Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రావణ రహస్యం-24

[శరన్నవ రాత్రుల సందర్భంగా శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘రావణ రహస్యం’ అనే వ్యాస పరంపరలో చివరి వ్యాసం అందిస్తున్నాము.]

24

రామాయణంలో కనిపించే వ్యక్తులు, జంతువులు, వనాలు, ఆశ్రమాలు అన్నీ కూడా సమకాలీనమైనవే కాదు.. సార్వకాలీనమైనవి. ప్రతి పాత్రా ఇవాళ్టికీ.. ఇవాళ ఉన్న సమాజంలో ఏదో ఒక వ్యక్తిత్వానికి దర్పణం పడతాయి. మన జీవితాలను ఏదో విధంగా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఈ విషయాలేవీ మనకు చెప్పరు. వాటి గురించి చర్చించరు. మాట్లాడరు. వివరించరు. కానీ రామాయణంలోని ప్రతి పాత్రా మనకు జీవితంలో ఒక పాఠాన్ని నేర్పుతుంది. విలువలను నేర్పుతుంది. రామాయణంలో మనకు సార్వకాలీనమైన భావోద్వేగాలు అడుగడుగునా కనిపిస్తాయి. మన జీవితంలో మనకు, మనలో ఎదురయ్యే భావోద్వాగాలన్నీ కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి. రామాయణం లోకంలో జరిగింది కాబట్టే, మిథ్య కాదు కాబట్టే.. మానవ జీవితంలోని ప్రతి ఒక్క ఉద్వేగమూ.. రాముడితో సహా ప్రతి పాత్రలోనూ మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే.. నవరసాలు రామాయణంలో ప్రతిఫలిస్తాయి. పెద్దలు, పండితులు అందరూ రామాయణం కరుణ రస ప్రధానమైనదని రుజువుచేశారు. అయితే, మనకు ఇందులో నవ రసాలు కూడా కనిపిస్తాయి. వీటన్నింటి గురించి క్లుప్తంగానే రెండుమూడు వాక్యాల్లో వివరించే ప్రయత్నం చేస్తా.

భావోద్వేగాల విషయానికి వస్తే.. రామాయణంలో దాదాపు అన్ని పాత్రలూ.. ఏదో ఒక సందర్భంలో అనుమానంతో బాధపడుతుంది. బాల కాండ మొదలుకొని.. యుద్ధకాండ వరకూ ఇలాంటి దృష్టాంతాలు మనకు ఎన్నో కనిపిస్తాయి. కైకేయికి సుఖం దక్కకపోతే.. ఆమె కొడుకు రాజు కాకపోతే.. తన బతుకు బానిస బతుకు అయిపోతుందని మంథర అనుమానిస్తుంది. ఈ అనుమానమే పెనుభూతమై రాముడిని వనవాసందాకా పంపించింది. వనవాసానికి సీతను వద్దని వారించినప్పుడు భరతుడి ముందు తనను పొగడవద్దని రాముడు హెచ్చరిస్తాడు. రాజ్యం చేతికి వచ్చి చక్రవర్తి అయితే మనిషి మారిపోతే.. తన భార్యకు సమస్యాత్మకం అవుతుందని రాముడు అనుమానిస్తాడు.

అడవిలో చిత్రకూటంపై ఆశ్రమాన్ని నిర్మించుకున్న తరువాత రాముడిని కలవడానికి ససైన్యంతో వచ్చిన భరతుడిని చూసి, యుద్ధానికి వచ్చాడని లక్ష్మణుడు అనుమానిస్తాడు. చిత్రకూటంపై రాముడు వచ్చిన తరువాతే రాక్షసుల దాడులు పెరిగాయని అక్కడ రుషులు అనుమానిస్తారు. వాళ్లంతా చిత్రకూటాన్ని వదిలేసి వెళ్లిపోతారు. వెళ్తూ వెళ్తూ రాముడికి చెప్పి మరీ వెళ్తారు.

మాయలేడిని తీసుకురావడానికి వెళ్లినప్పుడు మారీచుడు హా లక్ష్మణా, సీతా.. అని మారీచుడు అరచినప్పుడు అన్నగారి రక్షణ కోసం  సీత లక్ష్మణుడిని వెళ్లాలని కోరుతుంది. అందుకు లక్ష్మణుడు నిరాకరించినప్పుడు అతడిని సీత తీవ్రంగా అనుమానిస్తుంది. ఆగ్రహంతో మందలిస్తుంది. తప్పనిసరిగా లక్ష్మణుడు సీతను ఆశ్రమంలో ఒంటరిగా వదిలేసి వెళ్లాల్సి వస్తుంది. సీతాపహరణం తరువాత ఆశ్రమం దగ్గర జటాయువు రక్తంతో తడిసి ఉండటం చూసి ఏదో బలమైన పక్షి తన భార్యను మింగేసి ఉంటుందని రాముడు అనుమానిస్తాడు.

రుష్యమూకంపై తలదాచుకున్న సుగ్రీవుడు, రామలక్ష్మణులను చూసి తన అన్న వాలి పంపించిన ఏజెంట్లుగా అనుమానిస్తాడు. ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి హనుమంతుడిని వారి దగ్గరకు పంపిస్తారు. వాలి చేతిలో సుగ్రీవుడు చావు దెబ్బలు తిని కూడా తిరిగి యుద్ధానికి రావడంతో వాలి భార్య తార తీవ్రంగా అనుమానిస్తుంది. వాలిని వెళ్లవద్దని వారిస్తుంది కూడా. సీతాన్వేషణకు దక్షిణం వైపు పంపించిన వానరసేనకు అంగదుడిని చీఫ్‌గా చేసినప్పటికీ, హనుమంతుడిని ఆ టీమ్‌లో సుగ్రీవుడు చేరుస్తాడు. అంగదుడు తిరుగుబాటు చేస్తాడేమోనన్న అనుమానం అతనిలో బలంగా ఏర్పడింది. అతను ఊహించినట్టుగానే అంగదుడు సముద్ర తీరంలో స్వయంప్రభ వనంలో తిరుగుబాటు ప్రయత్నం చేసి విఫలమవుతాడు. లంకా ద్వీపానికి చేరుకున్న తరువాత సీత హనుమంతుడిని మొదట రావణుడి ఏజెంట్‌గా అనుమానిస్తుంది.

సీతను రాముడికి అప్పజెప్పాలని విభీషణుడు రావణుడికి సలహా ఇచ్చినప్పుడు అతడి ఉద్దేశాన్ని రావణుడు అనుమానిస్తాడు. తీవ్రంగా కోపం వచ్చి వెళ్లగొడతాడు. విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చినప్పుడు సుగ్రీవుడు, ఇతరులు అనుమానిస్తారు. యుద్ధరంగంలో రాముడి చేతిలో చావుదెబ్బలు తిన్న తరువాత తనను సేఫ్ ప్లేస్‌కు తరలించిన సారథిని రావణుడు అనుమానిస్తాడు. కోవర్టేమోనని అనుకుంటాడు.

ఒక్క అనుమానం అనే ఒక భావోద్వేగం రామాయణంలో ఇంతగా వచ్చిందంటే.. ఇతర భావోద్వేగాలు ఏ రకంగా ఉన్నాయో ఊహించుకొండి..

ఇంకో ఉదాహరణ క్లుప్తంగా ..

కోరరాని కోరికలు కోరినందుకు దశరథుడు కైకను నిందిస్తాడు. వనవాసానికి తీసుకొని పోనందుకు సీత రాముడిని నిందిస్తుంది. అన్నను అడవులకు పంపినందుకు భరతుడు తల్లి కైకను నిందిస్తాడు. ఒక ఆడుదాని మాటను విని చెప్పిన మాటలు వినే కొడుకును కాలదన్నుకున్నందుకు రాముడు తండ్రి దశరథుని నిందిస్తాడు. సీతాపహరణానికి ముందు లక్ష్మణుడిని సీత నిందిస్తుంది. కిష్కింధలో సీతాన్వేషణ ప్రారంభించనందుకు లక్ష్మణుడు సుగ్రీవుని నిందిస్తాడు. సీతాన్వేషణ మార్గంలో అంగదుడు సుగ్రీవుని నిందిస్తాడు. లంకలో విభీషణుడు, కుంభకర్ణుడు, మండోదరి వివిధ సమయాల్లో రావణుడిని నిందిస్తారు. ఇదంతా నింద అనే భావోద్వేగానికి సంబంధించింది.

రామాయణంలో రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు ఇలా ఏ ఒక్కరూ మానవాతీతమైన శక్తులను ప్రదర్శించలేదు. మానవాతీత భావోద్వేగాలని మించి ప్రవర్తించలేదు.

ఈ ఉద్వేగాలన్నీ కూడా సార్వకాలికమైనవి. సార్వత్రికమైనవి. వీటికి అతీతంగా వాల్మీకి పోలేదు. మనందరిలోనూ ఈ భావోద్వేగాలే ఉన్నాయి.. ఉంటాయి.. సందర్భానుసారం ప్రదర్శితమవుతుంటాయి కూడా. నిర్వేదం, అలసట, అసూయ, విద్వేషం, కామోద్రేకం, స్నేహం, వాత్సల్యం, ప్రేమ.. ఒకటేమిటి సమస్తం రామాయణంలో మనకు అద్భుతంగా ఆయా పాళ్లలో సమ్మిళితమై కనిపిస్తాయి. యుద్ధకాండలో ఒక చోట రాముడు –

యతః కాంతి తాం స్పృష్ట్వా మమపి స్పృశా
త్వయి మే గాత్ర-సంస్పర్శశ్ చంద్రే దృష్టి-సమాగమః
(6వ శ్లోకం, 5 వ సర్గ, యుద్ధకాండ)

ఓ గాలీ! నా ప్రియురాలు ఉన్నవైపు నుండి ఇటు వీయుము. ఆమెను స్పృశించి నన్ను కూడా స్పృశించుము. నీ ద్వారా నాకు నా ప్రియురాలి శరీరము స్పర్శ లభించును – అని అన్నాడు. ఎంత అందమైన శృంగార భావన ఇది. కాళిదాసు మేఘ సందేశానికి ఇది మూలమే కదా..

ఇలాంటి ఉద్వేగభరిత సన్నివేశాలను ఎన్నింటినో మనం రామాయణంలో చూస్తాం. ఆ రకమైన ఉద్వేగాలన్నీ కూడా ఇవాళ్టికీ.. ఎప్పటికీ మన సమాజంలో ప్రతి మనిషిలో కలిగేవే. వీటిలో వేటికీ మనం అతీతులం కాదు. వాటిని దాటి మనం వెళ్లలేము కూడా. అంతెందుకు.. మనమే ఒకసారి రాముడిలా, సీతలా, సుగ్రీవుడిలా, మండోదరిలా, లక్ష్మణుడిలా ప్రవర్తిస్తుంటాం. ఈ పాత్రల ఛాయలన్నీ కూడా మన సమాజంలో ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. అందుకే వాల్మీకి అంటాడు..

యావత్ స్థాస్యంతి గిరయ: సరితశ్చ మహీతలే
తావత్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి
(బాలకాండ, 2వ సర్గ, 35 శ్లో)

భూమిపై పర్వతాలు, నదులు, ఉన్నంతకాలం రామాయణం ఈ భూమండలంపై తిరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే అది మిథ్య కాదు కాబట్టి. చరిత్ర కాబట్టి.

రాముడు నిజమైన జాతీయ సమైక్యతావాది

వీటన్నింటినీ గమనించినప్పుడు మనకు రెండు విషయాలు అర్థమవుతాయి. రాముడికి కలిసిన వ్యక్తులంతా.. ఆయనకు అడుగడుగునా సహాయం చేసిన వారే.. కొందరు మాటల ద్వారా, ఎక్కువమంది ఆయనకు కావాల్సిన ఆయుధాలను సమకూర్చడం ద్వారా సహాయపడ్డారు. గుహుడు, భరద్వాజుడు, అత్రి, అనసూయ, అగస్త్యుడు, శరభంగుడు, సుతీక్ష్ణుడు, విరాధుడు, విభీషణుడు, శబరి, హనుమంతుడు, సుగ్రీవుడు, జటాయువు, సంపాతి, మైనాకుడు, సాగరుడు, భరత శతృఘ్నులు, అయోధ్యలోని ప్రతి పౌరుడు.. రాముడి వెంటే.. రాముడిని అనుసరించే ఉండాలని బలంగా కోరుకున్నారు. వానరులు రాముని మద్దతుదారులని తెలిసిన సంపాతి.. సంతోషిస్తాడు. తన కంటి బలంతో, మానసిక దృష్టికోణంతో రాముడికి సీతాన్వేషణలో సహాయం చేస్తాడు. ప్రతి జీవి కూడా రాముడికి సహాయం చేయాలని సంకల్పించింది. అందుకే ఇందుకు అనుగుణంగా అనేక జానపదకథలు కూడా వచ్చాయి. అందులో ఒకటి సేతు నిర్మాణంలో ఉడత వచ్చి రాముడికి సాయం చేయడమనేది. శ్రీరాముడు సూర్యవంశానికి చెందిన రాజు. సూర్యుడు లేకుండా ప్రపంచం ఎలా ఉండలేదో.. రాముడు లేకుండా ప్రపంచం ప్రశాంతంగా ఉండదు. దేశవ్యాప్తంగా అన్ని రంగాల ప్రజలు ఆయనను హృదయపూర్వకంగా స్వాగతించారు. భారతదేశమంతటా విస్తరించిన వీరినందరినీ ఏకం చేసిన వాడు రాముడు ఒక్కడే.. ఇవాళ్టికి కూడా.

కానీ, అదే సమయంలో రావణుడి విషయంలో ఏ ఒక్కరు కూడా అతని వెంట నడవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టపడలేదు. రావణుడి విషయం దగ్గరకు వచ్చేసరికి రెచ్చగొట్టిన శూర్ఫణఖ, ఆయనకు భయపడిన మంత్రులు తప్ప అతడి చర్యలను సమర్థించినవారు లేనేలేరు. శూర్ఫణఖ తన పగ తీర్చుకోవడానికి మాత్రమే సీతాపహరణాన్ని సమర్థించింది. మిగతా మంత్రులు రావణుడికి భయపడి.. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న సూత్రాన్ని ఆరోజే అనుసరించి అతడి చర్యలు సమర్థించారు. కానీ నిజానికి అతడి హితులు, సన్నిహితులు, బంధువులు, చివరకు మామగారు, భార్య కూడా ఆయన చర్యలను ఎక్కడా, ఏ కోశానా సమర్థించలేదు. తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. కానీ, మన కమ్యూనిస్టులు, హేతువాదులు, రావణ భక్తులు, అరస, విరస, కురస, నీరస మేధావులందరూ మాత్రం రావణుడి చర్యలను సమర్థిస్తుంటారు. పొగుడుతుంటారు. పూజలు చేస్తుంటారు.

కావ్య సౌందర్యశాస్త్రం వాల్మీకి రామాయణంతోనే మొదలైందేమో భాషాలంకార శాస్త్రవేత్తలు చెప్పాలి. రసధ్వని, ఔచిత్య విచారం, వక్రత, అలంకారాలలో మాస్టర్ పీస్‌గా రామాయణాన్ని పేర్కొనాలి. రామాయణం అనేది కవిత్వ ప్రథమ పద్ధతి. సాధారణ వ్యవహారిక భాష కావ్యంలో ప్రవేశించి అనేక జీవితాన్ని ఉద్వేగంగా ప్రకటించే దశకు చేరుకున్నప్పుడు ఆ భాష మరింత సుసంపన్నమవుతుంది. అందుకే కావ్యం రాసే కవులకు వాల్మీకి తేలికగా వేసిన  గొప్ప మార్గం రామాయణం అని కాళిదాసు చేసిన ప్రకటన అక్షర సత్యం. రామాయణాన్ని పరిశోధించిన స్కాలర్లు.. అందులోని ఎన్నో విశేషాలను వెలికి తీశారు. అనుప్రాసలు, శబ్దాలంకారాలు కాకుండా దాదాపు 30 వేర్వేరు అర్థాలంకారాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు. వీటిలో ఉత్తమమైనవి కిష్కింధ, సుందర, అయోధ్యకాండల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అయోధ్యకాండ అంతా భావోద్వేగాలతో సున్నితంగా సాగితే.. యుద్ధ కాండ అంతా వివిధ ఘటనతో బీభత్సంగా సాగుతుంది. ఉత్తరకాండలో ఇలాంటి అలంకారాలు ఉండవు. ఉన్నా చాలా తక్కువ. ఎందుకంటే.. అది తరువాతి కాలంలో రామాయణానికి బలవంతంగా అతికించింది కాబట్టి. ఇతిహాసానికి అవసరమయ్యే పద్ధెనిమిది వర్ణనలు అంటే రుతువులు, రాత్రి, చంద్రోదయం, వేట, రాజ్యం, యుద్ధం, ప్రేమ ఇలాంటివన్నీ కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి.

రామాయణం సంగీతానికి అనుగుణమైన ఇతిహాసం. ఇందులోని అక్షర సౌందర్యం, అలంకారాలు, అనుప్రాసాలు, శబ్ద వైచిత్రి వల్ల పాడుకోవడానికి శ్రావ్యంగా ఉంటుంది. అంతే కాదు, రామాయణంలో మహిళలు మాత్రమే నిర్వహించే నృత్య, నాటక బృందాల గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. నటులు, గాయకుల ప్రస్తావన కనిపిస్తుంది. అటు భరద్వాజాశ్రమంలో బిల్వ వృక్షాలు మృదంగం వాయిస్తుంటాయి. భిభీతక వృక్షాలు కర్రలుగా మారుతాయి, అశ్వత్థ చెట్లు నృత్యకారులుగా మారుతాయి. మనకు మధ్య యుగాలలో పేర్కొన్న శ్యామ్ రాస్ లీల, నుంచి ఇప్పుడు మన దేశంలో ప్రసిద్ధి చెందిన దాండియా రాస్, కోలాటం వంటివాటికి ఇది ప్రతీక. లంకలోని రావణుడి అంతఃపురంలోనూ మనకు సంగీత వాయిద్యాలు కనిపిస్తాయి.

హనుమంతుడి కళ్లతో రావణుడి ఆధీనంలో ఉన్న పుష్పక విమానం దాని సౌందర్యం, నైపుణ్యం, శిల్పకళను మనం చూస్తాం. పుష్పకాన్ని చూసినప్పుడు దాన్ని హంసలు మోస్తున్నాయా అని అనిపించిందిట హనుమంతుడికి. దాని చుట్టూ రత్నములు పొదిగి ఉండి వాటి కాంతులచేత ప్రకాశిస్తున్నది. వజ్రవైఢూర్యములతో, పగడములతో పక్షులు, మాణిక్యాలతో సర్పాలు, గుర్రాల శిల్పాలను చెక్కారు. దాని రెక్కలు విలాసంగా ఉన్నాయట. పుష్పకమే కాదు, అయోధ్య, కిష్కింధ, లంక నగరాల వర్ణన, అందులోని భవనాల వర్ణన, రామ రావణ భవంతుల వర్ణన భారతీయ వాస్తు, నిర్మాణ శాస్త్రాలకు అద్దం పడుతుంది.

అనాడు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజల వంటల వివరాలు కూడా మనకు కనిపిస్తాయి. పిండివంటల దగ్గరి నుంచి మాంసాహారం వరకు అనేక వంటకాల గురించిన చర్చ సంగ్రహంగా రామాయణంలో కనిపిస్తుంది.

ధర్మం.. ఆచరణ

ఇక రామాయణంలో సాంస్కృతిక, ధార్మిక పరమైన అంశాలు తప్పనిసరిగా చర్చించుకోవాల్సినవి. రామాయణేతిహాసంలో సనాతన ధర్మం అన్న మాట అనేక చోట్ల వినిపిస్తుంది. మన సమాజానికి అనాది కాలం నుంచి మూలంగా ఉన్న పురుషార్థాల కళాత్మక వివరణ రామాయణం అని చెప్పవచ్చు. మహాభారతం మాదిరిగా రామాయణం మనకు పాఠాలు బోధించదు. రామాయణంలో అసలు బోధన స్వభావమే రామాయణంలో ఉండదు. మనం ఎలా ఉండాలో.. మన నడక, నడత ఎలా ఉండాలో  సీతారాములు తాము స్వయంగా ఆచరించి చూపించారు. యజ్ఞ, దాన, తపస్సులు అన్ని సామాజిక వర్గాల వారు ఎలా నిర్వహించారో వివరించింది. శబరి తపస్సు, మహర్షుల యజ్ఞయాగాదులు, అయోధ్యలో దానధర్మాలు ఇవన్నీ మనకు స్పష్టంగా గోచరిస్తాయి.

బాలకాండలో మంత్రుల ఎంపిక, వారి బాధ్యతలు దశరథుడు చెప్పిన రాజనీతి, అయోధ్యకాండలో రాముడు భరతుడికి చెప్పిన రాజనీతి కానీ, అరణ్యకాండలో శూర్ఫణఖ, మారీచుడు రావణుడితో మాట్లాడిన సందర్భంలో కానీ, కిష్కింధ కాండలో తార వాలి, లక్ష్మణుడితో మాట్లాడిన సందర్భంలో కానీ, యుద్ధ కాండలో విభీషణుడు, కుంభకర్ణుడు లాంటి వారు రావణుడితో మాట్లాడిన సందర్భంలో కానీ.. పాలకులు ఎలా ఉండాలి.. పరిపాలన ఎలా చేయాలి.. మంత్రులు ఎవరుండాలి.. వారి బాధ్యతలు ఏమిటి, సమాజంలో నాలుగు వర్ణాలకు సంబంధించిన ప్రజలు ఏవిధంగా జీవించాలి. నైపుణ్యం అధికంగా ఉన్న ప్రజలను ఎలా వాడుకోవాలి.. తక్కువ నైపుణ్యం కలిగిన ప్రజలను ఏ పనులకు నియోగించాలి, నిఘా వ్యవస్థ ఎలా ఉండాలి? రాజుతో సహా ప్రతి పౌరుడి బాధ్యత వ్యక్తిగత స్థాయిలో ఎలా ఉండాలి? సామాజిక స్థాయిలో ఎలా ఉండాలో అక్షరమక్షరం చాలా స్పష్టంగా, సూటిగా రామాయణం మనకు చెప్తుంది.

రామాయణంలో విశ్వామిత్రుడితో రాముడు బయలుదేరినప్పుడు గురుభక్తి ప్రస్తావన వస్తుంది. విశ్వామిత్రుడి యాగరక్షణ అన్నది రామ లక్ష్మణులకు ఒకవిధంగా చెప్పాలంటే ఇంటర్న్‌షిప్ లాంటిది. గురుశిష్య సంబంధం, దేవుడు, భక్తుడి సంబంధం కూడా మనకు భారతీయ సంప్రదాయంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఉదాహరణకు భారతదేశంలో రాముడి కంటే ఎక్కువగా హనుమంతుడి ఆలయాలు కనిపిస్తాయి కానీ.. లవకుశుల ఆలయాలను ఎక్కడైనా చూశామా? భక్తుడు తన అపారమైన భక్తిచేత తానే భగవంతుడిగా ట్రాన్స్‌ఫామ్ అవడం మనం హనుమంతుడిలో చూడవచ్చు. మహాభారతంలోనూ ద్రోణాచార్యుడు అర్జునుడి గురుశిష్య బంధాన్ని చెప్పినట్టుగా దృష్టద్యుమ్యుడి గురించి చెప్పగా విన్నామా? భారతదేశంలో గురుకుల విద్య, గురుశిష్య పరంపర అనూచానంగా వస్తున్నది.

మనకు బాలకాండలో సీతారాముల కల్యాణం సందర్భంలో వివాహ ఆచారాన్ని వివరిస్తాడు. వివాహంలో అగ్నిహోత్రంతో పాటు గంధ పుష్పాలు, బంగారు పాలికలు (మనం ఇప్పుడు మట్టి పాలికలను వాడుతుంటాం) అంకురములు గల రంధ్రములతో కూడిన కుంభములు(కుండలు) అంకురములతో నిండిన మూకుళ్లు, ధూపముతో కూడిన ధూప పాత్రలు, శంఖాకారములైన పాత్రలు, స్రుక్కులు, స్రువములు, అర్ఘ్యోదకము నింపిన పాత్రలు, పేలాలు నింపిన పాత్రలు, సంస్కరించిన అక్షతలు నిండిన పాత్రలు.. ఇవన్నీ సీతారాముల వివాహములో వినియోగించారు. పాణిగ్రహణము చేయించడము, అగ్ని ప్రదక్షిణ వంటి కార్యక్రమాలను గురించి కూడా మనం రామాయణంలో పేర్కిన్నారు.

ప్రకృతిని ప్రేమించడం అంటే, సీతారాములను చూసి నేర్చుకోవాలన్నంతగా మనకు రామాయణం చెప్తుంది. నదులు, చెట్లు, పర్వతాలు, జంతువుల పట్ల వారు ప్రదర్శించిన గౌరవం అపూర్వం. గుహుడి దగ్గరి నుంచి వనంలోకి ప్రవేశించడానికి నౌక ఎక్కే ముందు నౌకారోహణ మంత్రాన్ని పఠిస్తారు. ముందుగా సీతను, ఆ తరువాత లక్ష్మణుడు, చివరగా రాముడు నౌకలోకి ప్రవేశిస్తారు. పంచవటిలో ఆశ్రమ నిర్మాణం జరిగిన తరువాత గృహప్రవేశం చేస్తారు. యుద్ధభూమిలో ఇంద్రుడు రథాన్ని పంపించినప్పుడు దాని చుట్టూ ప్రదక్షిణం చేసి మరీ రథాన్ని అథిరోహిస్తాడు రాముడు.

రామాయణ కాలంలో అనేక ఆరాధనా పద్ధతులు, ఆచారాలను మనం చూడవచ్చు. చిత్రకూటం దగ్గరకు భరతుడు వచ్చి తండ్రి మరణ వార్త చెప్పిన తరువాత రాముడు తన తండ్రికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తాడు. సీతను కాపాడే సందర్భంలో మరణించిన జటాయువుకు రాముడు స్వయంగా ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు. అయోధ్య కాండలో కౌసల్య అగ్నిహోత్రం చేయడం, పట్టాభిషేక కార్యక్రమానికి ముందు సీత నారాయణుడికి పూజ చేయడం కనిపిస్తుంది. అత్యంత కీలకమైన విషయమేమిటంటే.. సుందరకాండలో సీతను అన్వేషించడానికి లంకకు వెళ్లిన హనుమంతుడు.. అశోకవనంలో ప్రవేశించి అక్కడ సెలయేటి దగ్గర నిలుచుని.. ఎక్కడా కనిపించని సీత.. కనీసం సంధ్యోపాసన కోసమైనా ఈ పవిత్ర జలం దగ్గరకు వస్తుందేమోనని ఆశించాడు. సీత సంధ్యోపాసన చేసినట్టుగా ఈ ఉదంతం మనకు చాలా స్పష్టంగా చెప్తుంది. స్త్రీలు సంధ్యోపాసన చేయకూడదని మన శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఊహించుకొని ఇన్నాళ్లూ ప్రచారం చేస్తూ వచ్చిన మన చరిత్రకారులనబడే వారికి ఈ రామాయణం చదివితే ఏవి పాలో, ఏవి నీళ్లో అర్థమవుతాయి. యుద్ధకాండలో రాముడు సంధ్యావందనం చేస్తాడు, లంకలో బ్రహ్మరాక్షసులు కూడా వేదాలు పఠిస్తున్న విషయాన్ని హనుమంతుడు గమనించాడు. యుద్ధకాండలో ఇంద్రజిత్తు నికుంభిల హోమం చేస్తాడు. అగస్త్యుడి ఆశ్రమ వర్ణనలో బ్రహ్మ, అగ్ని, విష్ణు, మహేంద్ర, సూర్య, సోమ, వాయు దేవతల ఆరాధనా ప్రాంతాలు ఉన్నట్టు గమనించవచ్చు. వసంత, వర్ష, శరత్, హేమంత కాలాలలో ప్రజలు పండుగలు జరుపుకున్నట్టుగా బాల, అయోధ్య, కిష్కింధ కాండల్లో గమనించవచ్చు.

ఎవరి దగ్గర ఎలాంటి భాష వాడాలి? ఏ విధంగా ప్రవర్తించాలి అన్న సూక్ష్మమైన అంశాలు కూడా మనకు రామాయణంలో కనిపిస్తాయి. రామలక్ష్మణులను మొదటి సారి కలిసినప్పుడు హనుమంతుడు మాట్లాడిన తీరు.. ఆతని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ఆ తరువాత లంకలో సీతను కలిసిన తరువాత ఆమెతో ఎలా మాట్లాడాలో ఒకటికి రెండు సార్లు హనుమంతుడు ఆలోచిస్తాడు

యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్
రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి
వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణమ్

అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్య మర్థవత్
మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయ మనిందితా  
(17,18 శ్లో, 30 వ సర్గ సుందరకాండ)

నేను పండితుడిలా (సంస్కృతమైన భాషలో సంస్కృతం కాదు. సంస్కృతమైనది) మాట్లాడితే సీత నన్ను రావణుడనుకొని మరింత భయపడుతుంది. ఒక వానరుడు ఇలా మాట్లాడతాడేమని అనుమానిస్తుంది. అందువల్ల నేను సామాన్య ప్రజలు మాట్లాడే భాషలో మాట్లాడతాను అని అనుకున్నాడు.. ఇంత స్పష్టంగా మాట్లాడే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలన్న సందేశాన్ని మనకు హనుమంతుడు ఇస్తున్నాడు. మన సామాజిక జీవితానికి సంబంధించి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి ఒక్క అంశంతో రామాయణం ముడిపడి ఉంది. కాబట్టే రామాయణం భూమి ఉన్నంతకాలం మనతో ఉంటుంది. మనతోనే ఉంటుంది.

వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే।
వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా॥

వేదములు తెలియజేసిన పరమపురుషుడైన పరబ్రహ్మ దశరథుడి కుమారుడిగా పుట్టాడు.. వేదము వాల్మీకి వలన రామాయణ రూపములో అవతరించింది అని దీని అర్థం. నా మాటలో చెప్పాలంటే.. శ్రీరామచంద్రుడి సగుణ రూపాన్ని స్వీకరించిన నిర్గుణ పరమాత్మ, పరబ్రహ్మ సమస్త విశ్వానికి ఆధారం అయితే.. సగుణ రూపంలో మనముందున్న శ్రీరామచంద్రుడు మన దృశ్య ప్రపంచానికి ఆధారం.

(సమాప్తం)

Exit mobile version