[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘సమాంతర రేఖలం!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]


నడిరోడ్డులో నేను పాదచారినై,
అలసటనిపించనప్పుడల్లా ఆగి,
విఫలమయ్యే యత్నమేనని తెలిసినా..
అటు పోతున్న వాహనదారులకు మళ్లీ, మళ్ళీ
నా బొటన వేలుని ఆకాశం వైపు చూపుతూ..
ఆశతో.. అదిగో ఆ గమ్యం చేరడానికి
కాస్త ఊతమివ్వరా! అంటూ అభ్యర్థిస్తునే ఉన్నాను.
అయ్యో! ఒక్కడూ ఆగడే!
మానవవత్వం నానాటికి మృగ్యమై పోతుందే..
అంటూ మనసు మూల్గుతుంది,
హహహ! దీనికే మానవత్వం, మట్టి గడ్డలంటూ
అంత పెద్ద పెద్ద మాటలెందుకులే నేస్తం?..
నా మనసును వింటూ.. బుద్ది వెటకరిస్తోంది.
నిజానికి..
వేగంగా కదిలే ఆ మందలో కొందరికైనా
నాకై ఆగి ఆ కాస్తా సాయం చేయాలని ఉంటుందేమో?
కానీ! ఆగి నన్ను పట్టించుకునే తీరికెక్కడుంది ఎవరికి?
ఉరుకుల పరుగుల జీవితాలగాట కట్టబడ్డ వారికి..
తలకు మించి నిర్దేశించుకున్న దూరాలు కొందరివి..
ఒక్కో క్షణం ఒక్కో నాణెం, నాణ్యం వారికి.
తప్పక చేరాల్సిన గమ్యాలు ఇంకొందరివి..
ఒక్కో క్షణం ఒక్కో యుగం, సమరం వారికి..
రాను రానూ ఆ వాహనదారులతో విసిగి వేసారిన నేను
నాకంటూ ఓ వాహనం కావాలనుకున్నాను.
నా చెమటనంతా దారపోసి వడబోసిన
కాసుల చమురునంతా వడబోసి
రాతి చమురు తాగి రేగి ఏగే ఓ వాహనాన్ని
నా అంగటి రాటగట్టాను.
ఇప్పుడు నేను ప్రతి రహదారిని సునాయసంగా గెలుస్తున్నాను.
ప్రతిరోజూ నాకిప్పుడు ఒకరిద్దరు పాదచారులు
రహదారి పక్కన బొటన వేలిని ఆశతో ఆకాశం వైపు చూపుతూ
ఏదో గొణుగుతూ ఉన్నట్టు నాకు అ(క)నిపిస్తారు.
వారు తమ గమ్యాన్ని జపిస్తూ, అటు వైపు చేర్చమని అభ్యర్థిస్తుంటారనుకుంటాను.
కానీ నాకిప్పుడు వారికై ఆగి కదిలే
సమయమెక్కడుంది?
ఒక్కోసారి వారి కోసం ఆగాలనిపించినా..
ఓ వేగానికి అలవాటు పడ్డానేమో?
దాని అనుభూతిని అనుభవిస్తున్నానేమో..
వేగంలో ఉన్న ఆ యోగాన్ని నిరోదించగ మనసొప్పకనేమో..
లేక! నన్ను మాత్రం అప్పుడు ఎవరైనా పట్టించుకున్నారా?
అనే తృణీకార భావమేమో..
వారిని చూసీ చూడనట్టు దూసుకు పోతుంటాను.
“నీలో నానాటికి మానవత్వం
సన్నగిల్లుతోంది నేస్తం” అంటూ
అదే మనసు, అదే..
నేను నేల పై నడుస్తూ ఉన్నప్పటి నుండీ నాతో ఉన్న మనసు..
అదే మాటను పదే పదే ఉటంకిస్తూ నన్ను గిల్లుతున్నా..
అప్పుడు, ఇప్పుడూ అదే నేను!
హహహ! ఈపాటి దానికే మానవత్వం,
దానవత్వమంటూ..
ఆ తత్వాలెందుకులే నేస్తం అంటూ తేలికగా
ఆ మాటను కొట్టి పారేస్తుంటాను.
ఔను నాలాగే ఎందరో..
తాము నేలమీద ఉన్నప్పుడు ఎవ్వరూ చేయందించలేదని,
అన్నిటా బాగా ఉన్న తమకిప్పుడు ఎవరి తోనూ పనిలేదని
తోటి సమాజాన్ని వెలివేస్తారు.
ఓనాటికి కరడుగట్టుకు పోతారు,
నానాటికి తమ అనుకున్న వారి నుండి కూడా వెలివేయబడతారు.

భానుశ్రీ తిరుమల అనే కలం పేరుతో రచనలు చేసే నా అసలు పేరు తిరుమల రావు పిన్నింటి. నా జననం శ్రీకాకుళం జిల్లా, కవిటి తాలుకా మాణిక్యపురంలో జరిగింది. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకూ సొంత ఊరిలోనే జరిగింది.
రామోజీ గ్రూప్ సంస్థలలోని ఆతిథ్య విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నాను.
చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం, చిన్న చిన్న కవితలు రాయటం చేసేవాడిని. కొందరు గురువులు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో ఇటీవల కొన్ని పత్రికలకు పంపిన కవితలు, కథలు అచ్చులో చూసుకొని ఆనందపడుతున్నాను. ఇప్పటి వరకు 20 చిన్న పెద్ధ కధలు,100 కవితలు రాశాను.