[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
19
ఇక రామాయణంలోని కొన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. మన లెఫ్టిస్టులు, ఎర్ర చొక్కా చరిత్రకారుల్లో ఎవ్వరికీ ఈ అంశాల గురించి తెలియదు. అవగాహన అస్సలు ఉండదు కూడా. రామాయణం అంటే తన చెల్లెను కురూపిని చేసినందుకు ప్రతీకారం కోసం రాముడి భార్యను ఊరికే ఎత్తుకుపోతే, నోరు మూసుకొని ఉండకుండా, రావణుడిని చంపిన దుర్మార్గుడు రాముడన్నదే వీరికి తెలిసిన కొంచెపు విషయాలు. ఇలాంటివి ఎన్ని సార్లు చెప్పుకున్నా తెగవు.. ముడిపడవు. ఇక రామాయణంలో చాలా మంది తెలిసీ, గమనించని కొన్ని అంశాలను వరుసగా చర్చించుకుందాం. రామాయణంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది మంథర, శూర్ఫణక, తార.. రామాయణంలో ఈ మూడు పాత్రలు కొద్దిసేపు మాత్రమే ఉండి.. తమ పని తాము చేసుకొని వెళ్లిపోతాయి. ఇలాంటి పాత్రలు చాలానే రామాయణంలో మనకు కనిపిస్తాయి. తరువాతి వ్యాసాల్లో వీటి గురించి చర్చించుకోవచ్చు. కానీ ఈ పాత్రలన్నీ.. సర్వకాలాలలో మానవ జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ మూడు స్త్రీ పాత్రలను ఎందుకు తీసుకున్నానంటే.. మొత్తం రామాయణాన్ని నడిపించిందే వీరు. రామాయణంలో ఈ రెండు పాత్రలు కూడా చాలా కొద్ది సేపు మాత్రమే కనపడి వెళ్లిపోయేవి. కానీ.. ప్రపంచంలో పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టే వ్యక్తిత్వం ఉండే మహిళలందరికీ వీరిద్దరు కచ్చితమైన ప్రతినిధులు.
ముందుగా మంథర గురించి తెలుసుకుందాం. ఈమె.. దశరథుడు కైకేయిని వివాహం చేసుకున్నప్పుడు ఆమెతో పాటుగా వచ్చిన దాసి. పేరుకు దాసి కానీ, ఒక విధంగా కైకేయికి ఆంతరంగికురాలు అని చెప్పవచ్చు. చొరవ తీసుకొని కైకేయితో మాట్లాడగలిగిన సన్నిహితురాలు. ఈ మంథర మొదట రామకథను నడిపించింది. రాముడి పట్టాభిషేకాన్ని ఆపించి.. రాముడిని వనవాసం దాకా తీసుకొని వెళ్లింది. అయోధ్యలో రాముడి పట్టాభిషేక వార్త వినగానే మంథర కైకేయి దగ్గరకు వెళ్లి ఆమెను తీవ్రంగా రెచ్చగొట్టింది. రాముడు రాజు అయితే కైకేయి కౌసల్యకు దాసి అవుతుందని ఆమె అభిప్రాయం. కైకేయి లాభపడితేనే తాను లాభపడతానని భావించింది. అందుకే.. ‘రాణీ! నీకు అంతులేని మహా దుఃఖము వచ్చి పడినది. దశరథుడు రాముడిని యౌవరాజ్య పట్టాభిషేకము చేయుచున్నాడు. నేను అనంతమైన దుఃఖములో మునిగిపోయినాను. నన్ను అగ్నిచే కాల్చివేయుచున్నట్టున్నది (మనం మామూలుగా ‘నాకు బాగా కాలుతున్నది’ అన్నట్టు). ఈ విధముగా దుఃఖశోకములతో నిండినదానవై నీకు హితము చేయగోరి ఇచటికి వచ్చితిని. నీకు దుఃఖము కలిగినచో నాకు కూడా కలుగును. నీకు అభివృద్ధి కలిగినచో నాకు అభివృద్ధి లభించును. ఈ విషయమున సందేహము లేదు. (20-22 శ్లో. 7వ సర్గ, అయోధ్యకాండ). ఇలా కైకేయిని రకరకాల మాటలతో రెచ్చగొట్టింది. అప్పటిదాకా రాముడిపై అవ్యాజమైన ప్రేమను భరతునివైపు స్వార్థంగా మార్చివేసింది. అంతే.. అప్పటిదాకా సజావుగా సాగుతున్న రామకథ ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. ఆ తరువాత జరిగిన కథ మామూలే.. కైకేయి అలకబూనడం.. దశరథుడిని వరాలు అడగటం, రాముడిని వనవాసానికి పంపించడం.. ఇది రెండుమూడు సర్గలకు పరిమితమైన కథనమే. కానీ, మనం జాగ్రత్తగా గమనిస్తే.. మనం అత్యంత అప్రధానంగా భావించే అత్యంత ప్రధానమైన పాత్ర మంథరది. ఎందుకంటే పట్టాభిషేకం భగ్నం కావడానికి ప్రధాన కారణం మంథర. పట్టాభిషేకాన్ని ఆపాలనే ఆలోచన పుట్టిందే మంథర మెదడులో. ఆ పుట్టిన ఆలోచనను కైకేయి మెదడులోకి సక్సెస్‌ఫుల్‌గా ఇంజెక్ట్ చేసింది. ఆ ఆలోచన సుడిగాలిలా మారింది. దశరథుడి కళ్లలో దుమ్ము రేపింది. అంతే.. అప్పటిదాకా మరికొద్ది గంటల్లో పట్టాభిషక్తుడిని అవుతానని అనుకుంటున్న రాముడిని సమస్తం వదిలేసి నారచీరలు కట్టుకొని అడవుల పాలు అయ్యేలా చేసింది. ఆ తరువాత మంథర మళ్లీ మనకు రామాయణంలో మరెక్కడా కనిపించదు. మేనమామల ఇంటినుంచి అయోధ్యకు భరత శత్రఘ్నులు తిరిగి వచ్చిన తరువాత మంథర ఒకసారి మాత్రం కనిపిస్తుంది. ఆమె కనిపించిన వెంటనే శత్రుఘ్నుడు కత్తి దూస్తాడు. కానీ.. భరతుడు వారించాడు. మహిళల మీద కత్తి దూయడం సరికాదని అన్నాడు భరతుడు. సామాన్యంగా మనమైనా మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూసిన వారు కనిపిస్తే.. కత్తికో కండగా నరకాలనేంత కోపం వస్తుంది. కానీ.. మహిళలపై ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడరాదన్నాడు వాల్మీకి. అదే తాటక విషయంలో ఈ సూత్రం పని చేయలేదు. తాటక సమస్త మానవాళికి కంటకంగా మారింది. ఆ కంటకాన్ని తొలగించక తప్పలేదు. రాముడు సంకోచించినా.. తాటకను స్త్రీగా విశ్వామిత్రుడు పరిగణించలేదు. ఆమె లోకానికి ఒక కంటకంగానే కనిపించింది. అందువల్లే ఆమెను హతమార్చడం తప్పనిసరి అయింది. బాగా డబ్బున్న కుటుంబాల్లో గారాబంగా పెరిగి పెండ్లి చేసుకున్న అమ్మాయిలు.. తమ సుఖాల కోసం, కోరికలను తీర్చుకోవడం కోసం కైక లాగా ఎంతకైనా తెగించే మహిళలను మనం ఇవాళ్టికీ చూస్తూనే ఉన్నాం. చెప్పుడు మాటలకు చెవొగ్గి.. వంకరబుద్ధులకు పదునుపెట్టి సంసారాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్న ఘటనలను ఎన్నెన్నో మనం ఈనాటికీ చూస్తున్నాం. అందుకేనేమో ఎవరో కవి అన్నారు.. ఆడదె సంతోషం.. ఆడదె సంతాపం అని..
ఇలా వనవాసం దాకా రామకథను మంథర నడిపిస్తే.. అక్కడి నుంచి యుద్ధం దాకా శూర్ఫణఖ రామకథను ముందుకు నడిపించింది. విద్యుజ్జిహ్వునితో తన వివాహం చేసిన అన్న రావణుడే తన భర్తను చంపితే.. కొద్ది సేపు కోపించింది శూర్ఫణఖ. నాలుగు తిట్లు తిట్టింది. తరువాత దండకారణ్యాన్ని ఆమెకు బహుమానంగా ఇవ్వడంతో సైలెంట్ అయిపోయింది. దానికి తోడు.. ఆమె చెప్పినట్టల్లా వినే కజిన్ ఖరుడు దండకారణ్యానికి బాస్‌గా ఉన్నాడు. ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా మారిపోయింది. విచ్చలవిడితనంతో తిరిగే స్త్రీకి భర్త ఉండటం అలంకారమే తప్ప మరేదీ కాదు. ఆమె దండకారణ్యంలోకి ప్రవేశించడమే రాముడిని మరింత ముందుకు పంపించడానికి సంకేతం. అలాంటి స్త్రీకి రాముడి లాంటి ఆజానుబాహువు.. 96 అంగుళాల ఎత్తైన మహాపురుషుడు కండ్లముందు కనిపిస్తే ఊరుకోబుద్ధి అవుతుందా? ఎలాంటి వారికైనా మనసు చలించక మానదు కదా.. రాముడి దగ్గరకు వెళ్లి ట్రై చేసింది.. వర్కవుట్ కాలేదు. ఆ తరువాత లక్ష్మణుడి దగ్గరకూ వెళ్లింది అక్కడా కుదరలేదు. దీంతో.. సీతను చంపేస్తే.. ఓ పనయిపోతుంది. ఈ ఇద్దరూ తనవాళ్లవుతారని గట్టిగా నమ్మింది. కానీ, ఆమె ప్రయత్నాన్ని లక్ష్మణుడు విఫలం చేశాడు. కానీ, కామంతో నిండిపోయిన ఆమె ఖరదూషణులను తన కోరికకు బలిచ్చింది. అక్కడికీ సఫలం కాకపోవడంతో రావణుడి దగ్గరకు వెళ్లి సీతను ఎరగా వాడింది. తాను కోరుకున్న పురుషుడు తనకు లభించకపోతే.. ఏ స్థాయికైనా ఆ స్త్రీ దిగజారుతుందనడానికి శూర్ఫణఖ కచ్చితమైన ఉదాహరణగా చెప్పవచ్చు. ఆమె వెళ్లి సీత అందాన్ని వర్ణించింది. ఆమెను తన పట్టమహిషిని చేసుకోవాలని రావణుడిని రెచ్చగొట్టింది. ఆమెలాంటి స్త్రీ నీకు భార్యగా ఉండాలి కానీ, రాముడి లాంటి వాడి దగ్గర కష్టపడుతూ ఉండటమేమిటని రావణుడిలో కోరికను పురికొల్పింది. అంతకుముందు జనస్థాన విధ్వంసం గురించి తెలిసినా, సీతాపహరణాన్ని వద్దనుకున్న రావణుడు శూర్ఫణఖ కారణంగానే తీవ్రమైన కామోద్రేకాలకు గురయ్యాడు. వెంటనే సీతాపహరణానికి పూనుకున్నాడు. అంతకుముందు ఏ మారీచుడి మాట విని ఊరుకున్నాడో.. ఇప్పుడు అదే మారీచుడిని ఎరగా వాడి సీతాపహరణం చేశాడు. ఇక్కడ శూర్ఫణఖ రాముడిని మోహించింది. ఈ మోహావేశం తీవ్రమై తాను ఏమి చేస్తున్నానో కూడా తెలియని దశలోకి చేరుకుంది. రాముడికి అత్యంత ప్రియురాలైన సీతను చంపి తినేయాలని దూకుడుగా ముందుకు వచ్చింది. అందువల్లనే శూర్ఫణఖ ముక్కు చెవులను కోసి ఆమెను మరింత కురూపిగా మార్చేశాడు. శూర్ఫణఖ తలలో, తలంపులో మొలకెత్తిన మోహావేశం వటవృక్షంగా మార్చింది. దండకారణ్యంలో రావణుడి ఆనవాళ్లను సమూలంగా నాశనం చేయడానికి కారణమైంది. అక్కడితో ఆగకుండా ఏ సీతాపహరణాన్ని ముందుగా వద్దనుకున్నాడో.. ఆ రావణుడి చేత అదే పనిని చేయించింది. అది కాస్తా సంపూర్ణ లంకా వినాశనానికి దారి తీసింది. వేలు, లక్షలు, కోట్ల మంది రాక్షస జనాభా సమూలంగా నాశనమైపోయింది. కొన్ని లక్షల కుటుంబాలు కాలగర్భంలో కలిసిపోయాయి. ఒక జాతి వినాశనానికి శూర్ఫణఖ కారణమైంది. యుద్ధరంగంలో ఇంద్రజిత్తు కూడా చనిపోయిన తరువాత భర్తలను, అన్నదమ్ములను, కుటుంబసభ్యులను కోల్పోయిన రాక్షస స్త్రీలు ముందుగా తిట్టుకున్నది ఈ శూర్ఫణఖనే. యుద్ధకాండలోని 94వ సర్గ చదవండి.. ఈ ముసలిది, వికృత రూపము, లోతైన పొట్ట ఉన్న ఈ శూర్ఫణఖ.. సుకుమారుడు, బలశాలి అయిన రాముడి దగ్గరకు ఎందుకు పోవాలి? ఒంటి నిండా ముడతలతో వికారంగా ఉన్న ఈ శూర్ఫణక ఆ రాముడి దగ్గరకు వెళ్లి కామ మోహితురాలవడమేమిటి? ఖరదూషణాదులను చంపించడమేమిటి? అక్కడితో ఆగకుండా రావణుడిని రెచ్చగొట్టినందువల్లనే కదా.. ఇంత వినాశనం జరిగింది.. అని వాపోయారు. ‘రావణుడు ఆ శూర్ఫణఖ మూలాన ఇంత గొప్ప వైరము పెట్టుకున్నాడు. అతడు తన చావు కొరకే సీతను తెచ్చినాడు. రావణుడు జనకాత్మజయైన సీతను పొందజాలడు. బలవంతుడైన రామునితో లేనిపోని వైరము పెట్టుకున్నాడు. సీతను కోరుటచే ఒక్క రామునిచే చంపబడిన విరాధుని చూచినచో ఆ నిదర్శనము చాలదా? జనస్థానములో రాముడు అగ్నిజ్వాలల వంటి బాణాలతో, భయంకరమైన పనులు చేయు 14 వేల మంది రాక్షసులను చంపివేసింది. యుద్ధములో ఖరుడు, దూషణుడు, త్రిశిరస్సు సూర్యుని వంటి బాణాల చేత చంపబడినారు. ఆ నిదర్శనమే చాలును. యోజన ప్రమాణములైన బాహువులు కలవాడు, రక్తము ఆహారము కలవాడు అయిన క్రోధముతో అరుచుచున్న కబంధుడు చంపబడినాడు. ఈ నిదర్శనము చాలును. మహాబలశాలి, ఇంద్రుని కుమారుడు, మేఘము వంటి పెద్ద శరీరము గలవాడు అయిన వాలిని రాముడు చంపినాడు. ఆ నిదర్శనమే చాలును. మనోరథము భగ్నము కాగా దీనుడై రుష్యమూక పర్వతము మీద నివసించుచున్న సుగ్రీవునకు రాజ్యము ఇవ్వబడినది. ఈ నిదర్శనము చాలును(11-18 శ్లో.. 94వ సర్గ, యుద్ధకాండ) శూర్ఫణఖ ఎంత పని చేసిందో లంకలో రాక్షస స్త్రీలు అనుకొన్న మాటలే ఇవి. శూర్ఫణఖ చేసిన ఒక్క పని కారణంగా లంక సమస్తం సర్వనాశనమైంది.
మంథర శూర్ఫణఖల పాత్రలు చిన్నవే. రామాయణంలో ఆ పాత్రల గురించి వాల్మీకి మరింత విస్తారంగా వివరించలేదు. వివరించదలచుకోలేదు. ఎందుకంటే.. కడివెడు పాలు నాశనం కావడానికి ఒక చుక్క విషం చాలదా? అన్నట్టు ఈ పాత్రల వివరాలను అక్కడితో ముగించాడు వాల్మీకి. మన జీవితాల్లో, కుటుంబాల్లో ఇలాంటి మంథరలను, శూర్ఫణఖలను ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఒకరు సంసారంలో చిచ్చు పెడితే.. మరొకరు ఏకంగా కుటుంబాన్నే నాశనం చేసుకునే వారు.
ఇక తార గురించిన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావించాలి. తార రాజ నీతిజ్ఞత ఎలాంటిదో గతంలో ‘రామం భజే శ్యామలం’లో కొంత రాసి ఉన్నాను. అదే తారకు మరో పార్శ్వం ఏమిటో ఇదే వాల్మీకి ఎలా చెప్పాడో చూద్దాం. కిష్కింధలో వాలి సుగ్రీవులు అన్నదమ్ములు. అన్న వాలి భార్య తార. సుగ్రీవుడి భార్య రుమ. అన్న రాజుగా ఉన్నాడు. ఆయన భార్యగా, మహారాణిగా, పట్టమహిషిగా తార సకల రాజభోగాలను అనుభవించింది. హాయిగా జీవితాన్ని గడిపింది. ఒకసారి దుందుభి అనేవాడు వచ్చి వాలితో యుద్ధానికి దిగుతాడు. వాళ్లిద్దరూ పోరాడుతూ ఒక గుహలోకి వెళ్తారు. అక్కడ ఎంతోకాలం గడిచినా గుహలోంచి ఎవరూ బయటకు రాకపోయేసరికి వాలి చనిపోయాడనుకొని వచ్చి సుగ్రీవుడు కిష్కింధ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సుగ్రీవుడు రాజు కాగానే తార అతని ప్రియురాలిగా మారి.. శయ్యాసుఖం, రాజ భోగాలు అన్నీ అనుభవించింది. తరువాత మళ్లీ వాలి బతికి వచ్చాడు. సుగ్రీవుడిని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. అతడు పారిపోయి రుష్యమూకంపై తలదాచుకున్నాడు. తార యథాతథంగా వాలి అంతఃపురానికి చేరుకున్నది. ఆయన అధికారాన్ని తానూ సమానంగా అనుభవించింది. మహారాణిగా పెత్తనమూ చెలాయించింది. కొంతకాలానికి రాముడు అక్కడికి వచ్చాడు. సుగ్రీవుడితో స్నేహం చేశాడు. అతడికిచ్చిన మాట ప్రకారం వాలిని చంపేశాడు. తార గోడు గోడున ఏడ్చింది. మళ్లీ సుగ్రీవుడు రాజయ్యాడు. తార కొడుకు అంగదుడు యువరాజయ్యాడు. ఆమె జీవితంలో మార్పు ఏమీ చోటు చేసుకోలేదు. మళ్లీ సుగ్రీవుడి అంతఃపురంలో చేరి సమస్త రాజభోగాలను అనుభవించింది. అన్నదమ్ముల్లో ఎవరు రాజైనా.. రాజ్యం మాత్రం ఆమె కనుసన్నల్లో మెలిగింది. ఆమెకు వాలి చనిపోయినాడన్న దుఃఖము ఉన్నప్పటికీ.. తన రాజసాన్ని మాత్రం వదులుకోలేదు. సుఖభోగాలను సంపూర్ణంగా అనుభవించింది. శరద్రుతువు వచ్చిన తరువాత సీతాన్వేషణ ప్రారంభిస్తానని మాటిచ్చిన సుగ్రీవుడు ఆ మాట తప్పడంతో ఆగ్రహంతో సుగ్రీవుడి దగ్గరకు వెళ్లిన లక్ష్మణుడిని శాంతింపజేయడానికి తార వస్తుంది. అప్పుడు తార ఎలా ఉన్నదో చూడండి. ‘ఆ తార నేత్రములు మదము చేత వ్యాకులములై ఉండెను. ఆమె శరీరమునందు వడ్డాణము, బంగారు సూత్రములు వ్రేలాడుచుండెను. ఉత్తమ లక్షణ సంపన్నురాలైన ఆమె శరీరము కొంచెము వంగి యుండెను. అట్టి తార తొట్రుపడుతూ (తూలుచూ) లక్ష్మణుని దగ్గరకు వెళ్లెను. మహాత్ముడైన ఆ లక్ష్మణుడు తారను చూడగానే ఉదాసీనుడయ్యెను. స్త్రీ సమీపమునందు ఉండుటచేత కోపము తొలగి తల వంచుకొనెను. మద్యము సేవించి యుండుటచేతను, లక్ష్మణుని దృష్టి ప్రసన్నముగా ఉండుట చేతను ఆ తార సంకోచమును విడచి స్నేహముతో ప్రగల్భముగానున్న గొప్ప అర్థము గల బ్రతిమాలుకొననట్లున్న వాక్యమును పలికెను’ (38-40 శ్లో. 33 వ సర్గ, కిష్కింధకాండ). ఆమె లక్ష్మణుడితో మాట్లాడిన మాటలు ఆమె రాజనీతిజ్ఞతకు నిదర్శనాలు. సుగ్రీవుడి దగ్గరకు వాలి రెండోసారి వెళ్తున్నప్పుడు ఆపిన సందర్భంలోనూ.. లక్ష్మణుడితో దౌత్యనీతిని ప్రదర్శించడంలోనూ తార ప్రతిభ అనుపమానమైనది. కానీ ఈ సందర్భం తార వ్యక్తిగత వ్యక్తిత్వం గురించినది. పైన లక్ష్మణుడి దగ్గరకు వచ్చిన సందర్భంలో తార ఏ స్థితిలో ఉన్నదో గ్రహిస్తే.. తార ఏ స్థాయిలో సుఖాలను అనుభవించిందో అర్థం చేసుకోవచ్చు. తార ఎలాంటి స్త్రీయో కూడా మనకు అవగతమవుతుంది. తారలో రెండు రకాల వ్యక్తిత్వాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. మొదటిది తన రాజ్యం కోసం, తన రాజు కోసం.. ఒక రాణిగా తాను చేయవలసిన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వర్తించడం. ఆమె రాజనీతి బాగా ఎరిగినది కనుకనే.. వాలికి హితవు చెప్పగలిగింది. తెలివి గలది కాబట్టి అంగదుడిని రాజును చేద్దామని హనుమంతుడు అన్నప్పటికీ, సుగ్రీవుడి వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు కాబట్టి.. భర్తను పోగొట్టుకున్నట్టు కొడుకునూ పోగొట్టుకోకుండా.. తెలివిగా సుగ్రీవుడిని రాజును చేసి.. రాజ్యం అంతా తన కనుసన్నల్లో సాగేట్టు చేసుకున్నది. రాజకీయం అంటే బాగా తెలిసిన స్త్రీగా తారను ఈ పార్శ్వంలో మనం చూడవచ్చు.
ఇక రెండో పార్శ్వంలో తార సుఖాలను అనుభవించడానికి ఏ మార్గాన్నైనా ఎంచుకుంది. అన్నదమ్ముల్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ.. సుఖ భోగాలను అనుభవించడంతో పాటు, తన స్థాయిని కాపాడుకుంటూ వెళ్లింది. ఇవాళ నాగరక సమాజంలో సంపద, అధికారం ఉంటే.. వారి వెంట తిరిగి, రాజ భోగాలను అనుభవించే మహిళలందరికీ తార ఒక ప్రతీక.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
