Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రేపటి కోసం అల్లిన ఆశల సాలెగూడు

[మణి గారు రచించిన ‘రేపటి కోసం అల్లిన ఆశల సాలెగూడు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

రేపటి కోసం అల్లిన ఆశల సాలెగూడులో,
చిక్కుకుపోయింది జీవితం!
ఎన్ని సంతోషాలు రేపటి కోసం కుదువ పెట్టాను!
ఎన్ని దుఃఖాలు మూటలు కట్టి మూల దాచేసాను!
ఎన్ని రక్షణలు?!
ఎన్ని కాపలాలు..?! .. రేపటి కోసం!!!
పులకరించలేదని, చల్లగాలి దూరం జరిగింది!
పలకరించలేదని, వర్షం చినుకులు
నిరాశగా కిందకి జారాయి!!
ఒంటి మీద పడే వెలుగు కిరణాలు
మెరవకుండానే రాలిపోయాయి!!!
కాలి కింద నేల కన్నీళ్ళు పెట్టుకుట్టుంది
కర్కశత్వానికి!!!
రేపటి ఆశలో, బతుకు భద్రపరుస్తున్న నాకు,
ఎన్ని క్షణాలు, దిగులుతో నలిగి
పగిలి పోయిందీ, తెలియనే తెలియదు!!!
నా దృష్టి అంతా రేపటి మీదే!
ఇప్పుడు ఇక్కడ ఈక్షణం నా కోసం వెతుకుతుంది!
కానీ ఎక్కడ.. నాకు నేనే కనపడటం లేదు?!
ఆశల గూడులో రేపటికి, కాపలా కాస్తూ,
నన్ను నేను పోగొట్టుకున్నాను.
కొత్త రోజు వచ్చాక,
కుదువపెట్టిన సంతోషాన్ని,
వాకిలిలో ఆరపెట్టొచ్చు అనుకున్నా!
దుఃఖాల మూటలని
దులిపి పారేయొచ్చు అనుకున్నా!
నెరవేరిన ఆశలతో
దీపాలు వెలిగిద్దాం అనుకున్నా!
సంబరాల కాంతుల్లో బతుకు
మెరిసిపోతుంది అనుకున్నా!
కానీ,
రేపనేది లేదని, ఇంక రాదని
చెప్పడానికి వచ్చిన క్షణం,
నన్ను లయం చేసుకుని, రాలిపోయింది!
రేపటి కోసం గూటిలో దాచిన జీవితం,
వ్యర్థమై, జాలిగా నవ్వి, మాయమయింది!

Exit mobile version