Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

రోబో రెస్టారెంట్‌

[శ్రీ ఎస్. హనుమంతరావు రచించిన ‘రోబో రెస్టారెంట్’ అనే బాలల కథని అందిస్తున్నాము.]

ప్పుడే వీధి దీపాలు వెలిగాయి. రాజమండ్రి కుమారీ టాకీసు రోడ్డులో నడుస్తున్నారు శేషుబాబు, అతని పన్నెండేళ్ల కొడుకు శశి. గోదావరి ఒడ్డు వైపు వెళుతున్నారు వాళ్లు.

వారికి దూరంగా ‘రోబో రెస్టారెంట్‌’ అన్న బోర్డు కనిపించింది, మెరుస్తున్న లైట్లతో. హోటల్‌ పేరు కింద ‘రోబో సర్వీసింగ్‌ మా ప్రత్యేకత’ అన్న వాక్యం వైలెట్‌ కలర్‌ దీపాల కాంతితో మెరిసిపోతోంది.

‘‘కొత్తగా పెట్టినట్టున్నారు’’ అన్నాడు శేషుబాబు.

‘‘ఆకలేస్తోంది నాన్నా!’’ అన్నాడు శశి. నాన్నకీ ఆకలిగానే వుంది. మధ్యాహ్నం ఇంట్లో కాకరకాయ కూర.. అదీ సంగతి!

‘‘సరే!.. టిఫిన్‌ తిందాం’’ అన్నాడు నాన్న.

‘‘పదండి మరి.. ఆ రోబో హోటల్‌కి వెళదాం’’ అన్నాడు శశి ఉత్సాహంగా. హోటల్‌ పేరు బాగా ఆకర్షించింది వాడిని. హోటల్‌ లోనికి వెళ్లారు. అక్కడ సర్వర్లుగా నిజంగా రోబోలు వున్నాయి. వాళ్లిద్దరికీ భలే థ్రిల్లింగ్‌గా వుంది. ఓ టేబుల్‌ దగ్గర కూర్చున్నారు. వారి దగ్గరికి ఓ రోబో నడుచుకుంటూ వచ్చింది. పొట్టిగా, కాస్త బొద్దుగా ఎర్రటి యూనిఫాం లాంటి రంగులో అచ్చం పోస్టు డబ్బాలా వుంది. దాని కాళ్లూ చేతులు, మనిషి నడిచినప్పుడు ఎలా కదులుతాయో అలాగే కదులుతున్నాయి.

‘‘ఆర్డర్‌ ప్లీజ్‌’’ అంది రోబో.

ఏం చెప్పాలో అర్థం కాలేదు నాన్నకి. దానికి తెలుగు వచ్చా?.. లేదా?.. అనుకున్నాడు శేషు. కాస్త తేరుకుని, ‘‘చల్ల పునుకులు’’ అన్నాడు.

‘‘నాకు ఆవడ కావాలి’’ అన్నాడు శశి. వారి ఆర్డర్‌ రోబోకి అర్థం కాలేదు. తల గోక్కున్నట్టు జుట్టు లేని తలపై కుడిచేయిని తాకించుకుంది. ‘‘నో సచ్‌ ఐటమ్స్‌’’ అంది స్పష్టంగా.

‘‘మెనూ ప్లీజ్‌..’’ అన్నాడు శేషు.

‘‘ఇడిలీ.. దోష.. పెసరట్‌.. ఉపమా, మైసూర్‌ బజి’’ చెప్పుకుపోతోంది రోబో. దాని మాటలు గమ్మత్తుగా వున్నాయి. అలా వినాలనిపించినా, ‘‘రెండు ప్లేట్లు మైసూర్‌ బజ్జీ’’ అన్నాడు నాన్న.

‘‘ఓకే’’ అని గిరుక్కున తిరిగి, గునగున నడుస్తూ కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ఆశ్చర్యం నుండి కొంచెం తేరుకుని, క్యాష్‌ కౌంటర్లో కూర్చున్న యజమానిని చూసి నవ్వాడు నాన్న. ‘‘బావుంది మీ ఏర్పాటు.. కొత్త ఐడియా!’’ అన్నాడు.

‘‘జనాన్ని ఆకట్టుకోవడానికి ఏదో కొత్తగా చెయ్యాలి కదండి’’ అన్నాడు యజమాని వీర్రాజు.

‘‘మనిషిని పోలిన రోబోని ‘హ్యూమనాయిడ్‌ రోబో’ అని అంటారు. ఇవి ఆ రకంవే..’’ నాన్న చెప్పాడు శశితో.

ఈలోగా టిఫిన్‌ తెచ్చింది రోబో. ‘‘ఏనీ మోర్‌?’’ అంది.

‘‘ఏ దిల్‌ మాంగే మోర్‌!’’ అని పాడాడు శశి.

‘‘ఒన్‌ ఇలాచీ ఛాయ్‌.. ఒక మసాలా పాలు’’ అన్నాడు శేషు. ‘‘ఓకే’’ అంటూ వెళ్లిపోయింది రోబో. టిఫిన్‌ తిన్నాక టీ, పాలని తీసుకొచ్చింది రోబో, బిల్‌తో పాటు.

‘‘బేరర్‌కి టిప్‌ ఇవ్వండి’’ అన్నాడు శశి నవ్వుతూ.

ఆ మాటలు విన్న ఓనర్‌, ‘‘దానికి టిప్‌ అవసరం లేదు బాబు’’ అన్నాడు.

ఈ వింత హోటల్‌ గురించి ఇంటికెళ్లగానే అమ్మకి చెప్పాలని తెగ ఉబలాడపడ్డాడు శశి. అతనికి చాలా ఉత్సాహంగా వుంది.

***

‘‘లేరా శశి ఏడయింది. స్కూలుంటే ఈసరికి స్కూలు బస్సులో వుండేవాడివి. రాత్రి పొద్దుపోయేవరకు ఆ రోబోల సినిమా చూసి లేటుగా పడుకుని, ఇంకా లేవలేదు’’ అంది అమ్మ. ఆమె మాటలకు ఉలిక్కిపడి లేచాడు శశి.

అమ్మకి గుడ్మాణింగ్‌ చెప్పాడు నవ్వుతూ.

‘‘వెరీ గుడ్మాణింగ్‌ నాన్నా’’ అంది అమ్మ బదులుగా.

మంచం మీంచి లేస్తూ వీధిలోకి చూశాడు. రోడ్డు అవతల పోస్టాఫీసు. దాని గోడ పక్క పొట్టిగా బొద్దుగా ఎర్రటి పెయింట్‌తో పోస్టు డబ్బా.. దాన్ని చూస్తూ.. ‘రోబో రెస్టారెంట్‌ కలన్న మాట’ అనుకుంటూ, రాత్రి చూసిన సినిమా, ఆ పోస్టు డబ్బా కలిసి అలా కల వచ్చిందన్నమాట’ అనుకున్నాడు.

కల గురించి అమ్మకి చెప్పాడు. ‘‘ఏమోలే అలాంటి హోటళ్లూ త్వరలోనే వస్తాయేమో!’’ అంది అమ్మ.

‘‘నీకు కలలో ఆవడ దొరకలేదు గాని, నేను చేసి పెడతానులే.. త్వరగా ఫ్రెష్‌ అవ్వు’’ అంది.

తను అడగకుండానే ‘ఆవడని గ్రాంట్‌ చేసింది అమ్మ’ అనుకున్నాడు వాడు. ‘ఏది అడిగినా ఇచ్చేది అక్షయపాత్ర..’ క్లాసులో ఓసారి మేస్టారు చెప్పిన విషయం గుర్తుకొచ్చింది శశికి. ‘అడిగినా అడగకపోయినా ఇచ్చేది అమ్మ!’ అనుకున్నాడు ప్రేమగా శశి.

***

రెండు రోజుల తర్వాత, వాళ్ళ సైన్స్ టీచర్ క్లాసులో పాఠం చెప్తూ, రోబోల గురించి వివరంగా చెప్పారు. చెన్నయిలో రోబో రెస్టారెంట్ ఉందని సార్ చెప్పగానే ఎంతో సంతోషించాడు శశి.

Exit mobile version