సాహిత్య రంగంలో విశిష్టమైన సేవలందించిన వారిని గుర్తించే ప్రతిష్టాత్మకమైన ‘సాహిత్య స్పర్శ్ అవార్డులు 2025’ ప్రకటించబడ్డాయి. వివిధ ప్రక్రియలలో రచయితల కృషిని గుర్తిస్తూ ఈ ఏడాది అవార్డుల్లో ప్రత్యేకంగా నిలిచిన వారిలో ప్రముఖ తెలుగు రచయిత కోడీహళ్ళి మురళీమోహన్ ఒకరు. ఈ ఏడాది బయోగ్రఫీ/ఆటోబయోగ్రఫీ విభాగంలో ‘పోరాట పథం’ అనే గ్రంథానికి గాను మురళీమోహన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.


వీరు ప్రముఖ హేతువాది, విద్యావేత్త, బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయిన డా.హెచ్.నరసింహయ్యగారి ఆత్మకథను కన్నడ భాష నుండి తెలుగులోనికి ‘పోరాటపథం’ పేరుతో అనువదించారు.
లిటరేచర్స్ లైట్ పబ్లిషింగ్ సంస్థ ది లిటరేచర్ టైమ్స్, ది షైనింగ్ లిటరేచర్ పత్రికల సహకారంతో ప్రతియేటా భారతీయ భాషలు మరియు ఇంగ్లీషు భాషలో వివిధ సాహిత్య ప్రక్రియలలో వెలువడిన రచనలకు ఈ అవార్డులను ప్రకటిస్తుంది. పూర్తి పారదర్శక పద్ధతిలో ఎంపిక చేసే ఈ పురస్కారాలకు ఎక్కువ స్థాయిలో ఎంట్రీలు రాగా వాటిలో అర్హమైన కొన్నింటికి మాత్రమే ఈ అవార్డులను ప్రకటిస్తారు.


ఈ సంవత్సరం ఈ పురస్కారాన్ని మురళీమోహన్‌కు ప్రకటించడం పట్ల సాహిత్య రంగానికి చెందిన పలువురు హర్షం వ్యక్తం చేశారు.
[హెచ్. నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదం ‘పోరాటపథం’ సంచికలో ధారావాహికగా ప్రచురితమైంది.]