ఉ:
శ్రీ కరమైన భారతి కి జెన్నుగదూరుపు దిక్కు నందునన్
ప్రాకట మైనరీతిగను బంగళఖాత మటంచు బిల్వరే
సాకెను జాలరుల్ జగతి సర్వ జనంబులు స్నానమాడ గన్
యా కరవాక యందున నే అన్య పు జాతులు విశ్రమించగన్
ఉ:
చల్లని పిల్ల తెమ్మరలు చాలగ వీచు పయోధి తీరమున్
పల్లెల పట్నపున్ ప్రజలు బాగుగచేరి షికారు నొందగన్
కొల్లలు కొల్ల లై అలలు కొండొక రీతిని హాయి గూర్ప : యా
అల్లదె సంద్ర తీరముమహా ద్భుత మై ఇల పెంపె లారగన్
చం:
రవిదొలి నేత్రముల్దెరచి రాజిత కీర్తిని రంగరించగన్
అవిరళ కాంతి రేఖలతొ యం తట లోకము వెల్గు పంచగన్
భువికిని జీవజాలముల భుక్తికి ముక్తికి లోటు కల్గకన్
భవితకు లోటు లేక నవభారత జాతిని బెంపుజేయగన్
ఉ:
దీరము నుండు జాలరుల తీర్చును యాకలి దప్పికాదులన్
దారులుదె న్నులన్ గనక దాపున జే రగ నాదరించుచున్
కూరిమి మత్స్య సంపదల కూర్చుచు బెస్తల కుక్షి నింపుచున్
ధారుణియన్నపూర్ణయని ధన్యులు గొ ల్చేడి నిన్ను దల్చేదన్
కం:
తిరముగనుండక జలములు
దరికిని కదలుచు నలలుగధారుణి లోనన్
పరి పరి విధముల జూసిన
జర జర ప్రాకెడు విధాన జారును వేగన్

కవి, రచయిత, నాటక, రేడియో రచయితగా ప్రసిద్ధులైన శ్రీ ఆవుల వెంకట రమణ 1999 నుంచీ కథలూ, కవితలు వ్రాస్తున్నారు. వీరి కథలూ, కవితలూ వివిధ పత్రికల్లో అచ్చాయ్యాయి. ఆకాశవాణి విజయవాడ, హైదరాబాదు, మార్కాపురం కేంద్రాల్లో వీరు రచించిన అనేక కథలు, కవితలూ, నాటకాలు అనేక మార్లు ప్రసారమయ్యాయి. దిశా నిర్దేశం – కవితా సంపుటి, అల రక్కసి – దీర్ఘ కవిత, భారత సింహం నాటకం ప్రచురించారు. అనేక సాహిత్య సంస్థల నుంచి సన్మానాలని స్వీకరించారు.
సహజకవి, సాహితీ ఆణిముత్యం, సాహిత్య రత్న, మత్స్యకవిమిత్ర బిరుదుల్ని పొందారు. హ్యుమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఉగాది పురస్కారాన్ని (02-04-2022) పొందారు. 2020లో ప్రజాశాక్తి దినపత్రిక ఆదివారం ప్రత్యేకం స్నేహలో సంవత్సరం పాటు ప్రచురింపబడిన మత్స్యకార కథలని ‘కరవాక కథలు’ పేరుతో సంపుటంగా తీసుకురాబోతున్నారు. కొన్ని వందల యేండ్ల క్రితం తమిళనాడు ప్రాంతం నుంచి వలస వచ్చి ప్రస్తుతం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల సముద్ర తీరంలో నివసిస్తున్న పట్టపు మత్స్యకారుల మీద చేసిన పరిశోధనా గ్రంథాన్ని అతి త్వరలో ముద్రించబోతున్నారు. కుసుమ వేదన కావ్యాన్ని ఎక్కడా శిక్షణ తీసుకోకుండా స్వయం కృషితో ఛందోబద్ధ పద్యకావ్యంగా రచించారు.
కం॥
గురువెవ్వరు నా కవితకు
గురువెవ్వరు లేరు నాకు గురుతులు దెలుపన్
గురువులు లేకనె నేనిట
ధరణిని శారద కరుణను దయగొని బడితిన్.