[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
20
రామాయణం గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారికి దాని గురించి కనీసం అవగాహన కూడా ఉండదు. ఏదో నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంటారు. ఈ మధ్యే.. ఈ వ్యాసం రాయడానికి కొద్ది రోజుల ముందు ఫేస్‌బుక్‌లో ఒకాయన.. అతనికి జై శ్రీరావణ అవార్డు కూడా లభించిందనుకుంటా.. తమను ఎదిరించిన వారిని హతమార్చి రాక్షస సంహారమని చెప్పుకొంటారని.. ఈ విషయం రామాయణం నుంచి మొదలైందన్నట్టుగా ఎద్దేవా చేస్తూ ఓ పోస్టు పెట్టారు. అంతకుముందు దండకారణ్యంలో మావోయిస్టులను భారత భద్రతా బలగాలు మట్టుపెట్టే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న తీరును విమర్శిస్తూ పెట్టిన పోస్టు. మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టడం అంటే ఇదే. రామాయణంలో ఎవరు ఎవరిని ఎదిరించారు? ఎందుకోసం ఎదిరించారు? ఆ ఎదిరించినందుకు ఈ ఎదిరింపబడిన వారు హతమార్చారా? రామాయణం చదివిన ఏ ఒక్కరూ ఇలాంటి చెత్త మాట్లాడరు. ఒకరి ఎదిరింపునకు మరొకరు వేసిన శిక్ష కానే కాదు. ప్రపంచంలో అత్యంత భయానకంగా, నీచమైన వ్యక్తిత్వం కలిగి, నియంతృత్వానికి ప్రపంచంలోనే తొలి సింబల్‌గా మారిన ఒకానొక మూర్ఖుడిని, దుర్మార్గుడిని.. అంతం చేయడం రామాయణ లక్ష్యం. ప్రపంచంలో మొట్టమొదటి నియంత రావణుడు. నియంత ఎంతటి బలవంతుడైనా, చివరకు అతడి నియంతృత్వానికి అతడే బలికాక తప్పదు అనడానికి రావణుడు పెద్ద ఉదాహరణ. మనకు తెలిసిన ప్రపంచంలోనే నియంతలుగా పేరుపొందిన వాళ్లందరి గతి ఏమైందో చరిత్ర మీద అవగాహన ఉన్నవాళ్లందరికీ బాగా తెలిసిన విషయమే. రామాయణం అలాంటిలాంటి చరిత్ర కాదు. అన్ని సమాజాల్లో.. సార్వకాలికమైన వ్యక్తిత్వాలన్నింటికీ రామాయణం గట్టి ఉదాహరణ. రామాయణంలో కేవలం సీతారామ లక్ష్మణులు, రావణుడు లాంటి ఒకరిద్దరు వ్యక్తులు మాత్రమే కాదు.. రామాయణంలో మనకు కనిపించే ప్రతి ఒక్కరూ కూడా అత్యంత ప్రధానమైన భూమికను పోషించినవారే. క్షణకాలం కనిపించిన వ్యక్తులు కూడా వేల సంవత్సరాలు గడిచినా మన జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉన్నారు. మనం కైక, మంథర గురించి తెలుసుకున్నాం. శూర్ఫణఖ, తార, మండోదరి లాంటి వాళ్లను గురించి కూడా తెలుసుకున్నాం. వీరంతా ఒక పూట లేదా, ఒక రోజు, కొన్ని పరిమిత రోజులు మాత్రమే రామాయణంలో కనిపిస్తారు. ఆ తరువాత వారు ఎక్కడా కనిపించరు. ఎవరి వల్ల రామకథ ఎంత మేరకు ముందుకు సాగాలో అంతవరకు సాగుతూ పోతుంది. అచ్చంగా మన జీవితంలో మాదిరిగానే, ఏమీ తేడా ఉండదు. మనం పుట్టినప్పడు మనతో తల్లిదండ్రులు ఉంటారు. పెరుగుతున్న కొద్ది జీవన ప్రస్థానంలో రకరకాల వ్యక్తులు మనతో కలుస్తుంటారు. వారిలో కొందరు ఆ ఒక్క నిమిషం వరకే ఉండవచ్చు. మరికొందరు కొన్ని రోజుల పాటు మనతో కలిసి ప్రయాణం చేయవచ్చు. ఇంకొందరు కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఒకరిద్దరు మాత్రం జీవన పర్యంతం మన నీడై నడుస్తారు. వీళ్లలో చాలామంది ప్రభావం మన జీవితం మీద పడుతుంది. మన జీవితంలో అనేక మైలురాళ్లను దాటిస్తుంది. మలుపులు తిప్పుతుంది. మన జీవితమే రామాయణం. ఇంతకు మించి మరేమీ లేదు. రామాయణాన్ని ఒకసారి గమనించండి. క్షణాల వ్యవధిలో మనకు కనిపించి నిష్క్రమించే వ్యక్తులు.. ఇప్పటికీ వారి ప్రభావం చూపుతూనే ఉన్నారు. ఇదే వాల్మీకి ప్రత్యేకత. ఎవరి గురించి ఎక్కడ, ఏ మేరకు మనకు చెప్పాలో.. ఎంత చెప్పాలో అంతే చెప్పి వదిలేస్తాడు. ఆ తరువాత వారి ప్రస్తావన ఎక్కడా తీసుకొని రాడు. కానీ వారి స్వభావం ఇవాళ్టికి కూడా మనల్ని ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది.
కుంభకర్ణుడు
రామాయణంలో మనకు అత్యంత పరిచితమైన పాత్ర.. మన సమాజంలో ప్రతిరోజూ ఏదో ఒక సందర్భంలో పోల్చుకొని మాట్లాడుకునే పాత్ర కుంభకర్ణుడు. ఎవరైనా ఎక్కువసేపు నిద్రపోతే కుంభకర్ణ నిద్ర అని అంటుంటాం. అతి నిద్రకు పర్యాయపదం కుంభకర్ణుడు. కుంభకర్ణుడి ప్రస్తావన రామాయణంలో చిన్నగా అయినా.. అతడి వ్యక్తిత్వాన్ని గురించి మనం కొంత అయినా మాట్లాడుకోవాలి. కుంభకర్ణుడు పుట్టిన వెంటనే ఊళ్లమీద పడి కనపడిన వాటిని కనపడినట్టుగా భక్షించేవాడు. వాడి అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ తరువాత రావణుడితో కలిసి గోకర్ణానికి వెళ్లి తపస్సు చేసినప్పుడు మాయా ప్రభావంతో నిద్రను వరంగా కోరుకున్నాడు. దానివల్ల ప్రపంచానికి కొంత మేలు కలిగింది. తపస్సు అనంతరం లంకకు చేరి.. తనకు అనువైన ఇంటిని నాలుగు వైపులా యోజనం పొడువైన చతురస్రాకారపు భవంతినొక దానిని నిర్మించుకొని అందులో నిద్రపోతాడు. తిరిగి అతడు మనకు కనిపించేది యుద్ధకాండలో ఒక పూట మాత్రమే. మేఘనాథుడు అలియాస్ ఇంద్రజిత్తు చనిపోయిన తరువాత ఇక కుంభకర్ణుడిని లేపక తప్పలేదు. కుంభకర్ణుడు లేచిన వెంటనే విషయము తెలుసుకుని రావణుడిని తిడతాడు. బలం ఉన్నది కదా అని ఏది పడితే అది చేయకూడదని తీవ్రంగా నిందిస్తాడు. ఎవరిని అడిగి సీతను అపహరించుకొని వచ్చావని నిలదీస్తాడు. ఏది ముందు చేయాలి.. ఏది తరువాత చేయాలన్న ఇంగితం లేనివాడు రాజుగా ఎట్లా ఉండగలడు అని ప్రశ్నిస్తాడు. ‘రాజు, కార్యముల యథార్థ స్వరూపము తెలిసిన బుద్ధి జీవులైన మంత్రులతో కలిసి ఎట్లు చేసిన తనకు హితము కలుగునో ఆలోచించుకొని కార్యములు చేయవలెను. పశువుల వంటి బుద్ధి గల వారికి ఆలోచనలు చేయునప్పుడు అవకాశమిచ్చినచోవాళ్లు శాస్త్ర విషయములు తెలిసికొనకుండగా ప్రాగల్భ్యము వలన ఏమేమో చెప్పుచుందురు. శాస్త్ర జ్ఞానము లేక, అర్థ శాస్త్రము ఎరుగక అధికమైన ఐశ్వర్యమును మాత్రము కోరుచుండు అట్టివాళ్లు చెప్పిన విధముగా చేయకూడదు. ఏ మానవులు హితము వలె కనబడు అహితమును ధార్ష్ట్యము వలన ఉపదేశించుచుందురో వారిని కార్యాలోచనల నుండి దూరముగా ఉంచవలెను. కొందరు మంత్రులు పండితులైన(తెలివైన) శత్రువులతో కలిసి తమ ప్రభువునకు అపకారము చేయుచు అతని చేత చెడ్డపనులు చేయించుచుందురు. శత్రువుల నుండి లంచము మొదలైనవి తీసుకొని మారిపోయి పైకి మిత్రుల వలె కనబడు అమిత్రులైన మంత్రులను రాజు మంత్రమును నిర్ణయించు సమయమునందు వారి వ్యవహారమును బట్టి గుర్తించవలెను చపలచిత్తులై తొందరపడి పనులు చేయువారిలో ఉండు లోపాలను క్రౌంచ ఫర్వత రంధ్రములో పక్షులు ప్రవేశించినట్టు శత్రువులు తమకు అనుకూలముగా ఉండునట్టు చేసుకొనుచుందురు. శత్రువు విషయమున అనాదరము చూపుచు (తక్కువ అంచనా వేయడం) తనను తాను రక్షించుకొనని వాడు అనర్థములను పొందును. తన స్థానమునుండి దింపివేయబడును. నీకు పూర్వము విభీషణుడు చెప్పినట్టు చేయుము. మనకు అదే హితమైనది. అట్లు కానిచో నీకు ఏది ఇష్టమూ అది చేయుము’ (13-21 శ్లో. 63వ సర్గ, యుద్ధకాండ,). దుర్మార్గుడైన కుంభకర్ణుడు కూడా రావణుడి తప్పును నిలదీసేసరికి.. నువ్వేమైనా నాకు గురువువా ఉపదేశిస్తున్నావు.. అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏమిటంటే కుంభకర్ణుడికి రావణుడు చెప్పిన జవాబులో తాను పొరపాటు చేశానని అంగీకరిస్తాడు. ఆ పొరపాటును తన పరాక్రమముతో సరిచేయాలని కుంభకర్ణుడిని కోరుతాడు. ‘అనవసరంగా మాటలాడి ఎందుకు శ్రమపడుతున్నావు. ఈ సమయమున ఏది చేయుట యుక్తమో అది చేయుము. భ్రాంతి వలననో, చిత్త మోహము వలననో, బలపరాక్రమములు చూచుకొనో పూర్వము తెలియక చేసిన దానిని గూర్చి ఇప్పుడు చర్చించుట అనావశ్యకము. ఈ సమయమునందు ఏది యుక్తమో దానిని గూర్చి ఆలోచించుము. బుద్ధిమంతులు అయిపోయినదానిని గూర్చి ఆలోచించరు. గడిచిపోయినది గడిచి పోయినదే. నీకు నా యందు స్నేహమున్నచో, నీకెంతటి పరాక్రమమున్నదో తెలిసికొన్నచో ఈ నా కార్యము తప్పక చేయదగినది అని నీ మనస్సు అంగీకరించినచో నా పొరబాటు వలన కలిగిన దుఃఖమును నీ పరాక్రమము చేత సరిచేయుము. పని చేడిపోయిన దీనుణ్ణి ఆదుకొనువాడే స్నేహితుడు. నీతి తప్పిన వానికి సాహాయ్యము చేయుటకు ముందుకు వచ్చువాడే బంధువు. (22-27, 63 వ సర్గ, యుద్ధకాండ).
రావణుడి పరిస్థితి ఏమిటన్నది ఈ అయిదు శ్లోకాలు అద్భుతంగా వివరించాయి. అప్పటికి తన ప్రధాన సైన్యం, ముఖ్యమైన సేనా నాయకులంతా చనిపోయారు. ఇక తన కుటుంబం మాత్రమే మిగిలి ఉంది. ఆ కుటుంబంలో ఒక తమ్ముడు శత్రు శిబిరానికి వెళ్లిపోయాడు. మరో తమ్ముడు ఎదురుగా ఉన్నాడు. ఇక ఇంద్రజిత్తు, మరో ఆరుగురు కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకును లంకాదహనం సమయంలోనే హనుమంతుడు హతమార్చాడు. తాను చేసింది పొరపాటని అర్థమవుతున్నది. యుద్ధంలో తాను ఓటమి వైపే వెళ్తున్నానని కూడా స్పష్టంగానే తెలిసిపోతున్నది. అయినా తాను ఇంత వినాశనానికి కారణమైన తన ఈగోను మాత్రం పక్కన పెట్టలేదు. సీతను విడిచిపెట్టడానికి మనసు అంగీకరించలేదు. తాను తప్పు చేశానని తెలిసినా, సరిదిద్దుకోవాలని అంతమంది చెప్పినా సరే.. అతను మాత్రం వినాశనాన్నే కోరుకున్నాడనడానికి ఈ అయిదు శ్లోకాలు గొప్ప ఉదాహరణ. రావణుడి మాటలు విన్న తరువాత కుంభకర్ణుడికి యుద్ధానికి వెళ్లక తప్పలేదు. యుద్ధంలో శక్తివంచన లేకుండా బీభత్సమైన యుద్ధం చేశాడు. చివరకు రాముడి చేతిలో హతమవుతాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు, అనంతరం రావణుడి ఆరుగురు కొడుకులు యుద్ధానికి వెళ్లి అంతమవుతారు. ఈ ఆరుగురు కొడుకుల ప్రస్తావన యుద్ధానికి వెళ్ళేముందు మాత్రమే వస్తుంది. క్షణమాత్రమే వారి చర్చ జరుగుతుంది.
రామాయణంలో మరికొన్ని పాత్రల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలోఅత్యంత కీలకమైన పాత్ర విశ్వామిత్రుడు. ఈయన కనిపించేది చాలా చాలా కొద్ది సేపు. కానీ రామ కథలో చాలా ముఖ్యమైన భూమిక పోషించి వెళ్లిపోతాడు. తాను చేస్తున్న యాగానికి రక్షణ కోసం రామలక్ష్మణులను అయోధ్యకు వచ్చి మరీ అడవికి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన దగ్గర ఉన్న వందకు పైగా వివిధ అస్త్రశస్త్రాలను రామలక్ష్మణులకు అప్పగిస్తాడు. తాటక, సుబాహులను చంపి, మారీచుడిని వదిలిపెట్టడం ద్వారా రావణుడికి మొట్టమొదటి సంకేతం పంపించాడు. తరువాత శివధనుర్భంగం చేయించి సీతాకళ్యాణం చేయించాడు. సీతారాముల కళ్యాణం జరిగిన మరుక్షణంలో విశ్వామిత్రుడి పాత్ర రామాయణంలో అయిపోతుంది. మళ్లీ కనిపించడు.
సీతారామకళ్యాణం తరువాత ఆ క్షణంలోనే కనిపించి వెళ్లిపోయే పాత్ర పరుశురాముడు. బాలకాండ చివరలో ఇలా వచ్చి అలా వెళ్లిపోతాడు. సీతారామ కళ్యాణం అనంతరం అయోధ్యకు తిరిగి వస్తున్న దశరథుడి కుటుంబానికి తోవలో పరుశురాముడు వస్తాడు. కారడవిలో దశరథుడి బృందాన్ని నిలిపి.. శివధనుర్భంగం గురించిన చర్చతో పాటు.. తన జీవిత వృత్తాంతాన్ని కూడా చెప్పాడు. శివధనుస్సులాగానే విష్ణు ధనుస్సును అందిస్తాడు. విష్ణు ధనస్సును, శరములను అందించి వెళ్లిపోతాడు. అంతే ఆ తరువాత పరుశురాముడు మళ్లీ కనిపించడు. రామకథను ముందుకు తీసుకొని పోవటంలో ఈ ఇద్దరు కూడా చాలా ముఖ్యమైన భూమికను పోషించారు. భవిష్యత్తులో జరుగబోయే యుద్ధం కోసం కావలసిన ఆయుధ సంపత్తిని అందించారు. అక్కడితో వారి భూమిక అయిపోయింది. కానీ, వారి పాత్రలను కానీ, వారి పేర్లను కానీ ఇప్పటికీ ఎవరైనా మరచిపోగలరా? ఇదీ వాల్మీకి విద్య. వాల్మీకికి మాత్రమే అవగతమైన విద్య.
అంతెందుకు రాముడు అయోధ్య దాటిన తరువాత.. మళ్లీ పట్టాభిషేకం అయ్యేంతవరకు అయోధ్య నగరం ప్రస్తావన కానీ, రాణీవాసపు విశేషాలు కానీ మనకు ఎక్కడా కనిపించదు.
అడవికి బయలు దేరిన తరువాత ఒక్కో మజిలీలో ఒకరు కనిపించి వెళ్లిపోతుంటారు. అయోధ్యను విడిచిన వెంటనే రాముడికి మొదట కలిసిన వాడు నిషాద రాజు గుహుడు. గంగా నదిని దాటి అడవిలో ప్రవేశించడానికి ముందు సీతారామ లక్ష్మణులు మొదట విశ్రాంతి తీసుకున్నది గుహుడి దగ్గరే. అక్కడే నేలమీద పడుకొన్నాడు. గుహుడు రాముడిని తన సోదరుడిగా భావించాడు. కౌసల్య కూడా గుహుడిని తన కుమారుడితో సమానంగా చూసుకున్నది. నిషాదుడనో.. లేక మరొక పేరుతోనో జాతివర్ణ భేదాలు చూపించలేదు. గుహుడు తన సోదరుడైన రాముడి బాగోగుల గురించి లక్ష్మణుడితో ఎన్నెన్నో విషయాలు చెప్పాడు. పదునాలుగేండ్ల వనవాస కాలంలో అన్నను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో జాగ్రత్తలు చెప్పుకుంటూ వచ్చాడు. అంతే.. ఆ తరువాత గుహుడు మళ్లీ కనిపించలేదు.
ఆ తరువాత వనవాసంలో పదమూడేండ్ల కాలంలో సీతారాములు అనేకమంది మహర్షులను కలుసుకుంటూ వచ్చారు. వనవాసం మొదట కలిసింది భరద్వాజ మహర్షిని. రావణ వధ అనంతరం అయోధ్యకు తిరిగి వస్తూ కూడా చిట్ట చివరన కలిసింది కూడా భరద్వాజ మహర్షినే. సీతారామ లక్ష్మణులు ఆశ్రమం కట్టుకొని నివసించడానికి చిత్రకూటాన్ని చూపించిన వాడు భరద్వాజుడు.
భరద్వాజముని తరువాత సీతారాములు వెళ్లింది అత్రి, అనసూయల ఆశ్రమానికి. ఇక్కడ అత్రి మహాముని రాక్షసుల నుండి ఎలా దూరంగా ఉండి, సీతను కాపాడుకోవాలో రాముడికి చెప్పాడు. అనసూయాదేవి.. పండు ముదుసలి.. చిగురుటాకులా వణుకుతూ ఉన్న ఆ మహాసాధ్వి.. సీతా కళ్యాణం గురించి తెలుసుకుని.. ఆమెకు చీర, సారె పెట్టింది. అనసూయను కలిసిన తరువాత సీతలో ఒక అద్భుతమైన ధైర్యం లభించింది. అప్పటివరకూ మిథిలలో, అయోధ్యలో రాజధాని నగరంలో రాజభోగాలు అనుభవించిన సీతాదేవి.. భరద్వాజ అశ్రమం వరకూ జరిగిన ప్రయాణంలో కూడా ఎక్కడలేని అలసటను అనుభవించింది. కాలు కిందపెట్టకుండా మహారాణిలా బ్రతికిన తల్లి.. చిత్రకూటం దగ్గరకు చేరుకునేసరికే చాలా బడలిపోయింది. కానీ, కలుసుకున్న తరువాత, ఆమె ఆతిథ్యాన్ని స్వీకరించిన తరువాత మరెన్నడూ వనవాసం కష్టంగా అనిపించనే లేదు.
భరద్వాజ ముని తరువాత సీతారామ లక్ష్మణులు శరభంగుని ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ దివ్యాశ్వములతో కూడిన ఇంద్రుని రథం కనిపించింది. ఆ రథం గురించి లక్ష్మణుడితో వివరంగా చెప్పాడు రాముడు. ఆ రథం గొప్పతనాన్ని, దివ్యమైన అశ్వాలను గురించి చర్చిస్తాడు. మనం గమనించాల్సిందేమిటంటే.. రామరావణ యుద్ధ సమయంలో రాముడు ఇదే ఇంద్రుని రథంపై అథిరోహించి రావణుడిని హతమార్చాడు. ఎప్పుడో జరుగబోయే యుద్ధంలో ఉపయోగపడే రథం గురించి శరభంగ ఆశ్రమంలో కనిపించింది. శరభంగుడి ఆశ్రమంలో ఆయన తపస్సు కుప్పలు కుప్పలుగా పోగై ఉన్నదంట.. ఆ తప:ఫలమంతా ఇచ్చేస్తానని రాముడితో శరభంగుడు అన్నాడు. కానీ, ఆ ఫలాన్ని తాను సొంతంగా సాధిస్తానని రాముడు సున్నితంగా తిరస్కరించాడు. దీనితో శరభంగుడి ప్రయోజనం పూర్తయింది.
ఆ తరువాత సుతీక్ష్ణుడు ఉండే ఆశ్రమం వెళ్లి ఆయన ఆతిథ్యం స్వీకరించాడు. ఇక్కడ సుతీక్ష్ణుడు కూడా శరభంగుడి లాగానే తన తపశ్శక్తిని ధారపోస్తానన్నాడు. అక్కడా రాముడు సున్నితంగా తిరస్కరించాడు.
సుతీక్ష్ణుడి ఆశ్రమం నుంచి అగస్త్య ముని ఆశ్రమానికి వెళ్లడానికి మధ్యలో వారు శబరిని కలిశారు. ఆమె తపస్సుకు సంతోషించారు. అక్కడి నుంచి వారు ఒక ముని ఆశ్రమానికి వెళ్లారని చెప్పారు కానీ, ఆ ముని పేరును వాల్మీకి ప్రస్తావించలేదు. ఆ తరువాత అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అగస్త్యుడు రాముడికి విష్ణు ధనుస్సు, అక్షయ తూణీరాలు, ఖడ్గాన్ని బహూకరిస్తాడు. ఈ అగస్త్యుడే యుద్ధ కాండలో రాముడికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశిస్తాడు.
తరువాత పంచవటిలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న సమయంలో జటాయువు రాముడికి కలుస్తాడు. పంచవటిలో రాముడి పర్ణశాల పక్కనే జటాయువుకు కూడా ఆశ్రమ నిర్మాణం చేస్తారు. సీతాపహరణం సమయంలో రావణుడిని అడ్డుకోవడానికి జటాయువు విశ్వప్రయత్నం చేసి మరణిస్తాడు. జటాయువుకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు నిర్విహిస్తాడు రాముడు.
అరణ్య కాండ తరువాత అగస్త్యుడు మినహా మరే మహర్షీ రామాయణంలో, రామకథలో కనిపించడు. కిష్కింద నుంచి యుద్ధకాండ దాకా మనకు కనిపించేది పూర్తిగా వానర సమూహమే. మధ్యలో కబంధుడు, సంపాతి, తాటక, మైనాకుడు, సురస, త్రిజట, వంటి పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోతాయి. కానీ ప్రతి పాత్రా తన వంతు కర్తవ్యాన్ని దిగ్విజయంగా చేసుకొని వెళ్లిపోతాయి.
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
