“రియాలిటీ చెక్” అని హెడ్డింగ్ రాసి పెట్టి పెన్ మూసేసి సిగ్గు పడింది గాయిత్రి. నేనేమన్నా రచయితనా రాయడానికి ? అని నవ్వేసుకుంది కూడా! ఈ బలవంతపు రచన వెనకున్న కథా క్రమం ఏంటంటే…
గాయిత్రి కొడుకు ఆర్య భీమవరం టౌన్లో ఎనిమిదో క్లాస్ చదువుతున్నాడు. ఒక్కడే కొడుకు కావడంతో వాళ్ళుండే గ్రామం అక్కడికి ఇరవై మైళ్ళు ఉండడంతో హాస్టల్లో చేర్చి మంచి స్కూల్లో ఇష్టంగా చదివిస్తున్నాడు భర్త సుబ్రహ్మణ్యం. కారణం ఆ స్కూల్ అతని మిత్రులు పెట్టిందే. అక్కడ ప్రత్యేకత ఏంటంటే మోరల్ సైన్స్ టీచర్ని పెట్టి, వారానికి రెండు క్లాస్‌లు నీతికి సంబంధించిన సబ్జెక్టు చెప్పిస్తారు. అతను స్టూడెంట్స్‌కి చక్కని ప్రవర్తన, మంచితనం, సామాజిక బాధ్యత గురించి అవగాహన కల్పిస్తాడు. చిన్న క్లాస్ పిల్లలకి నీతి కథలు, పంచతంత్ర కథలు, చందమామ కథలు, పెద్ద క్లాస్ పిల్లలకి భారత భాగవతాలు, ఖురాన్, బైబిల్ వంటి గ్రంధాల పరిచయం ఇంకా ఉన్నత వ్యక్తిత్వ వికాసం కోసం సూచనలు లాంటివి చెబుతాడా టీచర్. పరీక్ష ఏమీ ఉండదు. తమ పిల్లల్ని ఇలాంటి స్కూల్లో చదివించాలని మిత్ర బృందం అనుకునే ఆ స్కూల్ స్థాపించారు.
ఆర్య నిన్న రాత్రి ఫోన్ చేసాడు తల్లికి. “అమ్మా! మా మోరల్ సైన్స్ టీచర్ సత్యమే పలకాలి అని ఒక కాన్సెప్ట్ చెప్పారు. అయితే ఈ రోజుల్లో అందరం అలవాటుగా అబద్దాలాడుతున్నామట. మాట్లాడే మాటలేవీ సహజమైనవి కాదట. ఎవరికో భయపడో, లాభం కోసమో, స్వార్థం కోసమో మాట్లాడతామట. మనసులో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడతామట.
కావాలంటే మీ అమ్మగారిని ఒక రోజంతా ఏమనుకున్నారో, ఏం మాట్లాడారో అబద్దం లేకుండా రాయించి తెమ్మన్నారు. నువ్వొకరోజు జరిగిన విషయాలూ, నువ్వు మాట్లాడిన మాటలూ రాసి పెట్టమ్మా! ఆదివారం వచ్చినప్పుడు తీసుకు వెళ్తాను” అన్నాడు. అదీ సంగతి.
బాగా అలోచించిన తర్వాత ‘నిజంగా జరిగిందే రాస్తాను. నన్నెవరూ చంపెయ్యరుగా! అదసలే మోరల్ క్లాస్. పిల్లలకి నిజాయితీ నేర్పించాలి కదా!’ అనుకుందామె. ఆ మర్నాడు జరిగిందంతా ఆ రోజు రాత్రి కూర్చుని ఇలా రాసింది గాయిత్రి.
ఉదయం ఎనిమిది గంటలకి కాలింగ్ బెల్ విని తలుపు తీసింది గాయిత్రి. ఎదురుగా పనమ్మాయి రుక్కీ చక్కగా తయారై తలలో పూలతో నవ్వుతూ నిలబడింది. ఒక రోజు సెలవు కావాలి ఊరికి వెళతానని చెప్పి నాలుగు రోజులు మానేసిన రుక్కీని చూస్తూనే వళ్ళు మండి, ‘ఏమ్మా తల్లీ ! నాలుగు రోజులై మానేసి ముస్తాబై వచ్చావా?‘ అని అనాలనుకుని ఆ మాటల్ని మింగేసింది గాయిత్రి. అలా గనక అంటే గిరుక్కున వెనక్కి తెరిగి వెళ్లిపోగలదు రుక్కీ, దాని గిరాకీ అలాఉంది.
“వెళ్లిన వెంటనే పని కాలేదా రుక్కీ?” మొహాన నవ్వు పులుముకుంటూ అంది గాయిత్రి. “అవునమ్మా” అంటూ గిన్నెలు తోమి గదులు తుడిచి చేసుకుని వెళ్ళిపోయింది రుక్కీ.
సుబ్రమణ్యం మధ్యాన్నం భోజనానికి వచ్చి తిరిగి వెళుతూ, పనమ్మాయి జీతం ఇస్తూ “ఎన్ని రోజులు మానేసిందో అన్ని రోజులూ తగ్గించి ఇవ్వు” అన్నాడు. “ఒక్క రోజే లెండి పాపం” అంటూ అబద్ధమాడింది గాయిత్రి. అలా అనక పొతే ‘ఇంకో అమ్మాయిని పెట్టుకో ’ అంటాడు. దొరకలేదంటే ‘నువ్వే చేసుకో‘ అంటాడు. జీతం తగ్గించి ఇస్తే ఆ మహాతల్లి మానేస్తుంది మరి.
ఇంతలో గాయిత్రి అమ్మమ్మ నుంచి ఫోన్. “ఏమే! భడవా! ఒక్క ఫోన్ చెయ్యవు ఏం పాటు పడుతుంటావే?” అందామె కోపంగా.
“లేదమ్మమ్మా! రెండుసార్లు చేశాను. సిగ్నల్ లేదని చెబుతోంది ఫోన్” అని అబద్ధమాడక తప్పలేదామెకు. అమ్మమ్మ చల్లబడింది. “నిజమేలే అంతా అదే అంటున్నారు. నే బానే ఉన్నా! జాగ్రత్త!” అని కట్ చేసిందావిడ.
ఆ మధ్యాన్నం అత్తగారికి ఫోన్ చేసింది. “ఎలా ఉన్నరత్తయ్యా ? మావయ్యగారెలా ఉన్నారూ?” అంటూ. ఆవిడ తన ఆరోగ్యం గురించి, భర్త గురించీ పది నిమిషాలు చెప్పి కాసేపు కొడుకులు ఫోన్ చెయ్యరని నిష్ఠూరమాడి, చిన్న కోడలి మీద ఏవో చెప్పి ముగించింది. వారానికొకసారి ఈ కార్యక్రమం చెయ్యకపోతే గాయత్రికి చివాట్లు పడతాయి. అందుకే పలకరిస్తుంటుంది. ఈమే పెద్ద కోడలు మరి.
మరో గంటాగి పెద్దాడపడుచుకి ఫోన్ చేసింది. ఏటా ఊరి నుంచి ఆవిడ, పచ్చళ్ళు, కారం, పళ్ళూ పంపుతుంటుంది. పది రోజుల కొకసారి ఆవిడని పలకరించకపోతే అవసరానికే కానీ ప్రేమకు పనికి రామా? అని మొట్టికాయలేస్తుంది.
ఆ తర్వాత భోంచేసి గాయిత్రి తల్లికి ఫోన్ చేసింది. “అమ్మా! చెయ్యి నెప్పెలా ఉందే?” అనడిగింది ఆప్యాయంగా.
“మామూలేలే! నాతో పాటే అదీనూ! ఏం చేస్తాం? బండి నడిపించడమే! సర్లే, గానీ నీ గురించి చెప్పు! బట్టలుతుక్కుని, ఇల్లు సర్దుకుని అలిసిపోతావ్! శనివారం కొడుక్కి స్వీట్లూ, హాట్లూ, ఆదివారం బిర్యానీలు చెయ్యక తప్పదు. మధ్యాన్నం కాసేపు పడుకోలేకపోయావా?” అందామె ప్రేమగా. “అలాగే అమ్మా!” అని ఫోన్ పెట్టేసింది గాయిత్రి.
ఇంతలో పక్కింటి పద్మ గారు తలుపు తట్టింది. “ఏవండీ మ్యాచింగ్ సెంటర్ కి వెళ్ళాలి వస్తారా?” అని అడిగితే,
“అలాగే తప్పకుండా” అనేసి, ‘ఒక గంట ముందు చెప్పొచ్చు కదా’ అని సణుక్కుంటూ నడుము నెప్పితోనే చెప్పులేసుకుని బయలుదేరింది గాయిత్రి. రానని అనడానికి లేదు. తప్పదు. మొన్ననే బంగారం షాపుకి తోడొచ్చిందామె.
సాయంత్రం బజార్ నుంచి వచ్చి వంట చేసింది. భర్త కిష్టమని చాలా కష్టపడి గుమ్మడి గింజలు వలిచి కూర చేసింది. మాట్లాడకుండా మారు వడ్డించుకున్నాడు. “కూరెలా ఉంది?” భర్త నడిగింది. “ఏమీ మాట్లాడలేదంటే బావున్నట్టు. పొగడాలా రోజూ!” అని విసుక్కున్నాడు.
‘కూర బాగోకుంటే విమర్శించి, ఆవకాయ తెమ్మని అది వేసుకుని నిష్ఠూరంగా చూస్తాడు. బావుందంటే ఏం పోతుంది? పురుషాహంకారం కాకపొతే?’ కోపంగా మనసులో అనుకుని, “అబ్బే! పొగడమని కాదు లెండి” అంటూ నవ్వేసింది.
ఈ పై అన్ని సందర్భాల్లో నేను నటించాను. ఒక్క మా అమ్మతో మాత్రమే సహజంగా మాట్లాడాను.
ఇట్లు
గాయిత్రి
ఆర్య తల్లి
నీతి : అమ్మతో మాత్రం నిజమే మాట్లాడాలి. మనమంతా అమ్మ ప్రాణంలో, శరీరంలో ముక్కలం కాబట్టి.
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, 4 నవలలూ, 3 కవిత్వ సంకలనాలూ, ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
Good. A narration of facts and every reader somehow connect with same reflection like a morning mirror.
ఆఖరి వాక్యంతో యేడిపించారు గౌరీ. చాలా బాగుంది write up.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఆనందమే ఆరంభం
సరికొత్త ధారావాహిక ‘చంద్రునికో నూలుపోగు’ – ప్రకటన
నవమి – ఖండిక 2: ఉన్నమాట
యాత్రా దీపిక కృష్ణా జిల్లా – 15. ఘంటశాల
నా వెన్నెల
కాశ్మీర్ మారణహోమంలో ప్రాణాలు అర్పించిన హిందూ పండిట్లకు శాక్రమెంటోలో నివాళి
భూతాల బంగ్లా-2
తెలుగుజాతికి ‘భూషణాలు’-13
పిల్లి – లొల్లి
జీవన రమణీయం-116
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®