపుటిగా ప్రచురింతమయ్యింది. ఆంగ్లభాషలోకి అనువదింపబడింది.
- తెలుగులో నాలుగు గ్రంథాలను ప్రచురించారు.
- రేడియో, టీ.వి, సినిమా, ఆడియో కేసట్లకు అనేక గీతాలు రాశారు.